"లక్ష్యసాధనకూ - వయస్సుకూ సంబంధం లేదు"

 

94 సంవత్సరాల వయస్సులో "నేషనల్ వెటరన్ స్పోర్ట్స్"లో పాల్గొని బంగారు పతకాలు సాధించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వతంత్ర స్వరాజ్యలక్ష్మి మేడమ్! ఆటపాటలతో పాటు వంటా-వార్పు, గృహవైద్యం, కుట్లు, అల్లికలలో ప్రావీణ్యం కలిగి "మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడాలి" అని ఆకాంక్షిస్తూ, దానికోసం కృషి చేస్తున్నారు. "తెలంగాణ వెటరన్ స్పోర్ట్స్ అసోసియేషన్"కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వీరు ఆంధ్ర మహిళా సభ స్థాపించిన "శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్"తో కలిసి పనిచేసిన మహిళ! ఆయుర్వేదం అభ్యసించి దానిని గృహవైద్యంగా మలచి ఎందరెందరో ఆరోగ్యవంతులు అయ్యేందుకు తోడ్పడ్డారు. ఈ సంవత్సరం వెటరన్ స్పోర్ట్స్‌లో బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారి గురించిన విశేషాలు మనకోసం

-స్వర్ణలత

స్వర్ణలత: "నమస్కారం మేడమ్. 94 సంవత్సరాల వయస్సులో క్రీడల పోటీలలో పాల్గొంటూ పతకాలు పొందుతున్న మీరు ధ్యానులకు మాత్రమే కాక ఎందరికో స్ఫూర్తి ప్రదాతలు. మీ గురించిన విశేషాలు మన ‘ధ్యాన జగత్’ పాఠకులకు తెలియచేస్తారా?!"
స్వరాజ్యలక్ష్మి గారు: తప్పకుండా! నా తండ్రి శ్రీరాములు; తల్లి వెంకట సుబ్బమ్మ. మేము నలుగురు ఆడపిల్లలం, ఒక మగపిల్లవాడు. నలుగురిలో నేను పెద్దదానిని. మావారు వెంకట సుబ్బారావు వ్యవసాయదారులు .. మాకు నలుగురు పిల్లలు. నేను నా భర్తతో .. పిల్లలతో .. చాలా కష్టాలు పడుతూ .. అందరి బాధలు నావే అనుకుంటూ చేతనైనంత సాత్వికంగా జీవిస్తూ సంసారంలో నటిస్తూ వచ్చాను.

స్వర్ణలత: "ఇంత ఉత్సాహ, ఆరోగ్య, ఆనందాలతో జీవించే స్ఫూర్తి ఎలా అబ్బింది?"
స్వరాజ్యలక్ష్మి గారు: ప్రతి పనినీ ఆసక్తితో, పట్టుదలతో నేర్చుకుని చెయ్యటం నాకు చిన్నప్పటినుంచీ అలవాటు. అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.

స్వర్ణలత: "చిన్నప్పటినుంచీ మీరు ఏ ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారు?"
స్వరాజ్యలక్ష్మి గారు: చేతి పనులు, ఆటలు, పాటలు, వంటలు, భజనలు అన్నింటిలోనూ ప్రావీణ్యం పొందాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు కానీ తాళం, శృతి, తప్పకుండ పాడగలగటం విశ్వం నాకు ఇచ్చిన బహుమతి. చిన్నప్పటి నుంచి పరిశుభ్రమైన ఆహారం తయారు చేయడం నాకు ఇష్టం. అందరికీ అన్నీ సమకూర్చుతూనే బుట్టలు, అల్లికలు, విసనకర్రలు, సిరి చాపలు, ఈత ఆకు చాపలు అల్లడం, బట్టలు కట్టడం, ఎంబ్రాయిడరీ చేయడం నేర్చుకున్నాను.

