" పత్రీజీ .. నా జీవితానికి పరమార్థాన్ని కలుగజేసారు "

 

 

సాంప్రదాయ మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నేను గుజరాత్ రాష్ట్రం " బరోడా " లో జన్మించాను. మా నాన్న " శ్రీ గోవింద్ గోపాల్ కింగీ " మరి మా అమ్మ " శ్రీమతి కమిలినీ గోవింద్ కింగీ " నాకు ఒక అక్క ఇద్దరు అన్నలు.

 

మా నాన్నగారు సెంట్రల్ రైల్వేలో ఉద్యోగి కావడం వల్ల వారికి తరచూ బదిలీలు జరుగుతూ ఉండేవి. మా చదువులకు ఆటంకం కలగకూడదని వారు కుటుంబాన్ని హైదరాబాద్ కాచిగూడలో ఉంచి .. తాను ఒక్కరూ భారతదేశం అంతటా తిరుగుతూ ఉండేవారు.

 

దాంతో చిన్నప్పటి నుంచీ మా అమ్మే అన్ని విషయాలలో మార్గదర్శనం చేస్తూ మాకు చక్కటి సంస్కారాన్ని అందిస్తూ పెంచారు.

 

నేను కాచిగూడలోని వివేకవర్థినీ హైస్కూల్ మరి జూనియర్ కాలేజీలో చదువుకుని "గాంధీ మెడికల్ కాలేజీ" నుంచి M.B.B.S పూర్తిచేశాను.

 

మా అమ్మ " ఛత్రపతి శివాజీ " గురువుగారైనా " సమర్థ రామదాసు గురుపరంపర " ను అనుసరించడంతో మేము కూడా అమ్మతోపాటే ఆ సిద్ధాంతాలను పాటించేవాళ్ళం. ఇప్పటికీ మా ఇంట్లో " వైకుంఠ ఏకాదశి " మరి " ఆషాఢ ఏకాదశి " రోజులలో " భజన " మరి " మనాచే శ్లోక పఠనం " జరుగుతుంది.

 

మా గురుసంప్రదాయం ప్రకారం మేము సంవత్సరంలో ఒక రోజు ప్రతి ఒక్కరూ వీధులలో భిక్ష ఎత్తి దానినే తినాలి. మేమందరం దానిని పాటిస్తాం.

 

స్వయంగా హార్మోనియం కళాకారిణి అయిన మా అమ్మ పిల్లలకు చదువుతో పాటు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలన్న పట్టుదలతో నన్ను పదవతరగతి కాగానే "కిష్ణయ్య" అనే గురువు దగ్గర "సితార్" నేర్చుకోవడానికి చేర్పించారు.

 

ఆ తరువాత " పాండురంగ్ పరాఠే " గారి దగ్గర నాలుగు సంవత్సరాలపాటు నేర్చుకుని 1979లో ప్రముఖ సితార్ విద్వాంసులు " ఉస్తాద్ విలాయత్ ఖాన్ " గారి మేనల్లుడు " ఉస్మాద్ షాహిద్ పర్వేజ్ ఖాన్ ’ గారి దగ్గర " షాగిర్డ్ (Shagird) " గురుపూజ చేసి మరీ శిష్యుడిగా చేరాను.

 

నాకంటే వయస్సులో మూడు నాలుగేళ్ళు మాత్రమే పెద్దవాడయిన పర్వేజ్ ఖాన్ గారి దగ్గర నేను " శాస్త్రీయ సంగీతం " లో గొప్ప గొప్ప రాగాలను నేర్చుకుంటూ వీలున్నప్పుడల్లా వారితో కలిసి ముంబాయిలో ఉంటూన్న వారి మేనమామ గారయిన హిందుస్థానీ సంగీత లోకంలో మహామహులు " ఉస్మాద్ విలాయత్ ఖాన్ " గారి బంగాళాకు వెళ్ళేవాడిని !

 

వారికి సేవలు చేస్తూ, వారి ఇంట్లో పనులు చేస్తూ వారి సమక్షంలో గడుపుతూ వారి దగ్గర సాధన మెళకువలను నేర్చుకున్నాను. స్టేజీ మీద వారు చేసే కచేరీలను దగ్గర నుంచి గమనిస్తూ ప్రేక్షుకుల అభిరుచికి తగినట్లుగా వారు క్రొత్త క్రొత్త బాణీలను ఎలా ఎంచుకుంటారో తెలుసుకునేవాడిని.

 

ఇంటికి తిరిగి వచ్చాక కూడా వారి ఆడియో కేసెట్‌లను వింటూ తీవ్రసాధన చేసేవాడిని. ప్రతి సంవత్సరం వారు పిల్లలకు ఉచితంగా సితార్ నేర్పించడానికి నిర్వహించే శిబిరాలకు నేను కూడా హాజరు అయ్యేవాడిని. B.Sc చదివేటప్పుడూ .. మరి " మెడిసిన్ " చదివేటప్పుడూ ... వారు ఎప్పుడు రమ్మని పిలుస్తే అప్పుడు మా గురువు " షాహిద్ ఖాన్ " గారితో కలిసి ముంబాయి కి వెళ్ళిపోయేవాడిని !

