" సహనంతో ధ్యానం చేస్తూంటే అన్నీ సర్దుకుంటాయి "

 

 

నా పేరు "నూకయ్య".


గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారరీత్యా మలేషియా దేశంలో స్థిరపడి ఉన్న నేను .. క్వాలాలంపూర్ లో నివసిస్తూన్న వైజాగ్ పిరమిడ్ మాస్టర్ "మదిని రామానాయుడు" గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను.

 

"రామానాయుడు" గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూన్న పలు ధ్యాన కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ అక్కడి నుంచి తెచ్చిన పత్రీజీ సందేశాల సీడీలను మాకు వినిపించి .. ధ్యాన సమాచారాన్ని మాకు ఎప్పటికప్పుడు తెలియజేసేవారు.

 

వారి ఇంట్లో జరిగే విందులలో మరి విశేషదినాలలో ధ్యాన కరపత్రాలను ముద్రించి పంచేవారు! తమ ఇంటిని "పిరమిడ్ ధ్యాన మందిరం" గా మార్చి వారానికి ఒక రోజు మరి పౌర్ణమి రోజులలో ధ్యాన తరగతులను నిర్వహించేవారు.

 

ఈ క్రమంలో 2007 మే 15 వ తేదీన పత్రీజీ తమ అంతరంగిక కార్యదర్శి D.శివప్రసాద్ గారితో కలిసి క్వాలాలంపూర్ కు విచ్చేశారు.

 

నా దగ్గర కారు ఉండడంతో వారిని తోడ్కొని రావడానికి రామానాయుడు గారి వెంట నేను కూడా విమానాశ్రయానికి వెళ్ళాను. అక్కడ పత్రీజీ మమ్మల్ని అప్యాయంగా ఆలింగనం చేసుకుని పలుకరించిన తీరు నాకు ఎంతో నచ్చింది!

 

రామానాయుడు గారి స్వగృహానికి చేరిన పత్రీజీ .. నా గురించిన వివరాలు అడిగి తెలుసుకుని నేను వ్రాసి అచ్చువేయించిన "తెలుగు వీర లేవరా" అన్న కవితా సంపుటిని శ్రద్ధగా చదివారు.

 

ఆ పుస్తకంలోని కొన్ని కవితలను పాటల రూపంలో మార్చి "తెలుగు దీపం" పేరిట ప్రముఖ గాయనీ గాయకులు S.P.బాలసుబ్రహ్మణ్యంగారు,S.P.శైలజగారు, జేసుదాస్‌గారు, మనోగారు, K.P.మోహన్‌గారు, P.సుశీలగారు, S.జానకిగారు, S.Pచరణ్‌గారు గానం చేశారు. దానిని మలేసియా దేశంలో "తొలి తెలుగు ఆల్బమ్" గా నా మిత్రులు శ్రీ "C.T. మణియం" గారి ఆర్థిక సహాయంతో విడుదల చేయడం కూడా జరిగింది.

 

పత్రీజీ అంతటి గొప్ప జ్ఞానస్వరూపులు మా దగ్గరకు వచ్చినందుకు ఎంతో సంతోషించిన నేను వెంటనే మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా||అచ్చయ్య కుమార్ రావు గారిని కలిశాను.

 

వారు వెంటనే ఉపాధ్యక్షులు శ్రీ అక్కయ్య అప్పలనాయుడు గారు, సహాయ అధ్యక్షులు వెంకటేశన్ గారు, కొణతాల రామానాయుడు గారు, J.S.మణియమ్ గారు, ప్రధానకార్యదర్శి S.రాములుగారు, సహాయప్రధాన కార్యదర్శులు R.అప్పలనాయుడు గారు, N.B.లక్ష్మణ్ గారు, యువజన నాయకులు R.వెంకటరమణ గారు, మహిళా విభాగం అధ్యక్షులు శ్రీమతి ధనలక్ష్మి గార్లతో పాటు దేశం నలుమూలలలో ఉన్న ఇతర సంఘం నాయకులతో చర్చించి, పత్రీజీ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఫలితంగా .. 2007 మే 16వ తేదీన క్వాలాలంపూర్ లోని ప్రముఖ "సోమా హాల్" లో మొట్టమొదటి ధ్యాన శిక్షణా తరగతి విజయవంతంగా నిర్వహింపబడింది. క్వాలాలంపూర్ లో నివసిస్తూన్న అనేకమంది తెలుగు సంతతికి చెందిన వాళ్ళు ఈ సభలో పాల్గొని .. పత్రీజీ సమక్షంలో వెణునాద ధ్యానం చేసుకుని ..విశేష ధ్యానశక్తిని అందుకున్నారు.