స్వర్ణలత: "ఏ ఏ రంగాలలో కృషి చేసారు?"
స్వరాజ్యలక్ష్మి గారు: మహాత్మాగాంధీజీ గారి ప్రబోధంతో రాట్నంపై నూలు తీయడం నేర్చుకున్నాను. పదహారు కుదుళ్ళపై నూలు తీయడంలో నేను ప్రథమ స్థానం పొందాను. "శ్రీ ప్రభాకర్ జీ" గారి ఆధ్వర్యంలో "అహింసా పరమో ధర్మః" స్లోగన్ ఇస్తూ అనేక ప్రాంతాలలో పర్యటించాను. ఆయుర్వేద వైద్యంలో చిట్కాలు నేర్చుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కదా! ఆ మహాభాగ్యాన్నిఅందించడం కోసం ఆ చిట్కాలను ఉపయోగించి గృహవైద్యం అందుబాటు లోకి తెచ్చాను. యోగా నేర్చుకుని, నేర్పుతున్నాను.

స్వర్ణలత: "ఆరోగ్యకరమైన పోటీతత్త్వం ఎలా పెంపొందిచుకున్నారు?"
స్వరాజ్యలక్ష్మి గారు: ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదు. దృఢచిత్తం దేనినైనా పొందగలం. నా దృష్టిని నా కృషిపైననే కేంద్రీకరించి "ఏదైనా సరే చేసి తీరాలి" అనే పట్టుదలతో ముందడుగు వేస్తూ పోతాను. అందువలన నా మనస్సులో పోటీతత్త్వం ఉండదు.

స్వర్ణలత: "మహిళల కోసం ఏమైనా చేశారా?"
స్వరాజ్యలక్ష్మి గారు: "మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడాలి" అని దృఢంగా నమ్మి నిరంతరం అదే బోధిస్తూ వచ్చాను. కనీసం మిషన్ కుట్టడమైనా రావాలని 30 సంవత్సరాలలో 1000 మంది స్త్రీలకు కుట్టుశిక్షణ ఇచ్చాను. వారిలో చాలామందికి అది జీవనాధారంగా ఉపయోగపడింది.

స్వర్ణలత: "క్రీడలపట్ల అభిరుచి ఎలా ఏర్పడింది?"
స్వరాజ్యలక్ష్మి గారు: చిన్నప్పటినుంచి మా చిన్న నాయనమ్మతో ఆటలు ఆడుతూ ప్రతిదానిలో ఆమె పై గెలవాలని పట్టుదలతో ఉండేదాన్ని. "శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్" గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించేవారు. అక్కడ నా ఆసక్తి మరింద పెరిగింది. అప్పుడే "వెటరన్స్‌లో పాల్గొనాలి" అని తెలుసుకున్నాను.

స్వర్ణలత: "ఇంతవరకు మీరు సాధించిన విజయాలు వాటి ప్రభావం గురించి చెప్పండి!"
స్వరాజ్యలక్ష్మి: 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గెలుపొందాలని ఆకాంక్షతో భారతదేశంలోని ప్రతి నగరంలోనూ ఆడి గెలిచాను. మలేషియా, సింగపూర్, శ్రీలంక, బ్యాంగ్‌కాక్ మొదలగు దేశాలలో ఆడి సుమారు 300 మెడల్స్ పొందాను. నేను రిటైరైన తరువాత నా స్నేహితురాలు "ఉదయ మేరీ"వారి సోదరి నడిపే ప్రాజెక్టులో 400 మంది శిక్షణ పొందిన నర్సులకు 1 గంట యోగా ట్రైనింగ్, స్పోర్ట్స్ ట్రైనింగ్, పల్లెలలో ఆరోగ్య ప్రచారానికి అవసరమైన పాటలు, నృత్యాలు ట్రైనింగ్ ఇచ్చాను.

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక జీవితం గురించి వివరించండి!"
స్వరాజ్యలక్ష్మి గారు: చిన్నప్పటి నుంచి "దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎలా వుంటాడు?" అని తెలుసుకోవాలని తపన ఉండేది. సత్యసాయిబాబా దగ్గర 40 సంవత్సరాల పాటు ‘మానవసేవ’చేసినా ఆ తపన తీరలేదు.

