"నా మరణాన్ని చూసుకున్నాను"

 

నా పేరు "సునీత". నేను జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో టైపిస్టుగా విధులను నిర్వహిస్తున్నాను. నా తల్లిదండ్రులు "కీ.శే. డాక్టర్ మాధవరెడ్డి" మరి "శ్రీమతి ఆదినారాయణమ్మ" గార్లు. నా చిన్నతనంలో అనగా 8 సం||ల వయస్సులో పుట్టపర్తి "శ్రీ సత్యసాయిబాబా"గారిని దర్శించుకోవడంతో నాలో ఆధ్యాత్మిక బీజాలు నాటబడి బాబా గారి రచనలను చదవడం జరిగింది.

2002వ సంవత్సరంలో మా నాన్నగారి అనారోగ్యం కారణంగా నేను తీవ్రమైన మానసిక వేదనలో ఉన్న సమయంలో గురుదేవులు బ్రహ్మర్షి పత్రిగారితో పరిచయం కలిగింది. ఆ సమయంలో కడపలో మూడు రోజులపాటు TTD కళ్యాణమండపంలో ధ్యాన కార్యక్రమాలకు హాజరు అవడం, గురుదేవుల సాంగత్యంలో ప్రాతఃకాల ధ్యానం మూడు గంటలపాటు కూర్చోవడంతోపాటు కొన్ని ప్రకృతి దృశ్యాలను నేను చూడటం జరిగింది.

ఈ విధంగా గురువుగారి దివ్యబోధనలతోపాటు, ధ్యానం .. పుస్తక పఠనం .. సజ్జన సాంగత్యాల వలన నా జీవితం నేను ఊహించిన దానికంటే ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా సాగిపోతున్నది. కానీ ఇటీవలి కాలంలో కొంత నాలో కల్గిన విరక్తి భావలతో నాలో మానసిక అందోళన కల్గింది. "ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఎంత వరకు సాధించాను అని నేను స్వయంగా తెలుసుకోవాలంటే ఎలా?" అని నాలో ఒక అంతర్మధనం ఏర్పడింది. నా వ్యక్తిగత జీవితం నుంచి, నా అంగవైకల్యం వల్ల కలిగే ఇబ్బంది .. తద్వారా అనేకమంది వ్యక్తుల మాటల నుంచి .. ప్రకృతి నుంచి ఎక్కువగా పాఠాలను గ్రహించి సాధారణంగానే నేను కేవలం ‘తామరాకు మీద నీటి బిందువులాగా’ జీవించాలని, పత్రిగారు ఎక్కువగా బోధించే `Attachment - Detachment' అన్న విషయంపై నేను ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాను. "అన్నింటినీ చవిచూడాలి, కానీ ఏ బంధంలోనూ కూరుకు పోరాదన్నది" నా ప్రధానమైన ఆలోచన.

అంతేకాకుండా "ఆఖరు శ్వాస విడిచిన మరుక్షణం నుంచి నన్ను ఎంతో అభిమానించే నా కుటుంబ సభ్యులతో సైతం నాకు ఎటువంటి సంబంధం ఉండదు" అనీ, "వారందరూ ఈ భూమిపై నాకు సహాయపడటానికి కేవలం నా స్వ‌ఇచ్ఛతో ఈ జీవతమనే నాటకంలో నేను ఎంచుకున్న పాత్రధారులు" అనీ ధ్యానంలో ప్రవేశించిన తొలి రోజుల్లోనే నేను తెలుసుకున్నాను.

ముఖ్యంగా ఎన్నో విపత్కర పరిస్థితులలో, నాకు ధ్యానంలో మరి నాకు అనుక్షణం నన్ను వెన్నంటి ఉండే నా గైడ్ ఆస్ట్రల్ మాస్టర్ "శ్రీ షిరిడీ సాయినాధునికి" శతకోటి వందనాలు! పై విధమైన భావాలతో ఉన్న నేను మే నెల 20వ తేదీ రాత్రి భోజనం తర్వాత రెండు నిమిషాల ముఫ్పై సెకండ్ల సేపు ధ్యానం చేసి ఆ తరువాత ప్రశాంతంగా నిద్రపోయాను.

ఆ నిద్రలో ఒక "కల". నన్ను చికిత్స నిమిత్తం ఒక ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ నేరుగా ఆపరేషన్ ధియేటర్‌లోకి డాక్టర్లు తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ ఎక్విప్‌మెంట్‌ను చూసి నేను డాక్టరుతో "వాటిని చూస్తే నాకు భయంగా ఉంది" అని చెప్పాను. దానికి డాక్టర్ చిరునవ్వుతో "ఏమీ పర్వాలేదు, నీకు ఆపరేషన్ చేస్తాం" అని నాతో చాలా స్పష్టంగా చెప్పాడు.

నా నిజజీవితంలో .. అంటే 1982వ సంవత్సరంలో .. నాకు ఒక ఆపరేషన్ జరిగింది. కానీ ఆ సమయంలో నాకు అనస్తీషియా ఇవ్వడం, అందులోని ఈధర్‌కు నా అల్లర్జీ వచ్చి తీవ్రమైన ఆయాసంతో చాలా బాధపడ్డాను.

