"గ్రామస్థులందరికీ ‘ధ్యానజగత్’ చందా"

 

నా పేరు "మంగమ్మ"! మా వారి పేరు కృష్ణారెడ్డి; మాది రైతు కుటుంబం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి నాగకల్పన, చిన్న అమ్మాయి పేరు సాయిలక్ష్మి. 1982 సం||లో మా అమ్మగారు "సనాతన సారధి" అనే ఆధ్యాత్మిక మాసపత్రిక నాకు చదవమని ఇచ్చారు. కానీ అప్పుడు ఆ పుస్తకం నాకు అర్థం కాలేదు. మా తమ్ముడి ద్వారా పుట్టపర్తి వెళ్ళాం.

సత్యసాయిగారి ప్రసంగాలలోని "నిన్ను నీవు తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే" అన్న వాక్యం నన్ను ఆలోచింపచేసింది."కానీ ఎలా?" .. నన్ను నేను తెలుసుకోవాలనుకునే అన్వేషణలో భాగంగా "విగ్రహంలో దేవుడు ఉన్నాడా? .. సర్వాంతర్యామిగా అంతటా వ్యాపించి ఉన్నాడు కదా" అని పూజలు మానివేశాను. ఈ
క్రమంలో 2010లో కొల్లిపర పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ధ్యానం అందింది.

కొల్లిపరలో పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి పత్రీజీని కలిసాం. అందరితోపాటు వారు మా దంపతులు ఇద్దరికీ గంధం పూసారు. ఆయనతో కలిసి ధ్యానంలో కూర్చున్నప్పుడు "ఈయన నా అసలు గురువు"అనీ, "నన్ను నేను తెలుసుకునేది ఈ ధ్యానం ద్వారానే" అనీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మా వారికి కూడా ఇదే భావన కలిగింది. అక్కడే పిరమిడ్ నిర్మించాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం.

ధ్యానంలో ఆస్ట్రల్ మాస్టర్స్ సందేశాలు తీసుకుంటూ 2012లో "శ్రీ కోదండరామ స్వర్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం"విజయవాడ వరలక్ష్మీ మేడమ్ గారిచే ప్రారంభోత్సవం జరిగింది. ధ్యాన జీవితంలో భాగంగా ఎన్నో అనుభవాలు పొందుతూ శాకాహార ర్యాలీలు చేస్తూ ధ్యానమహాచ్రంలో అన్నదానానికి భిక్షాటనలు చేసి భూలోకయాత్రలు ముగించుకుని మా వారు 2015లో దివ్యలోకాలకు వెళ్ళారు. "ఇద్దరం కలిసి చేయాలనుకున్న విశ్వకళ్యాణం పనిని నేను ఒక్కదానినే ఎలా చేయాలి?" అనుకునే సమయంలో మహావతార్ బాబా నా వెన్నంటే ఉండి .. "నువ్వు చేయగలవు" అని నన్ను ముందుకు నడిపించారు! నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది మా అమ్మగారు ఇచ్చిన "సనాతన సారధి" అనే ఆధ్యాత్మిక మాసపత్రిక. అలాగే "పత్రీజీ మాసపుత్రిక అయిన ‘ధ్యాన జగత్’ పత్రికను గ్రామంలోని ప్రతి ఇంటికీ అందించాలి. దాని ద్వారా జ్ఞానం పంచబడాలి" అని ధ్యానంలో మావారు నాకు సందేశం ఇచ్చారు. వారి సందేశాన్ని ఆదేశంగా తీసుకుని "నేను పొందిన బ్రహ్మానందం అందరూ పొందాలి" అని సంకల్పించుకుని "ధ్యాన జగత్" పత్రిక చందాలను బహుమతిగా నేనే కడుతున్నాను! ఇప్పటికి 100 చందాలు పూర్తిచేశాను. మిగిలినవి త్వరలోనే పూర్తిచేస్తాను.

 

బొమ్ము మంగమ్మ
కొత్తబొమ్మువానిపాలెం - గుంటూరు జిల్లా

Go to top