 

అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సరళంగా మలిచి అందించిన పత్రీజీ ఆత్మీయతకు వాళ్ళు ఎంతో సంతోషించారు.

 

ఆ తరువాత "సెలాంగుర్" రాష్ట్రం "రవాంగ్" లో మలేషియా తెలుగు వారి గౌరవ చిహ్నంగా వెలుగుతూన్న "తెలుగు సాంస్కృతిక భవనం" లో రెండవ సభ .. మరి "చెరాస్" లో నాగేశ్వరరావు పంతులు గారిచే నిర్వహింపబడుతున్న ధ్యానకేంద్రంలో మూడవ ధ్యాన సభ నిర్వహించబడ్డాయి.

 

తెలుగు, తమిళ ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసించే ఈ ప్రదేశాలలో పత్రీజీ నోటి నుంచి తెలుగులో వెలువడిన అమృతం లాంటి పలుకులకు తమిళ అనువాదాన్ని నేనే అందించాను.

 

మే18వ తేదీ క్వాలాలంపూర్ " బ్రిక్‌ఫీల్డ్స్ ఫార్మ్ కోర్లు" లో మలేసియా దేశంలో ఉన్నత పదవులు నిర్వహిస్తూన్న తెలుగువారితో మరొక ధ్యాన సభ ఏర్పాటు చేయడం జరిగింది.

 

అంతవరకూ "సత్యసాయి" మరి "హరేరామ హరేకృష్ణ" భక్తి మార్గంలో ఉన్న తెలుగువాళ్ళు చాలా మంది కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి విచ్చేసి ధ్యానవిద్యను తెలుసుకుని .. ధ్యానం చేసి అందులోని గొప్పదనాన్ని రుచి చూశారు!

 

ఇలా పత్రీజీ తమ మలేషియా దేశ తొలి ధ్యాన ప్రచార పర్యటనను ముగించుకుని .. మిగతా కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా నాకు అవకాశం ఇచ్చారు.

 

అయితే అప్పటికే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న నేను .. పత్రీజీ అందించిన ఈ అద్భుత అవకాశాన్ని అందుకోలేకపోయాను. వయోభారం కూడా మీద పడడంతో "ఎంతో చెయ్యాలి" అన్న తపన ఉన్నా చేయలేక .. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా .. నాలో నేనే బాధపడిపోయాను.

 

శరీరం పటిష్టంగా ఉన్నంత కాలం "నా అంతటి వాడు లేడు" అన్న అహంకారంతో గడిపి .. తీరా ధ్యానంలోకి వచ్చాక పట్టుమని పదినిమిషాలు కూడా స్థిమితంగా కూర్చోనివ్వని నా శరీర పరిస్థితకి నేనే బాధాతప్తుడయ్యాను.

 

సాక్షాత్తూ పత్రీజీ అంతటి గొప్ప గురువు అందుబాటులో ఉన్నా కూడా నన్ను నేను ఉద్ధరించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఇక నా ఆత్మీయ సోదరులు "లక్ష్మణ్" మరి "మణియమ్" గార్లకు ధ్యానప్రచార బాధ్యతను అప్పగించడం జరిగింది.

 

వాళ్ళు "పెర్‌సతువాన్ మెడిటాసి పిరమిడ్" పేరుతో మలేషియా పిరమిడ్ సొసైటీని రిజిస్టర్ చేయించి పటిష్టవంతమైన కార్యప్రణాళికతో మలేషియా దేశ వ్యాప్తంగా ధ్యానప్రచారం చేయడం మొదలు పెట్టారు.

 

ఆ తరువాత 2015 వ సంవత్సరంలో నేను కొందరు మిత్రుల సహాయంతో విశాఖపట్టణం వెళ్ళి "ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్ " వ్యవస్థాపకులు డా|| G.K గారిని కలవడం జరిగింది.

 

బాల్యం నుంచీ నాకు ఉన్న అనారోగ్యాలనూ మరి జీవిత సమస్యలనూ వారికి వివరంగా తెలియజేయగా వారు "అన్నింటికీ ధ్యానం ఒక్కటే పరిష్కారం" అని సింపుల్‌గా తేల్చేశారు.

 

"ధ్యానం" .. "నాలుగు శత్రువులు" .. "నిస్సహాయత" .. "ఆధ్యాత్మిక పుత్రులు" .. "సోల్ స్కానింగ్" .. "సంపూర్ణ ఆరోగ్యానికి 12 ట్యాబ్లెట్లు" వంటి పుస్తకాలనూ మరి ఒక పిరమిడ్‌నూ నాకు అందజేసి" సహనంతో ధ్యానం చేస్తూంటే అన్నీ అవే సర్దుకుంటాయి" అని చెప్పారు.

