ధ్యానంతోనే .. చివరి శ్వాస వరకు

 

 

తెలుగు, తమిళ, హిందీ మరి ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలతో వీరోచతిమైన ఫైటింగులు చేయిస్తూ .. చలనచిత్ర రంగంలో సినీ ఫైట్ మాస్టర్స్‌గా తమదైన సృజనాత్మక ముద్రను సంపాందించారు. " రామ్ " మరి " లక్ష్మన్"  గార్లు.

 


తెలుగు చలనచిత్ర రంగంలోని అగ్రశ్రేణి హీరోలందరితో కలిసి పనిచేస్తూ .. " ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం " .. " ఇడియట్ " .. " అమ్మనాన్న తమిళఅమ్మాయి " .. " మగధీర " .. " ఆర్య1 ఽ ఆర్య 2 " వంటి హిట్ సినిమాలకు " బంగారు నందులు " పొంది " నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్ " గా వెలుగుతోన్న ఈ సోదరులు .. ప్రతి సంవత్సరం కడ్తాల్ పిరమిడ్‌కు వచ్చి .. 14 రోజుల పాటు " ధ్యానమహాచక్రం " లో ప్రాతఃకాల ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆత్మజ్ఞాన పరాయణులైన ఈ ధ్యానసోదరులతో " ఇన్నర్ వ్యూ " మనందరి కోసం ..

 


T.వాణి

 

వాణి: " మీ బాల్యం మరి కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకోగోరుతున్నాం .. "

 


రామ్ గారు: "మాది ప్రకాశం జిల్లా .. కారంచేడు మండలంలోని ‘నందిగుంటపాలెం’ అనే ఒక చిన్ని గ్రామం. అరవై గడపలకంటే ఎక్కువ లేని మా గ్రామంలో బస్సు సౌకర్యం గానీ .. ఆసుపత్రి సౌకర్యం గానీ లేవు.

 

" మా తల్లిదండ్రులు ‘ రంగారావు ’, ‘ మునహరమ్మ ’ గార్లకు అయిదుగురు సంతానంలో మేము ‘ కవలలు ’ గా చివరన జన్మించాము. మేము కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకు తరచూ మేఘాలలో ఆంజనేయస్వామి కనిపించి అభయం ఇస్తూండే వాడట ! దాంతో ‘ ఏదో దైవశక్తి నా కడుపులో పెరుగుతోంది ’ అని మా అమ్మకు అనిపించేదట.

 

" చూడడానికి ఒక్కలాగే ఉండడంతో మేం పుట్టినరోజే మమ్మల్ని చూడడానికి వచ్చిన ఊళ్ళో పెద్దవాళ్ళు మాకు ‘ రామ్ ’, ‘ లక్ష్మణ్ ’ అని పేర్లు పెట్టేశారు. "

 

 

లక్ష్మణ్‌గారు : " మా నాయనమ్మ ‘ ఈశ్వరమ్మ ’ గారికి మా నాన్న ఒక్కడే సంతానం కావడంతో కాస్త గారాబం పాలు ఎక్కువైన ఆయన అనేక వ్యసనాలకు బానిస అయ్యి ..  మా ఆస్తినంతా మంగళం పాడేశారు. దాంతో కుటుంబ పోషణ కష్టమై మా ఇంట్లో చిన్నాపెద్దా అందరం కూలీపనికి వెళ్ళాల్సి వచ్చేది.

 

 

" ఆ క్రమంలోనే మేమిద్దరం కూడా మూడేళ్ళ వయస్సు నుంచే ప్రత్తి పొలాలలో పని చేసేవాళ్ళం. నడవడం కూడా చేతకాని ఆ చిన్ని వయస్సులోనే మమ్మల్ని మా తాత తన భుజాలపై ఎత్తుకెళ్ళి ప్రత్తి పొలాలలో దించి వచ్చేవాడు. మేం కూడా హుషారుగా చేలల్లో ప్రత్తిని కోస్తూ .. రోజుకు ఒక్కొక్కళ్ళం మూడు రూపాయల చొప్పున సంపాదించి తెచ్చి మా అమ్మకు ఇచ్చేవాళ్ళం.

