"మన వాస్తవాలకు మనమే కారకులం"

 

కర్నూలు జిల్లా "నందవరం" గ్రామంలో "పత్రీజీ డ్రీమ్ ప్రాజెక్ట్" .. "సదానంద సద్గురు తపోవనం" మేనేజింగ్ డైరెక్టర్ అయిన తాడిపత్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్ "M.రంగనాధ రెడ్డి" గారు .. ధ్యానం ధ్యాన ప్రచారం ద్వారా PSSM లో తమదైన ముఖ్య భూమికను పోషిస్తూ ఉన్నారు. చక్కటి క్రమశిక్షణ, కార్యదీక్షాదక్షతలను కలిగి ఉన్న రంగనాధ రెడ్డి గారు "ఇన్నర్ వ్యూ" ద్వారా తమ ధ్యాన జీవిత అనుభవాలనూ మరి నందవరం పిరమిడ్ ఆశ్రమ విశేషాలనూ "ధ్యాన జగత్" తో పంచుకున్నారు. ఈ ఇన్నర్‌వ్యూలో సహకరించిన తాడిపత్రి పిరమిడ్ మాస్టర్ "ధ్యాన విద్యార్థి" C. ఆనంద్ కుమార్ గారికి కృతజ్ఞతలు.


-ఎడిటర్


ఆనంద్‍కుమార్: "నమస్తే అన్నా! ‘ధ్యాన జగత్’ ద్వారా మీ గురించి తెలుసుకోగోరుతున్నాం!"
రంగనాధ రెడ్డిగారు: నేను 1965 ఆగస్ట్ 15వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం "బండార్ల పల్లె" గ్రామంలో "మారంరెడ్డి భాస్కర్‌రెడ్డీ", "కమలమ్మ" దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించాను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు.

మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఆ ఊళ్ళో పెద్ద భూస్వామి అయిన మా తాతగారు .. "పెద్దిరెడ్డి" గారే మా కుటుంబ వ్యవహారాలన్నీ నడిపేవారు. దాదాపు 300 ఎకరాల భూమి మా సాగుబడిలో ఉండేది. వచ్చిపోయే జనాలు, జీతగాళ్ళతో మా ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. దాని తోడు ఊళ్ళో తగాదాలూ మరి భూ పంచాయతీలతో మా తాతగారు ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. దాంతో అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో అందరం ఉండేవాళ్ళం.

ఇటువంటి కుటుంబ నేపధ్యంలో పెరిగిన నాకు అసలు "ప్రశాంతత" అన్న పదం ఒకటి ఉంటుందని కూడా తెలియక పోయేది!

చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ చదువు వరకు మా అమ్మ దగ్గర కాకుండా మా నాన్నమ్మ మరి మేనత్తల దగ్గరే పెరగడం జరిగింది. ఆ తరువాత తాడిపత్రిలో డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ పూర్తయ్యాక నా మిత్రుడు K.శ్రీనివాసరావు సహకారంతో "ఉరవకొండ" లో ఒక ట్యుటోరియల్ కాలేజీని స్థాపించాం.

వ్యాపారం బాగానే సాగుతూన్న సమయంలో .. మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో ఇంటికి పెద్ద కొడుకునయిన నేను పొలం వ్యవహారాలు చూసుకోవడానికి ఉరవకొండ వదిలేసి మళ్ళీ మా ఊరు చేరుకున్నాను.

ఈ క్రమంలోనే తాడిపత్రికి చెందిన పారిశ్రామికవేత్త అయిన మా మామయ్య "సంజీవరెడ్డి" గారి కుమార్తె "కృష్ణవేణి" తో 1990 ఆగస్ట్ 15 వ తేదీన నా వివాహం జరిగింది. అప్పటినుంచీ వారి వ్యాపార లావాదేవీలను కూడా నేనే చూసుకుంటూ తాడిపత్రిలో స్థిరపడి పోయాను.

