" పత్రీజీతో కలిసి ఆ నాలుగు రోజులు .. "

 

 

మా అమ్మ తన 87 సంవత్సరాల జీవితంలో .. ఆఖరి రెండు సంవత్సరాల సమయం పూర్తిగా మంచం మీదే ఉండిపోయింది. దాంతో నా భార్య గ్రేట్ పిరమిడ్ మాస్టర్ "పద్మ" ఆమెను కనిపెట్టుకుని చూసుకుంటూ తన కుటుంబ ధర్మాన్ని పరిపూర్ణం చేసుకుంది.

 

2016 జూన్ 12 వ తేదీన అమ్మ శరీర విరమణ చేయగా ఆమె సంస్మరణ వేడుకను జూన్ 26 తేదీన బంధుమిత్రులతో కలసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాం! మరణం కూడా ఒక సంబరమే కదా!!

 

ఆ తరువాత "నాలుగు రోజులు ఎక్కడికయినా వెళ్ళాలి" అనుకున్నప్పుడు మొదటగా గుర్తువచ్చింది బెంగళూరు .. పిరమిడ్ వ్యాలీ!! అనుకున్నదే తడవుగా రానూ పోనూ ట్రైన్ టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరి సెప్టెంబర్ 10 వ తేదీ ఉదయం బెంగళూరు చేరాం.

 

అదే సమయంలో వ్యాలీలో "క్వాంటమ్ ఎనర్జీ వర్క్‌షాప్" నిర్వహిస్తూండటం వలన పత్రీజీ కూడా అక్కడే ఉండటం మా అదృష్టం!

 

ఒకసారీ వ్యాలీ లోపలికి ప్రవేశించిన తర్వాత ఎంతటివారైనా సరే అక్కడి పిరమిడ్ శక్తి, వ్యాలీ దృశ్యాలు, ఏపుగా పెరిగిన చెట్లు, చుట్టూ కొండలు .. ఇలా ఒక్కటేమిటి .. అన్ని కోణాల్లోనూ తెలియని తన్మయత్వానికి గురి కావలసిందే!

 

"పద్మ" ఆరు సంవత్సరాల తర్వాత వ్యాలీలో అడుగు పెట్టిందేమో .. ఎంతో పారవశ్యంతో పులకించిపోయింది!

 

దానికి తోడు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పిరమిడ్‌లో పత్రీజీ వేణునాదం, ధ్యానం ఎంత శక్తివంతంగా వుంటుందో వేరే చెప్పనక్కరలేదు! అలా ఆచార్య సాంగత్యంతో పాటు పిరమిడ్ వ్యాలీలోని ఏ ఒక్క ప్రదేశాన్నీ వదలకుండా అన్ని ప్రదేశాలలో ధ్యానం చేసుకుంటూ చక్కని విశ్వశక్తితోపాటు మధురమైన అనుభూతులు పొందటం జరిగింది.

 

ముందుగా చేసుకున్న రిజర్వేషను ప్రకారం 12 వతేదీ బయలుదేరి విజయవాడ కు తిరిగి రావలసి ఉన్నా .. కావేరీ జలాల కొరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర గొడవల వల్ల రైళ్ళు రద్దు కావడంతో .. రెండు రోజుల తరువాత పత్రీజీతో కలిసి బెంగళూరు నుండి 13 వ తేదీ కారులో బయలుదేరి "ధర్మవరం" చేరుకున్నాం.

 

ఆ రోజు రాత్రి అక్కడ పిరమిడ్ మాస్టర్ "చలపతి" గారి ఇంటి వద్ద బస చేసి వారి ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించాం. మరుసటి రోజు ఉదయం పత్రీజీ ధర్మవరం వచ్చిన సంగతి ధ్యానులందరికీ తెలిసి, స్థానిక "దివ్యధర్మ పిరమిడ్ ప్రాంగణం" లో 200 మంది వరకు చేరిపోయారు!

 

అక్కడ ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన కార్యక్రమంలో మా అనుభవాలు విశేషంగా పంచుకోవటం జరిగింది. ధర్మవరం మాస్టర్లు అందరూ ఎంతో ఆసక్తిగా వాటిని ఆస్వాదించారు. మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తర్వాత పత్రిజీతో కలిసి "ధర్మవరం" నుంచి బయలుదేరి మూడు కార్లలో "రాప్తాడు" అనే గ్రామం చేరాం.

