"MIMC - వసుధైక కుటుంబవు ప్రతీక"


"లేహ్/లడఖ్" లోని "మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్" - MIMC ప్రముఖ బౌద్ధగురువు "శ్రీ భిక్కు సంఘసేన"గారి ఆధ్వర్యంలో నడపడుతోంది. బుద్ధుడు బోధించిన ప్రేమ, కరుణ, వివేక సందేశాలను ప్రపంచం అంతా వ్యాప్తి చేసే లక్ష్యంతో స్థాపించబడిన ఈ MIMC నిత్యజీవితంలో బుద్ధుని బోధనలు ఆచరించే విధంగా ముముక్షువులనూ పరిసర ప్రజలనూ తీర్చిదిద్దుతోంది. "ఒకానొక సామాన్య సైనికుడుగా దేశ పరిరక్షణకు తోడ్పడటం కంటే ఆధ్యాత్మిక సైనికుడిగా మానవులలో ఆత్మజాగరూకతను కలిగించడమే ముఖ్యం" అన్న ఉదాత్త లక్ష్యంతో "ఆధ్యాత్మిక సైనికుడు"గా మారిన ప్రాపంచిక సైనికుడు "భిక్కు సంఘసేన" గారి గురించిన వివరాలు వారి మాటలలోనే .. మనకోసం:


- M.స్వర్ణలత

స్వర్ణలత: "మీ తల్లిదండ్రులు, బాల్యం, విద్యాభ్యాసాల గురించి తెలపండి?"
భిక్కు సంఘసేన గారు: "ఉత్తరభారతదేశంలోని హిమాలయ ప్రాంతమైన ‘లడఖ్’ సమీపంలోని ‘బేనిస్గామ్’లో సాంప్రదాయ బౌద్ధ కుటుంబంలోని నేను జన్మించాను. మా నాన్నగారు ‘రిన్చెన్ అన్చెక్’ సాంప్రదాయ వైద్యులు మరి మా అమ్మగారు ‘సూరింగ్ డాల్మా’, గృహిణి. "1970 సంవత్సరాలలో ‘లడఖ్’ అన్నది పూర్తిగా ఒక ప్రక్కకు విసిరివేయబడినట్లు ఉండేది. పాఠశాలలు ఉండేవి కావు. అశ్రమ విద్య మాత్రమే బోధించబడేది. అప్పట్లో నా వద్దకు వచ్చిన ఒకే ఒక క్రొత్త విషయం ‘సైన్యం’. వారి దుస్తులచే ఆకర్షితుడనై నేను సైన్యంలో చేరాను. అప్పట్లో నా పేరు ‘సిరింగ్ అన్చుక్’."

 

స్వర్ణలత: "మరిసైన్యం నుంచి ఎందుకు వచ్చేశారు?"
భిక్కు సంఘసేన గారు: "జీవితానికి అర్థాన్నీ అంతిమ సత్యాన్నీ మరి ‘ఈ అద్భుత సృష్టి వెనుక ఉన్నది ఎవరు?’ అన్న విషయాన్నీ తెలుసుకోవాలని నేను చిన్నప్పటి నుంచీ ఎందరినో ప్రశ్నించేవాడిని. కానీ ఎవ్వరూ వాటికి తృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. రాను రానూ సృష్టిరహస్యం తెలుసుకోవాలన్న ఆకాంక్ష నన్ను నిలువనీయక పోవడంతో "దేశాన్ని రక్షించే సైనికుడిగా ఉండటం కంటే ఆధ్యాత్మిక సైనికుడిగా మారి సృష్టి రహస్యాలను తెలుసుకోవాలి" అనుకుని సైన్యాన్ని విడిచిపెట్టాను.


స్వర్ణలత: "ఇదంతా ఎలా మొదలైంది?"
భిక్కు సంఘసేన గారు: "నా 20 సం||ల వయస్సులో నేనొక బౌద్ధ సన్యాసిని కలిసాను. మేము పరస్పరం మా జీవితాలలో విషయాలను కలబోసుకునేవాళ్ళం. అప్పుడు నాకు ‘నేను సరియైన బౌద్ధ మతస్థుడిలా జీవించడం లేదు’ అనిపించింది." "సైన్యంలో మాకు ఎదుటి వాళ్ళను ఎలా చంపాలో శిక్షణ ఇచ్చేవారు కానీ ‘ఎలా రక్షించాలి?’ .. ‘సామరస్యతతో ఎలా సాధించాలి?’ అన్నది బోధించేవారు కాదు. అందువలన నాకు ‘సైన్యంతో కొనసాగటం కంటే బుద్ధత్వం అనుసరించడమే మేలు’ అనిపించింది."

 

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు?"
భిక్కు సంఘసేన గారు: "బెంగుళూరులోని బౌద్ధ విహారం అధ్యక్షులు ‘ఆచార్య బుద్ధ రక్షిత’ నా గురువు".