 

 

" అలా LKG చదివే వయస్సు నుంచే .. అందరు పిల్లలు తమ బ్యాగులను భుజాలపై వేసుకుని స్కూల్‌కి వెళ్ళినట్లు .. మేము మా భుజాలపై సద్దిమూటలు వేసుకుని కూలీ పనికి వెళ్ళేవాళ్ళం. పొలం పనులు లేని రోజుల్లో మేకలు, గేదలు కాస్తూ ఎవరు ఏ పని చెప్పిన చక్కగా చేసేవాళ్ళం. దాంతో ఊరి వాళ్ళందరికీ మేమంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.

 

 

" దానికి తోడు మేం ఇద్దరం కవలలం అయ్యి .. చుడడానికి ఒక్కలాగే ఉండడంతో మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తూ .. మేం ఎదురువస్తే చాలు ‘ పనులు పూర్తి అవుతాయి ’ అనుకునేవారు. ఏదైనా ముఖ్యమైన పనిని మా చేతులతోనే మొదలు పెట్టించేవారు.

 

 

" ఇలా చిన్నతనం నుంచే ఏదో ప్రత్యేకతా మరి దైవశక్తి మాలో ఉన్నాయన్న ఆత్మవిశ్వాసాన్ని మాకు కలిగించిన మా ఊరి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. "

 

రామ్‌గారు :  ఇలా పెరిగి పెద్దవుతూ మేము మా ఖాళీ సమయాలలో కర్రసాము, కత్తిసాము నేర్చుకుని .. ప్రదర్శనలు కూడా ఇచ్చేవాళ్ళం. మా నిజాయితీ, వినయం మా కలుపుగోలుతనం మరి కష్టపడేతత్వం చూసి ఊరివాళ్ళంతా కూడా తమ పిల్లలకు మమ్మల్ని ఆదర్శంగా చూపేవాళ్ళు. దాంతో మేము చిన్నప్పటి నుంచే మా నాన్నకు ఉన్న చెడు అలవాట్లన్నింటికీ దూరంగా ఉండేవాళ్ళం.

 

 

" మా ఊళ్ళో రచ్చబండ దగ్గర ఒక ‘ వందకిలోల బండరాయి’  ఉండేది. దానిని ఎత్తడానికి గతంలో ఎవరెవరు ప్రయత్నించారో మా ఊళ్ళో కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళు. అవి విని మేమిద్దరం ఆ బండరాయిని లేపడమే లక్ష్యంగా రాత్రిళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేసి .. ఒక సంవత్సరం తరువాత దానిని లేపి .. ఊళ్ళో ఒక్కసారిగా ‘హీరో’ లుగా అయిపోయాం ! "

 

వాణి: " చెన్నైకి మీ ప్రయాణం ఎలా సాగింది ? "

 


లక్ష్మణ్ గారు: " హీరోలలా అయ్యాక ఇక మాకు ఆ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. " ‘ మిలటరీ ’ లో చేరాలన్న ఉద్దేశ్యంలో గుంటూరులో సెలెక్షన్స్ కు వెళితే ‘ కనీస విద్యార్హతలు కూడా లేవు ’ అని మా అప్లికేషన్ లను తిరస్కరించారు. ఇక దాంతో ఏం చెయ్యాలో పాలుపోక తిరుగుతూన్న మమ్మల్ని మా నాన్న చీరాల ప్రక్కనే ఉన్న ‘ సంతరావూరు ’ కు చెందిన ‘ సినీ ఫైట్ మాస్టర్ రాజు ’ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు !

 

అప్పటివరకూ మా నాన్న వల్లనే పాడయిపోయిన మా జీవితాలకు .. మళ్ళీ మా నాన్న ద్వారానే బాగుపడే దారి దొరకడం ఎంతో విచిత్రం !

 


" ఇక ‘ స్వాతిముత్యం ’ సినిమాలో కమల్ హాసన్‌లా రాజుగారి వెంటపడి, విసిగించి మరీ మేం రైలెక్కి చెన్నై చేరుకున్నాం.

 

 

రామ్ గారు: " అదొక భీభత్సమైన ప్రపంచం ! అక్కడ మా నాన్నను మించిన వ్యసనపరులకు మేము సేవలు చేయాల్సిరావడంతో ప్రతి క్షణం నరకం అనుభవించే వాళ్ళం.