 

అక్కడ "పాండు" గారి ఇంటి వద్ద పత్రీజీ రాకకోసం ఎదురు చూస్తూన్న ధ్యానులు మమ్మల్ని ఎంతో అప్యాయంగా పలకరిస్తూ స్వాగతించారు!

 

వారు స్వాగతించిన తీరు .. పత్రీజీ పట్ల వారు చూపుతున్న వినయపూర్వక భక్తి విశ్వాసాలు చెప్పనలవి కాదు! ఒక్కమాటగా చెప్పాలంటే వారి విశ్వాసమే వారికి శ్రీరామరక్ష. ఎంత ఆనందం! ఎంత పారవశ్యం!

 

అక్కడినుంచి బయలుదేరి "గంగుల కుంట" గ్రామంలో దేవాలయ ప్రాంగణంలో కట్టిన "నారాయణస్వామి పిరమిడ్" కు వెళ్ళాము.

 

ఇప్పటివరకు దేవాలయాలలో కట్టిన పిరమిడ్‌లు అన్నీ ఆ యా దేవాలయాలలో ఏదో ఒకప్రక్క చిన్నవిగా కనిపించేవి కానీ ఇక్కడ అలాకాదు! దేవాలయానికి మించిన సైజులో పిరమిడ్ నిర్మాణం జరిగిన తీరుమించిన సైజులో పిరమిడ్ నిర్మాణం జరిగిన తీరు "దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి" అన్న పత్రీజీ ఆశయానికి నిలువెత్తు నిదర్శనంలా కనబడింది!

 

ఇంతకు ఆ పిరమిడ్ నిర్మాణం చేసిన మూల వ్యక్తి ఎవరో తెలుసా! "ఫణి" అనే ఒకానొక నవయువకుడు!

 

ధ్యానానికి రాకపూర్వం పూర్తి మాంసాహారి అయిన అతనికి .. తాపీపనిలో వచ్చే సంపాదన అంతా తన తిండికి అంటే చికెన్, మటన్‌లకే సరిపోయేవి కావట! అంత పిచ్చి తిండిపోతు! ప్రతి చిన్న విషయానికీ తెలియని భయంతో క్రుంగిపోయే స్వభావం. ఏ జన్మ సంస్కారమో తెలియదు కానీ .. ధ్యాన పరిచయం జరగటం అతని అదృష్టం!

 

గంటలు గంటలు ధ్యానం చేయటం .. రకరకాల విజన్స్ చూడటం, ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి ఎన్నెన్నో మెస్సేజెస్ తీసుకోవటం జరిగి అందులో అద్భుతమైన మెస్సేజ్ పిరమిడ్ కట్టమని వచ్చిందట!

 

కానీ తన దగ్గర డబ్బు లేదు .. ఎలా?

 

సంకల్పం బలంగా ఉండాలే కానీ పిరమిడ్ మాస్టర్ల వల్ల కానిదేమీ లేదన్నట్లు .. ధ్యానంలో ప్రతిసారీ పత్రీజీ కనబడి "నువ్వు పిరమిడ్ పని మొదలు పెట్టు! ఇదిగో చూడు .. నా జేబులో ఎంత డబ్బు ఉందో అంటూ తన జేబులోంచి డబ్బుల కట్టలు తీసి చూపిస్తూ "ఇవన్నీ నీ కోసమే " అనేవారట!

 

"ఆవగింజంత విశ్వాసం వుంటే చాలు పర్వతాలను సైతం కదిలించవచ్చు" అన్నారుగా జీసస్! ఆ అబ్బాయి తనువంతా విశ్వాసమే మరి .. ఇక కానిదేముంది?!

 

అలా మొదలుపెట్టిన పిరమిడ్ నిర్మాణం "ఎలా అయ్యిందీ" అంటే తనకే ఆశ్చర్యం! అదీ సంకల్పబలం అంటే!!

 

జక్కా రాఘవరావు

అధ్యక్షులు PSSM

కృష్ణా జిల్లా

Go to top