" ఎంత భాగ్యమో ధ్యాన జీవితం "

 

పేరు: T.సూర్యప్రభ
హోదా: డిప్యూటీ సెక్రెటరీ
విభాగం: వ్యవసాయ శాఖ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.


2000 సంవత్సరం నుండి నేను ధ్యానసాధన చేస్తున్నాను. ధ్యానంలోకి వచ్చినప్పుడు "నా పరిస్థితి .. ఈ జీవితం దుఃఖమయం, బాధాకరం మరి సమస్యల వలయం" అని అనుకునే దానిని.

 

* మానసిక ప్రశాంతతకు ఎన్నో గుళ్ళు, గోపురాలు తిరిగి స్తోత్రాలు చేశాను. ఎలుగెత్తి హారతి పాటలు పాడాను. కానీ ప్రశాంతత దొరకలేదు.


* " ధ్యానాంధ్రప్రదేశ్" గిరిజా మేడమ్ ద్వారా ధ్యానం నేర్చుకుని, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ క్లాసులకు అటెండ్ అయ్యాను. ఎన్నెన్నో ట్రెక్కింగ్‌లకు కూడా అటెండ్ అయ్యాను. పత్రీసార్ క్లాసెస్‌కు వీలైనంత వరకు హాజరు అవుతున్నాను.


* మొదట్లో ధ్యానం కుదిరేది కాదు. విపరీతమైన ఆలోచనల పరంపర. కానీ ప్రతిరోజూ రెండు గంటలు ధ్యానం చేసేదాన్ని. క్రమంగా ఆలోచనల పరంపర తగ్గింది.


* ధ్యానం ద్వారా ఎంతో కాస్మిక్ ఎనర్జీని పొందుతున్నాను. ట్రెక్కింగ్‌లలో మాస్టర్ల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాను. ట్రెక్కింగ్‌లలో అన్ని కిలోమీటర్లు నడిచే శక్తిని, విశ్వశక్తి ఇస్తుంది. అదొక అతీతమైన శక్తి. బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో చాలా ట్రెక్కింగ్స్ మన పిరమిడ్ మాస్టర్స్ నిర్వహించారు. నేను శ్రీశైలం, తిరుపతి మరి హిమాలయాల ట్రెక్కింగ్‌లు అటెండ్ అయ్యాను.


* ధ్యానం ద్వారా ఎంతో ఎనర్జీని పొందుతూ, మనలో ధ్యానం ద్వారా దివ్యత్వం సిద్ధిస్తుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.


* నా అంతరంగం చెప్పే విషయాలను నేను వింటూ అవి అమలు పరుస్తున్నాను.


* 2008 నుంచి నేను ధ్యానం చేయడం మాత్రమే కాకుండా ధ్యానం గురించి అందరికీ చెప్పడం ప్రారంభించాను. మా ఆఫీసులోనూ 1.00 p.m. to 1.30 p.m వరకు ధ్యానం క్లాసు తోటి ధ్యానులతో కలిసి నిర్వహిస్తున్నాం.


* మా ఆఫీసులో నవంబర్, 2009 లో సచివాలయంలో చాలా అత్యద్భుతంగా ముఖ్యమంత్రి రోశయ్య మరి పత్రీసార్‌తో జరిగింది. (అందరితో ఈ మీటింగ్ కలిసి) నిర్వహించే సామర్థ్యం, ధైర్యం మరి శక్తి మొత్తం ధ్యానం ద్వారనే నాకు ప్రాప్తించింది.

 

* ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ, ప్రతిరోజూ ధ్యానం చేస్తూ, కొందరితో చేయిస్తూ, ధ్యానం కరపత్రాలు పంచుతూ, నా జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆనందంగా ఉంటున్నాను.

 

* ఒకసారి ధ్యానంలో ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు .. ("కార్తీక మాసంలో దీపాలు పెట్టాలా? వద్దా") .. అని, అప్పుడు అంతరంగం నుంచి "నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు" ధ్యానం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా" అని సమాధానం వచ్చింది.


* ఒకసారి మోకాలి జాయింట్ కింద నాకు వాపు వచ్చింది. "ఫ్రాక్చర్ ఏమైనా అయిందేమో" అని నేను డాక్టర్ దగ్గరికి వేళ్ళాను. డాక్టర్ , "జాయింట్ పెయిన్స్ మందు ఆరు వారాలు రెగ్యులర్‌గా వాడాలి" అని చెప్పారు. ఈ మధ్యలో నేను శాకాహార ర్యాలీకి వెళ్ళి కరపత్రాలను పంచాను. అంతే! పోటు వెంటనే ఆ రోజే తగ్గిపోయింది. దీని ద్వారా కరపత్రాలను పంచితే ఎంతటి ఎనర్జీని సంపాదించుకుంటామో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.