శ్రీ శ్రీ బహ్మానందగిరి స్వామి వారి వద్ద బ్రహ్మవిద్య, మహావాక్యాలు నేర్చుకుని పూర్ణసేవ చేసినప్పుడు ఆ స్వామి "కాషాయం ఇస్తాను" అంటే నా మనస్సు "కషాయం అవ్వడానికికా? కాషాయం నాకు వద్దు .." అని చెప్పాను! అంతలో ఆ స్వామి మరణించారు. అప్పుడు వెతుకులాటలో పత్రీజీని చేరాను .. "శ్వాస మీద ధ్యాస తో సాధించలేనిది ఏదీ లేదు" అని తెలుసుకున్నాను.


స్వర్ణలత: "ధ్యానంలోనికి ఎప్పుడు ప్రవేశించారు?"
స్వరాజ్యలక్ష్మి గారు: "నేను "శ్రీ శ్రీ బ్రహ్మానందగిరి స్వామి"వారి వద్ద "బ్రహ్మవిద్య" అభ్యసించాను. చిన్ముద్రతో 40 సంవత్సరాలు ధ్యానం చేశాను. స్వామీజీ దేహ విరమణ చేసిన తరువాత మా బంధువు, "కస్తూరి" గారి ఇంటిలో పిరమిడ్ చైర్‌లో కూర్చుని ధ్యానం చేస్తే చాలా బాగుంది. అప్పుడు ఆమె నాకు "ఆనాపానసతి ధ్యానం" గురించి వివరించింది. "శ్రీశైల ధ్యానమహాచక్రం"లో పత్రి సార్‌ని చూడటం, వారితో కరచాలనం, సంభాషణ జరిగింది. అప్పటినుంచి నేను "పిరమిడ్ -ధ్యానం శరణం గచ్ఛామి" అనుకుంటూ దీనినే సాధన చేస్తున్నాను.

స్వర్ణలత: "మీ ధ్యాన ప్రచార శైలిని వివరించంది!"
స్వరాజ్యలక్ష్మి గారు: నేను పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తరువాత ధ్యానం గురించి పాటలు వ్రాయడం, పాడటం వచ్చినది. "శ్వాస మీద ధ్యాస" మీద "బుర్రకథ" కూడా వ్రాశాను. అందరినీ ధ్యానులుగా చేయాలనే ఆశయంతో గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి, మహబూబ్‌నగర్ జిల్లాలలోనే కాక హైదరాబాద్ చుట్టుప్రక్కల కూడా ధ్యానం గురించి చెబుతూ వచ్చాను/వస్తున్నాను. ధ్యానం క్లాసులకు వచ్చిన వారి అనారోగ్యానికి కారణం తెలుసుకుని వారికి చిన్న చిన్న చిట్కాలు చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాను. ఆవిధంగా ఆరోగ్యాన్ని పొందిన వారు ఎందరో నాకు మిత్రులు అయ్యారు. ఇదంతా సరైన ధ్యానం వలన, నా గురువుగారైన సుభాష్ పత్రిగారి వలన, సరైన ఆహార, విహారాల వలన జరిగింది.

స్వర్ణలత: "ఈ మధ్య మీరు సాధించిన విజయాలు?"
స్వరాజ్యలక్ష్మి గారు: నేషనల్ వెటరన్ స్పోర్ట్స్‌లో ఈ సంవత్సరం "జావలిన్‌త్రో"లో వెండి, "షాట్‌పుట్"లో బంగారు, "డిస్కస్ త్రో" లో బంగారు పతకాలు సాధించాను. అది కూడా నాకంటే చిన్నవాళ్ళతో పోటీపడి సాధించాను. లక్ష్యసాధనకు వయస్సుతో నిమిత్తం లేదు.

