" ప్రతి క్షణం బ్రహ్మానందం "

 

 

నా పేరు " స్వరూపరాణి " !

 

" నువ్వు ఒకానొక ఆత్మ స్వరూపానివి " అని మొదటిసారిగా నాకు తెలియజేసిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మాభివందనాలు!

 

సుమారు 18 సంవత్సరాల క్రితం మా పుట్టిల్లు అయిన గుంతకల్లులో పత్రీసార్ సమక్షంలో ధ్యానం చేసుకొని .. వారి ప్రవచనం విని నా ధ్యాన జీవితాన్ని ప్రారంభించాను!

 

2009 సంవత్సరం " శ్రీశైలం ధ్యానమహాయజ్ఞం ‘ లో పాల్గొని అపారమైన " విశ్వశక్తి " ని గ్రహించుకున్నాను. ఆ వెంటనే చెన్నై కి వచ్చి 40 రోజుల ధ్యానశిక్షణా తరగతులను ప్రారంభించాను !

 

ఒకానొక రోజు ధ్యానంలో ఉన్నప్పుడు చనిపోయిన మా అమ్మగారు నాకు దర్శనం ఇచ్చి .. నాతో సూక్ష్మశరీరయానం చేయించారు. చక్కటి ఆధ్యాత్మిక విషయాలను నాకు తెలియజేస్తూ నన్ను ఎన్నెన్నో లోకాలు త్రిప్పారు !

 

" అమ్మా ! ఇవన్నీ నీకు ఎలా తెలుసు?" అని నేను ఆశ్చర్యంతో అడుగగా ..ఆమె " ఇక్కడ చాలా బాగుంది. ఈ లోకాలలో అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ నేను చాలా ఆనందంగా ఉన్నాను " అని చెప్పారు ! అప్పటినుంచీ " మా అమ్మ చనిపోయింది" అన్న దుఃఖం నుంచి నేను పూర్తిగా విముక్తి చెందాను.

 

ఇలా ధ్యానంలో నాకు ఏవైన అనుభవాలు కలిగినప్పుడు వెంటనే " పత్రీసార్ కి చెప్పాలి " అనిపించగానే .. అంతే సార్ .. ఫోన్ .. చేయడమో, ఏదో ఒక కార్యక్రమంలో అనుకోకుండానే వెళ్ళి నేను సార్‌ని కలవడమో జరగుతూ ఉంటుంది.

 

ఇలా నా ధ్యానసాధన నేను చేసుకుంటూ ఉన్నా కూడా ఎక్కడో మనస్సు మూలల్లో " నా భర్త ఈ ధ్యాన మార్గానికి దూరంగా ఉండడం వల్ల నేను నా సాధనలో అనుకున్నంత వేగంగా వెళ్ళలేకపోతున్నానేమో ? " అని నాకు అనిపించేది.

 

ఇదే విషయాన్ని సార్‌తో పంచుకోగా వారు " మీ సమయం వచ్చినప్పుడు మీరు ఈ మార్గంలో వచ్చినట్లే .. వారి సమయం వచ్చినప్పుడు వారు కూడా ఇందులోకి వస్తారు ! అందాకా సహనంతో వేచి ఉంటూ మీ సాధన మీరు చేసుకోండి " అన్నారు.

 

ఇదే నా గురువు నాకు నేర్పించిన ఆత్మజ్ఞానం ! ఈ ఆత్మజ్ఞానమే లేకపోతే నేను నా భర్తలో .. ఒక తండ్రినీ, ఒక తల్లినీ, ఒక దైవాన్నీ, ఒక అన్ననీ, స్నేహితుడినీ ఎన్నటికీ చూసుకోలేకపోయేదానిని. వారిని నాకు " ఒక అవరోధం " లా తలుస్తూ వారిపై కోపం మరి భయం పెంచుకునేదానిని.

 

పత్రీజీ చెప్పినట్లుగానే ఇప్పుడు మా వారు కూడా ధ్యానం చేస్తూ .. నేను చేసే అన్ని ధ్యానకార్యక్రమాలకు సహకరిస్తూ .. మా ఇంటిపై " పరమహంస పిరమిడ్ " ను కుడా నిర్మించారు. సార్ చేతులు మీదుగా ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం జరగడం మా కుటుంబాన్ని ఎంతగానో ఆనందపరిచింది!

 

ఈ క్రమంలోనే 2014, 2015, 2016 సంవత్సరాలలో నేను "బెంగళూరు పిరమిడ్ వ్యాలీ" లో జరిగిన GCSS లలో పాల్గొని " మహావతార్ బాబాజీ " ఎనర్జీని విశేషంగా విశేషంగా తీసుకోవడం జరిగింది.

 

2015 సంవత్సరంలో గురువు గారితో కలిసి చేసిన " ఈజిప్ట్ " ప్రయాణం నా జీవితంలో మరువలేను. పత్రీజీతో కలిసి " నైల్ నది " లో క్రూజ్ ప్రయాణం, " గ్రేట్ గిజా పిరమిడ్ కింగ్స్ ఛేంబర్ " లో ధ్యానం, దహాబ్‍లో జరిగిన " స్పిరిచ్యువల్ రిట్రీట్ " లో పాల్గొనడం నన్ను ఆత్మపరంగా ఎంతగానో ఎదిగించింది.

 

మౌనశక్తి ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి నేను 11 రోజులపాటు మౌనంగా ఉన్నాను. మౌనానికి ధ్యానం తోడవుతూనే అపారమైన విశ్వశక్తి నాలోకి ప్రవహించి .. " నేనే ఒక శక్తిక్షేత్రం " అన్న అనుభూతిని పొందాను.

 

ఆ 11 రోజులపాటు గాలిలో తేలిపోతూన్న అనుభవం కలిగింది. ఇటీవల " తిరుమల " లో జరిగిన మూడు రోజుల మౌనధ్యానంలో పాల్గొన్న తరువాత నాలో " ఆటోరైటింగ్ " మరి " దివ్యచక్షువు అనుభవాలు" అన్న ప్రక్రియలు ప్రారంభం అయ్యాయి.

 

ఇలా ధ్యానం, మౌనం, స్వాధ్యాయం, శాకాహారం, పిరమిడ్ శక్తులతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నేను జీవితాన్ని హాయిగా జీవిస్తున్నాను.

 

స్వరూపరాణి - చెన్నై


98843 09923

Go to top