"ఉన్నది Free-will ఒక్కటే"

 


వృత్తిరీత్యా ఆస్ట్రేలియా దేశం మెల్‌బోర్న్ మహానగరంలో స్థిరపడి .. "Breath - Universe" విభాగం ద్వారా online లో చక్కటి ధ్యాన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మస్టర్ "హరి రాధాకృష్ణ పుప్పాల". చిన్నవయస్సులోనే ధ్యానసాధన ప్రారంభించి చదువులో .. సంస్కారంలో మరి వృత్తి నైపుణ్యంలో తమ సర్వసమర్థతను నిరూపించుకుంటున్న "హరి" గారు ఇటీవల తమ ఇండియా సందర్శనలో కాస్సేపు "ధ్యాన జగత్" తో ముచ్చటించి తమ ఆత్మీయ భావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ..

వాణి: "హలో హరి! ‘ధ్యాన జగత్’కు స్వాగతం. చిన్న వయస్సులోనే మీరు ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. అది ఎలా జరిగింది?’
హరిగారు: కృష్ణాజిల్లా .. విజయవాడ మా స్వస్థలం. మా నాన్నగారు "శ్రీ రాఘవ కుమార్" గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా మా అమ్మ "శ్రీమతి పుష్పలత"గారు గృహిణి. చిన్నప్పటినుంచీ నేను మా తాతగారైన "శ్రీ రామారావు" మరి మా నాన్నమ్మ "నాగమణి" గార్ల దగ్గరే మచిలీపట్నంలో ఎక్కువగా పెరిగాను. దానివల్ల నేను మా తల్లితండ్రుల ప్రేమానురాగాలతోపాటు నాన్నమ్మ తాతయ్యల ఆత్మీయాభిమానాలను సంపూర్ణంగా పొందాను. వీటికి తోడు మా బాబాయి, అత్తయ్యల స్నేహం మరి ఆప్యాయతలు సరేసరి! వెరసి ఈనాటి తరం పిల్లలకు భిన్నంగా నేను పెద్దవాళ్ళందరి అప్యాయతానురాగాలను పుష్కలంగా పొందాను! మా తాతగారు "మహర్షి మహేష్ యోగి" గారి "భావాతీత ధ్యానం" చేస్తూ ప్రతిరోజూ నాతోకూడా చేయించేవారు. దాంతో పౌర్ణమి, అమావాస్య రోజులలో మా ఇంట్లో కూడా ఉదయం మరి సాయంత్రం సామూహిక ధ్యాన తరగతులు జరుగుతూ ఉండేవి. క్రొత్తగా వచ్చినవాళ్ళకు అక్కడ మంత్రదీక్షలు కూడా ఇచ్చేవారు. నేను చదివింది 7 వతరగతి వరకు "మహార్షి విద్యాలయం"లోనే. ఇలా నాకు ఊహ తెలిసినప్పటినుంచే "ధ్యానం" అన్నది నా జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతిరోజూ పళ్ళు తోముకుని స్నానం చేసి భోజనం చెయ్యడంలాగే .. "నిరంతర ధ్యానసాధన" కూడా చేస్తూనే నేను పెరిగి పెద్దయ్యాను. 8వ తరగతిలో మా తాతగారు చనిపోయాక వారి కోరక మేరకు నేను విజయవాడ దగ్గర మంటాడ లో ఉన్న మా పెద్దత్తయ్య "శ్రీమతి చంద్రావతి"గారి ఇంటికి వచ్చాను. 8వ తరగతి మంటాడలో చదివాక మా మామయ్య శ్రీ బదరీ నారాయణగారు నన్ను ప్రక్కనే ఉన్న "కనుమూరు" హైస్కూల్ లో చేర్చి తొమ్మిది మరి పది తరగతులు చదివించారు. ఆ పై కాలేజీ చదువులకోసం విజయవాడ లో ఉన్న మా నాన్నగారి దగ్గరికి వచ్చేశాను. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు మా మామయ్య "బదరీ నారాయణ"గారు కృష్ణాజిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అధ్యక్షులు "జక్కా రాఘవరావు"గారి ద్వారా "పిరమిడ్ ధ్యానం" గురించి తెలుసుకున్నారు. వెంటనే వారు శాకాహారిగా మారిపోయి మా అందరితోకూడా "ఆనాపానసతి" ధ్యానం చేయించడం మొదలుప్ ఎట్టించారు. అలా డిగ్రీ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచే నేను కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ అందులోని లాభాలను పొందడం మొదలుపెట్టాను. ముఖ్యంగా "ధ్యానం చెయ్యడంవల్ల నిద్రపోయే సమయం తగ్గిపోతుంది" అని తెలుసుకున్నాను. ఇక దాంతో చదువుకోవడానికి నాకు బాగా సమయం దొరకడంతో సాధారణంగా స్టూడెంట్స్‌కి ఉండె "పరీక్షల ఒత్తిడి" నా పై తగ్గిపోయేది!