* ధ్యానం క్లాసు నేను చెపుతూంటే ఒక ధ్యాని అనుభవం ఏమిటంటే నా యొక్క సూక్ష్మశరీరం మంచి రంగులతో ఆ హాల్‌లో మూడు చోట్ల ఉందట. దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే.. ధ్యానం క్లాసు చెప్పినప్పుడు తప్పకుండా ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మనకు గైడెన్స్ మరి ఎనర్జీ ఇస్తారని.
* ఒక్కొక్కసారి నాలోంచి గంధం వాసనలు, మల్లెపూల వాసనలు మరి సుగంధాలు వస్తున్నాయి. దీనిని బట్టి ఏం తెలుసుకున్నానంటే ధ్యానంలో మాస్టర్స్ మన దగ్గరికి వస్తారని.


* నా నుంచి కరెంట్ తీగలా ప్రాకి ధ్యానం చేస్తున్న వారందరినీ కలిపి, వారందరికీ శక్తి నా ద్వారా ప్రవహిస్తున్నదని వేరొక ధ్యాని తన అనుభవాన్ని చెప్పాడు.

 

* ధ్యానులు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నా కూడా దానికి సరియైన సమాధానాలు నాకు తెలియకూండానే నా ద్వారా వస్తున్నాయి.


* ఒకసారి సామూహికా ధ్యానం చేస్తున్న సమయంలో ఒక మాస్టర్ హాల్‌లో పైనుండి ఆయన నోటి ద్వారా అగ్నిని పంపిస్తూ అందరికీ ఎనర్జీ ఇచ్చారని ఒక ధ్యాని చెప్పారు.


*  రాయిలాంటి నన్ను ధ్యానమార్గం ద్వారా (మణిగా) రూపొందించిన పత్రీజీకి శతకోటి వందనాలు.


* పెద్దబ్బాయి ఆస్ట్రేలియాలో, చిన్నబ్బాయి హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివారు. ధ్యానం ద్వారా ఎంతో అభివృద్ధి సాధించారు!


* ధ్యానసాధన ద్వారా "నేను ఆత్మ పదార్థాన్ని" అని తెలుసుకున్నాను. నాడీమండలశుద్ధిలో భాగంగా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత మరి విశుద్ధ చక్రాలు ఉత్తేజితమవటం అనుభూతి చెందాను.

 

" ధ్యానాంధ్రప్రదేశ్ ", " స్పిరిచ్యువల్ ఇండియా " మ్యాగజైన్స్ చదువుతూ ఉన్నప్పుడు హయ్యర్ ఎనర్జీస్ అనుభూతి చెందుతున్నాను. ఇతర ఆధ్యాత్మిక గ్రంధాలు చదివేటప్పుడు కూడా ఆ రచయితలు ఎనర్జీ తీసుకుంటున్నట్లు అనుభూతిని పొందుతున్నాను.


నా దైనందిక చర్య ధ్యానంతో ఉదయం 4 గంటలకు మొదలై రాత్రి 10 గంటలకు పూర్తి అవుతుంది. దాదాపు 18 గంటలు పనిచేసే సామర్థ్యం ధ్యానశక్తి వల్ల ఇతోధికంగా లభిస్తోంది. ధ్యానం ద్వారా వాక్ శుద్ధి లభిస్తుంది. దీని వల్ల దైనందిక జీవితంలో మనం చెప్పింది ఇతరులు చేయడం, వినడం జరుగుతుంది. దీనివల్ల పని సత్వరంగా జరుగుతుంది. నేను మీటింగులకి వెళ్ళడం, సందర్శకులకు సమాధానం చెప్పడం, ఆఫీసు ఫైల్స్‌ని విశ్లేషించడం, మీటింగులలో నా సలహాలను పై అధికారులకు తెలియచెప్పే సమయస్పూర్తికి అవసరమైన శక్తి ధ్యానం ద్వారా లభిస్తోంది.

