" పిరమిడ్ హౌస్ మాకు .. గొప్ప ఆస్తి "

 

 

నా పేరు "జ్యోతి". బాల్యం నుంచీ నాకు ప్రకృతికి దగ్గరగా జీవించడం, చందమామనూ మరి నక్షత్రాలనూ చూసి ఆనందించడం, ఇంటి పెరట్లో పూలమొక్కలను పెంచి ఆ పూలతో రకరకాల అలంకారాలు చేయడం అంటే చాలా ఇష్టం.

 

కథల పుస్తకాలను చదువుతూ మరి క్రమం తప్పకుండా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళడం ఎంతో ప్రీతిగా చేసేదానిని. నాతో నేనే మాట్లాడుకుంటూ .. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ .. ఒక్కోసారి కారణం లేకుండానే దుఃఖిస్తూ ఉండేదానిని.

 

మాది పల్లెటూరి రైతుకుటుంబం కావడంతో మా అమ్మానాన్నలు ప్రొద్దున్నే లేచి పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. దాంతో ఇక నాలో జరుగుతూ ఉన్న ఈ మార్పులను గురించి ఎవరితో పంచుకోవాలో నాకు తెలియకపోయేది.

 

17 సంవత్సరాలకల్లా నాకు పెళ్ళి చేసేయడంతో వెంటవెంటనే ఇద్దరు పాపలు కూడా పుట్టేసారు. ప్రాథమికంగా మా అత్తింటివాళ్ళు కూడా వ్యవసాయదారులే అయినా .. మా వారు "జగదీశ్వర్ రెడ్డి" గారు మాత్రం కడ్తాల్ లోనే మెడికల్ షాప్‌ ను నిర్వహిస్తూండేవారు.

 

అయితే వ్యాపారంలో ఒడిదుడికుల వల్ల నష్టపోయిన మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనశ్శాంతి కరువై మా ఊళ్ళో ఎక్కడ గురువుల ప్రవచనాలు మరి సాయిభజనలు జరుగుతూన్నాయని తెలిసినా అక్కడికి వెళ్ళిపోయేదానిని. ఆలయాలకు వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయిస్తూండేదానిని.

 

ఈ టెన్షన్ లను తట్టుకోలేని మావారు నిద్రలేమితో బాధపడుతూ ఎందరో డాక్టర్ల దగ్గరికి తిరిగి చికిత్స చేయించుకుంటూ .. ప్రతిరోజూ స్లీపింగ్ ట్యాబ్లెట్‌లను వేసుకుని గానీ నిద్ర పోకపోయేవారు. "అలా స్లీపింగ్ ట్యాబ్లెట్‌ లను అలవాటు చేసుకోవడం ప్రమాదకరం" అని నేను హెచ్చరిస్తే .. "నా బాధ నీకు అర్థం కాదులే" అని బాధపడేవారు.

 

వారి గురించి ఆలోచించీ, ఆలోచించీ నాకు B.P. నడుమునొప్పి, సయాటికా కూడా రావడంతో నేను వాటికోసం మళ్ళీ మందులు వాడడం మొదలుపెట్టాను. ఇలా ఇద్దరం అనారోగ్యాలతో మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మా ఊళ్ళో "సిద్ధసమాధి యోగ" తరగతులకు హాజరు అయ్యాం. "సత్యసాయి ధ్యానమండలి", "భిక్షమయ్య గురూజీ" గారి ప్రసంగాలు చాలా విన్నాం. మాకు ఉన్నదాంట్లోనే కొంచెం పైకాన్ని బీదపిల్లల చదువులకు మరి దానధర్మాలకు ఖర్చుచేస్తూండేవాళ్ళం.

 

ఈ క్రమంలోనే "2012 ధ్యానమహాచక్రం" ఆహ్వాన పత్రాలు మా మెడికల్ షాప్‌లో అందాయి. దాంతో సకుటుంబ సమేతంగా మేము "కడ్తాల్ .. కైలాసపురి" వెళ్ళి .. అక్కడ ధ్యానం చేసుకుని వేదికపైన "పత్రీజీలో షిరిడీసాయి బాబా"ను కూడా దర్శించుకున్నాము!

