" లోకాఃసమస్తా సుఖినోభవంతు "

 

 

PSSM ధ్యానవిద్యాప్రచారంలో ముఖ్యభూమికను పోషిస్తూ .. తూర్పుగోదావరి జిల్లాలో
అద్భుతమైన ధ్యానప్రచార సేవను నిర్వహిస్తున్నారు " C.S.మూర్తి దంపతులు ".

 

పట్టుదలకూ, క్రమశిక్షణకూ మరి అంకితభావానికీ మారుపేరుగా నిలుస్తూ .. ధ్యానప్రచార
సేవలో పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఈ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్స్‌తో కాస్సేపు.

 

 

ఎడిటర్, T. వాణి

 

ప్రశ్న: " మీ గురించి ? "

 

CS మూర్తి గారు: నేను ఈ భూగ్రహానికి 1942 సంవత్సరం డిసెంబర్ మాసంలో వచ్చాను. ఇక్కడ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు " సత్యనారాయణ మూర్తి " ! నేను " M.Sc. జియోలజీ " చదివి 2,000 సంవత్సరం వరకు భూగర్భజల శాఖలో ఉపసంచాలకునిగా పనిచేయడంతో నా పేరు "గ్రౌండ్ వాటర్ మూర్తి" గా అయ్యింది. ఆ తరువాత అందరికీ యోగా శిక్షణను ఇవ్వడం వల్ల " యోగా మూర్తి " గా ప్రస్తుతం పిరమిడ్ ధ్యానప్రచారంతో "పిరమిడ్ మూర్తి"గా పిలువబడుతున్నాను ! ఎవరు .. ఎప్పుడు .. నన్ను ఏ పేరుతో పిలిచినా " నేను సత్యనారాయణ మూర్తినే " అని ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాను.

 

కల్పన గారు: ఏలూరు ప్రక్కన ఉన్న దెందులూరు లోని ఒకానొక కమ్యూనిస్ట్ కుటుంబంలో 1946 సంవత్సరం లో పుట్టిన నేను B.Sc.,B.Ed చదివాను. మా పెద్దవాళ్ళకు మధ్య ఉన్న కుటుంబ స్నేహం కారణంగా మూర్తిగారితో నా వివాహం జరిగింది.

 

వివాహం నిశ్చయం రోజున వారు నాకు ఒక చీటీ మీద "నేను శాకాహారిని .. నీకు ఇష్టమేనా?" అని వ్రాసి పంపారు! నిజానికి నేను కూడా శాకాహారినే కానీ అంతకు రెండు సంవత్సరాల ముందు నాకు టైఫాయిడ్ జ్వరం రావడంతో డాక్టర్లు బలవంతంగా నాచే మాంసాహారం తినిపించారు! అయితే మూర్తిగారితో వివాహం నన్ను మళ్ళి శాకాహారిగా మార్చేసింది!!

 

వివాహం తరువాత నేను ఎయిడెడ్ స్కూల్‌లో మరి ఏలూరు మున్సిపాలిటీలో "సైన్స్ అసిస్టెంట్"గా పనిచేసి 13 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చెందాను. మా అబ్బాయి పెళ్ళిచేసుకుని ఇద్దరు పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డాడు.

 

ప్రశ్న: "సర్! మీరు ఎలా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు?"


CSమూర్తి గారు: మొదటి నుంచీ "వాకింగ్" అంటే ఇష్టపడే నేను విధినిర్వహణలో భాగంగా కొండలు గుట్టలు ఎక్కుతూ, అడవులలో సర్వేలు చేస్తూ ప్రకృతికి ఎంతొ దగ్గరగా గడిపాను. నేను, నా శ్రీమతి కల్పన .. మరి ఇంజనీరింగ్ చదువుతూన్న మా అబ్బాయి .. ముగ్గురం కలిసి యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియలు చేస్తూ 1989 సంవత్సరంలో "విపస్సన" 11రోజులు ధ్యాన శిక్షణలో పాల్గొన్నాము. ఆ తరువాత నేను మరి కల్పన ఇప్పటికి నాలుగుసార్లు ఈ శిబిరాలలో పాల్గొన్నాం.

 

1992-93 సంవత్సరాలలో "సింప్లిఫైడ్ కుండలినీ యోగ (SKY)" లో శిక్షణ పొంది స్వయానా వేదాద్రి మహర్షి చేతుల మీదుగా "మాస్టర్" సర్టిఫికెట్ కూడా అందుకున్నాం.

 

1994-2000 మధ్య ఋషి ప్రభాకర్‌జీ గారి "సిద్ధ సమాధి యోగా" లో మరి 2000-2003 వరకు శ్రీ భిక్షమయ్య గురూజీవారి "Meditation Medication Yoga (MMY)"లో AMC, BST, AMCII టీచర్స్ ట్రైనింగ్ శిక్షణలు పూర్తిచేసుకుని "దానిలోనే స్థిరపడదాం" అనుకున్నాం.