వాణి: "బాగుంది! .. మరి ధ్యానానుభవాలు ఏవైనా వచ్చేవా!?"
హరి గారు: నిజానికి .. "ధ్యానం" అన్నది చిన్నప్పటి నుంచీ నా జీవితంలో ఒక భాగమై వస్తూన్నా కూడా .. అందులోని లాభాలు నాకు అందుతూన్నా కూడా కాస్త పెరిగి పెద్దవుతూన్న కొద్దీ స్నేహితులు నా ధ్యానాన్ని ఎగతాళి చేస్తూండడంతో నేను ధ్యానం చెయ్యడానికి ఒకింత సిగ్గుపడేవాడిని! ఇలా ఒకానొక ధ్యానికి ఎన్ని ప్రలోభాలూ మరి పరీక్షలూ ఉంటాయో చూడండి! సరే .. అలా పరీక్షలప్పుడు నిద్రా సమయాన్ని తగ్గించుకునే క్రమంలో ఒకానొకరోజు మా ఇంటిపై మూడవ అంతస్థులో ఉన్న డాబాపై కూర్చుని నేను రాత్రిపూట ధ్యానం చేసుకుంటున్నాను. గాఢ ధ్యానస్థితిలో ఉండగా నా కళ్ళముందు ఒక స్త్రీ .. తెల్ల చీర కట్టుకుని పొడవాటి జుట్టు పెద్ద బొట్టుతో నా మూడోనేత్రానికి ప్రత్యక్షం అయ్యింది! నాకు చాలా భయం వేసి వెంతనే కళ్ళు తెరిచేసి .. క్రిందికి వచ్చేశాను. మర్నాడు మళ్ళీ ధ్యానానికి కూర్చోగానే మళ్ళీ అదే రూపం! "ఇదేంట్రా బాబూ! ఈవిడెవరో దయ్యంలా నా వెంట పడుతోంది!" అనుకొని మళ్ళీ క్రిందికి పరిగెత్తుకుని వచ్చేశాను. రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ హాల్‌లో పగటిపూట ఇంట్లోనే అందరి మధ్యలో కూర్చుని ధ్యానం మొదలుపెట్టాను. మళ్ళీ అదే రూపం! ఇక లాభం లేదని ధ్యానం చెయ్యడం సాంతం మానేశా! కొన్ని రోజులకు మా అత్తయ్య, మామయ్య మా ఇంటికి వచ్చినప్పుడు "మామయ్యా! ధ్యానం చేస్తే దయ్యాలు కనబడతాయా?" అని అడిగాను; వివరం అడిగిన ఆయనకు నా అనుభవం చెప్పాను. వెంటనే ఆయన "ఈ సారి అలా కనిపించినప్పుడు వాళ్ళు ఎవరో అడుగు" అని చెప్పి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. దాదాపు రెండు గంటలపాటు అలాగే కుర్చున్నాను. ఏదో ఒక పెద్ద పూలతోటలో సువాసనలు చుట్టుముట్టుతూండగా "ఒక గురువు నా ముందు ప్రత్యక్షం అయ్యారు!" "గత ఏడు జన్మల నుంచీ రకరకాల దేహాలతో నువ్వు ఉన్నప్పుడు నేను నీకు ఆధ్యాత్మిక గురువును" అని చెప్పారు. చాలాసేపు నేను ఒక సాక్షిలా వారిని చూస్తూ ఉండిపోయాను. ధ్యానం అయిపోయిన తరువాత మా మామయ్యకు నా అనుభవం చెప్పగా వారు .. "ఈసారి వారినుంచి మరింత సమాచారం తెలుసుకో" అని చెప్పి "ఒక యోగి ఆత్మకథ" అన్న పుస్తకం నాకు ఇచ్చారు. ఆ పుస్తకం మీద ఉన్న "శ్రీ శ్రీ పరమహంస యోగానంద" గారి చిత్రం చూసి చాలా ఆశ్చర్యపోయాను! వారే నాకు ధ్యానంలో కనిపించిన ‘స్త్రీ రూపం’ మరి ‘గురువు రూపం’ కూడా!

