"ధ్యానులందరూ శాకాహారులు కావాలి"

 

నా పేరు విజయలక్ష్మి. మా వారి పేరు R. వెంకటేశ్వరరావు. హైదరాబాద్ "మీర్‌పేట"లో ఉంటాం. మేము ఇరువురం ధ్యానంలోకి ఒకే నెలలో వచ్చాం. ధ్యానంలోకి రాకముందు కూడా "నేను చిన్నప్పటినుంచీ శాకాహారిని" అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటినుంచి "మహాత్మా గాంధీతాత" అంటే ఇష్టం. ఆయన భావాలు అంటే చాలా ఇష్టం. ఆయన భావాలే నా మనస్సులో కూడా ఉండేవి. "అందరూ ఒక్కటే" అనే భావం ఉండేది. "అందరిలో ఒకటే రక్తం; కానీ వారు అంటరానివారు ఎందుకు అయ్యారు?" అనే భావం నాకూ ఉండేది. చిన్నప్పటి నుంచి అనేక ప్రశ్నలు మదిలో ఉండేవి. ఆ ప్రశ్నలకు జవాబులు అన్నీ ధ్యానంలోకి వచ్చాక అర్ధం అయ్యాయి. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఏ పుస్తకం దొరికితే అది చదివేదాన్ని. మా ఇంట్లో మా అత్తగారు, మా పిల్లలు, మావారు అందరూ శాకాహారులే. చిన్నప్పటినుంచి నేను పూజలు బాగా చేసేదాన్ని. ఉపవాసాలు, అన్నదానాలు, గుడిలో ఏది కావాలన్నా ఇచ్చేవాళ్ళం. లలితా సహస్రనామం, విష్ణుఅసహస్రనామం, సూర్యనమస్కారాలు అన్నీ పూర్తయిన తరువాత మంచినీళ్ళు త్రాగేదాన్ని.

ఒకానొక పౌర్ణమిరోజు "108 శ్రీనివాస్ సార్" వాళ్ళ ఇంటికి ధ్యానానికి వెళ్ళాం. నేను వాళ్ళ ఇల్లు "ధ్యానానికి పుట్టినిల్లు" అని ముద్దుగా పిలుచుకుంటాను. ఆయనకు నా ఆత్మప్రణామాలు. ఆ రోజు తెల్లవార్లూ విజయకుమార్ సీనియర్ మాస్టరు శ్రీ భగవద్గీత, ఆదిశంకరుల గురించి చెపుతూ ధ్యానం గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది .. "క్లాసుకు వెళితే మనకు తెలియని విషయాలు తెలుసుకుంటాము" అని తెలిసింది; అలా ఒక నెలరోజులు వెళ్ళాం. అలా వెళుతూంటే "మనం మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం; ఈ జ్ఞానాన్ని మన చుట్టుప్రక్కల అందరికీ తెలియజేయాలి" అన్న భావన మా ఇరువురి మనస్సులోకి వచ్చింది. అలా ముందు మా ఇంటిలో 40 రోజుల ధ్యానం క్లాసు పెట్టడం జరిగింది. మా చుట్టుప్రక్కల వారు వచ్చారు. 40 రోజులు సీనియర్ మాస్టర్స్ వచ్చి క్లాసు చెప్పారు. చక్కగా జరిగాయి. ఆఖరి రోజు 41వ రోజు "స్వర్ణమాల పత్రి మేడమ్" వచ్చి పూర్తి చేశారు. ఆ తల్లికి శతకోటి వందనాలు.

ఆ తరువాత చుట్టుప్రక్కల అన్ని కాలనీలలో ధ్యాన ప్రచారం అతి తొందరగా జరిగింది. మావారికి సహాయ సహకారాలు అందించడం నా వంతు. ఏ మాస్టర్స్ వచ్చినా రెండు, మూడు రోజులు ఉండి క్లాసులు చెప్పి వెళ్ళేవారు. వారికి అన్ని సదుపాయాలు చూసుకునేవాళ్ళం. 2008లో పత్రీసార్‌తో "మెగా శాకాహార ర్యాలీ" జరిగింది! గురువుగారితో ఆ ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ర్యాలీలు, క్లాసులు, ట్రెక్కింగ్‌లు అన్ని జరుపుకుంటూ అద్భుతమైన జీవనం జీవిస్తున్నాం! ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు "మిట్టా మనోహర్ సార్" కూడా వచ్చేవారు. మా ఇద్దరికీ అన్నీ వివరిస్తూ ఎప్పుడూ మాతో ఉంటూ, మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెబుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మాకు అండదండలుగా ఉండే ఆ మాస్టర్‌కి శతకోటి వందనాలు!