 

"అయినా మేం నమ్ముకున్న సిద్ధాంతాలను గౌరవిస్తూ వాటిని వదలకుండా నిష్కళంకులుగా ఉంటూనే ‘ ఫైటర్స్ ’ గా గుర్తింపు కార్డులు తెచ్చుకుని .. గొప్ప గొప్ప దర్శకుల బ్యానర్స్ లో పని చేస్తూ సినీరంగంలో స్థిరపడ్డాం. "

 


" ఇప్పటి వరకూ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు అన్నీ కలిపి వెయ్యికి పైగా సినిమాలు చేశాం. డబ్బూ, భవనాలూ, బంగారం, వాహనాలూ, పెళ్ళిళ్ళూ, పిల్లలూ, సమాజంలో గుర్తింపూ .. ఒక్కటేమిటి .. అన్నీ పొందేశాం. "

 

వాణి: " సినిమా ‘  హీరో ’ లుగా కూడా చేసినట్లున్నారు ? "

 


లక్ష్మణ్ గారు: " చేశాం తల్లీ ! ‘ సినీ ఫైటర్స్’  గా డబ్బూ, పేరు, గుర్తింపూ అన్నీ పొందాక మాలో  ‘అహంకారం ’. ‘ అసంతృప్తి ’, ‘ భయం ’ అన్న మూడు శత్రువులు బయలుదేరాయి. ఇక దాంతో ‘మనకేం తక్కువ ? ! ’ అన్న అహంకారంతో మేము ‘హీరో’ లుగా కొన్ని సినిమాలు చేశాం ! 
"అందులో రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ !

 


" దీనికితోడు హీరోలుగా చేస్తూ మేము ‘ ఫైటర్స్ ’ రంగానికి దూరం కావడంతో మా అవకాశాలన్నీ వేరేవాళ్ళకు వెళ్ళి పోయి మేము మళ్ళీ ‘ జీరో ’ లు గా మిగిలిపోయాం. దాంతో ఉన్న డబ్బంతా సర్వమంగళం అయ్యి .. కుటుంబాలతో సహా వీధిన పడ్డాం.

 


" ‘ ఇక అంతా అయిపోయింది ’ అనుకున్న తరుణంలో మేము మాలో ఉన్న అహంకారాన్నంతా వదులుకుని .. ఇతరులు హేళన చేస్తున్నా లెక్క చేయకుండా .. మళ్ళీ ‘ ఫైటర్స్ ’ గా అవకాశాల కోసం ప్రయత్నించాం.

 


" అదృష్టవశాత్తు ప్రముఖ దర్శకులు ‘ పూరి జగన్నాథ్ ’ గారి దర్శకత్వంలో ‘ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ’ సినిమాకి ఏకంగా ‘ ఫైట్ మాస్టర్స్ ‘ గా మాకు అవకాశం దొరికింది. "

 


" అది సూపర్ హిట్ ! వెంట వెంటనే ‘ ఇడియట్ ’, ‘ అమ్మ నాన్న తమిళ అమ్మాయి ’, ‘ ఆర్య’, ‘ మగధీర ’ వంటి హిట్ లతో మళ్ళీ డబ్బూ, పేరు ప్రఖ్యాతులూ మరి బంగారు నందుల తోపాటు క్షణం తీరిక లేకుండా వెంటవెంటనే అవకాశాలు వచ్చేశాయి. అయితే ఇలా చలనచిత్ర రంగంలో ‘నెంబర్ వన్ ఫైట్ మాస్టర్స్’ గా ఎదిగినా కూడా మాలో ఏదో తెలియని ‘అసంతృప్తి’ మాత్రం అలాగే ఉండిపోయింది.

 

 

వాణి: " ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వచ్చారు ? "

 


రామ్‌గారు: " రోజురోజుకీ మాలో పెరుగూతూన్న అసంతృప్తిని తీర్చుకోవడానికి ఇద్దరం ‘ కృష్ణకాంత్ పార్క్ ’ లో జరుగుతూన్న ‘ నర్సోజీ గురువు ’ గారి ధ్యానశిక్షణా తరగతులకు హాజరు ఆయ్యేవాళ్ళం.