"సరే" అని నేను ఉత్సాహంగా కూర్చుని ధ్యానం మొదలుపెట్టాను. నిజానికి ఒక స్టూడెంట్‌గా నాకు అవన్నీ చాలా విచిత్రమైన మరి వింతైన అనుభవాలు! కానీ అవి తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను నిలువనీయకపోయేది! నేను చిన్నప్పటినుంచీ పూజలు, స్తోత్రాలు చేసేవాడిని. కాదు. "దేవుడు" అంటే నాకు ఒక స్నేహితుడిలాగానే తలచేవాడిని. అందరితో కలిసి పండుగ పబ్బాలకు గుడికి వెళ్ళినా .. ఆ పరిసరాలను మాత్రమే ఇష్టపడేవాడిని కానీ గుళ్ళీకి వెళ్ళి కోరికలు కోరడవంటివి చేసేవాడిని కాదు! అలాంటిది ఈ ధ్యానం నన్ను కుదురుగా నిలువనీయక పదే పదే ధ్యానంలో కూర్చోవాలనిపించేది! క్రమక్రమంగా మామయ్య దగ్గర రకరకాల పుస్తకాలు చదువుతూ "థాట్ పవర్" .. "ఆస్ట్రల్ ట్రావెల్" .. "ఏడు శరీరాలు" .. "కుండలినీ" .. "ఆరా" వంటి నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలలోని శాస్త్రీయతను తెలుసుకుని నేను ప్రత్యక్షంగా ఆ అనుభవాలను పొందాను. ముఖ్యంగా "శ్రీ శ్రీ పరమహంస యోగానంద" గారి"ఒక యోగి ఆత్మకథ" నాకు ఆధ్యాత్మికత పట్ల ఎంతటి స్పష్టతను ఇచ్చిందో చెప్పలేను. "భవిష్యత్తులో నువ్వు ఎంతో ధ్యాన ప్రచారం చెయ్యాలి" అని వారు నాకు పదే పదే ధ్యానంలో మార్గదర్శనం చేశారు.