 

నేను కల్పన ఇద్దరం కూడా సెలవుదినాలలో "ప్రేమాలయం" వృద్ధమాతల ఆశ్రమంలో మా సేవలను అందిస్తూ అక్కడ దేహత్యాగం చేసిన వారికి మేమే కర్మలను నిర్వహించే వాళ్ళం!

 

 

ఇలా అటు ఉద్యోగం ఇటు యోగసాధనలు చేస్తూ .. మరోవైపు సేవాకార్యక్రమాలలో గడుపుతూ 2000 సం||లో నేను .. మరి 2003లో కల్పన .. పదవీ విరమణలు చెందాం.

 

ఇక అప్పటి నుంచి స్వేచ్ఛాజీవులలా మా అసలైన జీవితానికి తెరతీశాం!

 

2004 సంవత్సరంలో ఒకసారి ప||గో||జిల్లా అండలూరు పిరమిడ్ మాస్టర్ "మేకా వెంకటేశ్వరరావు" గారు మా ఇంటికి వచ్చి మాతో "శ్వాస మీద ధ్యాస" పిరమిడ్ ధ్యానం చేయించారు. ఆ తరువాత మేము ఏలూరులో జరిగిన అనేకానేక ధ్యాన శిక్షణా కార్యక్రమాలకు హాజరయి ధ్యానంలో గొప్పతనాన్ని తెలుసుకుంటూ వచ్చాం!

 

అదే సంవత్సరం నవంబర్ 18వ తేదీ స్థానిక పిరమిడ్ మాస్టర్ "యెర్నేని ప్రసాద్" గారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా "పత్రీజీ"ని కలిసాం.

 

ఆ మహాగురువు సమక్షంలో ధ్యానం చేసిన తరువాత మాలో చాలా మార్పు వచ్చింది! "ఇప్పటి వరకూ బాగానే ఉంది. ఎన్నో సంస్థలలో చేరి ఎంతో నేర్చుకున్నాం. కానీ ఇక నుంచి మన ఆత్మ ఎదుగుదల కోసం పొందిన ఆత్మజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి" అనుకుని మా స్వస్థలం అయిన రాజమండ్రికి మకాం మార్చాం.

 

2005 ఫిబ్రవరి లో తాడేపల్లిగూడెం పిరమిడ్ మాస్టర్ "త్రిమూర్తులు" గారి సహకారంతో "మైత్రేయ బుద్ధా స్పిరిచ్యువల్ ట్రస్ట్" ను రిజిస్టర్ చేసి రాజమండ్రిలో ధ్యానకార్యక్రమాలు ముమ్మరం చేశాం.

 

ప్రశ్న: పత్రి గారితో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?

 


CS మూర్తిగారు: "ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా ‘నేను ఆత్మస్వరూపం’ అని తెలుసుకునేంత వరకూ నేను ప్రభోదిస్తూనే ఉంటాను" అని స్వామీ వివేకానందులు బోధించినట్లే .. పత్రీజీ కూడా "ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా శాకాహారి అయ్యేంత వరకు నేను ఈ శరీరాన్ని వదలను" అని చెప్పడం నాకు చాలా నచ్చింది.

 

వారి శక్తివంతమైన వాక్కులు నా భావాలకు 100% సరిపోయినట్లు ఉండడం వలన నేను పత్రీజీ పట్ల ఎంతగానో ఆకర్షితుడనయ్యాను. " ‘గురువు .. గురువు’ అంటూ ఎవరూ వేరుగా లేరు; నీ గురువు నీదగ్గరనే ఉన్నాడు! మరి ఆ గురువే ‘నీ శ్వాస’ " అన్న సత్యాన్ని ముక్కుసూటిగా చెబుతోన్న సార్‌ని నేను మరీ మరీ ఇష్టపడ్డాను.

 

" ధ్యానం చెయ్యి, చెయ్యకపో - అది నీకు సంబంధించిన విషయం. కానీ మాంసాహారం తీసుకోవడం అన్నది ఇంకొక జీవికి సంబంధించినది. కనుక వాటిని చంపడానికి నీకు ఏ మాత్రం హక్కు లేదు. ఒక జీవి చనిపోయినప్పుడు పొందే మరణవేదనకు సాక్షీభూతూడైన ఏ వ్యక్తి కూడా మాంసాహారం తినడు" అంటూ పత్రీజీ చెప్పే అద్భుతమైన విషయాలను నేను ఎంతగానో ఇష్టపడతాను.

