" నా తల మీద నుంచి భారం దిగిపోయింది "

 

 

శ్రీ B.సాంబశివరావు గారు 2014 సం||లో "ది హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్" కు మేనేజింగ్ ట్రస్టీ గా తమదైన "టీమ్ స్పిరిట్" మరి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ధ్యానమహాచక్రం-5 కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రస్తుతం "ట్రస్ట్ బోర్డ్" లో "ట్రెజరర్" గా మరి "కైలాసపురి అభివృద్ధి కమిటీ " కి "ఛైర్మన్" గా తమ విశిష్ట సేవలను అందిస్తూన్న ఈ గ్రేట్ పిరమిడ్ మాస్టర్‌తో కాస్సేపు ..


T.వాణి

 

ప్రశ్న: "మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు .. ఇత్యాది విషయాలన్నీ తెలియజేయండి.."


సాంబశివరావు గారు : నేను తెనాలి జిల్లా "అత్తోట" గ్రామంలోని ఒకానొక వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాను. ఇంటర్ వరకు "తెనాలి" లోనే చదువుకున్నాను. ఆ తరువాత కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి వచ్చి "సింగరేణి కంపెనీ" నుంచి కోల్ కాంట్రాక్ట్‌లు చేస్తూ నా స్వంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను.

 

వివాహం తరువాత హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో స్థిరపడిపోయాను. నా భార్య అరుణ, పిల్లలు సాయిమహేశ్, లోహిత్ అందరూ .. ధ్యానులు మరి శాకాహారులు!

 

2001 సంవత్సరంలో ఒకసారి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఏం తిన్నా .. వాంతి అయిపోతూ ఉండేది. "తల తీసుకెళ్ళి అమాంతం ఏదైనా టైర్ క్రింద పెట్టేద్దామా?" అన్నంత భరించలేని బాధ ఉండేది.

 

"బ్రెయిన్‌లో ట్యూమర్ ఉందేమో" అని రకరకాల పరీక్షలూ, స్కానింగ్‌లూ చేసినా డాక్టర్‌లు కారణం ఏమీ చెప్పలేకపోయారు.

 

మందులు వాడుతూ ఉంటే తాత్కాలికంగా ఉపశమనం లభించినా "మళ్ళీ తలనొప్పి వస్తుందేమో" అన్న భయం నన్ను వెంటాడుతూ ఉండేది.

 

అదే సమయంలో మా కాలనీలో ఉన్న "విజయకుమారి (గుడివాడ .. రాజకుమారి గారి సోదరి)" గారి ఇంట్లో ధ్యానం క్లాసు జరుగుతోందని తెలియడంతో నా భార్య అక్కడికి వెళ్ళింది.

 

తిరిగి వచ్చాక "ధ్యానం చేస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంది" అని చెబుతూ .. మర్నాడు నన్ను కూడా రమ్మని కోరింది. అయితే .. "అక్కడికి మగవాళ్ళు రావచ్చో లేదో" అని నేను సందేహించాను.

 

అది విని విజయకుమారి మేడమ్ "శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాల్సిందే " అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. అలా వెళ్ళి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాక ఒక్క గంట సేపట్లోనే నాకు ఎంతో ప్రశాంతంగా .. ఏదో భారం నా తల మీద నుంచి దిగిపోయినట్లుగా అనిపించింది. విజయకుమారి గారు "PSSM" గురించీ, "పత్రీజీ" గురించీ మరి పిరమిడ్‌లను గురించీ వివరంగా చెప్పారు.

 

అదే క్లాసులో "ధ్యానాంధ్రప్రదేశ్ రమాదేవి "గారితో మాకు పరిచయం అయ్యింది!

 

అంతకు ముందు నేను ప్రతిరోజూ నిష్ఠగా పూజలు చేస్తూ .. గాయత్రీ మంత్రాన్నీ మరి నారాయణ మంత్రాన్నీ 108 సార్లు చొప్పున జపిస్తూ ఉండేవాడిని. ప్రతి గురువారం సాయి బాబా గుడికి వెళ్ళి హారతులు ఇచ్చేవాడిని. ఎవరు ఏది చెప్పినా "నాకు మంచి జరిగితే చాలు " అనుకుని వెంటనే చేసేసేవాడిని .