 

స్వర్ణలత: "ఆయన బోధనలు?’
భిక్కు సంఘసేన గారు: "బుద్ధుని బోధనలే మా గురువు యొక్క బోధనలు. భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణయే మా లక్ష్యం".

 

స్వర్ణలత: "మీ గురువుగారు మిమ్మల్ని ఎలా ఉత్తేజపరిచారు?"
భిక్కు సంఘసేన గారు: "ఆయన పాండిత్యం ద్వారా! సంస్కృతం, పాళీ, బుద్ధతత్వాలతో ఆయన అనన్య పాండిత్యం కలిగి ఉన్నారు. దానితోపాటు ఆయన మానవతా దృక్పధం నన్నెంతో ప్రభావితం చేసింది!"

 

స్వర్ణలత: "మీ విశేష ధ్యానానుభవాలు తెల్పండి"
భిక్కు సంఘసేన గారు: "దైనందిన జీవితంలోని ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, అనుకూల ప్రతికూలతలు, సమస్యల నుంచి విడిపడి ఉండటం, ఉనికి యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకోగలగటం, అహంకార రాహిత్యం .. ఇవన్నీ ధ్యానస్థితి మరి ధ్యాన సాధనల వలననే పొందగలిగాను. ‘నేను’ అన్నదే లేనప్పుడు .. బంధాలను అంటిపెట్టుకోవడాలు ... ‘నావి’ అన్నవి అదృశ్యం అయిపోయి .. నిర్భీతితో కూడిన నూతన జీవితంలో ఆశీర్వదించబడుతాం."

 

స్వర్ణలత: "`MIMC' స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?"
భిక్కు సంఘసేన గారు: "నేను బెంగళూరులో సన్యాసదీక్ష తీసుకున్నప్పుడు .. ‘మానవజాతికి ఋణపడి ఉన్నాను.. వారికోసం ఏమైనా చెయ్యాలి’ అనుకున్నాను. "ఎవరికైనా చేయడానికి ముందు నేను పుట్టి పెరిగిన ప్రాంతమైన లడఖ్ .. చాలా వెనుకబడిన ప్రాంతం కనుక ‘అక్కడినుంచే సేవ ఆరంభించాలి’ అనుకున్నాను. 1986లో ఈ `MIMC' ప్రార్ంభించి, నెమ్మదిగా అనేక కార్యక్రమాలు చేపడుతూ, విస్తరిస్తున్నాను."

 

స్వర్ణలత: "ఈ అభివృద్ధి సాధించటానికి నిధులు ఎలా సమకూర్చారు?"
భిక్కు సంఘసేనగారు: "భారతదేశం వెలుపలకు వెళ్ళి లామా బోధనలు, ధ్యాన శిక్షణలు చేపట్టేవాడిని. వాటి ద్వారా వచ్చిన ధనాన్ని సంస్థ అభివృద్ధికి వినియోగించేవాడిని."

 

స్వర్ణలత: "మీరు ఏ యే దేశాలలో ధ్యానశిక్షణను ఇచ్చారు?"
భిక్కు సంఘసేన గారు: "ఆసియా, ఐరోపా ఖండాలకు చెందిన అనేక దేశాలలో ధ్యానశిక్షణ ఇవ్వటంతో పాటు ఇక్కడకు వచ్చిన వారు ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన వారయినా సరే .. అందరికీ ధ్యానంతోపాటు కరుణ, సేవల ప్రాధాన్యత బోధిస్తాము."

 

స్వర్ణలత: "MIMC లో మీరు చేపడుతూన్న కార్యక్రమాలు ఏవి?"
భిక్కు సంఘసేనగారు: "లేహ్/లడఖ్లో ‘సంబోధిరిట్రీట్ సెంటర్’ .. ‘జేతవన మొనాస్ట్రీ’ .. ‘ఫౌండేలింగ్ నన్నరీ’ .. ‘రెసిడెన్షియల్ స్కూల్’ .. ‘బాలుర బాలికలు వసతిగృహం’ .. ‘బోధ్కర్బు’ .. ‘టింగ్ మోస్గాంగ్’ .. ‘లోచాస్ స్కూల్ - సే’ .. చండీఘడ్లో .. ‘బాలికల వసతి గృహం’ .. ‘అంధుల వసతిగృహం’ .. ‘అనాథ వసతిగృహం’ మొదలైనవి నిర్వహిస్తున్నాం.

వీటితో పాటు ‘గ్లోబల్ ఫ్యామిలీ గెస్ట్హౌస్’ .. ‘గ్రీన్ దేవాచన్ ప్రాజెక్ట్’ .. ‘ఇంటర్ ఫెయిత్ హార్మొనీ ప్రోగ్రామ్స్’ .. ‘మెడికల్ ప్రోగ్రామ్స్’ .. ‘మైత్రి ఛారిటీ ప్రోగ్రామ్స్ ఫర్ ఎమర్జన్సీ రిలీఫ్’ .. ‘మహాకరుణ దివస్’లు నిర్వహిస్తున్నాం."