 

ఇలా సితార్ కళాకారుడిగా ఎదుగుతూనే .. నా వైద్యవిద్యను పూర్తిచేసుకున్నాను ! డాక్టర్ పట్టాతో మెడికల్ కాలేజీ నుంచి బయటికి వచ్చే సరికే నేను .. దేశ విదేశాలలో కచేరీలు చేస్తూ .. డబ్బులు సంపాదిస్తూ సితార్ కళాకారుడి గా స్థిరపడిపోయాను !

 

ఈ లోగా " బరోడా " కు చెందిన జాతీయస్థాయి క్రికెట్ క్రీడాకారిణి అయిన " ప్రతిమ " తో ప్రేమ వివాహం జరగడం మరి ఇద్దరు పిల్లలు " ఉన్నతి ", " యశశ్రీ " పుట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి.

 

దాంతో ఇక కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం వైద్యవృత్తిని పూర్తిగా ప్రక్కనపెట్టేసి .. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేపధ్య సంగీత కళాకారుడిగా చేరి తెలుగు, హిందీ చిత్రాలకు పనిచేస్తూ .. " సినీ విజన్స్ యూనియన్ " కు సెక్రెటరీగా ఎన్నిక అయ్యాను.

 

" కీరవాణీ ", " శ్రీలేఖ " వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేస్తూ .. 1994 లో హైదరాబాద్ మోతీనగర్ లో " ప్రతిమా రికార్డింగ్ స్టూడియో" స్థాపించాను. ఇక అప్పటినుంచి " పద్మశ్రీ ", " డా||యల్లా వెంకటేశ్వరరావు " గారి వంటి గొప్ప గొప్ప కళాకారుల ఆడియో వీడియో సీడీలను రూపొందిస్తూ వచ్చాను.

 

ఈ క్రమంలోనే డా||యల్లా వారు పత్రీజీతో కలిసి చేసిన ఒకానొక రికార్డింగ్ సందర్భంగా నేను పత్రీజీని కలవడం జరిగింది. ఇక అప్పటినుంచీ " పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ " లో జరిగిన ప్రతి ఒక్క ముఖ్యకార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతూ వచ్చాను !

 

పత్రీజీ ఆత్మజ్ఞాన సందేశాల ఆడియో మరి వీడియో కేసెట్స్ అన్నీ దాదాపుగా మా స్టూడియోలో రూపొందించబడినవే ! ఈ సందర్భంగా మాకు రోజులు తరబడి వారితో సమయం గడిపే భాగ్యం దక్కింది. వారి రికార్డింగ్‌లు చేస్తూ చేస్తూ వారు అందించే జ్ఞానమంతా నాలో చేరిపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను !

 

" పత్రీజీతో కలిసి పనిచెయ్యడం జన్మజన్మల అదృష్టం " అని వారితో కలిసి పనిచేసేవాళ్ళకే తెలుస్తుంది; అయితే కళాకారులకు వారు ఇచ్చే గౌరవం మాటలో చెప్పలేనిది. స్టేజీ పైన కూడా .. ఎదుటివాళ్ళకు అనుకూలంగా ఉండేవిధంగా వారు తమ గతి మరి తాళం సరిచేసుకుంటూ ఉంటారు.

 

" 2013 డిసెంబర్ ధ్యానమహాచక్రం " సమయంలోనే మా చిన్నమ్మాయి వివాహం కూడా జరగడంతో నేను ఒకరోజు ప్రాతకాల ధ్యానానికి రాలేకపోయాను. అక్కడ పనిచేస్తున్నా నా మనస్సంతా " కైలాసపురి "లోనే !

 

నాకు బదులుగా వేరెవరితోనో కార్యక్రమం పూర్తి అయినా ఆ రోజు వేదికపై పత్రీజీ .. " సంజయ్ కింగీ లేని లోటు ఈ రోజు నాకు తెలిసింది " అనడం నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. అంత గొప్ప గురువు ప్రశంసలు పొందడం కంటే గౌరవం ఇంకొకటి లేదు.

 

" పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ " లో జరిగే అన్ని మెగా ఈవెంట్‌లలో వారితో కలిసి వేదికపై ప్రాత:కాల ధ్యానంలో పాల్గొనడం గొప్ప అనుభవం !

 

కర్నాటక గాత్ర సంగీతంలో దిట్టలు అయిన వారితో కలిసి హిందూస్థానీ కళాకారుడిని అయిన నేను గంటలు గంటలు కచేరీలు చేయడం ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను !

 

ప్రస్తుతం నేను " భగవద్గీత " ను 700 శ్లోకాలను 700 రాగాలలో 18 భాషలలో రికార్డింగ్ చేస్తున్నాను. తెలుగు భాషలో పత్రీజీ, హిందీలో ‘ లుధియానా పిరమిడ్ మాస్టర్ అనిల్ భారతిగారు ’, ఇంగ్లీష్‌లో నేను పూర్తి చేశాం.

 

న్యూఢిల్లీలో " ప్రధానమంత్రి మోదీ " గారి చేతుల మీదుగా పత్రీజీ సమక్షంలో వాటిని రిలీజ్ చేయించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం.

 

ఇప్పుడు పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయ్యి .. అమెరికా మరి అస్ట్రేలియా దేశాలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్లుగా స్థిరపడ్డారు.

 

పెద్దమ్మాయి " గజల్ సింగర్ " గా, చిన్నమ్మాయి " సితార్ కాళాకారిణి " గా చక్కగా రాణిస్తున్నారు. ఇక నా జీవితం ప్రయాణం అంతా పత్రీజీతోనే !

 

 

Go to top