వాణి: "PSSM లోకి ఎలా వచ్చారు?"
హరిగారు: ఈ క్రమంలో ఒకసారి నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు పత్రీజీ విజయవాడ వచ్చారని తెలుసుకున్న మా మామయ్య నన్ను వెంట బెట్టుకుని వారి దగ్గరకు తీసుకెళ్ళారు. "ఈ మధ్య మావాడు తెగ ధ్యానం చేసేస్తూ .. ధ్యానంలో రకరకాల అనుభవాలను పొందేస్తున్నాడు" అని పత్రీజీతో చెప్పారు. "ఔనా!" అంటూ నిశితంగా నావైపు చూస్తూన్న పత్రీజీతో నేను .. నాకు వచ్చిన అనుభవాలన్నీ వివరంగా చెప్పాను. అన్నీ విన్న వారు "వెరీ గుడ్" అనగానే .. "సార్ .. అవన్నీ నిజమేనా?!" అని అడిగాను. అంతే! వారు నన్ను కొట్టినంత పనిచేసి .. "నీకు వచ్చిన అనుభవాలూ ‘నిజమా’ .. ‘కాదా’ అని నేనెందుకు నిర్ధారించాలి? బుద్ధుడు తనకు వచ్చిన అనుభవాలు ‘సరియైనవా కాదా’ అని ఎవ్వరినీ నిర్ధారణ అడుగలేదు. బ్రతికితే అలా బుద్ధుడిలా బ్రతుకు .. లేకపోతే చావు" అని వార్నింగ్ ఇస్తూ .. "దృఢసంకల్పంతో ఒక అభిమన్యుడిలాగా ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు దూసుకు వెళ్ళాలి" అని చెప్పారు. అదే పత్రీజీ దగ్గరనుంచి నాకు వచ్చిన ఖచ్చితమైన .. అద్భుతమైన మరి అద్వితీయమైన సందేశం!! ఇక ఆ తరువాత ఏనాడు నేను నా సాధనలో కానీ .. ధ్యానానుభవాలను పొందడంలో కానీ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ విషయమైనా సరే . .నాకు నేనుగా ధ్యానంలో కూర్చుని ప్రశ్న వేసుకుని ధ్యానంలోనే సమాధానాన్ని పొంది .. ఒక అభిమన్యుడి లాగా ముందుకు దూసుకుపోవడం అలవాటు చేసుకున్నాను. కొన్నాళ్ళకు డిగ్రీ అయిపోయాక .. MCA చేయడం కోసం హైదరాబాద్ వచ్చేశాను.