 

"ధ్యానం" గురించీ మరి "పిరమిడ్ శక్తి" గురించీ చాలా విషయాలు తెలుసుకున్నాము కానీ "మాంసాహారం మానేయాలి" అన్న విషయం మాత్రం మాకు అస్సలు నచ్చలేదు. "ఇంత చిన్నవయస్సులో చికెన్, మటన్ తినడం మానివేస్తే బలం ఎలా వస్తుంది? అస్సలు కుదరదు కనుక ఇప్పుడు బాగా తిని .. బంధువులకు కూడా వండిపెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేసి .. ముసలి వయస్సు వచ్చాక మాంసం మాని ధ్యానం చేద్దాం" అని నిర్ణయించుకున్నాం.

 

ఇక మునుపటిలాగే శ్రద్ధగా పూజలు చేస్తూ .. గుళ్ళకు వెళ్తూ, దానధర్మాలు చేస్తూ మరి యధావిధిగా మాంసం తింటూ కాలం గడిపేవాళ్ళం! ఈ లోగా వ్యాపారంలో ఇబ్బందులు మరీ ఎక్కువై నాలో రకరకాల అనారోగ్యాలు మరింత ఎక్కువకావడం వల్ల డాక్టర్లూ, స్కానింగ్‌లూ, మందులూ మొదలయిన వాటితో విసిగిపోయాం. మావారికి కూడా స్లీపింగ్ పిల్స్‌ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువై "ఇక ధ్యానం ఒక్కటే పరిష్కార మార్గం" అని నిర్ణయించుకుని ఇద్దరం కలిసి కైలాసపురికి బయలుదేరాం.

 

అక్కడ s. రాజశేఖర్ సార్ మా సమస్యలన్నీ విని .. ఏం మాట్లాడకుండా మమ్మల్ని పిరమిడ్‌లో ధ్యానానికి కూర్చోబెట్టి .. "నేను ‘O.K.' చెప్పేంత వరకూ కళ్ళు తెరువకూడదు" అని చెప్పారు.

 

నాకు ఒక ప్రక్క విపరీతంగా నడుమునొప్పి వస్తూండంతో "ధ్యానంలో ఒక్క నిమిషం కంటే ఎక్కువ కూర్చోలేను" అనిపించింది. అయినా బాధను భరిస్తూ అలాగే కూర్చోగా కాస్సేపటికి అంతా సర్దుకుని నా శరీరంలో బరువు అంతా తగ్గిపోయి నేను గాలిలో తేలుతున్నట్లుగా అనుభూతి చెందాను. అలా ఒకగంటసేపు ధ్యానంలో మునిగిపోయాను!

కళ్ళు తెరిచాక అటూ, ఇటూ వంగి నన్ను నేను పరీక్షించుకుంటే నడుమునొప్పి ఛాయలుకూడా మటుమాయం అయిపోయాయి!

 

అంతే .. ఇక పట్టినపట్టు విడువకుండా పిరమిడ్‌కు వెళ్ళి రెండురోజులపాటు ధ్యానం చేసుకున్నాం! మా వారు కూడా ఆ రెండు రోజులు ఎటువంటి నిద్రమాత్రలు వాడకుండా హాయిగా నిద్రపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడవరోజు ఇద్దరం ధ్యానం చేసుకోవడానికి మళ్ళీ పిరమిడ్ దగ్గరికి వెళ్ళేసరికి మేం ధ్యానం చేసుకునే ప్రదేశంలో పత్రీజీ కూర్చుని ఉన్నారు.

 

రాజశేఖర్ సార్ మమ్మల్ని వారికి "సాయి డివోటీస్" గా పరిచయం చేశారు. వెంటనే వారు "పూజలే చేస్తూ కూర్చుంటే మీ శక్తి విగ్రహానికి వెళ్తుంది; ధ్యానం చేస్తే విగ్రహంలోని శక్తి మీకు వస్తుంది మేడమ్" అన్నారు షేక్ హ్యాండ్ ఇస్తూ! ఆ క్షణంలోనే ఇక మేము జీవితాంతం శాకాహారులుగా మారి ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

 

