"కడ్తాల్ పిరమిడ్ వలన చుట్టుప్రక్కల తండాలు అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి"

 

నా పేరు "లక్ష్మణ్"! "కైలాసపురి పిరమిడ్"కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న "గానుగమర్ల తండా"లో నేను పుట్టాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఐదుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. 10వ తరగతి వరకు చదివాను. ఆర్ధిక ఇబ్బందుల వలన చదువు ఆపేసి మాకు ఉన్న పది ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ ఉండేవాడిని.

అలా ఐదు సంవత్సరాలు గడిచింది. అప్పుడప్పుడు ఆకతాయితనంగా "పిరమిడ్"కు వచ్చి .. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేవాడిని. అప్పట్లో పిరమిడ్‌కు సరియైన రోడ్లు ఉండేవి కావు. నా రాకపోకలను ఒక వ్యక్తి నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తూ ఉండేవారు. ఆయనే అప్పటి కడ్తాల్ పిరమిడ్ ట్రస్టీ "లక్ష్మణరావు"గారు! ఒకరోజు ఆయన నన్ను పిలిచి "పిరమిడ్‌కు చట్టబద్ధమైన రోడ్డు కావాలి" అడుగగానే నా కుటుంబ సభ్యులతో సంప్రదించి ఒక ఎకరం పొలం ఉచితంగా ఇచ్చేసాను! అలా ఉదారంగా ఇవ్వడానికి కారణం కూడా లక్ష్మణరావుగారే! ఆయన నాకు ధ్యానం నేర్పటమే కాకుండా .. "ఈ ధ్యానపద్ధతి వలన, ఈ పిరమిడ్ వలన మీ తండాజాతి వారందరూ మహోపకారాలు పొందుతారు" అని ప్రతిరోజూ నూరిపోసేవారు.

అప్పటినుంచి ప్రతిరోజూ రెండు పూటలా క్రమం తప్పకుండా రెండు గంటలకు తక్కువ లేకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానానికి ముందు నాకు అపరిమితమైన కోపం ఉండేది. చిన్న చిన్న విషయాలకే కోపం ఉప్పొంగి ఎదుటివారి మీద విరుచుకు పడేవాడిని. ధ్యానం తర్వాత నా కోపం చాలావరకు తగ్గి కొంతవరకు శాంతమూర్తిగా మారగలిగాను. ఒకానొక రోజు లక్ష్మణరావు గారు "ఈ పిరమిడ్ ప్రాంగణంలో ఉన్న గార్డెన్ పని చూడు" అని చెప్పారు. నెలకు ఆరువేల జీతం కూడా ఇస్తానన్నారు. దానితో నేను మా నాన్నకు పూర్తిగా వ్యవసాయం అప్పగించి పిరమిడ్‌కే అంకితమైపోయాను. ఎప్పుడు తెల్లవారుతుందా .. ఎప్పుడు పిరమిడ్‌కు వెళ్ళి పని మొదలు పెడదామా .. అని విపరీతమైన కాంక్ష .. అంతకు మించి ఆతురత ఉండేది. ఇలా 2011 నుంచి 2013 వరకు "గార్డెన్ పని" చాలా ఇష్టంగా చేసాను. ఆ సమయంలోనే ట్రస్ట్ మెంబర్స్‌లో ఒకరైన "శ్రీ సుబ్బరాజు"గారు "పత్రిసార్"కు నన్ను పరిచయం చేశారు.

పత్రిసార్‌ను దగ్గరగా చూడటం అదే మొదటిసారి! అంతవరకు ఎందరో మనుష్యులను చూశాను గానీ ఒక "మహనీయుడిని" చూస్తున్నాననే భావం ఏర్పడింది! వారి నోటి నుండి వచ్చిన మొదటి మాట "గార్డెనింగ్ చాలా బాగా చేస్తున్నావు .. ఇలాగే కొనసాగించు .. నీ వెనుక నేను ఉంటాను".. ఆ ఒక్క వాక్యం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది!