వాణి: ‘పైమా (PYMA)' కార్యక్రమాలను గురించి?"
హరిగారు: MCA చదువుకుంటూ .. స్కూల్ పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ .. వారికి ధ్యానం నేర్పిస్తూ నేను హైదరాబాద్ .. కొత్తపేటలో ఉంటూ .. మా అత్తయ్య "శ్రీమతి జయలక్ష్మి", మామయ్య "నాగేశ్వరరావు" గార్ల సహకారంతో మా చుట్టుప్రక్కల కాలనీలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాను. ఈ క్రమంలోనే పత్రీజీ ఆశీస్సులతో కూకట్‌పల్లి పిరమిడ్ మాస్టర్స్ రమాదేవి, రాంబాబు గార్ల కుమారుడు "జీవన్" గారి నేతృత్వంలో యువతకు ధ్యానప్రచారం చెయ్యడానికి "Pyramid Young Masters Association"ను స్థాపించడం జరిగింది. "సంపత్, శ్రీ చందన, ప్రదీప్, ప్రబోధ్" ప్రణీత, సౌమ్య, భగవద్గీత, మల్లిక, విఠల్, దీపిక, పింకీ, ప్రాణహిత, పూర్ణ, ధృవ, శివ, స్రవంతి, నవకాంత్, రాజు, శ్రీలక్షి, శ్రీరామ్, చక్రవరి .. ఇంకా మరెంతో మంది యువ బృందంతో PYMA చక్కటి ధ్యానకార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలోని అనేకానేక స్కూళ్ళల్లో, కాలేజీలలో వేలాదిమంది విద్యార్థులకు 11 రోజులు, 40 రోజుల చొప్పున ధ్యానకార్యక్రమాలనూ మరి వ్యక్తిత్వ వికాస తరగతులనూ నిర్వహించేవాళ్ళం. పత్రీజీ ఆధ్వర్యంలో మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాం. ఈ క్రమంలోనే "పైమా మైత్రేయ"అన్న ఒక ద్వైమాసిక మ్యాగజైన్‌ని కూడా రూపొందించడం జరిగింది. విద్యార్థులు మరి యువత యొక్క ధ్యానానుభవాలనూ మరి పత్రీజీ సందేశాలను అందులో ప్రచురించేవాళ్ళం. ఆ తరువాత MCA పూర్తి అయ్యాక ఉద్యోగరీత్యా TCS బెంగళూరుకు వెళ్ళిపోయిన నేను .. అయ్యప్ప, ఉమా మహేష్, చంద్రమోహన్ గార్లతో కలిసి అక్కడ చక్కటి ధ్యాన కార్యక్రమాలను నిర్వహించాం. అప్పుడే ఇక "TCS కంపెనీ" వాళ్ళు నన్ను ప్రాజెక్ట్ పని మీద అమెరికాకు పంపించారు. అక్కద "మినియా పోలిస్"లో ఉంటూ అక్కడి లోకల్ పిరమిడ్ మాస్టర్స్ ధ్యానయుక్త, శాంతిశ్రీ, లోకేష్, జ్యోతి వైట్ల, శ్రీకాంత్ గార్లతో కలిసి ఆన్‌లైన్‌లో "Spritual America" స్కైప్ కార్యక్రమాలను నిర్వహించాం. ఈ క్రమంలోనే "Live in Truth" అన్న ఆన్‌లైన్ మ్యాగజైన్ ద్వారా PSSM కాన్సెప్ట్‌లనూ .. పత్రీజీ సందేశాలనూ మరి వివిధ దేశాలలోని పిరమిడ్ మాస్టర్ల ధ్యానానుభవాలనూ .. అత్యంత శాస్త్రీయంగా అందించేవాళ్ళం. నేను అమెరికాలో ఉన్నప్పుడే పెద్దలందరి అనుమతితో సింగపూర్‌లో ఉద్యోగం చేస్తూన్న హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ "శ్రీలక్ష్మి తిరునగరి"ని ప్రేమవివాహం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత సింగపూర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన నేను మరి శ్రీలక్ష్మి .. అప్పటికే ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడి ఉన్న చందన, శశిధర్ రెడ్ది మరి సతీష్ గార్లతో కలిసి వారాంతాలలో ధ్యానకార్యక్రమాలను నిర్వహించాం. అప్పుడు పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన మెగా కార్యక్రమాలలో జ్యూడీ సటోరీ .. జాస్ముహీన్ .. ఇలోనా సిల్కీ .. నీనా బ్రౌన్ వంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను మేము కలవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆస్ట్రేలియా దేశానికి వలస వెళ్ళి .. ఉద్యోగాలు చేసుకుంటూ మెల్‌బోర్న్ నగరంలో స్థిరపడ్డాం. మాకు ఒక అమ్మాయి "లౌక్యమాధురి". ప్రస్తుతం మేము మెల్‌బోర్న్‌లోనే "ధ్యానమందిరంతో కూడిన ముచ్చటయిన ఇల్లు" కట్టుకుని ప్రతి పౌర్ణమికి చక్కటి ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పత్రీజీ మెల్‌బోర్న్‌కు వచ్చినప్పుడు వారితో కలిసి మెల్‌బోర్న్‌లో స్థానిక "సాయిబాబా ఆలయం"లో మరి "కన్నడ సంఘ్"లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. పిరమిడ్ గ్రాండ్ మాస్టర్స్ శ్రీమతి సరోజ గుళ్ళపల్లి, శ్రీ హరీష్ గుళ్ళపల్లి గార్లు మెల్‌బోర్న్‌లో మాకు ఇస్తోన్న సహకారం ఎంతో గొప్పది!