 

ధ్యానానికి కూడా అలాగే వచ్చి .. "ధ్యానం చేస్తే పూజలూ, జపాలు ఇంకా బాగా చేసి .. ఇంకా ఎక్కువ మంచిని పొందాలి" అనుకున్న నేను "ధ్యానమే అన్నింటికన్నా పై మెట్టు .. ధ్యానం చేస్తే ఇక పూజలూ, జపాలూ చెయ్యనవసరం లేదు" అన్న విజయకుమారి గారి మాటలు విని ఆశ్చర్యపోయాను!

 

"సరే, మనకైతే ప్రశాంతంగా ఉంది కదా" అనుకుని ధ్యానం కొనసాగిస్తూ వచ్చాను.

 

ప్రశ్న: "పత్రీజీని ఎప్పుడు కలిశారు?"


ఆ తరువాత కొన్ని రోజులకే పత్రీజీ కార్యక్రమం సికింద్రాబాద్ లోని "అగ్రసేన్‌భవన్" లో ఏర్పాటు చేయబడుతోందని తెలుసుకుని చాలా సంతోషపడ్డాను. "పత్రీజీని కలిసి నా భవిష్యత్తు గురించి ఏదన్నా ప్రశ్న అడుగుదాం" అనుకున్నాను.

 

విజయకుమారి మేడమ్ నన్ను వారిస్తూ .. " అలా జ్యోతిష్యాలూ, ప్రశ్నలూ వారు చెప్పరు; ధ్యానం చేయిస్తారంతే !" అని చెప్పడంతో ఒకింత నిరుత్సాహంగానే ఆ కార్యక్రమానికి వెళ్ళాను.

 

పైగా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా విచ్చేసినా డా|| న్యూటన్ మరి డా|| లక్ష్మీ న్యూటన్ గార్లు " రాముడూ, కృష్ణుడు లాగే మనం అంతా కూడా దేవుళ్ళం" అని చెప్పడం నాకు మింగుడు పడలేదు! అదే కార్యక్రమంలో పత్రీజీ "మిర్దాద్" అన్న ఒక అనువాద గ్రంథాన్ని రిలీజ్ చేస్తూ "ఇది చదవకపోతే జన్మ వేస్ట్" అన్నారు.

 

"అలాగైతే చదవాల్సిందే" అనుకుని "మిర్దాద్" తో పాటు "ధ్యానం-శరణం-గఛ్ఛామి" అన్న పుస్తకం కూడా కొని తెచ్చి .. ముందు దానిని చదవడం మొదలుపెట్టాను.

 

ఒక్కొక్కటిగా అందులోని ఆత్మజ్ఞాన సత్యాలు బోధపడుతూంటే నాకు చాలా ఆశ్చర్యంవేసింది! "ధ్యానం ఎందుకు చేస్తారు?" .. "పూజలు అంటే ఏమిటి".. "దేవుళ్ళు అంటే ఎవరు" అన్న విషయాలు కూలంకషంగా అర్థం అయ్యాయి. ఇక "అన్నింటి కంటే ధ్యానమే అత్యున్నతం" అని తెలుసుకున్నాక ధ్యానం మరి ధ్యానప్రచారమే నా జీవితంగా మారిపోయింది.

 

క్రమంగా మందులు కూడా మానేసి ఎన్నో సంవత్సరాలుగా నన్ను వేధిస్తూన్న తలనొప్పి నుంచీ మరి ఆ "తలనొప్పి వస్తూందేమో" అన్న భయం నుంచీ సంపూర్ణంగా విముక్తి చెందాను. అప్పటి నుంచీ మా ఇంటికి దగ్గరలోనే ఉన్న "షిరిడీ సాయి గుడి ధ్యాన మందిరం" లో ప్రతి గురువారం సాయంత్రం హారతి తరువాత విజయకుమారి, రమాదేవి మరి ప్రస్తుతం హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీ గా వున్న రాంబాబు గార్లతో కలిసి ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం.

 

ఆ తరువాత 2003 సంవత్సరంలో కూకట్‌పల్లి వివేకానందనగర్ ప్లే గ్రౌండ్‌లో 2000 మంది ధ్యానులతో పత్రీజీ ధ్యాన కార్యక్రమం నిర్వహించాం. అందుకోసం నేను ఉదయం 8.00 గం||ల నుంచి రాత్రి 8.00 గం||ల వరకు కూకట్‌పల్లి మాస్టర్స్‌తో కలిసి 20 వేల ధ్యాన కరపత్రాలను చుట్టుప్రక్కల కాలనీలలో పంచడం జరిగింది.

