"ఆగిరిపల్లిలో మండల ధ్యాన మహోత్సవాలు"

 

నా పేరు ‘సుబ్రహ్మణ్యం’! కృష్ణాజిల్లా "ఆగిరిపల్లి" గ్రామంలోని మా "గరికిపాటి పిరమిడ్ ధ్యాన మందిరం"లో 20-4-2017 నుంచి 31-5-2017 వరకు మండల ధ్యాన ఉత్సవాలు జరిగాయి. పత్రీజీ విజయవాడ వచ్చిన సందర్భంగా ముగింపు ఉత్సవం జూన్ 5వ తేదీన జరిగింది.

పురాతన, ప్రసిద్ధ "ఆగిరిపల్లి వేదపాఠశాల" ఆవరణలో ఈ ధ్యాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. దానికి నాంది .. మేము రెండు సంవత్సరాల క్రితం ఆగిరిపల్లిలో పిరమిడ్ నిర్మించి ప్రతి నెలలో మొదటి ఆదివారం శాకాహార ర్యాలీలు నిర్వహించాము. ఆ ర్యాలీల వలన ప్రజలతో ధ్యానంపట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. "హింసాయుత చర్యల వలన అనారోగ్యాలకు గురి అవుతున్నాం" అని గ్రహించి వారు మాంసాహారం మాని ధ్యానసాధన పెంచారు.

విశ్వం నుంచి అందిన సహకారంతో వారికి స్వస్థత చేకూరి, వారిలో కొందరు వాలంటీయర్లుగా మారి పరిసర గ్రామాలలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దాంతో .. "తరువాత ఏం చేయాలి?" .. అని ఆలోచించి "మండల ధ్యానం" గురించి తెలుసుకున్నాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సాంబశివరావు .. సింగ్‌నగర్ గారి ఆధ్వర్యంలో .. 2017 ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మండల ధ్యానం రూపుదిద్దుకుంది. నలభై రోజులలో ప్రతిరోజూ శాకాహార ర్యాలీలు నిర్వహించాం. మా చిన్న గ్రామంలో రోజుకు 60 మంది పాల్గొనటం గొప్ప విజయం. జ్ఞానబోధ సమయం రోజుకు 2 గం||ల సమయం నుంచి 4 గం||లకు పెంచబడింది. అనేకానేకమంది పిరమిడ్ మాస్టర్స్ జ్ఞాన సందేశాలను అందించారు.

"కృష్ణాజిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అధ్యక్షులు శ్రీ జక్కా రాఘవరావు గారి అధ్యక్షతన ముగింపు నిర్వహించాలి" అనుకున్నాను. అయితే కాకతాళీయంగా పత్రీజీ విజయవాడ రావటం సంభవించి ఆయనే ముఖ్య అతిథిగా మహదానందోత్సాహాలతో కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో అదృష్టం! "ఇంత చిన్న గ్రామంలో ‘పత్రిసార్’తో కార్యక్రమం చేయగలనా?" అని మొదట్లో సందేహించాను కానీ వారి రాక వింటూనే వాలంటీర్లలో ఆనందోత్సహాలు పెల్లుబికాయి! "ఆరోజు సాయంత్రానికి ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది! సాయంత్రం 5.00 గం||లకు శ్రీ పిప్పళ్ళ ప్రసాద్ గారి తుంబర గానం సాగుతూండగా దాదాపు వెయ్యిమంది వచ్చి చేరారు!" మా ఊరిలో అంతమందిని నేను అంతకుముందు ఎన్నడూ చూడలేదు! అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుండగా రాత్రి 7.00 గం||ల సమయంలో చప్పట్లు మారుమ్రోగుతూండగా పత్రీజీ వేదిక వద్దకు చేరుకున్నారు. వారు నన్నూ, నా కుటుంబ సభ్యులను ధ్యాన అనుభవాలను వివరించమని చెప్పి .. అందరినీ ధ్యాన ముగ్దులను చేశారు. ఈలోపు అంతటి వేడిలో ఏకధాటిగా వర్షం కురిసి వరుణదేవుడు మమ్మల్ని పలకరించటానికి వచ్చాడు. "ఎవ్వరూ కదలకండి" అని సార్ ఆదేశించగానే ఒక్కరు కూడా కదలకుండా ధ్యానస్థితిలో ఉండిపోయారు! నేను కళ్ళు మూసుకోగానే గాఢధ్యానస్థితిలో లోతైన సముద్రంలో ఎక్కడో ప్రయాణిస్తున్నట్లుగా భావించాను. అనంతరం భోజన సదుపాయంతో అత్యంత ఆనందంగా, వైభవంగా కార్యక్రమం ముగిసింది!


గరికపాటి సుబ్రహ్మణ్యం

ఆగిరిపల్లి - కృష్ణాజిల్లా
-98480 25084.

Go to top