స్వర్ణలత: "ఇప్పుడు మీరు చేపట్టిన కార్యక్రమం?"
స్వరాజ్యలక్ష్మి గారు: తెలంగాణా వెటరన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ అమరేంద్ర రెడ్డి DSP గారు జాతీయస్థాయిలో ప్రెసిడెంట్‍గా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఉన్న CI, SIలు అందరినీ పిలచి వారి సమక్షంలో శ్రీ రెడ్డిగారిని సన్మానించి, ఆ కార్యక్రమంలో వారందరికీ ధ్యానం, శాకాహారం గురించి తెలియజేయాలని కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఆదివారం ఉదయం ధ్యానులు 50 మంది మరి మిగిలినవారితో సమావేశం జరిగింది. కేశవరాజుగారు, రాజేష్ పూల గారి ఆధ్వర్యంలో శ్రీ అమరేంద్ర రెడ్డి DSP దంపతులకు సెక్రెటరీ రామాంజనేయులు గారిచే సన్మానం చేశాం. కేశవరాజు, రాజేష్ గార్లు ధ్యాన ప్రాశస్త్యం గురించి, పత్రిసార్ గురించి చెప్పగా .. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం వల్ల ప్రయోజనాల గురించి సురేష్ చెప్పారు. అరుణ ధ్యానం ద్వారా తను ఆరోగ్యం పొందటాన్ని వివరించారు. మీర్‌పేట విజయలక్ష్మి గారు శాకాహార ప్రాశస్త్యాన్ని తెలుపగా, నేను"పత్రిగారు ‘ధ్యానంతోపాటు అందరూ అన్ని కళలలో ప్రవేశం, ప్రావీణ్యం పొంది ఉండాలి’ అంటారు" అని చెప్పాను. నన్ను కూడా సన్మానించి నంది బహుమతిని బహుకరించారు. అందరికీ శాకాహార పుస్తకాలు, పిరమిడ్‌లు ఇచ్చాము.

స్వర్ణలత: "మీ పై పత్రీజీ ప్రభావం?"
స్వరాజ్యలక్ష్మి గారు: అది నేను వివరించి చెప్పగలిగినది కాదు. కానీ ప్రయత్నిస్తాను. ఈ ఒక్క జన్మలోనే నేను ఆయన నుంచి 1000 మంది తల్లుల ప్రేమను అనుభవించాను! ఇక నాకు జన్మలేదు గాక లేదు!

స్వర్ణలత: "మీ చిట్కాలలో ఒకటి, రెండు .."
స్వరాజ్యలక్ష్మి గారు: 1. ధనియాలు-100గ్రాములు, సొంఠి, మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క ఒక్కొక్కటి 5 గ్రాములు చొప్పున తీసుకుని అన్నింటినీ కలిపి పొడిచేసి ఒక చిటికెడు పొడిని నీరు, పాలు కలిపి మరిగించి కొంచెం బెల్లం కలిపి తీసుకుంటె చెడు కొలెస్ట్రాల్ తగ్గి, పొట్ట కరిగి, కాళ్ళనొప్పులు తగ్గుతాయి.

2. మెంతులు - 100 గ్రాములు, వాము 40 గ్రాములు, నల్ల జీలకర్ర 20 గ్రాములు వేరువేరుగా వేయించి పొడి చేసి బెల్లం కలిపి ఉండలు చేసి పడుకునేటప్పుడు ఒక ఉండ వేసుకోవాలి; దీనివలన జీర్ణాశయ సమస్యలన్నీ తగ్గుతాయి.

స్వర్ణలత: "PSSM గురించి మీ అభిప్రాయం?"
స్వరాజ్యలక్ష్మి గారు: ఎందరో మహానుభావులు అందరికీ వందనములు! పిరమిడ్ మాస్టర్లు చేసే సేవ అమోఘం. ప్రతి ఒక్కరూ గొప్పవారే. వారు చేసే సేవ చాలా గొప్పది. శరవేగంగా విత్తనాలు చల్లుకుంతూ, ముందుకు వెళుతున్నందుకు వారందరికీ నా శతకోటి వందనాలు.

స్వర్ణలత: "మీ సందేశం .."
స్వరాజ్యలక్ష్మి గారు: ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ, శాకాహారం తింటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఆనంద సాగరంలో తేలిపోవాలి!

Go to top