వాణి: "ఇంకా మీరు చేస్తోన్న ధ్యాన కార్యక్రమ వివరాలు ..?"
హరి గారు: ఈ మధ్యకాలంలో "వరల్డ్ యునైటెడ్" వ్యవస్థాపకులు డా||యుగంధర్ గారి సహకారంతో మేమంతా మెల్‌బోర్న్‌లోనే స్థిరపడిన "కృష్ణా రెడ్డి" అనే యువ పిరమిడ్ మాస్టర్స్‌తో కలిసి "Breath Universe" కార్యక్రమాన్ని ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్నాం. అత్యంత శాస్త్రీయంగా, ప్రయోగత్మకంగా మరి అంతర్జాతీయంగా నిర్వహిస్తూన్న ఈ కార్యక్రమంలో ఆచరణాత్మక ఆధ్యాత్మిక సూత్రాల యొక్క ధ్యానానుభవాలను అన్ని దేశాల వాళ్ళూ పరస్పరం పంచుకోవడం జరుగుతోంది. మొదటి విడతగా 2017, మే 8 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు వారం రోజులపాటు ఆన్‌లైన్‌ లో నిర్వహించబడిన ఈ సదస్సులో బ్రహ్మర్షి పత్రీజీ - "Science of Meditation" గురించి తమ సందేశాన్ని అందించారు. ఆస్ట్రేలియా నుంచి జాస్మూహీన్ గారు - "Breath & Prana"; అంజెలా ఓఖేల్ట్రీ - "Power of Sub concious mind & Mindful Breathing", సరోజ గుళ్ళపల్లి మరి నిఖిల్ గుళ్ళపల్లి - "SPiritual Parenting"; డారెల్ డిసౌజా - "Mindful Eating"; భారతదేశం నుంచి డా|| యుగంధర్ "Transforming Our Breath as a Vehicle to go Within"; డా|| కవితా చంద్రశేఖర్, పార్థ, నిత్యశాంతి, రష్మీ మీనన్ గార్లు - "Benefits of Meditation" గురించి ఈ కార్యక్రమంలో అత్యంత శాస్త్రీయంగా వివరించారు.

వాణి: "లేహ్ - లడఖ్ లో జరిగిన ధ్యాన కార్యక్రమంలో మీ అనుభవాలు..?"
హరి గారు: మొదటి నుంచీ నాకు "హిమాలయ ట్రెక్కింగ్ వెళ్ళాలి" అన్న ఒక కల ఉండేది. లేహ్-లడఖ్ యాత్ర గురించి విన్నాక .. ఇక వెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఇండియా చేరుకున్నాను. 2017 జూన్ 7వ తేదీన లడఖ్ "మహాబోధి ఇంటర్నేషనల్ సెంటర్" చేరుకుని భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పిరమిడ్ ధ్యానులనూ మరి పత్రీజీనీ కలుసుకున్నాను. ఎటుచూసినా మంచుకొండలతో ఆ ఉత్తుంగ హిమాలయాలలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూన్నా కూడా ఆ ప్రదేశం సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తున ఉండడంతో నాకు తీవ్రమైన తలపోటు వచ్చింది. మూడవ రోజుకు ఆ భరించలేని తలపోటు మరీ ఎక్కువ కావడంతో ఇక నేన్ రూ‌మ్‌లోనే విశ్రాంతిగా ఉండిపోయాను. మర్నాడు ఉదయం హిమాలయాలలోని ఎత్తయిన .. అంటే సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న "Pangong Lake" దగ్గరికి వెళ్ళాల్సి ఉండడంతో స్నానంచేసి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడానికి గది బయటికి వచ్చాను. దూరంగా ఒక క్యాంటీన్ దగ్గర ఉన్న పత్రీజీ నన్ను తమ దగ్గరికి పిలుచుకుని .. తాము గతంలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళినప్పుడు పొందిన "మరణ సామీప్య ప్రత్యక్ష అనుభవం (Near Death Experience)" గురించి చెప్పారు. వారు చెబుతూన్న విషయాలను ఆసక్తిగా వింటూన్న సడన్‌గా "నువ్వు కూడా ఇప్పుడు ఆ అనుభవాన్ని పొందు" అన్నారు! అంతకు ముందురోజే MIMC జరిగిన ధ్యాన శిక్షణా తరగతిలో పత్రీజీ "స్వేచ్ఛాయుత ఎంపికలు - స్వేచ్ఛాయుత కాంక్ష - Free - will" ల గురించి చెప్పి ఉండడంతో నేను వెంటనే "నా Free-will ప్రకారం నేను చనిపోవాలని అనుకోవడం లేదు సార్" అన్నాను. అయినా వారు వదలకుండా "ఈ హిమాలయాలలో చనిపో .. బాగుంటుంది" అన్నారు. "ఇక ఆ సంభాషణకు ఒక ఫుల్‌స్టాప్ పెట్టేద్దాం" అన్న ఉద్దేశ్యంతో నవ్వుతూ "సరే సార్" అన్నాను. ఇక వెంటనే పత్రీజీ అక్కడ ఉన్న అందరితో "ఈ రోజు హరి హిమాలయాలలో చనిపోతున్నాడు" అని చెప్పడం మొదలుపెట్టారు. ఇక నాలో అంతర్మధనం మొదలయ్యింది! "చావు అంటే భయం అని కాదు కానీ .. ఒక స్థిర మనస్సుతో నా పని ఈ భూమి మీద ఉన్నంత కాలం ఉంటాను; ఒకవేళ పని అయిపోయినా కూడా ఇంకా ఉండాలనుకుంటే నా Free-will ని ఉపయోగించుకుని ఇంకా ఎంతకాలమైనా ఉండగలుగుతాను. కనుక నియర్ డెత్ అనుభవానికి నేను ఓకే .. కానీ చావడానికి కాదు" అని స్పష్టమైన సంకల్పం చేసుకున్నాను.