 

కార్యక్రమం ఇలా విజయవంతం కావడం చూసిన మా వివేకానందనగర్ సొసైటీ వాళ్ళు మా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో రెగ్యులర్‌గా ధ్యానకార్యక్రమాలు నిర్వహించమని మమ్మల్ని కోరారు! దాంతో మేము అక్కడ ప్రతి ఆదివారం ధ్యానం క్లాసులు, పౌర్ణమి అమావాస్య ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ వచ్చాం.

 

ఆ క్రమంలోనే " తిమ్మరాజు " గారి సహకారంతో వివేక్‌నగర్ లో కూడా "పిరమిడ్ ధ్యాన మందిరం" ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధ్యాన - శాకాహార ర్యాలీలను అద్భుతంగా నిర్వహిస్తూన్న "బండ్ల లక్ష్మీ" మేడమ్ కూడా అక్కడికే వచ్చి మొట్టమొదటసారి ధ్యానం నేర్చుకోవడం జరిగింది.

 

ప్రశ్న: "శాకాహారులుగా ఎప్పుడు మారారు?"

 

ధ్యానంలో ప్రశాంతత పొందిన వెంటనే నేను .. ఆ తరువాత కొంతకాలానికి నా భార్య .. శాకాహారులుగా మారిపోయాం. మాంసాహారం వల్ల కలిగే అనర్థాలను గురించి మా పిల్లలకు చెప్పేవాళ్ళం కానీ .. శాకాహారులు కమ్మని మాత్రం వాళ్ళను బలవంతం పెట్టలేదు.

 

కానీ వాళ్ళే ఒకసారి పత్రీజీ కార్యక్రమానికి హాజరుఅయ్యి "మాంసాహారం తినడం అంటే శరీరాలను స్మశానాలు చేసుకుని తిరగడమే" అన్న పత్రీజీ మాటలను విని తమంతటతామే శాకాహారులుగా మారిపోయారు!

 

ఒకసారి సెలవులకు వాళ్ళు తమ అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మేనమామలు బలవంతంగా చికెన్ తినిపించబోతే ఇద్దరూ ఏడ్చి అక్కడి నుంచి వచ్చేశారు! అలా శాకాహారులుగా మారాక అప్పటివరకూ చీటికీమాటికీ అనారోగ్యం పాలు అవుతోన్న వాళ్ళ ఆరోగ్యాలలో గణనీయమైన మార్పు వచ్చింది.

 

ప్రశ్న: PSSM కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం గురించి .."


2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను మా నియోజక వర్గం నుంచి "పిరమిడ్ పార్టీ అభ్యర్థి" గా పోటీ చేశాను! ఈ ఎన్నికల పేరు మీద దాదాపు రెండు లక్షల ధ్యాన-శాకాహార కరపత్రాలను పంపిణీ చేశాం!

 

కూకట్‌పల్లి పిరమిడ్ మాస్టర్స్‌తో కలిసి నా భార్య, పిల్లలం ప్రాతఃకాలం 4.00 గం||లకే లేచి వెళ్ళి న్యూస్‌పేపర్లలో కరపత్రాలు పెట్టేవాళ్ళం. నా నియోజక వర్గంలోని అన్ని కాలనీలలో గడప గడపకూ ఈ కరపత్రాలను అందించాం.

 

ఇతర పార్టీల వాళ్ళ మీటింగ్‌లకూ కూడా వెళ్ళి అక్కడికి వచ్చిన జనాలకు మన ధ్యాన -శాకాహార కరపత్రాలను పంచి ఆధ్యాత్మిక పాలన యొక్క అవసరాన్ని వాళ్ళ మైక్‌లలోనే చెప్పేవాళ్ళం!

 

"ధ్యాన - శాకాహార జీవనవిధానం పట్ల ప్రజలను అప్రమత్తులను చేయడానికే ఎలక్షన్‌లలో పాల్గొంటున్నాం" అన్న మన గొప్ప ఆశయాన్ని గుర్తించిన ఆ యా పార్టీల వాళ్ళంతా కూడా మాకు స్నేహపూర్వకంగా సహకరించేవాళ్ళు.

 

2008 సంవత్సరంలో మా స్వగృహంపై "శ్రీకృష్ణ గీత పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించుకుని పత్రీజీ చేతుల మీదుగా దానిని ప్రారంభోత్సవం చేయించుకున్నాం.