 

 

ప్రశ్న: "‘ పిరమిడ్ హౌస్’ " నిర్మాణం గురించి ... "

 


CSమూర్తిగారు: ఏదైనా ఒక గొప్ప పని జరుగబోయే ముందు కొన్ని అడ్డంకులు రావడం సహజమే కదా! అలాగే మా జీవితంలో కూడా కొన్ని అడ్డంకులు వచ్చాయి! అయితే " అవి అడ్డంకులు కావు .. ముందు ముందు గొప్ప పని చేయడానికి మమ్మల్ని సమర్థులుగా తయారుచేసిన శిక్షణా కార్యక్రమాలు" అని మాకు తరువాత అర్థం అయ్యింది.

 

రాజమండ్రి చేరుతూనే మేము ధ్యాన కార్యక్రమాలకు అనువుగా ఉన్న "పెంట్‌హౌస్" ను చూసుకుని అద్దెకు దిగాం. ఇంట్లోకి చేరిన వారం రోజులకే మేము ఏర్పాటుచేసిన మొట్టమొదటి ధ్యానం క్లాస్‌కు చుట్టుప్రక్కల అపార్ట్‌మెంట్స్ వాళ్ళు వందమంది వచ్చారు! దాంతో మా అపార్ట్‌మెంట్ నిర్వాహకులు ఆఘమేఘాల మీద మీటింగ్ నిర్వహించి "రెసిడెన్షియల్ ఏరియాలలో ఇలాంటి ధ్యానకార్యక్రమాలు కుదరవు" అంటూ వెంటనే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించాలని తీర్మానం చేశారు. "సరే" అనుకుని మేము క్రొత్త ఇంటి వేటలో పడిపోయాము.

 

వెతికి వెతికి "గ్రంధి ప్లాజా"లో ఒక ఇల్లు దొరకగా ఈ ఇంటి యజమానితో మా కార్యక్రమాలను గురించి ముందే చెప్పి ఆ ఇంటికి మారాము.

 

అక్కడ ఏర్పాటు చేసిన "మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్" ప్రారంభోత్సవానికి తమ పరివారాన్ని వెంటవేసుకుని పత్రీజీ విచ్చేసారు! వారు వస్తున్నారని ఆనోటా, ఈనోటా విని చుట్టుప్రక్కల వాళ్ళంతా వందకు తక్కువ కాకుండా వచ్చేశారు.

 

అంతే .. ఇక అయిపోయింది! ఆ ఇంటి యజమాని కూడా మమ్మల్ని పొమ్మన లేక .. "రోజుకి అయిదుగురి కంటే ఎక్కువ మంది రాకూడదు" అని షరతుపెట్టాడు! ఇక చేసేది లేక మేము "దేవుడా" అనుకుంటూ ఇళ్ళవేటలో పడ్డాం! ఊరంతా తిరిగి తిరిగి ఎక్కడో సందులో చాన్నాళ్ళనుంచి ఎవ్వరూ అద్దెకు రాకుండా ఉండిపోయిన ఒక పాత ఇల్లు దొరకడంతో ఆనందంగా అందులో చేరిపోయాం!

 

అందులో ఒక గదినంతా పిరమిడ్‌లతో నింపేసి అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలను చేపట్టాం! ఎంతో మందికి మైగ్రేన్ తలనొప్పులు ఆస్ట్రల్ సర్జరీలు, నడుం నొప్పులు, వెన్నెముక సమస్యలు ఆ సెంటర్‌లో చక్కగా నయం అయ్యేవి! అక్కడ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉండి మేం చేసిన ధ్యానకార్యక్రమాలతో ధ్యానులుగా మారిన పిరమిడ్ మాస్టర్స్ ఆ తరువాత రాజమండ్రి మరి చుట్టు ప్రక్కల అనేక పిరమిడ్‌లను నిర్మించడం జరిగింది!

 

ముఖ్యంగా ఆరు నెలల అల్లోపతి చికిత్సకు కూడా తగ్గని నడుము నొప్పి వల్ల వెన్నెముకలో జారిన డిస్క్‌తో ఇతరుల సహాయంతో అక్కడికి వచ్చిన పేషెంట్స్‌లా .. ములకల్లంక సొదరులు శ్రీ "పోలిన రామచంద్రరావు" మరి "సీతారామయ్య"గార్లు ధ్యానం చేసి .. విశ్వశక్తితో సంపూర్ణ స్వస్థత పొంది తమ ఇంటిపై ఏకంగా పిరమిడ్‌నే కట్టేశారు!

 

ఆ తరువాత సీతారామయ్య గారు తూ||గో||జిల్లా "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" సెక్రటరీగా విశేష ధ్యానప్రచారాలు చేసి తమ వూరిలో 20'x20' పబ్లిక్ పిరమిడ్ మరి నాలుగు రూఫ్‌టాప్ పిరమిడ్‌లను కట్టించారు.