 

స్వర్ణలత: "మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?"
భిక్కుసంఘసేన గారు: "ఈ చేపట్టిన ప్రణాళికలు అన్నింటినీ పూర్తిచేసి, బుద్ధ సందేశాన్ని ప్రపంచ స్థాయిలో వ్యాప్తి చేయటం."

 

స్వర్ణలత: "మీరు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు మరి వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం?"
భిక్కు సంఘసేన గారు: "అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు - ‘ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్’ .. ‘ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్’ .. ‘పర్యావరణ పరిరక్షణ’ .. ‘మౌలిక విద్య’ .. ‘ఆరోగ్యం’ .. ‘శాంతియుత సహజీవనం’ .. ‘ధ్యానం’ .. మరి ‘యోగ’లకు చెందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

 

స్వర్ణలత: "బుద్ధుని గురించి తెలపండి!"
భిక్కు సంఘసేన గారు: "దివ్యజ్ఞానప్రకాశం పొందిన మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ ‘గౌతమ బుద్ధుడు’ మానవాళిలో ఎక్కువ భాగానికి సహాయం చేశాడు. మరింత సహేతుకమైన, శాస్త్రీయమైన మానవతా విధానాల ద్వారా అందరికీ చేరువ అయ్యి, దుఃఖ నివారణను తెలిపిన మార్గదర్శకుడు గౌతమబుద్ధుడు."

 

స్వర్ణలత: "మీరు పత్రీజీని ఎప్పుడు, ఎక్కడ కలిసారు? పత్రీజీ గురించీ, PSSM గురించీ మీ అభిప్రాయం?"
భిక్కు సంఘసేన గారు: "పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో జరిగిన GCSS కు నేను ఆహ్వానించబడ్డాను. ఆయనను అక్కడ తొలిసారిగా కలుసుకున్నాను.

"పత్రీజీ పట్ల నాకు అపారమైన గౌరవం. ధ్యానం, శాకాహారం, ఆధ్యాత్మిక విజ్ఞానాల వ్యాప్తి ద్వారా మానవాళికి సేవచేస్తున్న ఆయన అందరికీ ఆదర్శప్రాయులు, అనుసరణీయులు. "‘PSSM' అన్నది మానవ జాతి అంతటికీ మార్గదర్శకత్వం వహించగల మహోన్నత ఉద్యమం.

 

స్వర్ణలత: "MIMC లో పిరమిడ్ నిర్మాణం గురించి చెప్పండి!"
భిక్కు సంఘసేన గారు: "MIMC లో 50’*50’ ధ్యాన పిరమిడ్ నిర్మాణం చేసుకోబోతుంది. ‘పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం’ అని నేను కూడా విశ్వసిస్తున్నాను. ఇక్కడ పిరమిడ్ రాబోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఆసక్తి ఉన్నవారందరూ దానిను ఉపయోగించవచ్చు."

 

స్వర్ణలత: "మీ సందేశం"
భిక్కు సంఘసేన గారు: "మానవ జీవితం అమూల్యమైనది, అందమైనది. ‘మిగిలిన జీవరాశులు అన్నింటికంటే మిన్నగా ఉండటం’ అనేది మనకు ఆధ్యాత్మికత వలననే సాధ్యం. ఆధ్యాత్మికతా, మానవతా విలువల ఫల, పుష్పాలు లేకుండా ఉన్న జీవితం మోడువారిన వృక్షం వంటిది. కనుక అందరూ ఆధ్యాత్మికులు కావాలి."

 

స్వర్ణలత: "ఇంకా ఏమైనా ..?"
భిక్కు సంఘసేన గారు: "ఇది శాస్త్రీయత, తర్కం, హేతువు, మేధాశక్తుల కాలం. కనుక ఈ కాలంలో ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా తెలియజేయాలి. గతంలో ముక్తిమార్గం భక్తి ద్వారా బోధించబడేది. కానీ అది శాస్త్రీయంగా .. పదార్థ విజ్ఞాన శాస్త్రాన్ని దాటి .. తెలియచేయబడుతుంది. భౌతికవిజ్ఞానశాస్త్రమ్ అంతమైనచోట ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం ప్రారంభమవుతుంది.

"షరతులు లేని, శాశ్వత ఆశీర్వాదం ద్వంద్వత్వానికి, పదార్థానికి ఆవల ఉంది. దానిని అందరూ అందుకోగలగాలి. "భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడైన ‘ఆల్బర్ట్ ఐన్స్టీన్’ సిద్ధాంతం దైవాన్ని రూపాంతరీకరించి . . మూర్ఖ ఆచారాలు, సిద్ధాంతాలు నుంచి వైదొలగుతుంది. ప్రాకృతిక, ఆధ్యాత్మికతలను మేళవించిన అనుభవాల నుంచీ ఉద్భవించే అర్ధవంతమైన ఐక్యత అది. ఇదంతా బుద్ధతత్త్వం నుంచే సాధ్యం.

"బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి."

"దేవాచన్" - లేహ్/లడఖ్ - హిమాలయాలు"

 

 

Go to top