" చావు భయం పోగుట్టుకోగలిగాను "

 

 

పేరు : S. అరుణ కుమారి
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : రెవెన్యూ


పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

బ్రహ్మర్షి పత్రిగారికి పాదాభివందనాలు. నేను ధ్యానంలోకి రాకముందు నా జీవితం వేరేగా ఉండేది అంటే చిరాకు, కోపం, ఉక్రోషం మరి ఎవరైనా ఏదైనా అంటే వెంటనే అసహనాన్ని ప్రదర్శించేదానిని. ఆరోగ్యపరంగా థైరాయిడ్‌తో బాధపడుతున్నాను. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం నా స్నేహితులు శ్రీమతి శివరమ్య మరి శ్రీమతి సరళ గార్ల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను.

 

సరిగ్గా ఆరు నెలల నుంచి నేను పట్టుదలగా ధ్యానం మొదలుపెట్టాను. మొదటి రోజు నా అనుభవం ఏమిటంటే నేను అప్పటికి పత్రిగారిని చూడలేదు, నేను ధ్యానంలో కూర్చోగానే పత్రిగారు ఆశీర్వదిస్తున్నట్లుగా వచ్చారు, "నేను ఇందులో అన్నీ పొందగలను" అనుకున్నాను .. అంటే శాంతి ఓర్పు మొదలైనవి.

 

నేను సాయిబాబాకి భక్తురాలిని, ఏ దేవుడినీ పూజించను. ఒకరోజు "పారాయణం చేద్దాం" అని పుస్తకం తీస్తే ధ్యానం గురించి విపులంగా ఉంది. అంటే ధ్యానం ఎంత మేలు చేస్తుందో తెలిసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో అనుభవాలు వస్తున్నాయి, నా నిజ జీవితంలో కూడా ఎంతో మార్పు వచ్చింది అంటే కోపం లేదు, ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటే సహనంగా వుంటూ, ఎదురు తిరగడం చేయడం లేదు. ఎంతో మంది యోగులనూ, మాస్టర్స్‌నూ మరి దేవుళ్ళనూ ధ్యానంలో నేను చూడగలిగాను.

 

ఆరోగ్యపరంగా ఇంకా చెప్పాలంటే థైరాయిడ్‌తో నేను చాలా బాధ పడేదాన్ని. నేను ధ్యానం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుండి థైరాయిడ్ తగ్గినట్లు అనిపించింది కానీ పూర్తిగా నిర్థారణ కాలేదు. అయితే ఒకరోజు ప్రొద్దున థైరాయిడ్ మందులు వేసుకుంటూ, "ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇవి వేసుకోవాలిక?" అనుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం ఆఫీసులో ధ్యానంలో కూర్చోగానే బ్రహ్మర్షి పత్రిగారి చేయి కనిపించింది. ఆ చేతిలో పెద్ద తెల్లని అన్నం ముద్ద, దాని మీద క్రీమ్ కలర్ ఉన్న మందులాంటిది ఉంది. అయితే ఒక తండ్రి తన బిడ్డకి ఎలా అన్నం తినిపిస్తాడో అలా ఆ చేయి నాకు ధ్యానంలో తినిపించింది, నేను శారీరకంగా ఇక్కడ లేను, అది ఎక్కడో నాకు తెలియదు. అది తిన్నాక శరీరం తేలికయింది. ఏదో శక్తి నాలో ప్రవేశించినట్లుగా అయింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకున్న థైరాయిడ్ తగ్గిపోయింది!

 

ధ్యానం ద్వారా చావు భయం పోగొట్టుకోగలిగాను. ఎలా అంటే నేను చనిపోతే నా భర్త, పిల్లలు ఏమైపోతారో అనే భయం. నేను ధ్యానం మొదలు పెట్టాక.. ఈ భయం అన్నది పోయింది. ఇప్పుడు నేను చావు గురించి ఆలోచించటం లేదు. అస్సలు భయమే లేదు.

 

చివరగా నేను చెపదల్చుకున్నది ఏమిటి అంటే, ఈ ధ్యానం వలన శారీరకంగా కానీ, మానసికంగా మరి ఆరోగ్యపరంగా కానీ చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఈ ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిగారికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. పత్రిగారి ఆశీర్వాదం వలన నేను నా ఇంట్లో ఒక ధ్యాన మందిరం మొదలుపెట్టాను. నేను అనుకున్నవన్నీ సాధించగలననే నమ్మకంతో ఉన్నాను.

 

సందేశం : మనమందరం ధ్యానం చేద్దాం; యదార్థ సత్యాలను తెలుసుకుందాం. జ్ఞానవంతంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం.

 

Go to top