 

ఎంతోమంది కాలనీవాసులు మరి చుట్టుప్రక్కల వాళ్ళు మా పిరమిడ్‌కు వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తూంటారు. ఈ రోజు మా చుట్టుప్రక్కల కాలనీలలో ధ్యానం అంటే తెలియని వారు లేరు అని నేను గర్వంగా చెప్పగలను!

 

ఇలా ధ్యాన-శాకాహార ప్రచారాల ద్వారా ప్రతి ఒక్కరూ తమను తాము ఉద్ధరించుకునేలా చేస్తోన్న పత్రీజీకు వేల వేల కృతజ్ఞతలు!

 

అంతటి గొప్ప గురువుకు సమకాలీనులుగా జన్మతీసుకోవడం మన అదృష్టం! ప్రతి ఒక్క ఆత్మ సత్యాన్ని ఆచరణ ద్వారా వారు మనకు బోధిస్తూ ఉంటారు. వారి సాంగత్యంలో ప్రతిక్షణం కూడా చైతన్యపూరితంగా మరి అర్థవంతంగా ఉంటుంది.

 

ప్రశ్న: "కడ్తాల్ .. కైలాసపురి కార్యక్రమాలలో మీ పాత్ర .."


2008- బెంగళూరు ధ్యానమహాయజ్ఞం కోసం "సేత్ బాలకృష్ణ", "ప్రేమ్‌నాథ్" గార్ల ప్రోత్సాహంతో నేను అన్నదాన విరాళాల సేకరణకు నడుం కట్టాను.
అందుకుగాను నా మిత్రులనూ .. వారి మిత్రులను .. నా బంధువులనూ .. వారి బంధువులను మరి .. నా సర్కిల్‌లోని ఇండస్ట్రియలిస్ట్‌లనూ, వ్యాపారవేత్తలనూ .. ఇలా ధ్యానం అంటే ఏ మాత్రం పరిచయం లేని వాళ్ళను మాత్రమే లిస్ట్ వేసుకుని .. ఉదయాన్నే మా ఆవిడ కట్టిచ్చిన టిఫిన్ క్యారేజీ తీసుకుని కారులో బయలుదేరేవాడిని.

 

బయలుదేరే ముందు ధ్యానంలో కూర్చుని ఆ రోజు కలవాల్సిన వాళ్ళను కలిసినట్లూ .. వారికి ధ్యానం గురించి చెప్పినట్లూ మరి వాళ్ళంతా ఆనందంగా నాకు భిక్ష ఇచ్చినట్లూ .. విజ్యువలైజ్ చేసుకునే వాడిని.

 

ఆశ్చర్యం ఏమిటంటే .. ఆ తరువాత ఎవ్వరింటికి వెళ్ళినా .. నన్ను ఉత్తి చేతులతో పంపకపోయే వళ్ళు! అలా ధ్యానసంకల్పబలంతో పనిచేస్తూ .. కార్యక్రమం కోసం అక్షరాల ఎనిమిది లక్షల రూపాయల విరాళాలను సేకరించి .. పత్రీజీ అభినందనలు కూడా పొందాను!

 

2009 లో కూకట్‌పల్లి "హౌసింగ్ బోర్డ్ పార్క్" లో "పైమా" పిల్లల సహకారంతో పత్రీజీ ధ్యాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం. ధ్యాన ప్రచార రథాల ద్వారా మేం చేసిన ప్రచారానికి దాదాపు నాలుగువేల మంది హాజరయి ధ్యానం చేసుకున్నారు.

 

ఆ సమయంలో హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు నన్ను కైలాసపురిలో జరుగుతూన్న "గెస్ట్ హౌస్ మెంబర్‌షిప్" కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరారు. ఆ తరువాత 2010 సం||లో శివరాత్రి రోజున పత్రీజీ నన్నుఅదే ట్రస్ట్‌లో ఒకానొక "ట్రస్టీ" గా నియమించారు.

 

నాకు చాలా సంతోషం వేసింది! ఎందుకంటే .. అంతకుముందు కైలాసపురిలో నిర్మాణంలో ఉన్న మహేశ్వర మహా పిరమిడ్ దగ్గర జరిగే శివరాత్రి, పౌర్ణమి ధ్యానాలలో పాల్గొన్నప్పుడు "నేను కూడా ఒక ట్రస్టీగా .. ఈ అద్భుత నిర్మాణంలో పాలుపంచుకుంటే బాగుంటుంది" అని బలంగా అనుకునేవాడిని.

