" దివ్యమైన కాంతి శరీరాలు"

 

నా పేరు "వాణి". వృత్తిరీత్యా నేను గవర్నమెంట్ స్కూల్‌లో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయురాలిని. నేను 2011 మార్చి 1వ తారీఖున నడుమునొప్పి కారణంగా పిరమిడ్ ధ్యానాన్ని మొదలుపెట్టాను. 40 రోజులలో నా శరీరం నడుమునొప్పి నుంచి పూర్తి స్వస్థత పొందడంతో నాకు ధ్యానం పట్ల అపార నమ్మకం ఏర్పడింది!

అప్పటినుంచి నేను పత్రీజీ గారి సలహా తీసుకుని నా పాఠశాల విద్యార్థులకు ధ్యానం, ఆత్మజ్ఞానం బోధిస్తున్నాను. అంతేకాకుండా మా చుట్టుప్రక్కల ఉన్న ధ్యాన కేంద్రాలల్లో, పాఠశాలల్లో, గ్రామాలల్లో ధ్యానం నేర్పిస్తూ .. నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ .. జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను!

ఇంతలో 2012 జూలై 7వ తారీఖున సాయంత్రం 4.00 గం||లకు పెద్ద వర్షం పడింది. 5.00 గం||లకు ఆకాశం అంతా వర్ణరంజితమైంది. బ్యాక్‌గ్రౌండ్ దృశ్యం కోసం మా పాపను ఫోటో తియ్యమన్నాను. డిస్‌ప్లే చేయగానే నా ప్రక్కన "ఒక దివ్యమైన కాంతి శరీరం" కన్పించింది. కొన్ని పుస్తకాలలో చదివిన జ్ఞానం ఆధారంగా "ఒక గొప్ప ఆస్ట్రల్‌మాస్టర్" వచ్చారని గ్రహించి, మళ్ళీ వెంటనే ఒక ఫోటో తీయమన్నాను.

అందులో కూడా మళ్ళీ " ఓ కాంతిలోకవాసి" కొద్ది దూరంగా వచ్చారు. మూడవ ఫోటోలో ఇంకా దూరంగా కనపడ్డారు!

ఆ తరువాత ఎన్ని ఫోటోలు తీసినా కన్పించలేదు. నేను ధ్యానంలో ఉన్నప్పుడు చాలారోజులు "నాకు ఎందుకు దర్శనమిచ్చారు?" అని ఆ కాంతిలోక వాసిని అడుగుతూ ఉండేదానిని. బహుశా నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేయడానికి వచ్చారని అనుకునే దానిని; ప్రతిరోజూ నేను ధ్యానం చేస్తాను.

మే 15, 2017 న నాకు హఠాత్తుగా శరీరమంతా వాపు వచ్చి ఒళ్ళంతా నీరుపట్టి మూడు కిలోలు బరువు పెరిగి నడవడం కూడా కష్టమైపోయింది. డాక్టరు సలహాతో కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టరు దగ్గరకు వెళ్ళాను. అక్కడ పరిక్షలలో కిడ్నీ(మూత్రపిండం) నుంచి చిన్నముక్క తీసి పరీక్ష చేశారు: "కిడ్నీల నుంచి ప్రోటీన్ పోయి వాటి పనితీరు పాడయింది" అన్నారు. నేను దాదాపు అపస్మారకంలోకి వెళ్ళిపోయాను. మెడిసిన్స్ ఇచ్చి వాడమని డాక్టర్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.

"నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నేను సరియైన దారిలోనే ఉన్నాను కదా!" అని గురువు గారికి ఫోన్ చేసి "నాకింకా ఈ భూమి మీద మీ ప్రణాళికలో మీతో 100% పని చేయాలని ఉంది" అని చెప్పాను.

సార్ నాతో "మంచి కర్మ చేయాలి; మరి గతంలో చేసిన చెడు కర్మ ఫలితాలను, పరిణామాలనూ విధిగా అనుభవించాలి కూడా! అయితే, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ‘సత్యం’ అనుకున్న దానిని విధిగా చెపుతూనే ఉండాలి; కర్తవ్యకర్మలను విధిగా చేస్తూనే ఉండాలి. మరి ఏది జరిగినా, ఏది జరగకపోయినా దేనికీ భయపడనక్కర లేదు; అభయం ఉండాలి" అని ధైర్యం చెప్పారు.

ఆ ధైర్య వచనాలతో నేను నా శరీరం కొంచెం సహకరిస్తూంటే ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పెట్టుకుని రోజూ రాత్రి 5 గంటలు ధ్యానం చేస్తూ వచ్చాను. 15 రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళాను. మూత్ర పరీక్షలో తేలిన విషయం ప్రొటీన్ పోవడం పూర్తిగా తగ్గిపోయింది. పరీక్షలు చేయగా "నార్మల్" అని తెలిసింది.

ఇదంతా కేవలం ధ్యానం వల్లనే సాధ్యమయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితులలో "నా ఆత్మబంధువులు" అందరూ నాకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. ఏంజెల్స్ సహాయం అడిగినంతనే వారు నాకు హీలింగ్ చేశారు. నా ‘పూర్వజన్మల సుకృతాల’ వల్ల ఈ జన్మలో నాకు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు గురువుగా లభించడం వలన నాకు ఈ జన్మలోనే తిరుగులేని పునర్జన్మ లభించింది!

గురుదేవులకు వేల వేల నమస్కారాలు మరి కృతజ్ఞతలు. క్లిష్ట సమయంలో నా వెన్నంటే ఉండి నాకు మనోధైర్యాన్ని హీలింగ్ ఎనర్జీని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను ఈ సంఘటనతో ఆధ్యాత్మిక పునరుజ్జీవాన్ని పొందాను.

నా చివరి శ్వాస వరకు భూమి మరి విశ్వాల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేస్తాను. ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తూ నాకు తెలిసిన ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ "తోటి ఆత్మల" ఆధ్యాత్మిక ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.

 

K. వాణి

రామగుండం-కరీంనగర్ జిల్లా
9848758415

Go to top