 

చీఫ్ విజిలెన్స్ అధికారిగా నేను రోజుకి కొన్ని వేల పేజీలను చదవాల్సి ఉంటుంది. అవి చదివి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దానికి కావలసిన శక్తిని నేను ధ్యానం ద్వారా పొందుతున్నాను. ఒక్కోసారి తుదినిర్ణయం ఇవ్వడానికి కుదరదు. అప్పుడు ధ్యానం చేస్తే ఏం చేయాలో తెలుస్తుంది. నేను ఒక మామూలు ఉద్యోగిని. ధ్యానం ద్వారా ఒక గుర్తింపు కలిగింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మోవ్మెంట్లో కొన్ని పనులను నేను చేయగలుగుతున్నాను.

 

ఒకసారి మా పెద్ద అబ్బాయి అర్ధ రాత్రివేళ రాయి తగలి బైక్ మీద కిందపడ్డాడు. ఆ రోజు రాత్రి ఆస్ట్రల్‌గా నిద్రలో పత్రీసార్ కనిపించారు. తరువాత రోజు మా అబ్బాయి సురక్షితంగా ఇంటికి స్నేహితుల ద్వారా తిరిగివచ్చాడని తెలిసింది. మనం ఒక గురువుని నమ్మితే ఆ గురువు మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తారని అనటానికి ఇదే ఉదాహరణ. ఎంతో మంది వచ్చి సలహాలు అడుగుతూంటారు. అన్నింటికీ సమాధానం ఒక్కటే "ధ్యానం" అంటే "శ్వాస మీద ధ్యాస". నా జీవితంలో అనేక సమస్యలను నేను ధ్యానం ద్వారా పరిష్కరించుకుంటున్నాను.

 

నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు "ఆత్మాయణం", "మరణం తరువాత జీవితం", "నక్షత్రమిత్రులు", "బుద్ధంశరణం గచ్ఛామి", "ధర్మం శరణం గచ్ఛామి", "సాధనారహస్యాలు 1&11", "హిమాలయయోగులు", సాక్షిసాధన", అతీషాప్రజ్ఞావేదం", "ఒక యోగి ఆత్మకథ", "హిమలయ రహస్యాలు", "సావిత్రి", "తులసీదళం 1&2". పత్రీజీ రచించిన 50 పుస్తకాలను నేను చదివాను.

 

అఖండ ధ్యానం -2012

 

2012 సంవత్సరంలో అఖండ ధ్యానం నిర్వహించే అవకాశం పత్రీసార్ సచివాలయం ఉద్యోగులకే ఇవ్వడం జరిగింది. అది సచివాలయంలోకి మాకందరికీ ఒక వరం లాంటిది. దాదాపు 15 మంది సచివాలయం ఉద్యోగులం అఖండ ధ్యానంలో సేవ చేసాము. దాదాపు 2000ల మంది అఖండ ధ్యానంలొ పాల్గొన్నారు. ధ్యానంతోపాటు వారికి టైమ్ ప్రకారం అల్పాహారం, ఫలహారం ఇవ్వడం జరుగుతుంది.

 

ప్రతి రోజు సాయత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే క్లాసులు నిర్వహించాము. అఖండ ధ్యానంలో అన్నిరకాల వయస్సుల వారు పాల్గొన్నారు. వారందరి అనుభవాలను పొందుపరచాము.

 

ధ్యానమహాచక్రంకి వచ్చిన ప్రతిఒక్కరూ VIPలు, ఎంతో మంది యోగులు అఖండధ్యాన శిబిరానికి విచ్చేసి ప్రశంసలు ఇచ్చారు. అనేక మంది యోగులలో సత్సంగం చేసే అవకాశం సచివాలయ ఉద్యోగులగా మా అందరికీ లభించింది. తిరుపతిలో చేసే నారాయణసేవకన్నా ధ్యానమహాచక్రంలో చేసే సేవ అత్మోన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అఖండ ధ్యానం అయ్యాక అందరూ తమ తమ అనుభవాలు చెప్తూంటే వాళ్ళ కళ్ళలో కనిపించిన ధ్యానానందం మాటల్లో చెప్పలేనిది.

 

"ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము, ధ్యాన జీవితము" అన్నట్లుగా ధ్యానంతో ధ్యాన సాధనతో, ధ్యానులు చెప్పే అనుభవాలతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ధ్యాన ప్రచారంతో నా జీవితాన్ని ఆనందంగా, హాయిగా జీవిస్తున్నాను.

 

సందేశం: మనమందరం ధ్యాన-స్వాధ్యాయ-సజ్జన సాంగత్యాలతో ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిద్దాం.

 

 

Go to top