 


ఆ క్రమంలోనే " భిక్షమయ్య గురూజీ గారి ‘ అహంకారం ’ అన్న CD విని మా కళ్ళు తెరుచుకుని .. ‘ సత్యసాయి ధ్యాన మండలి ’ లో చేరి అన్ని కోర్సులు చేశాం. బ్రహ్మకుమారీస్ లో చేరి ‘ రాజయోగ ’ కూడా నేర్చుకున్నాం. నాలుగుసార్లు ‘ విపస్సన ’ కోర్సులలో చేరి స్వీయపరిశీలన చేసుకుని దుఃఖంతో ఎన్నో సార్లు ఏడ్చాం !

 

 

" ఈ సాధనల వల్ల మాలో ఉన్న ‘ అసంతృప్తి ’ అయితే తగ్గింది కానీ .. చిన్నప్పటి నుంచీ మాలో ఉంటూ మాతోపాటే పెరిగి పెద్దయిన ‘ ఏదో తెలియని భయం ’ మాత్రం మమ్మల్ని వదలలేదు. "

 

లక్ష్మణ్ గారు: " ఆ భయమేంటో .. అది ఎందుకు వస్తుందో తెలియని అయోమయంతో ఉన్న మేము .. 2014 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రీజీ గారి ‘ శ్వాస మీద ధ్యాస - పిరమిడ్ ధ్యానం ’ గురించి తెలుసుకున్నాం. ఇక వెంటనే ‘మహేశ్వర మహాపిరమిడ్’ ను వెతుక్కుంటూ వెళ్ళి కడ్తాల్ .. కైలాసపురిని చేరుకున్నాం !

 

 

అక్కడ మా ప్రాపంచిక గుర్తింపులన్నింటినీ వదిలేసి .. శూన్యమనస్సుతో చిన్న పిల్లల్లా మారిపోయి .. పిరమిడ్ లోని కింగ్స్ ఛేంబర్ లో, మహావతార్ బాబాజీ గుహలో మరి కైలాసపురి క్షేత్రంలో ఉన్న ‘జీవరాళ్ళ’ దగ్గర, చెట్లుదగ్గర, కొండగుహల లో కూర్చుని ధ్యానం చేసుకున్నాం.

 

 

" ఎన్నెన్నో దివ్యచక్షువు అనుభవాలను పొంది .. సూక్ష్మశరీరయానాలు చేశాం. ధ్యానంలో చనిపోయి ఉన్న మా స్వంత శరీరాలను చూసుకుని .. మరణానంతర జీవిత అనుభవాలను కూడా పొందాం.

 


" నెల రోజులపాటు అక్కడే మునులలాగా ఉండిపోయి పత్రీజీ ఆడియో కేసెట్ లను వింటూ .. మరింత మరింత గాఢ ధ్యానం చేసుకుంటూ ఉండగా మాలో ఉన్న ‘ భయం ’ అన్నది మటుమాయం అవుతూ వచ్చింది !

 

" ఇక ఈ జన్మలో పత్రీజీని వదలిపెట్టకూడదు’ అని ఇద్దరం నిశ్చయించుకుని వారి వెంటే ఊరురూ తిరగాలని నిర్ణయించుకున్నాం.
" ఆ మర్నాడు పిరమిడ్‌లో జరిగిన ఒకానొక ‘ పౌర్ణమి ధ్యానం ’ కార్యక్రమంలో పత్రీజీని కలిసి ‘ ఈ విషయం చెబుదాం ’ అనుకునేంతలోనే వారు ధ్యానం తరువాత తమ సందేశాన్ని ఇస్తూ .. ‘ మీరు నన్ను కాదు నమ్ముకోవలసింది ! ఏ శక్తిని నమ్ముకుని నేను ఈ ప్రయాణం చేస్తున్నానో .. ఆ శక్తినే మీరు కూడా నమ్ముకోండి ! ఆ శక్తినే నమ్ముకుని మీ ప్రయాణం కూడా కొనసాగించండి ! " అని మా కళ్ళు తెరిపించారు.