చాలా తక్కువ సమయంలోనే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి చెంది హాయిగా జీవిస్తూ ధ్యానం వలన మాకు అందిన లాభాలను అందరితో పంచుకుంటున్నాం! ఈ క్రమంలో మరొక అద్భుతం జరిగింది! మా పెద్దమ్మాయి "స్నేహలతా రెడ్డి" కి ఎంసెట్‌లో 4,౦౦౦ ర్యాంక్ వచ్చింది. ఆమెను ప్రయివేట్ మెడికల్ కాలేజీలో అయినా చదవించాలని అడ్వాన్స్ కూడా కట్టి .. మేము మిగిలిన ఫీజ్ క్రింద ముప్పైలక్షల రూపాయలను తయారుచేసుకున్నాం.

అయినా మనస్సు ఊరుకోక "కౌన్సిలింగ్" కు కూడా వెళ్ళగా అక్కడ మా అమ్మాయి ర్యాంక్‌కి మహబూబ్‌నగర్ "SVS మెడికల్ కాలేజీ"లో BDSలో "ఫ్రీ సీట్" వచ్చిందని తెలిసింది.

 

ఇక దాంతో మా వారి కోరిక మేరకు ఆ డబ్బుతో వెంటనే "పిరమిడ్ హౌస్" నిర్మాణం మొదలుపెట్టాం. 2016 సెప్టెంబర్ 26వ తేదీకి నిర్మాణం పూర్తిచేయగా పత్రీజీ వచ్చి "పిరమిడ్ హౌస్"ను ప్రారంభోత్సవం చేసి దానికి మా అత్తగారి పేరుతో "జగదాంబ పిరమిడ్ హౌస్"గా నామకరణం చేశారు!

 

అదేరోజు సాయంత్రం మా చిన్నమ్మాయి "సింధు లతా రెడ్డి" కి ‘ఎంసెట్’ రిజల్ట్స్‌లో 1293 ర్యాంక్ వచ్చిందని తెలిసింది! ఇక మా ఆనందానికి అంతే లేదు! ప్రస్తుతం తను "మల్లారెడ్డి మెడికల్ కాలేజి"లో "ఫ్రీ సీట్" రావడంతో MBBS మొదటి సంవత్సరం చదువుతోంది. "ఇదంతా కూడా మేము క్రమంతప్పకుండా చేస్తున్న ధ్యానం వల్లనే సాధ్యం అయ్యింది" అని గర్వంగా చెప్పగలం!

 

ధ్యానం చేసి "మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది" అని మేము నిరూపించుకుంటే .. "మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది" అని మా పిల్లలు నిరూపించారు! మా శక్తివంతమైన "పిరమిడ్ హౌస్" లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దెకు ఉన్నవాళ్ళకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ తగ్గిపోయి నార్మల్‌గా కావడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది!

 

ఇంతకంటే ఆస్తిపాస్థులు మాకు ఇంకేమీ అక్కర లేదు! ప్రస్తుతం కైలాసపురి పిరమిడ్ సందర్శనకు వచ్చే దేశవిదేశాల సందర్శకులు మా "పిరమిడ్ హౌస్" కు వచ్చి మమ్మల్ని అభినందిస్తూన్నారు. ఇంతటి గొప్ప జీవితాన్ని జీవించే ధ్యానవిద్యను మాకు అందించి .. మాచే "పిరమిడ్ హౌస్" వంటి శక్తివంతమైన నిర్మాణానికి చేయించిన పత్రీజీకి మా ధ్యాన కుటుంబం వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటోంది!

 

పిరమిడ్ హౌస్ ప్రత్యేకతలు:
50'x50' సైజ్ పిరమిడ్ కొలతలతో G+2 నిర్మాణం
బేస్‌మెంట్ ఆరు టన్నుల ముడిస్ఫటికాలతో నింపబడింది

 

గ్రౌండ్ ఫ్లోర్‌లో 22'x22' ధ్యానమందిరం
(ఉ|| 5.00 గం||ల నుంచి రా|| 9.00 గం||ల వరకు)
పైన రెండు అంతస్థులు రెసిడెన్షియల్.

 

 


K.జ్యోతి 

ఆమన్‌గల్

రంగారెడ్డి జిల్లా
9440586987, 94401 47745.

Go to top