 

ఇక అప్పటి నుంచి నా ధ్యానసాధనను మరింత తీవ్రతరం చేసి .. మలేషియా పిరమిడ్ మాస్టర్ల తో కలిసి ధ్యానప్రచారంలో పాల్గొని మెల్లిమెల్లిగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందుతూ వచ్చాను!

 

2015, జూన్ 16వ తేదీన "పెర్‌సతువాన్ మెడిటాసి పిరమిడ్ సెంటర్" లో పౌర్ణమి ధ్యానం చేస్తున్నప్పుడు నా దేహం తేలికగా అయిపోయి ఎక్కడో గాలిలోకి తేలిపోతూన్న అనుభూతిని పొందాను. అప్పటినుంచీ నాకు అంతకు ముందు ఉన్న తీవ్రమైన దగ్గు, ఒంటి నొప్పులు తగ్గిపోవడం జరిగింది!

 

ఆ తరువాత 2016, ఆగస్ట్ 28వ తేదీన "క్వాలాలంపూర్ తెలుగు సంక్షేమ సంఘం " లో జరిగిన తెలుగు భాషా దినోత్సవానికి విచ్చేసిన పత్రీజీ .. అక్కడ హాజరయిన 600 మంది తెలుగు వారిచే వేణునాద ధ్యానం చేయించారు! అక్కడ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత పత్రీజీ అంత జన సముదాయంలో కూడా నన్ను చూసి గుర్తుపట్టిన పత్రీజీ .. గట్టిగా ఆలింగనం చేసుకున్నారు!

 

ఆ తరువాత నన్ను అప్యాయంగా వేదిక పైకి పిలుచుకుపోయి తమ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు. లోగడ 1986 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కూడా ఇలాగే నాకు పాదనమస్కారం ప్రసాదించిన సన్నివేశం గుర్తుకువచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాను.

 

చైనా, కొరియా, మలేషియా దేశస్థులతో నిండిపోయిన ఆ సభలో పత్రీజీ అందించిన కొన్ని మార్గదర్శ సూత్రాలు ..

 

* ప్రతి ఏడాదికి ఒక విభిన్న దేశంలో గురు పౌర్ణమి ధ్యానం నిర్వహిద్దాం.
* మాంసాహారం వద్దు .. శాకాహారమే ముద్దు! జీవహింసకు ప్రత్యక్షంగా కానీ .. పరోక్షంగా కానీ కారకులం కాకూడదు!
* మనం "సూర్య - చంద్రులు " లా జీవితం గడపాలి.

 

సూర్యుడు ఉదయించే సమయం నుంచి .. సూర్యుడు అస్తమించే సమయం వరకు పగలంతా కుటుంబానికి కావలసినవి సమకూర్చుతూ .. కర్తవ్యచర్యలలో నిమగ్నమై ఉండాలి.

 

చంద్రుడు ఉదయించే సమయం నుంచి చంద్రుడు ఉదయించే సమయం నుంచి చంద్రుడు అస్తమించే రాత్రి సమయం అంతా కూడా ధ్యాన సాధనలోనే గడపాలి. అదే సరియైన మరి శాస్త్రీయమైన జీవితం.

 

* ఏ విషయంలో కూడా మితిమీరి గానీ .. అతి తక్కువగా కానీ ప్రవర్తింపరాదు. కర్తవ్యం మరి ధ్యానం రెండూ సమపాళ్ళల్లో ఉండాలి!

 

* ఇతరుల సమస్యలలో తలదూర్చకుండా .. ఎవరి స్వంత సమస్యలను వారే తీర్చుకోవాలి. తిండికీ మరి సంపాదనకూ మాత్రమే తపన పడకుండా ధ్యానం చేయడానికి కూడా తపన పడాలి.

 

అనంతరం వారు N.B.లక్ష్మణ్ గారి ఇంటి ఆవరణలో నిర్మించబడిన పిరమిడ్‌ కు ప్రారంభోత్సవం చేశారు. మలేషియా దేశం "పెరాక్" రాష్ట్రం "ఈపో" నగర సమీపంలో నిర్మాణం జరుపుకుంటూన్న పిరమిడ్‌కు పత్రీజీ .. 2017 జనవరిలో ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేశారు.

 

మలేషియా పిరమిడ్‌ను దర్శించడానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం!

 

జై ధ్యానజగత్ .. జైజై శాకాహార జగత్ .. జైజైజై పిరమిడ్ జగత్ ..

భీసెట్టి నూకయ్య

క్వాలాలంపూర్
0060-123328289
email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top