వెంటనే సార్‌తో "మీరు అంటూన్నట్లుగా .. ఒకవేళ నేను ‘ఇక్కడ ఈ హిమాలయాలలో చావాలి’ అని నా పపటి Free-will ప్రకారం నా విధిలో వ్రాసుకుని ఉన్నా .. నా ఇప్పటి Free-will - ప్రకారం నా విధివ్రాతను కూడా మళ్ళీ మార్చుకుంటున్నాను" అని చెప్పాను. "సరే .. ఏం జరుగుతుందో చూద్దాం" అన్నారు పత్రీజీ ! కొద్దిసేపటి తరువాత "Pangong Lake" కి మా ప్రయాణం మొదలయ్యింది. పావన హిమాలయాల ఒడిలో అందంగా ఒదిగిపోయి ఉన్న ప్రకృతి దృశ్యాలకు పరవశించిపోతూ మేము అత్యంత ఎత్తయిన ఆ ప్రదేశానికి చేరుకున్నాం. ఆ ప్రశాంత వాతావరణంలో ఆ సరస్సు ఒడ్డున చక్కగా ధ్యానం చేసుకుని ఆ రాత్రి అక్కడే నిద్రపోయాం. మర్నాడు ఉదయమే లేహ్ - మహాబోధికి తిరుగు ప్రయాణం అవుతూండగా పత్రీజీ నన్ను చూస్తూ "నువ్వు ఇంకా చావలేదా?" అన్నారు ఆశ్చర్యంగా! "లేదు సార్! నా Free - will ప్రకారం నేను ఇంకా చాలా చాలా సంవత్సరాలు జీవించి ఉంటాను" అంటూ నా నిర్ణయాన్ని మరింత ఖచ్చితంగా చెప్పాను. "వెరీ గుడ్ .. చూద్దాం" అంటూ కారులో పత్రీజీ వెళ్ళిపోయారు.