ఆనంద్‌కుమార్: "ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎలా ప్రవేశించారు?"
రంగనాధ రెడ్డి గారు: చిన్నప్పటినుంచీ నేను ఆంజనేయస్వామికి వీరభక్తుడిని. తెగ పూజలు చేసేస్తూ .. రోజుకు ఎన్నోసార్లు భూదేవికి మ్రొక్కేవాడిని. మా అమ్మ చాలా మంచిది! తన సహాయం కోరి వచ్చినవారు ఎవ్వరయినా సరే .. ఎంతమందికయినా సరే కాదనుకుండా ఎంతోకొంత సహాయం చేసేది. అసలు ఆమె "నో" చెప్పడం నేను చూడలేదు! అటువంటి మా అమ్మ క్యాన్సర్ జబ్బుకు గురి అయ్యి ఆరు నెలలపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి చనిపోయింది. దాంతో నాకు దేవుడిపై నమ్మకం పోయింది.

"అసలు దేవుడనే వాడు ఉంటే ఇంత మంచి మనిషిని అలా నరకయాతన పెడతాడా?" అని కోపంతో దేవుళ్ళందరినీ దూషిస్తూ ఇంట్లో పటాలన్నీ విసిరివేసి పూర్తి నాస్తికుడిలా మారిపోయాను. అలా అమ్మ చనిపోయిన వేదనలో ఉన్న నాకు 1998లో నా మిత్రుడు "సుబ్బారెడ్డి" గారి ద్వారా పిరమిడ్ ధ్యాన పరిచయం జరిగింది.

"మనమే దేవుళ్ళం" .. "మనమే సృష్టికర్తలం" .. "మన వాస్తవాలకు మనమే కారకులం" అన్న శక్తివంతమైన పత్రీజీ సందేశాలు నన్ను ఆలోచింపజేశాయి. ఇవన్నీ కూడా నాకు క్రొత్త విషయాలు! "ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది; కోపతాపాలన్నీ అదుపులో ఉంటాయి" అని ధ్యానులు తమ అనుభవాలను చెబుతూంటే విని ఆశ్చర్యపోయేవాడిని. ఈ క్రమంలోనే నేను ఒక చిలిపి పని చేశాను!

మన శాస్త్రాలు .. గురువులు గురించి "శాంత గంభీరమూర్తులుగా మరి అరిషడ్వర్గాలకు అతీతంగా ఉంటారు" అని చెబుతూండటంతో "అయితే ఈ పిరమిడ్ గురువు పత్రీజీ ఎలా ఉంటారో చూద్దాం" అని నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ధర్మవరంలో జరిగిన ఒకానొక ధ్యానసభలో వారికి పరీక్ష పెట్టాను!

ఆనంద్‌కుమార్: "పత్రీజీకి పరీక్షా?!"
రంగనాధ రెడ్డి గారు : అవును! జనాలందరి మధ్యలో ఉన్న వారి వెనుకగా వెళ్ళి .. వారి తలపైన గట్టిగా ఒక్క దెబ్బ వేశాను! "ఒకవేళ కోపం వచ్చిందా .. ఇక ఆయన సరి అయిన గురువు కాజాలరు" అనుకున్నాను.

సడె‌న్‌గా నేను కొట్టిన దెబ్బకి పత్రీజీ వెనక్కి తిరిగి .. అంతమందిలో కూడా నన్ను గుర్తుపెట్టి .. నా కళ్ళల్లోకి నిశితంగా చూసి .. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు!

నాకు నోట మాట రాలేదు!

నా మనస్సును చదివేసి .. నాకు నచ్చినట్లుగా ప్రతిస్పందించిన నా గురువు .. తమ మహామౌనంతోనే నన్ను ప్రేమగా తమ పరిధిలోకి అనుమతించినట్లు నేను ఆత్మీయ అనుభూతి చెందాను! "వీరే నా గురువు; జీవితంలో వీరు ఏది చెబితే అది చేసెయ్యాలి" అని ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను. ఇక అప్పటినుంచీ సార్ మాటే నాకు వేదవాక్కుగా మరి ధ్యానం ధ్యాన ప్రచారమే నా జీవితంగా అయిపోయింది.

ఆనంద్ కుమార్: "మీరు చేసిన ధ్యాన ప్రచార విశేషాలు .."
రంగనాధరెడ్డిగారు: 2003సం||లో అనంతపురం పట్టణంలో మేము మూడు వేలమందితో పత్రీజీ సమక్షంలో ఒక భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైన సభ అది! ఇలా PSSM లో జరిగే ప్రతి పనికీ అందరికంటే ముందు ఉన్నాం!

