"ధ్యానసాధనలో ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి"

 

నా పేరు "రావు"! నా వయస్సు 90 సంవత్సరాలు; ధ్యానానుభవం 17 సంవత్సరాలు. "కేంద్రీయ విద్యాలయ సంఘటన్"లో నేను ప్రిన్సిపాల్ మరి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేసి చివరకు పదవీ విరమణ పొందాను. 2000 సం|| జూన్ 2వ తారీఖున బ్రహ్మర్షి పత్రీజీ సమక్షంలో నేను "ఆనాపానసతి-ధ్యానం" మొదలుపెట్టాను. అంతకుముందు నా పరిస్థితి .. జీర్ణకోశ సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నా సమయం, సంపద డాక్టర్లకు అల్లోపతీ మందులకూ, సర్జరీలకూ ఖర్చుపెడుతూ ఉండేవాడిని. ఇక దాన ధర్మాలకు డబ్బేది? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలకు ఓపికగానీ, తీరికగానీ ఉండేది కాదు. ఇల్లు, ఉద్యోగం ఈ రెండే నా ప్రపంచం.

"అద్భుతమైన మార్పులు"

కానీ ధ్యానంవల్ల వచ్చిన అద్భుతమైన మార్పులతో జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయం మొదలయిందని తెలుసుకున్నాను:

* మొదటి మార్పు "ప్రాణమయకోశం అన్నది శక్తివంతం కావటం, మరి నాడీమండల శుద్ధి. సహజమైన శారీరక, మానసిక ఆరోగ్యం, మందులన్నీ మానేయటం.
*రెండవ మార్పు "నిరాటంకంగా ధ్యానం, ధ్యాన ప్రచారం చేయటం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల వల్ల కలిగిన అనేక ఆధ్యాత్మిక అనుభవాలు.
* మూడవ మార్పు "అద్భుతమైన అనుభవాలతో జ్ఞానోదయం. అనుభవమే జ్ఞానం కదా! మనోమయకోశ స్థితిలో జ్ఞాననేత్రం మేల్కోవటం, దేవీ దేవతల దర్శనం, సూక్ష్మ శరీరయానాలు, పూర్వజన్మ స్మృతులు, దివ్యలోకాలలో దివ్యాత్మల దర్శనం, సందేశం.
* నాల్గవది "మానవజన్మ సార్థకం చేసుకోవటానికి కావలసిన ఆత్మజ్ఞానం లభించటం. నేను ఈ ‘శరీరాన్ని’ కాను .. ఆత్మను! మనస్సు సృష్టించే కోరికవల్లనే ఈ శరీరానికి బాధలు, దుఃఖం కలుగుతాయి. ‘కేవలం ధ్యానసాధనతోనే వీటిని అధిగమించితే బుద్ధుడిని కాగలను’ అని తెలుసుకోవటం.
* అయిదవది "జీవితంలో విప్లవాత్మక మార్పులు రావటం, వ్యక్తిత్వంలో పూర్తి కలగటం, మాటలు, చేతలు, ఆహార విహారాదులు కూరాయి. ‘నా’ కు బదులు ‘మన’, ‘నేను’, ‘నాది’ స్థానంలో ‘మనం’, ‘మనది’ రావటం; అందరితో కలిసి మెలసి ఆనందంగా జీవించటం, ఆర్తులకు సహాయం సహకారాలు అందించటం; సేవ, దయ, దానం, ధర్మం మొదలైన దైవీక లక్షణాలతో తులతూగటం."

"దివ్య అనుభవం"

2011 లో విశాఖపట్టణం ధ్యానమహాచక్ర సభలో ధ్యానం చేసుకుంటూండగా బుద్ధ భగవానుడు నన్ను ధ్యానంలో నుంచి లేపి తన సహజ రూపంలో దర్శనం ఇచ్చాడు! చిరునవ్వుతో నన్ను దీవించి మూడు నిమిషాల తరువాత అదృశ్యమయ్యాడు! నాకు పరమానందం కలిగింది!