బస్సులో మా తిరుగు ప్రయాణం మొదలయ్యింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఉన్న "Change La Pass" అనే ప్రదేశానికి చేరుకోగానే అప్పటివరకు చాలా సౌకర్యవంతంగా సీట్‍లో కూర్చున్న నాలో శ్వాస మెల్లిమెల్లిగా ఆగిపోవడం మొదలయ్యింది. హృదయస్పందనలు తగ్గిపొతూండడం నాకు అర్థం అవుతోంది. నా శరీరంలోని ప్రతి ఒక్క కణం తన బరువును కోల్పోతున్న ఫీలింగ్ .. శరీరమంతా తేలికగా అయిపోతోంది! ఎంత ప్రయత్నం చేసినా శ్వాసను పీల్చుకోవడానికి సాధ్యం కావడం లేదు. మెల్లిమెల్లిగా నా భౌతిక దేహంలోంచి నేను బయటికి వచ్చేస్తున్నాను. శ్వాస లేదు, హృదయస్పందన లేదు! అది ఖచ్చితంగా మరణం. అంతే! అలా పదిహేను నిమిషాలపాటు సీట్‌లో నేను అచేతనంగా ఉండిపోయాను. సడన్‌గా నా అంతశ్చేతనా మనస్సును నా Free - will హెచ్చరించినట్లు .. కర్ఫూరం బిళ్ళలతో ఉన్న నా కుడిచేయి అసంకల్పితంగా .. తనంత తాను .. నా ముక్కు దగ్గరికి వచ్చింది! ఆ ప్రయత్నంలోనే ఒక దీర్ఘస్వాసతో నేను మళ్ళీ నా శరీరంలోకి వచ్చేయడం నిశ్శబ్దంగా, చాలా అద్భుతంగా జరిగింది! వెంట వెంటనే కొన్ని శ్వాసలు తీసుకున్న నేను గాఢధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోయాను! ఇక లేహ్ మహాబోధికి తిరిగి వచ్చేవరకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను! తిరిగి వస్తూనే పత్రీజీ దగ్గరికి వెళ్ళి .. "నేను చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాను సర్!" అని చెప్పాను. పత్రీజీ వెంటనే నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి .. నన్ను దగ్గరికి తీసుకుని "ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జీవించి ఉన్నప్పుడే ఈ మరణాంతర జీవితపు అనుభవాన్ని పొందాలి" అన్నారు. అలా Free - will యొక్క గొప్పతనాన్ని ముందే నాకు తెలియజేసి .. నేను ఒక గొప్ప అనుభవాన్ని పొందేలా నాకు మార్గదర్శనం చేసిన గురువు పత్రీజీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మరింత శక్తిని పుంజుకున్న "ఆధ్యాత్మిక యోద్ధుడి"లా మున్ముందు మరిన్ని ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తాను! ఇంత గొప్ప కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కోల్‌కత్తా పిరమిడ్ మాస్టర్ "సమిత మేడమ్"గారికి ధన్యవాదాలు.

వాణి: "చక్కటి ఆధ్యాత్మిక నేపథ్యంతో విజయవంతంగా జీవిస్తోన్న మీరు .. ముఖ్యంగా యువతకు ఏం చెబుతారు?"
హరి గారు: మన జీవితానికి మనమే సృష్టికర్తలం. చరాచర సృష్టి అంతా కూడా మనలాగే ఆ దైవత్వపు ప్రత్యక్ష వ్యక్తీకరణే!

1. ప్రతి ఒక్క జీవితాన్నీ మనం గౌరవించాలి; సాటి జీవిని చంపి తినడం అన్నది ఘోరాతిఘోరమైన నేరం.
2. ఏదీ సమస్య కాదు. ప్రతి ఒక్కటీ అవగాహనే! సరియైన అవగాహన పొందదం వల్ల .. మనం "సమస్య" అనుకుంటున్నది మనల్నిఎదిగించే ఒక క్రొత్త అవకాశంలా అర్థం చేసుకోగలం.
3. ఈ సువిశాల విశ్వంలో ప్రతి ఒక్కటీ శక్తిస్వరూపమే! మన ఆలోచనా, మన మాటా, మన చేష్టా అన్నీ కూడా శక్తిరూపాంతరాలే కనుక మనం ఎంత ధ్యానపూర్వకంగా ఉంటే మరి ఎంత సృజనాత్మకంగా ఉంటే .. అంత శక్తివంతంగా మారుతూంటాం.
4. ప్రేమ తప్ప ఈ ప్రపంచాన్ని రక్షించే గొప్ప ఆయుధం ఇంకొకటి లేదు కనుక షరతులు లేని ప్రేమతో ఉందాం .. విశ్వప్రేమను తిరిగి అందుకుందాం! చక్కటి స్వాధ్యాయం మానవ జీవితానికి తప్పనిసరి; కనుక నవీన ఆధ్యాత్మిక విజ్ఞాన గ్రంధాలను ప్రతి ఒక్కరూ చదివి తీరాలి. ప్రస్తుతం ఆన్‌లైన్ లో ఇవి చక్కగా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవడం చాలా చాలా అవసరం.

 

హరిరాధాకృష్ణ పుప్పాల


మెల్‌బోర్న్ - ఆస్ట్రేలియా దేశం

- 0061 - 449256993.

Go to top