 

మా మనస్సును చదివేసినట్లు వారు అలా సందేశం ఇవ్వడంతో .. దానినే గురువు ఆజ్ఞగా తలచి మా ధ్యాన సాధనను కొనసాగిస్తూ .. శుద్ధ శాకాహారులుగా మారి మాలోని భయాన్ని మూలం నుంచీ అర్థం చేసుకుని .. దానినుంచి విముక్తి చెందాం.

 

" ప్రస్తుతం మేము ‘ రామ్ లక్ష్మణ్ ఫౌండేషన్ ’ ని స్థాపించి .. వృద్ధులకు ఆశ్రమాలను నిర్మిస్తూ .. అనాధ పిల్లల విద్యకు సహాయం చేస్తూ .. ధ్యానం ద్వారా మేము తెలుసుకున్న ఆత్మసత్యాలను అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా జీవిస్తున్నాం. "

 

వాణి: " రోజువారీ ధ్యానానికి మీ సమయాన్ని ఎలా ప్లాన్ చేస్తారు ? "

 


రామ్ గారు: " ప్రతిరోజూ తెల్లవారు జామున 3.00 గం||ల నుంచే మా దినచర్య ప్రారంభం అవుతుంది. ఉదయం 6.00గం||ల వరకు ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు .. ఆ తరువాత షూటింగ్‌కి వెళ్ళిపోవడం .. రాత్రి పడుకునే ముందు మళ్ళీ తప్పనిసరి ధ్యానం.

 

" ఉదయం మొలకెత్తిన గింజలు, కొబ్బరి ముక్కలు, మధ్యాహ్నం ఇంటినుంచే తీసుకెళ్ళిన పరిమిత భోజనం మరి రాత్రికి పళ్ళు .. ఇదే మా ఆహారం. ఈ శాస్త్రీయమైన జీవనశైలి మరి ధ్యానం వల్లనే మేము ఎన్నడూ లేనంత ఆరోగ్యంగా మరి ఆనందంగా జీవించగలుగుతున్నాం.

 

" షూటింగ్‌ మధ్యలో విరామం దొరికితే మా యూనిట్ వాళ్ళందరికీ ధ్యానం గురించీ మరి శాకాహారం గురించీ చెబుతూ ధ్యాన - శాకాహార ప్రచారం చేస్తున్నాం ! "

 

వాణి: " ఇంకా మీ ధ్యాన అనుభవాలు ? ! "

 


లక్ష్మణ్ గారు: " మనం నడుచుకుంటూ రోడ్డుపై వెళుతున్నాం అనుకోండి ! దారిన పోయే ఒకానొక కుక్క అరుచుకుంటూ మన వెంటపడితే .. ‘ అది మనల్ని కరుస్తుందేమో ’ అని మనం భయంతో బిక్కచచ్చిపోతాం.

 


" అదే మనం సైకిల్ మీదకానీ .. మోటర్‌బైక్ మీద కానీ వెళ్ళుతున్నప్పుడు కుక్క అరుచుకుంటూ వెంటబడితే కాస్త ధైర్యం ఉంటుంది కానీ .. భయంతో ముచ్చెమటలు మాత్రం పట్టేస్తాయి.

 


" మరి మనం కారులో కూర్చుని వెళ్తూంటే అదే కుక్క అరుచుకుంటూ మన వెంట పడిందనుకోండి .. అసలు మనం దాని అరుపులనే పట్టించుకోం; కారు వెంట పరుగెత్తి .. పరుగెత్తి అదే అలిసిపోతుంది కానీ మనం మాత్రం హాయిగా ముందుకు సాగిపోతాం !

 

 

" జీవితం కూడా అంతే ! ధ్యానం ద్వారా మనలోని ఆత్మశక్తిని తెలుసుకుని మనం ఆత్మస్వరూపుల్లా బ్రతికినప్పుడు .. ఏ సమస్యలూ, ఏ కష్టాలూ మనల్ని ఏమీ చెయ్యలేవు ! గోల పెట్టీ పెట్టీ అవే ఆగిపోతాయి కానీ మనకేమీ అవ్వదు. కారులో ప్రయాణించినట్లు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడిపివేస్తాం ! "

 

వాణి : " పత్రీజీ సాంగత్యం గురించి ? ! "

 


రామ్ గారు: " జ్ఞానస్వరూపులైన గురువు పత్రీజీ .. ఎంతో సింపుల్‌గా ఉంటూ, అందరితో కలిసిపోతూ, ప్రతి ఒక్కరినీ ‘ మాస్టర్స్ ’ గా గుర్తిస్తూ ఉంటారు. లక్షల మందిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలుకరిస్తూ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే వారి తీరు మాకు ఎంతగానో నచ్చింది.

