" ఎంత పనైనా చేస్తాను "

 


పేరు : P. లింగమూర్తి
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : రెవెన్యూ

 

పాఠకులందరికి ధ్యానాభివందనాలు.

 

మా డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్న శ్రీమతి సూర్యప్రభ మేడమ్ ద్వారా నాకు ధ్యాన పరిచయం కలిగింది. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మేడమ్‌గారి రూంలో ధ్యానం చేసేవాళ్ళం.

 

పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టాక నాలో కోపం, చిరాకు మరి టెన్షన్స్ తగ్గిపోయాయి. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటోంది. నా బాధ్యతలను నేను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వున్నత స్థాయిలో అధికారుల మన్ననలను పొందుతున్నాను.

 

"శ్వాస మీద ధ్యాస" అనేది కేవలం ఒక చర్య కాదు. ఇది న్యూటన్ మూడవ గమన సూత్రమైన "చర్య-ప్రతిచర్య" లాగా పనిచేసి సమాజంలో సమూల మార్పులకు దారి తీస్తుంది. ఎలాగంటే ఒక వ్యక్తి "శ్వాస మీద ధ్యాస" పెట్టడమంటే అన్ని ఆలోచనలను ప్రక్కన పెట్టి మనస్సుని కేంద్రీకృతం చేయడం. ఈ చర్య దినచర్యలాగా మారితే నెమ్మదిగా ఒక వ్యక్తి తనలోని ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలికి అనుకూల ఆలోచనల వైపు మరలే అవకాశం ఉంది.

 

ఈ రకమైన దృక్పథం నెమ్మదిగా వ్యక్తిలో సమూల మార్పులకు దారి తీసి వ్యక్తి "శక్తి" లాగా మారే అవకాశం ఉంది. ఈ వ్యక్తుల/శక్తుల సమూహమే సమాజంలో సమూల మార్పులకు కారణభూతమౌతుంది. సమాజంలో మార్పు అనేది దేశంలో మార్పుకు, ఒక దేశంలోని మార్పు ప్రపంచ దేశాలలో మార్పుకు దారి తీసి చివరికి ఇది "ప్రపంచమే ఒక వసుధైక కుటుంబం" అనే ఐక్యతా రాగానికి వేదిక అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.

 

సుమారు ఇరవై సంవత్సరాల క్రితమే నాకు ఈ విషయ పరిజ్ఞానం ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎలాగంటే మా తల్లిదండ్రులు 1980వ సంవత్సరం నుండి "ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం" అనే ఆధ్యాత్మిక సంస్థలో రెగ్యులర్‌గా వెళ్తూ "ధ్యానం" అనే గొప్ప సుగుణానికి అలవాటు పడడం అది వారి దైనందిక చర్యలో భాగం కావడం, ఆ రకంగా వారిలో వచ్చిన మార్పు ఎంతో మందికి మార్గదర్శకం కావడం నన్ను ఆ దిశలో నడవడానికి తోడ్పడింది.

 

మా తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలుగా ప్రతిరోజూ ఉదయం రెండు గంటలు మరి సాయంత్రం ఒక గంట ధ్యానం చేస్తారు. ఆ రకంగా నేను కూడా ప్రొద్దున, సాయంత్రం ఎంతో కొంతసేపు ధ్యానం చేయడానికి అలవాటు పడ్డాను.

 

అయితే, ఆఫీసులో శ్రీమతి సూర్యప్రభ గారి పరిచయం తర్వాత ధ్యానం చెసే సమయాన్ని ఇంకా కొద్దిగా పెంచుకొని నలుగురికీ ఈ విషయం చెప్పాలనే ఆలోచనలు కూడా పెరిగాయి. అలాగే మన కో-ఆపరేటివ్ సొసైటీలోని స్టాఫ్ అందరికీ సుమారు పది రోజులపాటు ఈ ప్రోగ్రాం పెట్టించడం, వాళ్ళంతా చాలా సంతృప్తిపడడం జరిగింది.

 

మీరంతా దీని గొప్పతనం తెలుసుకొని, ఆ దిశగా అడుగులు వేస్తారనే చిన్ని ఆశతోనే పై విషయాలన్నీ మీ ముందర వుంచడం జరిగింది. చివరిగా సూర్యప్రభ మేడమ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

సందేశం: ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. ప్రపంచమంతా శాకాహారమయం కావాలి. ప్రపంచమంతా పిరమిడ్‌మయం కావాలి. కనుక మనమందరం ధ్యానం చేద్దాం. మన జీవితాలను ఆనందమయం చేసుకుందాం.

 

Go to top