" ఆనందం అందరికీ పంచాలి "

 

 

పేరు : G.కృష్ణవేణి
హోదా : డిప్యూటీ సెక్రెటరీ
విభాగం : ఆటవీ శాఖ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

"త్వమేవ శరణం మమ" అంటూ మన శక్తి చాలని స్థితిలో, పలు సమస్యల్లో చిక్కి, వాటిని పరిష్కరించుకునేందుకు పరితపిస్తూ దేవుణ్ణి వేడుకుంటాం. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లోనూ, దుర్భర వేదనలోనూ మనో నిబ్బరం సాధించడానికి ‘ధ్యానం’ ఒక గొప్ప అశ్రయం, ఓదార్పు మరి స్వాంతన.

 

"ధ్యానం" తో నా పరిచయం కొన్నేళ్ళుగా సాగుతోంది. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకొనే రోజుల్లో జ్ఞాపకశక్తిని బాగా మెరుగు పరుచుకోవాలని, ఏకాగ్రతను అలవరచుకోవాలన్న తలంపుతో .. గురు ప్రబోధంతో "భావాతీత ధ్యానం" మొదలు పెట్టాను. ఇంటికి దూరంగా హాస్టల్‌లో ఉంటూ రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా, ఎంతో సహనం వహించి, ప్రశాంత చిత్తంతో చదివి మంచి మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను. అప్పటి నుండి మనస్సులో అలజడి తగ్గించుకోవడానికి ‘ధ్యానం’ ఒక మంచి మార్గమైంది.

 

నాకు "పిరమిడ్ ధ్యానం’" 2001 వ సంవత్సరంలో పరిచయం అయ్యింది. ఆ రోజుల్లో నేను ‘శ్వాస’కు సంబంధించిన పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ క్రమేణా ఉబ్బస వ్యాధి పీడితురాలినయ్యాను.

 

మా ఆఫీసు ఆవరణలోని సమావేశ మందిరంలో భోజన విరామ సమయంలో నా తోటి ఉద్యోగులు "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని సాధన చేసేవారు. వారి ప్రోత్సాహంతో నేను క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టి, ‘శ్వాస’ సంబంధిత ఇబ్బందులను చాలా వరకు అధిగమించాను. నా ఆరోగ్యం మెరుగుపడటం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంలో ధ్యానం ప్రముఖ పాత్ర వహించింది.

 

అయితే, ఆ మధ్యకాలంలో ఉద్యోగంలో ప్రమోషను, కార్యాలయం మారడం, పని ఒత్తిడి మొదలైన లౌకిక పరమైన ఇబ్బందులు తలెత్తి, ఒక క్రమ పద్ధతిలో ధ్యానం’ చేసే అలవాటుకు దూరమయ్యాను.

 

మా సచివాలయ ఆవరణలో తోటి ఉద్యోగినులు సామూహిక ధ్యానం తలపెట్టి అందరినీ సమీకరించడంతో మళ్ళీ ‘ధ్యానం’ వైపుకు మళ్ళే మహద్భాగ్యం కలిగింది. అందుకు కారకులైన మా మిత్రులు సూర్యప్రభ గారు, నాగేంద్ర మణి గారు మరి వారి మిత్ర బృందానికి.. వారు ఎంతో కృషి చేసి ఏర్పాటు చేస్తున్న మహా గురువుల ప్రసంగ కార్యక్రమాలకు, వారి బోధనలకు మనః పూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను.

 

ప్రతి రోజూ తప్పనిసరిగా నేను ధ్యానం చేస్తాను. ధ్యానం చేయటం ద్వారా ప్రతిరోజూ ఆనందంగా జీవించగలం. ధ్యానం అన్నది ప్రతి మనిషికీ అత్యంత అవశ్యకమైనది.

 

నేను "భగవద్గీత", "బైబిల్", "ఒక యోగి ఆత్మకథ" మరి స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, పత్రీజీ, ఓషో, భగవాన్ రమణ మహర్షి, సేత్, రామ్తా ఇలా అనేక మంది మాస్టర్స్ యొక్క పుస్తకాలను చదవటం జరిగింది.

 

నేను ఎవరినైనా కలవాలన్న, మాట్లాడాలన్నా అవి వెంటనే జరిగిపోతాయి. ధ్యానం ద్వారా నా జీవితంలో సమతుల్యత ఏర్పడింది. ధ్యానం చేస్తే శాంతి, ఆనందం మన వెంటే ఉంటాయి. మరి ముఖ్యంగా ధ్యానమహాచక్రం నా జీవితంలో ఎంతో గొప్ప మార్పు తెచ్చింది. వేల మంది సమక్షంలో ప్రతిరోజు ధ్యానం చేస్తూ, అందరి అనుభవాలను పంచుకుంటూ, వసుధైక కుటుంబంలా జీవించే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో నేను భాగమైనందుకు ఎంతగానో గర్వపడుతున్నాను.

 

"ధ్యానం" లో నా అనుభవం ఒక కాంతిని దర్శించడం, తద్వార సుషుప్తావస్థ స్థితిలోకి వెళ్ళటం .. ఆ స్థితిలో నేను జారుకున్నా మానసికంగా చైతన్యభరితమైన అఖండ ధ్యాన శక్తిని పొందడం జరుగుతుంది. ధ్యానం ద్వారా మనలో ‘విశ్వశక్తి’ ని ఆవహింపజేసుకుని ఎంతో దృఢంగా, సంతోషంగా జీవించవచ్చునని స్వానుభవంతో తెలుసుకున్నాను. ధ్యానంలో సంకల్పించినదేదైనా సత్ఫలితాన్నిస్తుందని గ్రహించాను. దాంతో నాకు అసాధ్యంగా, అపరిష్కృతంగా తోచిన ఏ విషయమైనా ‘ధ్యానం’ లో సంకల్పిస్తే విజయం చేకూరుతుందన్న బలమైన నమ్మకం నాలో ఏర్పడింది. కానీ ఎక్కువ సమయం కేటాయించలేక సాధన కుంటుపడినప్పుడల్లా ‘ధ్యానం’ కోసం పరితపిస్తాను.

 

ధ్యాన గురువులు, సాధకుల ప్రసంగాలు వినడం వల్ల, పుస్తకాలు చదవడం ద్వారా నా ధ్యాన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. ఇలాగే ఆనందంగా గడపాలనీ, ఈ ఆనందాన్ని అందరికీ పంచాలనీ అభిలషిస్తున్నాను.

 

సందేశం : మన పట్ల మనకు విశ్వాసం, నమ్మకం, ప్రేమ, స్నేహభావం కలగాలంటే అత్యున్నతమైన ఏకైక మార్గం ధ్యానం అంటే "శ్వాస మీద ధ్యాస" మనమందరం ధ్యానం చేద్దాం.. ఆధ్యాత్మిక భావాలతో అభివృద్ధి చెందుదాం.

 

 

Go to top