 

 

" ‘ సినీ ఇండస్ట్రీలో మేము చాలా గొప్పవాళ్ళం; అందరితో కలిస్తే మా ఇమేజీ దెబ్బతింటుందేమో’ అన్న భ్రమలో ఉన్న మాకు .. గొప్ప ఆత్మజ్ఞానస్వరూపులు అయిన పత్రీజీ కలుపుగోలుతనం చూశాక కళ్ళు తెరుచుకున్నాయి ! ‘ ఈ భూమి మీద వారు ఉన్నప్పుడే మనం కూడా జన్మించడం మన అదృష్టం అయితే .. వారితో కలిసి పనిచేయటం మన జన్మజన్మల సుకృతం ’ అని తెలుసుకున్నాము."

 

 

వాణి: " ఇంకా మీరు తెలుసుకున్న ఆత్మజ్ఞానం ? ! "

 


లక్ష్మణ్ గారు: " సముద్రం ఒడ్డున ఇసుకలో ఎండ్రకాయలు అటూ ఇటూ తిరుగుతూ ఏదైనా అలికిడి కాగానే చటక్కున బొరియల్లో దూరిపోతాయి. లేకపోతే అవి వేటగాడి చేతిలో చిక్కి చచ్చిపోతాయి.

 


" ఏ ఆత్మజ్ఞానం లేని ఒక మామూలు చిన్ని జీవే తన ‘ రక్షణ ’ గురించి అంతగా ఆలోచిస్తే .. మరి అన్నీ తెలిసిన ఆత్మజ్ఞానపరాయణులమైన మనం .. మనలో కామ, క్రోధ, లోభ మద, మాత్సర్యాల అలికిడి కాగానే ఏం రక్షణ చర్యలు తీసుకోవాలి ? .. ‘ ధ్యానం ’ అనే బొరియలోకి దూరి .. మన అంతరంగ ప్రపంచంలో జీవించాలి !"

 

 

రామ్‌గారు: " మనం ఏదైనా పనిమీద ఒక క్రొత్త ఊరికి వెళ్ళినప్పుడు రైలు దిగగానే .. మనకు ‘ బస ’ ఎక్కడ ఏర్పాటు చేయబడిందో తెలుసుకుని .. మన లగేజీని అక్కడ పెట్టేసి .. ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తాం. పనులన్నీ చక్కబెట్టుకుని ఏ రాత్రి తిరిగి వచ్చినా .. ‘ ఎక్కడ ఉండాలో ? ’ అని ఖంగారు పడకుండా  హాయిగా మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న మన బసలో రెస్ట్ తీసుకుంటాం.

 

 

అలాగే ధ్యానంలోకి వచ్చాక ‘ మన దారి ఇదీ ’ అని తెలుసుకుని ఇక ‘ఖంగారు’ అన్నది లేకుండా జీవితాలను గడపగలుగుతాం. ఎక్కడ తేడా వచ్చినా సరే వెంటనే మనలోపలికి మనం వెళ్ళిపోయి .. ఆ సువిశాలమైన మన అంతరంగ ప్రపంచంలో సేద దీరగలుగుతాం.

 

 

" అసలు ఇటువంటి ‘ రాజమార్గం ’ ఉందని కూడా తెలియని వాళ్ళు .. మరి తెలిసినా ‘ మనకెందుకులే’ అని నిర్లక్ష్యం చేసేవాళ్ళు .. ఏ చిన్న సమస్య వచ్చినా ఖంగారుతో బెంబేలెత్తిపోయి రకరకాల అనారోగ్యాలకు గురి అవుతూ తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటారు."

