" ధ్యానంతోనే - జ్ఞానోదయం "


నా పేరు " సీతాదేవి " !


నేను 12 సంవత్సరాల క్రితం "మండపేట" సీనియర్ పిరమిడ్ మాస్టర్ " సత్యసుధ " గారి ద్వారా ధ్యానం నేర్చుకుని ధ్యానప్రచరం చేస్తున్నాను.
ఈ క్రమంలో రాజమండ్రి "వనజ మేడమ్" మరి విజయా బ్యాంక్ మేనేజర్ "శ్రీనివాసరావు" గార్లతో కలిసి నేను, మరొక 30 మంది మస్టర్స్ .. మారేడుమిల్లి ఆటవీ ప్రాంత గిరిజన పాఠశాలలలోని పిల్లలకు ధ్యానశిక్షణను అందించడానికి వెళ్ళాం.

 

రవాణ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఆ అటవీ ప్రాంతాలలో తిరుగుతూ తిరుగుతూ ప్రతిరోజూ ఉదయం 5.00 గం లకు మొదలయ్యే మా కార్యక్రమాలు రాత్రి 8.00 గం లకు ముగిసేవి.

 

ఇలా నాలుగు రోజులు గడిచాక ఒకరోజు రంపచోడవరం దగ్గర ఒకానొక గిరిజన పాఠశాలలో రాత్రి 8.00 గం లకు మా కార్యక్రమాలను ముగించుకుని నేను .. మరి తెనాలి మాస్టర్ లత గారు .. కలిసి మేం బస చేసి ఉన్న " కస్తూరిబా హాస్టల్ " కు బయలుదేరాం. గాలి దుమారంతో కూడిన ‘కుంభవృష్టి’ కురవడంతో ఉన్నట్లుండి కరెంట్ కూడా పోయింది.

 

మరో దారి లేక ఇద్దరం ఆ జోరువానలోనే నడుచుకుంటూ మా హాస్టల్‌కి చేరుకున్నాం. గేటు లోపల పెద్ద గడియ పెట్టి ఉండడంతో ఇద్దరం కలిసి గేటును తోస్తూ రాళ్ళతో మోదుతూ గట్టిగా లోపలి వాళ్ళను పిలిచాం.

 

ఆ వర్షపు హోరులో వాళ్ళకు వినిపించలేదేమో .. ఎవ్వరూ రాలేదు. గేటు తెరవడానికి ఇద్దరం శతవిధాల ప్రయత్నించి విఫలమై వేరేదారి లేక ఆ వర్షంలోనే కూర్చుని " ఇక ఆ పత్రీజీయే వచ్చి మమ్మల్ని కాపాడాలి " అనుకుంటూ ధ్యానం చేసుకున్నాం.

 

పదినిమిషాల ధ్యానం తరువాత లేచి .. ఇలా గేటు ముట్టుకున్నామో లేదో అలా అది బార్లా తెరుచుకుంది ఇక మా ఆనందానికి అవధులు లేవు .. ! మా వయస్సును కూడామరచిపోయి చిన్న పిల్లల్లా గెంతులు వేసాము !

 

మర్నాడు ధ్యానంలో ఒక ఆస్ట్రల్ మాస్టర్ కనిపించి " నేను ఒక సన్యాసిని; దేహంతో ఉన్నప్పుడు ధ్యానం నేర్చుకుని ఎన్నో లభాలను పొందాను కానీ అహంకారపు మాయలోపడి వేరెవ్వరికీ దానిని నేర్పకుండానే చనిపోయాను.

 

" తీరా మరణించిన తరువాత నేను చేసిన పొరపాటు నాకు తెలిసివచ్చింది. ‘ సంసారం లోనే నిర్వాణం ’ .. ‘ సన్యాసి జీవితం వల్ల విముక్తి లభించదు ’ అన్న సత్యాలనూ తెలుసుకుని మళ్ళీ జన్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఏదయితే చెయ్యలేకపోయానో దానిని మీరు చేస్తూన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు గేటు తీసి సహాయం చేసింది నేనే " అని చెప్పాడు !

 

మేము ఉంటూన్న " కస్తూరిబా హాస్టల్ " లో ఏడు కుక్కలు ఉన్నాయి. మేము ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా అవి వచ్చి నిశ్శబ్దంగా మా ప్రక్కన కూర్చుని .. ధ్యానం కాగానే మా రెండు చేతులలో కాస్సేపు తలలు పెట్టి వెళ్ళిపోయేవి; ఆ చుట్టుప్రక్కల మరెన్నో శునకాలు ఉన్నా .. ఇవి మాత్రమే ఇలా వింతగా ప్రవర్తించేవి !

 

ఒకరోజు ఆ శునకాల గురించే ప్రశ్నవేసుకుని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో ఒక శునకం కనబడి .. మన భాషలోనే తన అనుభవాన్ని చెప్పింది;

 

" మేం కూడా ఒకప్పుడు మీ లాగే మానవజన్మలో ఉన్నాం. ఆడ, మగ పిల్లలకు మధ్య వివక్షత చూపిస్తూ .. అజ్ఞానంతో ఆడపిల్లలకు కడుపునిండా భోజనం పెట్టక పోయేవాళ్ళం. ముందు మగపిల్లలకు పెట్టి .. మిగిలింది మాత్రమే వాళ్ళకు పెట్టేవాళ్ళం.

 

ఈ లోకం నుంచి నిష్క్రమించిన తరువాతే మాకు ‘ ఈ సృష్టిలో ఆడ-మగ అంతా సమానమే .. అందరూ ఆత్మస్వరూపులే ’ అన్న అవగాహన కలిగింది.

 

ఆ జన్మలో మేం చేసిన తప్పుకి ఈ జన్మలో ఇలా శునకాల్లా పుట్టి మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారని గుర్తించి ఇక్కడికి వచ్చాం. మీరు వాళ్ళందరికీ కడుపునిండా భోజనం పెడుతూ .. వాళ్ళకు ధ్యానవిద్యను నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు" అని తెలియజేశాయి !

 

ఇలా ప్రతి ఒక్క అనుభవం ద్వారా మనం అద్భుతమైన జ్ఞానోదయాన్ని పొందేలా చేస్తూన్న ధ్యానానికీ మరి ధ్యానాన్ని అందరికీ అందజేస్తూన్న పత్రీజీకి ధన్యవాదాలు !

 

 

దేవరపల్లి సీతాదేవి

పామర్రు గ్రామం


తూ||గో||జిల్లా


93930 22990

Go to top