"పరమ భక్తి .. నుంచి .. పరమ ముక్తివైపుకి"

 

దానం, ధర్మం, వ్యాపారాలు "కుటుంబ నేపథ్యం"గా పెరిగిన నేను 1998లో బ్రహ్మర్షి పత్రీజీని దర్శించుకోవడంతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక నేపథ్యంలో అడుగిడడం సంభవమైంది.

ధ్యానం పట్ల రక్తి, ధ్యానం చేసే అనుభూతి, ఆత్మజ్ఞానంపట్ల అవగాహన, స్వాధ్యాయం పట్ల మరింత శ్రద్ధ, ప్రవచనం వినడంలో ఇష్టం, చెప్పడంలో తాదాత్మ్యత ఇలా ఆధ్యాత్మిక జీవితంలో భాగమైంది. అనారోగ్య కారణాలవల్ల అంటే తీవ్రమైన ఆస్తమా శరీరాన్ని కుదిపివేసి, నిర్వీర్యపరుస్తూ ఉంటే, ఎనిమిదేళ్ళు .. ఎనిమిది లక్షలు ఖర్చుపెట్టినా వ్యాధి తీవ్రత తగ్గకపోవడంవల్ల మా మేనల్లుడు "ప్రేమనాథ్ మాస్టర్" పదేపదే వెంపర్లాడడం వల్ల ఆనాపానసతి ధ్యానమార్గంలోకి వచ్చాను.

మూడు నెలలు రోజుకు ఒక గంటనుండి గంటన్నర సేపు చేసిన ధ్యానం వల్ల ఆస్తమా తీవ్రత తగ్గి క్రమంగా తగ్గుముఖం పట్టి ఆ పైన ఇతోధికంగా తొలగిపోయింది!

పూర్వజన్మల సంస్కారలవల్ల, ధ్యానయోగి కావడం కోసమే, ఆత్మ కోరి ‘ఆస్తమా’ తెచ్చుకున్నదని అనిపించింది. దరిమిలా ధ్యానం గురించి ఎంతో అనుభవాలు వినడం, న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ బుక్స్ చదవడం, కర్నూలు పిరమిడ్‌లో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చంద్రశేఖర శర్మ, Y.J.శర్మ, ఆంజనేయ శర్మ, పాల్ విజయకుమార్‌ లాంటి దిగ్గజాల సన్నిహిత సాంగత్యం కలిగింది 1999లో!

1999 మార్చ్ దాకా, కర్నూలు జిల్లా "ఆత్మకూరు"లో పుట్టి పెరిగిన నేను 1999లో కర్నూలు పట్టణానికి వచ్చేసాను వ్యాపారరీత్యా .. అప్పటికి బ్రహ్మర్షి పత్రీజీ హెడ్ ఆఫీస్ కర్నూలు. రోజూ పిరమిడ్‌కు వెళ్ళడం వల్ల ‘పత్రిసార్’ సాంగత్యం దొరికేది వారానికి ఒక్కసారైనా! నేను ప్రేమనాథ్, ఆదోని మాస్టర్ రమేష్ - ముగ్గురం తరచుగా కలుసుకుని ధ్యానంలో ఎన్నో ప్రయోగాలు చేసేవాళ్ళం. ఎన్నో అనుభవాలు వచ్చేవి. ఆశ్చర్యానందాలు ముప్పిరిగొనేవి. పరస్పరం అనుభవాలు పంచుకునేవాళ్ళం.

2000 మే 31వ తేదీన సికింద్రాబాద్ "వాసవీ నగర్"లో ఒక వ్యాపారం ప్రారంభించాను. ప్రక్కనే ఇల్లు కూడా తీసుకున్నాను. ఆ వ్యాపార ప్రారంభం ధ్యానంతోనే మొదలు పెట్టడం జరిగింది. "నిర్మలా మేడమ్" ఆరోజే పరిచయం.

2000 ఆగస్టులో వాసవీనగర్‌లోని మా అపార్ట్మెంటులో "మెడిటేషన్ సెంటర్"ను పత్రీజీ ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రతి బుధవారం గత 16 సం||లుగా మా ఇంట్లో నిర్విరామంగా నడుస్తోంది! 2001 జనవరి 25న షిరిడీ వెళ్ళడం, "అబ్దుల్ బాబా" సమాధి దగ్గర కూర్చోవడం, ఆ ధ్యానంలో నా గతజన్మలో షిరిడీలో నేను "అబ్దుల్ బాబా"గా జీవించిన విషయం తెలుసుకోవడం, ఆ తర్వాత "నా జీవన గమనం ఆధ్యాత్మిక సేవయే" అని నిర్ణయించుకోవడానికి కారణభూతమైంది.

2005లో నవంబర్ నెల వచ్చింది. 18వ తేదీ ఉదయం పడుకున్న నా శరీరంలో ఏ భాగమూ కూడా కదలకుండా ‘కోమా’లా అయిపోయింది. నా అనారోగ్యం గురించి నా భార్య భయపడి ఫోన్ చేసిన మీద మా ఊరు ఆత్మకూరు నుంచి మా అమ్మ, అన్న వదిన, మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చేశారు.

అలా నవంబర్ 18,19,20 రాత్రి 11.00 గం||ల వరకు "నా పని ఇక అయిపోయింది" అనే స్థితిలో నా దేహం ఉన్నప్పటికీ ఎవరెన్ని తర్జనభర్జన చేస్తున్నా ఆ అయిదు నెలలు కూడా మెడిసిన్స్ తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు.

ఆ రాత్రి "అయిపోయింది మారం ఇక నీ జీవితం" అని నాలో నేను అనుకుంటున్న వేళ .. నా మంచానికి వాయువ్య దిశ నుండి శక్తి రావడం ప్రారంభించింది, "సూక్ష్మశరీరంతో ‘పత్రీజీ’ శక్తిని పంపిస్తున్నారు" అని అర్ధమైంది.

అలా వేకువఝామున 3.30 గం||ల ప్రాంతంలో నా శరీరంలో పూర్తి చలనం వచ్చి దిగ్గున లేచి నేనే మంచం దిగి "అమ్మా! చంద్రా!"అని అరిచాను. ఆ రాత్రి "ఒక మహాసిద్ధపురుషుని ఆత్మ" వాక్ ఇన్‍గా ఈ ‘మారం’ దేహంలో ప్రవేశించింది! దానికి ముందు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ప్రమోషన్ పొంది ఈ శరీరంలోనుండి నిష్క్రమించింది. ఈ మొత్తం విధానం "పత్రీజీ" యొక్క పర్యవేక్షణలో దిగ్విజయంగా పూర్తయింది. ఆనాటినుంచి నేను మరింత విస్తృతంగా ధ్యాన, జ్ఞాన ప్రచారాలు నిర్వహిస్తున్నాను. "2006 సంవత్సరం తిరువణ్ణామలై ధ్యాన యజ్ఞ" నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించాను. "శ్వాస మీద ధ్యాస" .. "శ్వాస" .. రెండూ ఏకమైపోయాయి.

 

మారం శివప్రసాద్

- సికింద్రాబాద్

 

Go to top