"పిల్లలకు ధ్యానం"

పిల్లలకు మంచి ఆరోగ్యం, మంచి చదువు, మంచి నడవడి రావాలనేది నా చిరకాల వాంఛ. దీనిని సాధించటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు అది ‘ధ్యానం’తోనే సాధ్యమైంది. కొన్ని వేలమంది పిల్లలకు ధ్యానం నేర్పాను. "బాలవికాస్" ఉత్సవాలు జరుపుతున్నాం. పిల్లలలో వచ్చిన అద్భుతమైన మార్పులు చూసి వాళ్ళ టీచర్లు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ విద్యాశాఖ కూడా సహాయ సహకారలందించింది.

స్కైప్ మెడిటేషన్: విశ్వగురువు పత్రీజీ ఆశీస్సులతో 2010లో అమెరికా వెళ్ళిన నేను ఒక మండలం (40రోజులు) పాటు స్కైప్ మెడిటేషన్ ద్వారా అమెరికాలోని ఆరు రాష్ట్రాల వారికి ధ్యానం నేర్పాను. పత్రీజీ గారి సహోదరి డా||సుధా మేడమ్; ఆమె భర్త రామకృష్ణగారు, కేశవరాజుగారు పాల్గొని చాలా మెచ్చుకున్నారు. అంధులకూ, అంగవైకల్యంతో బాధపడుతున్నవారికీ, మంచానపడిన వృద్ధులకూ, జైలులోని ఖైదీలకూ కూడా ధ్యానం నేర్పి స్వస్థత చేకూర్చాను.

"నా రచనలు"

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను పాటించడంలో భాగంగా నా అనుభవాలను ఎనిమిది చిన్నపుస్తకాలలో ప్రచురించాను. అవన్నీ మంచి ప్రాచుర్యం పొందాయి. "మిరాకిల్స్ ఆఫ్ మెడిటేషన్" .. "ధ్యానులు .. పూజలు చేయలా?" .. "Our Divine Centre" .. "సప్తకోశాలు" .. "ధ్యానమహిమ" మొదలైన నా గ్రంథాలలో కొన్ని తమిళంలోనికీ, హిందీలోనికీ అనువదింపబడ్డాయి.

"ఆధ్యాత్మిక ఆరోహణ"

విశ్వగురువు "పత్రీజీ"ని అనేకసార్లు కలిసే భాగ్యం నాకు లభించింది. మరి అపారమైన దయ, ఆధ్యాత్మిక శక్తి వలన నా ఆధ్యాత్మిక శక్తిని పెంచాయి. దీని ప్రభావం వల్ల నాకు దివ్యాత్మలు (Astral Masters)తో సంబంధం ఏర్పడి వారి సందేశాలూ .. సహాయ సహకారాలు అందుతున్నాయి.

నా సేవతో సంతృప్తి చెందినవారు నేను ప్రస్తుతం చేస్తున్న ధ్యాన కార్యక్రమాలకు బదులుగా ఒక నిమ్నలోకంలో ఆత్మహత్యలు చేసుకున్న అపవిత్ర ఆత్మలకు సలహాలు, సహాయం అందించి, ధ్యానం ద్వారా ఆత్మలను స్వచ్ఛపరచి ఊర్ధ్వ, ఉన్నతలోకాలకు పంపే బాధ్యతలను నాకు అప్పగించారు! ఈ విధంగా నా ఆధ్యాత్మిక ఆరోహణ జరిగింది. బయటి పరిస్థితి ఎలా ఉన్నా లోపల ఆత్మానందాన్నిపొందగలుగుతున్నాను. ఈ విధంగా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలిగాను. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిన "విశ్వగురువు" బ్రహ్మర్షి పత్రీజీకి నా ప్రణామాలు!!

 

N.S.రావు

 నేరేడ్‌మేట్-సికింద్రాబాద్

-9849748286.

Go to top