 

ఈ క్రమంలో మా అబ్బాయి అమెరికా నుంచి ఇండియాకు తరలి వచ్చేస్తున్నానని చెప్పడంతో మేము స్వంత ఇంటి నిర్మాణానికి ఫ్లాన్ చేశాం. కల్పన ఆ ఇంటిని "పిరమిడ్ హౌస్"గా కడదామని సూచించగా .. మా అబ్బాయి సహకారంతో మేము 2006 "బుద్ధపౌర్ణమి" రోజున శంఖుస్థాపనతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాం!

 

ఒకప్పటి "చేపల చెరువు ప్రాంతం" అయిన ఆ ప్రదేశంలో 20 అడుగుల పునాది వేస్తూ .. పిరమిడ్ ఇంజనీయర్ మధుసూదన్ రావు మరి మా జియాలజీ డిపార్ట్‌మెంట్ సివిల్ ఇంజనీయర్ శ్రీ ఘంటా వెంకట్రావు గార్ల నిత్య పర్యవేక్షణలో "పిరమిడ్ హౌస్" నిర్మాణం చకచకా సాగింది! ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా "హాలో బ్రిక్స్"తో నిర్మించబడి 36'x36' పిరమిడ్‌తో, 20 కిలోల క్రిస్టల్స్ మరి 3కిలోల నేచరల్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ తో శక్తివంతం చేయబడిన ఈ "పిరమిడ్ హౌస్" 2007 జనవరి 23వ తేదీ పత్రీజీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించుకుంది!


కల్పనగారు: 900 గజాల స్థలంలో సగం ఇల్లు .. మిగిలిన సగంలో పూల మొక్కలతో కూడిన లాన్ .. గార్డెన్ మధ్యలో గౌతమ బుద్ధుడు, మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద, జీసస్, వివేకానంద, ఆంజనేయస్వామి, రాముడు, కృష్ణుడు .. ఇలా పరమగురువుల చిత్తరువులతో తీర్చిదిద్దడం జరిగింది.

 

"ధ్యానం", "శాకాహారం"కు సంబంధించిన సందేశాలతో కాంపౌండ్ వాల్ అంతా అలంకరించాం. "పిరమిడ్ హౌస్"లో ప్రతిరోజూ ప్రాతఃకలం 5.00 గం||ల నుంచే ఒక గంట యోగా శిక్షణ తో కార్యక్రమాలు మొదలవుతాయి. గృహిణిలు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, వ్యాపారస్థులు .. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అక్కడికి వచ్చి ‘ధ్యాన సాధన’ చేసుకుని విశేష లాభాలను పొందుతున్నారు.

 

 

ప్రశ్న: "ఇంకా మీరు చేస్తూన్న ధ్యాన ప్రచార వివరాలు"

 


కల్పనా మూర్తిగారు: "పిరమిడ్ హౌస్"లో కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే మేము ABIRD .. "ఆంధ్రాబ్యాంక్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్" అనే గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అక్కడ వృత్తి విద్యలలో శిక్షణ పొందడానికి వచ్చే యువతకు "ధ్యానం" నేర్పించడం జరుగుతోంది. ఇప్పుడు మూర్తిగారికి 74 సంవత్సరాలు .. నాకు 70 సంవత్సరాలు! ఈ వయస్సులో కూడా మేము ఇలా ఆరోగ్యంగా మరి ప్రతి క్షణం ఉత్సాహంగా ఉంటున్నాం అంటే దానికి కారణం మేం చేపట్టిన మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ "శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానక్షేత్రం" నిర్మాణం!

 

ఆ శక్తిక్షేత్ర నిర్మాణానికి సంబంధించి 25 ఎకరాల స్థలాన్ని సేకరించి .. దానిని ఒక "ధ్యాన శాకాహార గ్రామం"గా తీర్చిదిద్దడంలో మేము మారం శివప్రసాద్ గారితో కలిసి పాల్గొనడం మా అదృష్టం!

 

160'x160' అడగుల ఎత్తయిన ఈ ధ్యాన పిరమిడ్ ప్రస్తుతం ఒక్కొక్కటి 14 అడుగుల ఎత్తు ఉన్న నూట పదకొండు (111) పిల్లర్లతో వేగవంతంగా నిర్మాణం జరుపుకుంటోంది!

 

తూ||గో||జిల్లా పిరమిడ్ మాస్టర్ల అంకిత భావానికీ మరి వారి విశేషకృషికీ ప్రతీకగా నిలువబోతోన్న ఈ అద్భుతమైన పిరమిడ్ .. భవిష్యత్తులో జిల్లా వాసులందరికీ ఆరోగ్యం మరి ఆనందాలను పంచే వరదాయినిగా మారబోతోంది! లోకా సమస్తా సుఖినోభవంతు!!

 


శ్రీ CSమూర్తి, శ్రీమతి కల్పనా మూర్తి 
రాజమహేంద్రవరం - తూ||గో||జిల్లా
9440483875.

Go to top