ధ్యానంలోకి వచ్చాక నేను ఏడు రకాల మందులు మానివేశాను. "తటవర్తి వీరరాఘవరావు సార్" వాళ్ళ మూడు రోజుల ట్రైనింగ్‌కి వెళ్ళాం. పన్ను నొప్పి, జ్వరం, తలనొప్పి ఏది వచ్చినా నేను పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేసి తగ్గించుకున్నాను. నాకు కుక్క కరిచినా T.T. ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. నాకు ఓ చిన్న పిరమిడ్ కావాలని కోరుకున్నాను 12’*12’ పిరమిడ్ వచ్చింది. ఆ పిరమిడ్‌కి గురువుగారు "శ్రీ స్వధర్మ పిరమిడ్ ధ్యానకేంద్రం" అని పేరు పెట్టి ప్రారంభించారు. చాలా సంతోషపడ్డాం. డాక్టర్ న్యూటన్‌గారి క్లాసు కూడా అద్భుతంగా జరిగింది. మేము ఇద్దరం "బడంగ్‌పేట"లో క్లాసుచేసి వస్తూ ఉంటే ఎదురుగా బండి అడ్డం వచ్చి బండితో సహా ఇద్దరం పడిపోయాం. ఇద్దరికీ చిన్న దెబ్బ కూడా తగలలేదు. బండికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఎందుకు చెబుతున్నారంటే "విశ్వం కోసం మనం పాటుపడినప్పుడు మాస్టర్స్, ప్రకృతి మనలని కాపాడుతారు" అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అక్టోబర్ 2వ తారీఖున "మెగా శాకాహార ర్యాలీ" చేశాం. కొంతదూరం నడచిన తరువాత కాలు స్లిప్ అయ్యి నేను క్రింద పడిపోయాను. కాలు కదపనివ్వడం లేదు. ర్యాలీ జరగాలి, భోజనాలు అవ్వాలి. 4,5 గంటల టైము పట్టింది. అప్పటివరకు గురువుగారిని తలచుకుంటూ వ్యానులో కూర్చున్నాము. ఆ నొప్పిని తట్టుకునే శక్తిని గురువుగారే ఇచ్చారు.

ఆ తరువాత హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళారు. 3వ తారీఖున సర్జరీ చేశారు. బంతి గిన్నె కీలు విరిగిపోయింది. డాక్టర్స్, డ్రెస్సింగ్ డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్లు అందరూ ఆ నొప్పి ఎలా తట్టుకోగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు. "నేను ధ్యానం చేస్తాను" అని వారికి ధ్యానం, శాకాహారం గురించి చెప్పాను. "ధ్యానశక్తి వలన ఎలాంటి గాయాన్ని అయినా తగ్గించుకోవచ్చు" అని వారికి చెప్పాను. సర్జరీ మాస్టర్స్ చేశారు. మన శరీరానికి అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి అణువునూ, కణాలనూ మన శరీరంలో ఉన్న అవయవాలనూ మనం ప్రేమిస్తే ఆ శక్తి ఎక్కడ కావాలో అక్కడ ఆ శక్తి పనిచేస్తుంది. ఏ గాయాన్ని అయినా తొందరగా నయం చేసుకోవచ్చు. గురువుగారు 2016, నవంబర్ 3వ తేదీన మాట్లాడినప్పుడు పట్టరాని ఆనందం; "మీరు తప్పకుండా నడుస్తారు; ధ్యానమహాచక్రాని రండి" అని చెప్పారు. నేను ధ్యానమహాచక్రంలో 15 రోజులు ఉన్నాను; చెప్పలేని ఆనందం. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. తల్లిలా ప్రేమగా పెడతారు, తండ్రిలా చూస్తారు, గురువులా జ్ఞానాన్ని ఇచ్చారు, దైవంలా కాపాడతారు. ఆ గురువుకు ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోగలం?! గురువుగారి మార్గాన్ని కొద్దిగా అయినా ఆచరించే శక్తి ఇవ్వమని కోరుకుంటూ గురువు గారికి శతకోటి వందనాలు! 2వ తేదీన మళ్ళీ దెబ్బ తగిలింది, 3వ తేదీన సర్జరీ అయింది. 4వ తేదీ అక్టోబరు చెన్నై, కేరళ టూరు వెళ్ళాలి. ఆ టూరు మా వారే వేశారు. నాకు సర్జరీ చేసిన మత్తు కూడా వదలలేదు. టూర్‌కి వెళ్ళమని చెప్పాను. ఆయన స్పిరిచ్యువల్ కార్యక్రమాలకు నేను అడ్డురాను. మా వారు వచ్చేవరకు మా పెద్ద అమ్మాయి, అల్లుడు ఇద్దరు మెడిటేటర్స్ ఫ్యామిలీలు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. "ధ్యానం చెబితే మిత్రలాభం" అని గురువుగారు చెప్పారు. ఆ మిత్రలాభం మేము పొందాం. టైముకి డబ్బులు లేకపోయినా డబ్బుతో సహా సహాయం చేశారు. ధ్యానులు అందరికీ నా కృతజ్ఞతలు. అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా అవ్వాలనీ, పిరమిడ్స్ కట్టాలనీ కోరుకుంటున్నాను.

R.విజయలక్ష్మి

మీర్‌పేట - హైదరాబాద్
- 9032334471.

 

Go to top