"శంబల ప్రభువు ప్రత్యక్ష చిత్రం"

 

నా పేరు "మంజునాథ్". 2001 లో స్వీయ సత్యాన్వేషణతో ధ్యానంలోకి ప్రవేశించాను. చిన్నతనం నుంచి భక్తి, విగ్రహారాధనల పట్ల ఇష్టం లేదు. బళ్ళారిలోని "పతంజలి పిరమిడ్ ధ్యానకేంద్రం"లో ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానానికి ముందు మాంసాహారిని, శారీరక అస్వస్థతతో బాధపడేవాడిని. ధ్యానంతో స్వస్థత చేకూరి సంపూర్ణ శాకాహారిగా మారాను!

2010లో "పిరమిడ్ వ్యాలీ"లో 17 రోజుల మౌనం అభ్యాసం చేశాను. 2011లో ఉరవకొండ దగ్గర "నింబగల్ పిరమిడ్ ధ్యాన కేంద్రం"లో దివంగత సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారి నిర్దేశకత్వంలో 41 రోజుల మౌనం ద్వారా నా మనస్సు ప్రక్రియను తెలుసుకున్నాను. 2011 లో మా ఇంటినీ, తల్లిదండ్రులనూ వదిలి "పత్రీజీ నే సర్వస్వం" అని భావించి బెంగళూరు పిరమిడ్కు వచ్చేశాను. 2012లో పిరమిడ్ వ్యాలీలో 21 రోజుల మౌనం తరువాత పత్రీజీ నన్ను కర్ణాటక రాష్ట్రానికి తమ "అంతరంగిక కార్యదర్శి"గా నియమించుకున్నారు.

2013లో 31 రోజులు, 2014లో 41 రోజులు వ్యాలీలో మౌనధ్యానం చేయటంతో .. నా జీవితంలో స్వచ్ఛత, స్పష్టత ఏర్పడి సమర్పణ భావానికి బాటలు వేసాయి. 2015లో గురువుగారు, పత్రి మేడమ్‌ల అధ్వర్యంలో, బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో అనంతపురం జిల్లా "సోమందేపల్లె"కు చెందిన పిరమిడ్ మాస్టర్ "కవిత"తో నా వివాహం జరిగింది; 2016లో 21 రోజులు మౌనం చేశాను.

2017 జూన్ గురువుగారు మరికొందరు పిరమిడ్ మాస్టర్లు బృందంతో లేహ్, లడఖ్ ధ్యానయాత్రలకు వెళ్ళాము. జూన్ 9న "మిలారెపా"గుహలో ధ్యానం చెయ్యమని సార్ చెప్పారు. అక్కడ నా సూక్ష్మశరీరం విడుదల అయ్యింది! అక్కడే ఉన్న చెట్టు క్రింద ధ్యానం చేస్తూండగా "అక్కడ ఒక పిరమిడ్ వస్తుంది" అని తెలిసింది.

జూన్ 10వ తేదీ "ప్యాంగాంగ్ సరస్సు"కు ప్రయానిస్తుండగా సముద్రమట్టానికి 17,580 అడుగుల ఎత్తున ఉన్న "చాంగ్లా పాస్" వద్ద పత్రిసార్, పత్రిమేడమ్‌ల ఫొటోలు తీసాను. తరువాత పత్రి మేడమ్ నా ఫోటోలు తీస్తుండగా మొదటి ఫోటోలో నేను మాత్రమే వచ్చాను. అది సాధారణమే. అయితే రెండవ ఫోటోలో నాతోపాటు ఇంకో చిత్రం కూడా కన్పించింది. ప్రక్కన చూస్తే ఎవ్వరూ లేరు. కానీ ఫోటోలో మాత్రం ఆ చిత్రం వచ్చింది. "అది .. శంబల ప్రభువు చిత్రం" .. అని పత్రి సార్ చెప్పారు. దానితో "నా జన్మ ధన్యమైంది" అనుకున్నాను. ఈ విహారయాత్ర ఏర్పాటు చేసి, నాకు ఇంతటి అనుభవం పొందే అవకాశం ఇచ్చిన పిరమిడ్ మాస్టర్స్ సమీతా మేడమ్ (ముంబై), శ్రీ DLN శాస్త్రి సార్ (ఢిల్లీ)లకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ..

పత్రిసార్‌కు ప్రణామాలతో ..

k. మంజునాథ్

బళ్ళారి - కర్ణాటక రాష్ట్రం

-098447 40001.

Go to top