 

నా సంకల్పమే పత్రీజీ నోటి నుంచి రావడంతో నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను.

 

ఆ తరువాత 2014 లో "మేనేజింగ్ ట్రస్టీ" గా "ధ్యానమహాచక్రం-v" కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను! వందల మంది కార్యకర్తలతో కలిసి .. పరస్పర సహకారంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల నేను "సహనశక్తి" యొక్క విలువను విశేషంగా తెలుసుకున్నాను.

 

ప్రశ్న: "ఇప్పుడు ‘కైలాసపురి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించారు కదా .. మీ భవిష్యత్ ప్రణాళికలు?"

 

కైలాసపురిలోని "మహేశ్వర మహాపిరమిడ్" అన్నది ఈ విశాల విశ్వానికి చెందిన ఒక మహా కట్టడం!

 

ఆధ్యాత్మిక జగత్తుకే గర్వకారణంగా నిలుస్తోన్న ఈ శక్తిక్షేత్రం యొక్క అభివృద్ధిలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ని కూడా భాగస్వాములను చేస్తూ .. ఒక బృహత్తర కార్యాచరణ భాగస్వాములను చేస్తూ .. ఒక బృహత్తర కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నాం.

 

ఇందుకుగాను త్వరలోనే అన్ని జిల్లాలలో పర్యటించి .. కైలాసపురిలో ఇక ముందు జరుగబోయే అభీవృద్ధి పనులను వారికి వివరించి .. అందరి సలహాలనూ, సహకారాలనూ తీసుకుంటాం.

 

ఇక ముందు జరగాల్సిన అభివృద్ధి పనులు ..

 

1. హాయిగా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా పిరమిడ్ లోపలి భాగమంతా "సైలెన్స్‌జోన్" గా తయారుచెయ్యడం.
2. ఇప్పుడు ఉన్న గ్రంథాలయాన్ని ఆధునీకరించి .. మరిన్ని జాతీయ -అంతర్జాతీయ .. ప్రాచీన-ఆధునిక విజ్ఞాన గ్రంథాలతో దానిని పరిపుష్టం చేయడం.
3. ప్రముఖ పర్యావరణవేత్త మరి రాయ్‌పూర్ నివాసి శ్రీ J.A.చంద్రశేఖర్ రావు IFS గారి పర్యవేక్షణలో కైలాసపురి ప్రాంగణాన్ని ఔషధ, పూల, పండ్ల మొక్కలతో కూడిన "పంచవటి" గా అభివృద్ధి చేయడం.
ముఖ్యంగా పిరమిడ్‌ను పశ్చిమ దిక్కున ఉన్న స్థలంలో ఆయుర్వేద విలువలను కలిగిన ఔషధ మొక్కలతో, వెదురు పొదలతో ఉద్యానవనాన్ని రూపొందించడం.
4. రిసెప్షన్, మీటింగ్ హాల్, క్రొత్తగా వచ్చే సందర్శకులకు ప్రాథమిక ధ్యాన అవగాహనను కలిగించే ఆడియో విజ్యువల్ ధ్యానమందిరం, కంప్యూటర్ సెక్షన్ మరి కెఫెటేరియా వంటి ఆధ్యాత్మిక సదుపాయాలతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణం.
5. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఏసి ఆంఫీ థియేటర్ నిర్మాణం.
6. ప్రాపంచిక విద్యతోపాటు నవీన అధ్యాత్మిక విద్యనూ, మరి సకల కళలనూ బోధించే గురుకుల విద్యాలయాల నిర్మాణం
7. కైలాసపురి ప్రాంగణం చుట్టూ సౌరశక్తి దీపపు కాంతులతో కూడిన 2 కి.మీ. పొడవైన ప్రహరీ గోడ నిర్మాణం.

 

ఇవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాల కాలంలో పూర్తిచేసే విధంగా .. ఆర్థిక ప్రణాళికలు వేస్తున్నాం. త్వరలోనే జిల్లాల వారీగా, రాష్ట్రాలవారీగా పిరమిడ్ మాస్టర్లు తమవంతు బాధ్యత తీసుకుని ఈ నిర్మాణాలు చేపట్టే విధంగా సన్నాహాలు చేస్తాం.

 


B.సాంబశివరావు

కూకట్‌పల్లి

హైదరాబాద్
9848207945

Go to top