"ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి"

 

నా పేరు "వెంకట్". నా తండ్రి వెంకటేశ్వరరెడ్డి గారు, తల్లి పిచ్చమ్మగారు. నేను ధ్యానంలోకి 2014 నవంబర్లో విజయవాడ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ముఖర్జీ గారి ద్వారా రావటం జరిగింది. మొదటి ధ్యానం చేసింది పౌర్ణమి రోజు. ఆరోజు నుండి ప్రతిరోజూ రాత్రిపూట ఎక్కువగా ధ్యానం చేసేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు. వాటిలో కొన్ని:

ఒకానొకరోజు రాత్రిపూట ధ్యానంలో రెండు చక్రాలు నా దేహంలోకి ప్రయాణం చేయటం జరిగింది. కొన్ని రోజుల తరువాత కాంతివంతమైన జ్యోతి కనబడింది. తరువాత హిమాలయాలలో కొండలమధ్య ఎందరో ఋషులు, మునులు తపస్సు చేస్తూ కనబడ్డారు. కొద్దిగా ముందుకు వెళ్ళగా తేజోవంతమైన శివలింగం కనబడింది. తరువాత ఒకరోజు రాత్రి ధ్యానంలో 11గం||ల సమయంలో నా అంతరంగం లోకి శివుడు వచ్చాడు. "మీతో పాటు పార్వతి ఏది?" అని అడుగగా మహాతల్లి పార్వతి కూడా కనబడింది. "మీకు ఏం కావాలి?" అని అడిగాను. ఆయన "నీ తల కావాలి" అని అడిగి నా తలను ఆయన కాలిక్రింద వేసి త్రొక్కిపెట్టారు! తరువాత ఉగ్రరూపంలో నరసింహస్వామి వచ్చారు. ఆయన్ని కూడా "ఏం కావాలి?" అని అడిగితే "నీ మొండెం కావాలి" అని మొండెం తీసుకుని వెళ్ళారు. నా అంతరంగంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన్ని "ఎవరు నీవు?" అని అడిగితే "నువ్వే నేను", "నేనే నువ్వు" అన్నారు. అప్పుడు ఆయన మీద పసుపు, కుంకుమ కలిపిన నీళ్ళు పడటం జరిగింది. ఆయ వెళ్ళిపోయారు.

ఒకరోజు 3.00 గం||ల తరువాత నా లోపలనుండి శూలంలాంటిది తిరుగుతూ బయటకు వచ్చింది. అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి నా నుండి బయటకు వెళ్ళటం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర ఉన్న"అమ్మ పిరమిడ్"లో ధ్యానం చేస్తున్నప్పుడు చీకటిలో కాంతివంతమైన మనిషి కనపడ్డాడు. అతనిని చూసి భయపడ్డాను. మరునాడు మళ్ళీ ధ్యానంలో వచ్చాడు. "ఎవరివి నీవు?" అని అడుగుగా ఆయన హనుమంతుడి రూపంలో కనపడ్డాడు. "నేను ఎవరిని? భూమి మీదకు ఎందుకు వచ్చాను?" అని ప్రశ్నించుకోగా ధ్యానం చేస్తూ ధ్యానం నేర్పించమని సమాధానం వచ్చింది. ఒకసారి నేను ఆస్ట్రల్గా పరిగెడుతూంటే పత్రీజీగారు నా నడుము పట్టుకుని "ఎక్కడకు పరిగెడుతున్నావు?" అని ఆపారు. "నన్ను ఎందుకు ఆపారు?" అని అడుగుగా "ఒక్కసారి ముందుకు చూడు" అన్నారు. ముందుకు చూస్తే పెద్దలోయ కనబడింది. ఇంకొకసారి మా ఇంట్లో రాత్రి ధ్యానం చేసేటప్పుడు నా ప్రక్కకు పత్రీజీ వచ్చి "నీ దివ్యదృష్టితో మీ వీధిలో అందరి ఇళ్ళల్లో వాళ్ళను చూసి రా" అన్నారు.

అలా చేసినప్పుడు ఒక ఇంట్లో ముసలి ఆవిడ మానసికంగా బాధపడుతూ కనపడింది. తరువాత ముఖర్జీ గారి ఇంటిముందు ఉన్న లక్ష్మీగారి అమ్మాయి మానసికంగా బాధపడుతూంది. అప్పుడు నేను, పత్రీజీ దివ్యదృష్టితో ఎనర్జీని ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. మా ఇంటి చుట్టుప్రక్కలి వారికి ధ్యానం నేర్పించి ఆ వాతావరణాన్ని శాంతివంతం చేయటం జరిగింది.

నిరుడు కృష్ణా పుష్కరాల సమయంలో పత్రీజీ "మానస సరోవర ధ్యాన" ఆశ్రమానికి విచ్చేశారు. మొదటి రెండు రోజులు శాకాహారర్యాలీ గురువుగారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు నేను ఆయన ప్రక్కనే నడుచుకుంటూ ర్యాలీలో పాల్గొన్నాను. విజయవాడ మొత్తాన్ని 18 సెంటర్లుగా విభజించి, సెంటరుకు ఇద్దరిని ఎంపికచేసి, శాకాహారం మీద అవగాహన క్లాసులు పెట్టమన్నప్పుడు ఆ క్రమంలో నాకు విజవాడ సీనియర్ మాస్టర్ మేడమ్ రత్నమాల గారిని సపోర్టుగా ఇచ్చారు. ఆ మేడమ్తో కలిసి ముత్యాలంపాడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో క్లాసులు జరిపాము.

కల్యాణి మేడమ్ గారి "మైత్రేయ బుద్ధ పిరమిడ్"లో ప్రతి మంగళవారం మరి ఆ చుట్టుప్రక్కల ఇళ్ళల్లో "ధ్యాన సప్తాహాలు" సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సహాయంతో అద్భుతంగా జరిగాయి. సత్యనారాయణపురం, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీ నగర్, రామక్రిష్ణాపురం, అయోధ్యనగర్, మధురానగర్లలో గుళ్ళల్లో, ఇళ్ళల్లో మొత్తం 37 సెంటర్లలో 108 సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో 41 రోజుల క్లాసులు, 21రోజుల క్లాసులు అద్భుతంగా నిర్వహించాను. ఇకముందు కూడా ఇలాగే నిర్వహిస్తాను!

నేను ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ధ్యానసాధన కొనసాగిస్తూ నిరంతరం ఉచిత ధ్యానం క్లాసు నిర్వహిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్క ధ్యానీ ప్రాపంచిక పనులు చూసుకుంటూనే ఆధ్యాత్మిక ఎదుగుదలలో తమ వంతు విశేష కృషి చేయాలనీ, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలనీ ఆశిస్తున్నాను.

 

R.వెంకట్

- విజయవాడ
-92464 99678.

Go to top