 

 

ప్రశ్న: " ‘ దేహదారుఢ్యం కోసం మాంసాహారం ’ అని ప్రజలలో అపోహ ఉంది. ఫైట్ మాస్టర్స్‌గా మీరేమంటారు ? "

 

 

రామ్‌గారు: " ‘ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా మనతో సమానమే! వాటిని చంపి తినే హక్కు ఎవ్వరికీ లేదు’ అని పత్రీజీ ప్రపంచానికి చాటిచెబుతున్నారు ..
" కానీ ‘ చాలా మంది బలం కోసం మాంసాహారాన్నే తినాలి’ అని మూర్ఖంగా ఆలోచిస్తారు. ఆత్మజ్ఞాన లోపం వల్ల డాక్టర్లు కూడా బలం కోసం మాంసాహారం తినమని పేషంట్లకు చెబుతూ వాళ్ళను మరింతగా రోగాల బారిన పడేస్తున్నారు.

 

" ‘ ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత బలమైన శరీరం అయినా కేవలం గడ్డిపోచతో సమానం’ అన్నది మా ప్రత్యక్ష అనుభవం. మరి ఆ ‘ఆత్మవిశ్వాసం అన్నది మనం ధ్యానం వల్లనే పొందగలుగుతాం’ అన్న విషయాన్ని మేము మా సినీ ఫీల్డులో అందరికీ తెలియజేస్తున్నాము.

 

"ఈ మధ్య ‘ గౌతమీపుత్ర శాతకర్ణీ ’ సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం .. ఇందోర్ ప్రక్కన ఉన్న ‘ మహేశ్వరం ’ అనే ఒక ఊరికి వెళ్ళినప్పుడు .. అక్కడ ఊరు ఊరంతా శాకాహారులుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాం! అక్కడ చెరువులో చేపపిల్లలను పట్టడం కూడా నిషిద్ధం. అహింసా సిద్ధాంతాన్ని అక్కడ అంత ఖచ్చితంగా అమలుపరుస్తారు."

 

లక్ష్మణ్ గారు: " ఈ విషయంలో మేము ఒక ప్రయోగం కూడా చేసాం. రెండు డబ్బాలను తీసుకుని వాటిలో ఒకానొక శాకాహారి (A) .. ఒకానొక మాంసాహారి(B): .. ఒక రోజులో ఏమేం పదార్థాలను తింటున్నాడో .. వాటిని అందులో వేస్తూ పోయాం.

 


ఉదయం: శాకాహారి (A) మొలకెత్తినగింజలు, కూరగాయల ముక్కలు, పళ్ళరసం
మాంసాహారి (B) టీ, బ్రెడ్ ఆమ్లెట్, చికెన్ రోటీ

 


మధ్యాహ్నం: శాకాహారి(A) కూరగాయలు మరి పప్పు
మాంసాహారి(B) చికెన్, మటన్, ఫిష్

 


రాత్రి: శాకాహారి(A) చపాతీ, ఆకుకూరలు, పళ్ళముక్కలు
మాంసాహారి(B) బిర్యానీ, మద్యం

 

ఈ రెండు డబ్బాలను మూసి ఉంచి .. వారంరోజుల తరువాత తెరిచిచూస్తే .. అందులో శాకాహార పదార్థాలతో కూడిన(A) డబ్బాలోని విత్తనాలు చిన్ని చిన్ని మొలకలుగా పెరిగి పచ్చగా నిగనిగలాడుతూ బయటికి వస్తే .. మాంసాహార పదార్థలతో కూడిన (B) డబ్బాలోని ఆహారపదార్థాలన్నీ క్రుళ్ళిపోయి పురుగులతో దుర్గంధాన్ని వెదజల్లాయి.

 

" ఇలా మాంసాహారం మన శరీరాలను ఎంత కలుషితం చెయ్యగలదో చెప్పడానికి ఇది ఒక్క ప్రయోగం చాలు ! "

 

ప్రశ్న: " మీ భవిష్యత్తు కార్యాచరణ ? "


రామ్ మరి లక్ష్మణ్ గార్లు: " ఇంత అద్భుతమైన ధ్యాన సాధనా మార్గాన్ని జీవితాంతం వదిలేది లేదు. మా చివరి శ్వాస ఉన్నంత వరకు పత్రీజీ అడుగుజాడలలో నడుస్తూ గ్రామగ్రామాలలో ధ్యాన, శాకాహార ప్రచారాలు చేస్తాం. ఇదే మా జీవిత పరమార్థం. "

 

Go to top