" ధ్యానం సర్వ శుభప్రదాయిని "

 


పేరు : V. నాగేశ్వరరావు
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీ రాజ్

 

పాఠకులందరికి ధ్యానాభివందనాలు.

 

ధ్యానంలో ఒక వ్యక్తి పొందిన అనుభూతిని వ్యక్తీకరించడం అంత సులవైన పని కాదు. దానికి సరిపడా పదాలు కూడా దొరకవు. అయితే ధ్యానంలో పొందిన అనుభూతులను శక్తి మేర వ్యక్తీకరించగలిగితే తద్వారా అది విన్న వారు ఆ అనుభూతులను ధ్యానంలో పొందడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సామూహిక ధ్యానం చేస్తున్న వ్యక్తులు అనుభవంలో, అనుభవాల గ్రహణలో విభిన్న స్థాయిలలో వుంటారు. ఒకానొక వ్యక్తి ధ్యానంలో తను పొందిన అనుభవాన్ని వ్యక్తీకరించినప్పుడు, అంతకన్నా అధిక స్థాయి అనుభూతులు అనుభవంలో వున్న వ్యక్తి విన్నప్పుడు, "అవును! అది అక్షరాలా సంభవమే" అని గ్రహిస్తాడు. అదే అనుభవం విన్న, తక్కువ స్థాయిలో వున్న వ్యక్తి! "ఇది సాధ్యమా?!" అని ఆశ్చర్యపోతాడు. అలాంటి అనుభూతిని తర్వాత తానుచేసే ధ్యానంలో పొందగలుగుతున్నాను అని గమనిస్తాడు. తద్వారా ఉన్నత స్థాయిని త్వరగా పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే మాస్టర్స్ తమ తమ అనుభవాలను పంచుకోవాలని అందరినీ ప్రోత్సహిస్తూంటారు.

 

నేను ధ్యానం ప్రారంభించినప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూంటాను. మధ్య మధ్యలో వచ్చే ఆలోచనలను వదలివేస్తూ, నిరంతరాయంగా శ్వాసపై ధ్యాస నిల్పటానికి ప్రయత్నిస్తాను. అలా కొంత సమయం గడిచేసరికి శ్వాసక్రియ జరుగుతోందో లేదో తెలియని స్థితికి చేరుకుంటాను. అలా అలా గమనిస్తూ వుంటే మరికొంత సమయానికి నేను శిరోభారం కలిగి వున్న స్పృహను కోల్పోతాను. ఆ స్థాయిలో శిరస్సు వున్నట్లు తెలియదుగాని, శిరస్సు ఊర్థ్వ భాగంలో అద్భుతమైన, వర్ణించడానికి వీలుకాని "శక్తి భ్రమణం" లేదా "ఆహ్లాద ప్రవాహం" తెలుస్తుంది. అది మహాద్భుత ఆనందాన్ని కల్గిస్తుంది. ఈ స్థితి నుండి బయటకు రావడానికి ఏమాత్రం ఇష్టం కలగదు. ఈ స్థితిలో కొంత సమయం గడిపిన తర్వాత శిరస్సు మాత్రమే కాదు శరీరంలో ఏ భాగం ఉన్నట్లు తెలియదు. ఒక అద్భుతమైన, అలౌకికమైన ఆనందానికి లోనవుతాను.

 

ధ్యానంలో నాది ప్రాథమిక స్థాయి. ఇలాంటి ఎన్నో స్థితులను దాటి అత్యున్నత స్థాయిలో వున్న మహామహులెందరో ఉన్నారు. అందుకే వారు తమ అనుభవాలను చెప్పేటప్పుడు కుతూహలంగా వింటూంటాను.

 

ఇలాంటి అద్భుత అనుభవాలను, అనుభూతులను పొందే అవకాశం కల్పిస్తూ సచివాలయంను "ధ్యాన తెలంగాణ సచివాలయం" గా తీర్చిదిద్దుతున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మరి మన గురువు బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మప్రణామాలు.

 

సందేశం: మనమందరం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ప్రతి యోగి గురించి చదివి తెలుసుకోవాలి. తద్వార ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుంటాం. అప్పుడే జీవితాన్ని ఆనందంతో, దివ్యానందంతో మరి బ్రహ్మానందంతో జీవిస్తాం.

 

Go to top