అప్పటినుంచి అంటే 2013 నుంచి ఈ క్షణం వరకు పిరమిడ్‌కి సంబందించిన పనులు .. మొదటగా గార్డెనింగ్‌తో పాటు "విల్లాస్ కన్‌స్ట్రక్షన్" పనులు కూడా నా ఆప్తమిత్రులైన రాజేష్, గోపీలతో కలిసి చేసే మహద్భాగ్యాన్ని నాకు సుబ్బరాజు గారు పత్రిసార్ అనుమతితో ఇప్పించారు. ఈ రెండు పనులు కూడా నేను, నా సహచరులం కలిసి చేసి అందరిచేత ‘శహభాష్’ అనిపించుకున్నాం. ఆ పైన పనినే ప్రాణంగా భావించే నా అకుంఠిత దీక్షను చూసి సంతోషపడిన సుబ్బరాజుగారు పత్రిసార్‌తో చెప్పి నాకు "అన్నపూర్ణేశ్వరి" సమస్త బాధ్యతలు అప్పజెప్పారు!

2014లోనే శాకాహారిగా మారిన నేను ఈ బాధ్యతను ధైర్యంగా తీసుకోగలిగాను. ఇది 2017 మార్చి 21న జరిగింది "అన్నపూర్ణేశ్వరి"లో అప్పటికే పనిచేస్తున్న వారందరూ కూడా తండాలకు చెందినవాళ్ళు కావడంతో మేము అన్నపూర్ణేశ్వరి పనులను ఆడుతూ, పాడుతూ ఆనందంగా చేయగలుగుతున్నాం!

అందరికీ పెరుగు వేయలేం కాబట్టి మజ్జిగనే కాస్తంత చిక్కగా అందిస్తున్నాం. సీజన్‌బట్టి కొన్నాళ్ళు నిల్వపచ్చళ్ళు, మరి కొన్నాళ్ళు రోటి పచ్చళ్ళు తప్పనిసరిగా ఉండేలా, అలాగే కురగాయలు రోజుకొక రకంగా వేపుడుగానీ, కూరగానీ చేస్తున్నాం. ప్రొద్దున సాంబారు, రాత్రి రసం ఉంటాయి. రాత్రి కూర వేరే ఉంటుంది.

తరతమ బేధాలు లేకుండా వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించి వడ్డిస్తున్నాం. దీనిలో కూడా నేను పెద్దలందరి ఆశీర్వాదం, ఆదరణ పొందాను. "అన్నపూర్ణేశ్వరే నా సర్వస్వం, నా కర్తవ్యం" అనుకుని సేవ చేస్తున్నాను. ఎంత పని ఉన్నా కూడా ఏదో సమయంలో రోజుకు రెండుసార్లు ధ్యానం తప్పనిసరిగా చేస్తున్నాను. ప్రొద్దున 8.00 గం||లకు వచ్చి రాత్రి 7.00గం||ల వరకు "అన్నపూర్ణేశ్వరి"లోనే ఉంటున్నాను. నేను లేని సమయంలో నంద్యాల లక్ష్మిగారు, వాలంటీర్లు నాకు సహాయ సహకారాలు అందించేలా వాళ్ళతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకున్నాను.
పత్రిసార్ వచ్చిన ప్రతీసారి వారిని తప్పక కలుస్తాను. కలిసిన ప్రతిసారీ కూడా వారు "ఎప్పుడూ నవ్వుతూ ఉంటావయ్యా" అని ప్రశంసిస్తారు! ఆయన మాటే మంత్రమై నాలో మరింత క్రొత్త ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. నాతోపాటు పిరమిడ్ చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్థులందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించిన పత్రిసార్‌కి ఎనలేని కృతజ్ఞతలు.


లక్ష్మణ్ నాయక్

గానుగమర్ల తండా - కడ్తాల్ మండలం - రంగారెడ్డి జిల్లా

-9848743962.

Go to top