కానీ అక్కడ ఉన్న పేషంట్‌లలో ఎవ్వరికీ రాని ఈ సమస్య నాకు రావడంతో సహజంగానే వైద్యుడైన నా తండ్రి డాక్టర్లను సంప్రదించినప్పుడు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే ఈ అమ్మాయికి ఈథర్‌కు అలర్జీ వచ్చినట్లుగా ఉంది, అందువల్ల భవిష్యత్తులో ఏదైనా ఆపరేషన్ చేయించాల్సి వస్తే తప్పకుండా అక్కడ డాక్టర్లకు తెలియజేయాలని చెప్పారు. ఆ విషయాన్ని నేను కలలో సైతం ఆ వైద్యులకు తెలియజేశాను.

కానీ వారు "ఏమీ కాదులే .. కొందరికి అలా జరుగుతుంది; అంతే! ఇక నీకు ఆపరేషన్ చేయాలి" అన్నారు. మత్తుమందు ఇవ్వడానికి ఒక మాస్క్‌ను నా ముక్కుకు అమర్చడం నేను పూర్తిగా స్మృతి కోల్పోతున్న సమయంలో సమయంలో యాధాలాపంగా పైకి చూసిన నాకు ముగ్గురు ఆస్ట్రల్ మాస్టర్స్ బంగారు వర్ణంతో, చిరునవ్వులు చిందిస్తూ నాకేసి చూస్తూండటం ఎంతో స్పష్టంగా గమనించాను!

ఆ తర్వాత కొద్ది క్షణాలకే నా భౌతిక శరీరం నుంచి నేను విడివడటం నేను గమనించాను. శరీరం నుంచి బయటకు వచ్చిన నేను ఒకలాంటి విజయగర్వంతో నా మృతదేహాన్ని చూసుకోవడం జరిగింది!

కానీ ఆ వైద్యులు మాత్రం తీవ్ర ఆందోళనతో "ఏం జరిగింది? కేవలం మనం మత్తు మాత్రమే ఇచ్చాం. ఏమిటి ఈ అమ్మాయి ఇంత సులభంగా మరణించింది?" అనుకుంటూ వారిలో వారు చర్చించుకోవడం నేను స్పష్టంగా వినడం జరిగింది. అంతేగాక ఉన్నతలోకవాసులైన మాస్టర్లు "నిన్ను బ్రతికించడానికి డాక్టర్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు చూడు" అని నాకేసి చూస్తూ చెప్పడం, దానికి సమాధానంగా "ఇంక ఆ సమయం దాటిపోయింది; ఎవ్వరూ ఏమీ చేయలేరు" అని ఆ మాస్టర్లతో నేను సమాధానం చెప్పాను!

మరొక్కసారి ఎంతో తృప్తిగా నా మృతదేహాన్ని నేను చూసుకున్నాను. అప్పుడు "నాకు యుద్ధరంగంలో అలసిపోయి మరణించిన వీర జవాన్" లాగా నా మృతదేహం నాకు కనిపించింది. ఆ సమయంలో ఆస్ట్రల్ మాస్టర్లు "ఇంకా ఇక్కడ ఉండాలని నీకు ఉంటే ఉండు" అని నాతో చెప్పడం దానికి సమాధానంగా నేను" ఇంకా ఇక్కడ ఉండాలని నాకు లేదు; మీతో వస్తాను" అని చెప్పాను. దానికి వారు సంతోషంతో షేక్‌హ్యాండ్ ఇవ్వడం జరిగింది.

అంతలో మళ్ళీ తిరిగి "భూమిపై ఇంకా ఏవైనా చూడాలని ఉందా?" అని మళ్ళీ వెంటనే "ఎవరినైనా కలవాలని ఉందా?" అని అడగడం జరిగింది "ఈ భూమిపైన ఎవ్వరినీ చూడాలని కానీ, కలవాలని కానీ నాకు లేదు" అని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తెలియజెప్పేసరికి ఆస్ట్రల్ మాస్టర్లు సంతృప్తిగా నన్ను వారితో తీసుకుని వెళ్ళడం జరిగింది.

అంతలో ఒక చిన్నపాటి కుదుపుతో నా శరీరం లోనికి నేను తిరిగి ప్రవేశించడం జరిగింది. ఆస్ట్రల్ మాస్టర్లు నాకు పరీక్ష పెట్టారనీ, అందులో నేను ఉత్తీర్ణత సాధించాననీ అర్థం చేసుకున్నాను! తుది శ్వాస ఉన్నంతవరకు నన్ను విశ్వకళ్యాణంలో భాగస్వామిగా చేస్తూ, నన్ను ఒక పనిముట్టుగా వాడుకోవాల్సిందిగా ఉన్నతలోకవాసులను నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను.

ఈ ధ్యానవిద్యను నాకు బోధించి నన్ను నేను ఒక ఉన్నత ఆత్మగా తీర్చిదిద్దుకోవడానికి సహాయపడిన నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రీజీ గారికి కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు!

 

G. సునీత 

కడప

Go to top