2004 సంవత్సరంలో పత్రీజీ "ధ్యానాంధ్రప్రదేశ్" లక్ష్యంగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

"పత్రీజీ అంత గొప్ప గురువు తమ పరిధిలో అంత గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే .. మనం కూడా మన పరిధిలో ‘ధ్యాన అనంతపురం’ లక్ష్యాన్ని ఏర్పరచుకుందాం" అని మా జిల్లా పిరమిడ్ మాస్టర్స్, అందరం నిర్ణయించుకున్నాం.

"ఆటో" ల ద్వారా శాకాహార ప్రచారం, "లక్ష క్యాలెండర్స్" ద్వారా ధ్యానప్రచారం చేస్తూ జిల్లా అంతా వీర తిరుగుడు తిరిగాం. ఈ లక్ష్య సాధనలో నాకు దేవుడిచ్చిన సోదరుడిలా T. "కృష్ణమోహన్" కలిశాడు. ధ్యానం యొక్క గొప్పతనాన్ని స్వయంగా అనుభవించిన కృష్ణమోహన్ అనంతపురం జిల్లాలో జరిగిన విస్తృత ధ్యాన ప్రచారానికి ఇతోధికంగా తనవంతు ఆర్థిక మరి భౌతిక సహాయాలు అందించాడు.

వందరోజుల పాటు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అనంతపురం జిల్లాలో ఉన్న వెయ్యి గ్రామాలలో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేశాం!

ఆనంద్ కుమార్: "పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ఎలెక్షన్‌లలో కూడా పాల్గొన్నారు కదా?"
రంగనాధ రెడ్డిగారు: ఇంతలో పత్రీజీ "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" అనే ఆధ్యాత్మిక రాజకీయ పార్టీని జాతీయస్థాయిలో స్థాపించి సార్వత్రిక ఎన్నికలలో శంఖారావాన్ని పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజిక వర్గాలకూ అభ్యర్థులను నిలబెట్టాలని ఆదేశించారు.

అది విని .. హాయిగా ధ్యానం చేసుకుని బ్రతుకుతూన్న నాలో అంతర్మధనం మొదలయ్యింది.

"ఇదేందబ్బా! ‘ఆధ్యాత్మికత’ అంటారు .. ‘రాజకీయాలు’ అంటారు. ఒకదానికొకటి లింకే లేదు" అంటూ నా మనస్సు గందరగోళంలో పడిపోయింది అయితే దానికి ధ్యానంలోనే సమాధానం కూడా పొందాను.

"నిజమే, సమాజంలోని కుళ్ళును కడిగివేయాలంటే మరి ఆ కుళ్ళులోకి మనం కూడా దిగాలి కదా! ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలంటే మరి ఆధ్యాత్మికవేత్తలం అయిన మనం కూడా ఎన్నికల బరిలోకి దిగి ప్రజలను చైతన్యవంతం చెయ్యాలి కదా!

"ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉన్న దేశమే భౌతికంగా కూడా ఉత్తమంగా ఉంటుంది కనుక ఆధ్యాత్మిక వేత్తలను పాలకులుగా ఎన్నుకోవాలంటే ప్రజలకు సరియైన ఆధ్యాత్మికత పట్ల అవగాహన మనమే కల్పించాలి" అంటూ నేను వెంటనే తాడిపత్రి నియోజకవర్గానికి MLAగా "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" తరపున బరిలోకి దిగాను.

ఇంటింటికీ, వీధి వీధికీ పిరమిడ్ పార్టీ పేరు మారు మ్రోగి పోయేలా అద్భుతంగా ప్రచారం చేశాం. ౩౦౦ మంది పిరమిడ్ మాస్టర్లం .. రేయింబగళ్ళు ధ్యాన - శాకాహార ప్రచారాలు చేశాం.

మా ప్రచారానికి దిమ్మతిరిగిపోయిన ప్రత్యర్థులు ఓట్లు చీలిపోతాయన్న భయంతో "ఎన్నికల నుంచి విరమించుకుంటే డబ్బులు ఇస్తాం .. పిరమిడ్ కట్టుకోవడానికి స్థలం ఇస్తాం" అంటూ మాకు ఎన్నో ప్రలోభాలు పెట్టారు.

కానీ మేము దేనికీ లొంగకుండా .. అప్పటివరకు ఫ్యాక్షన్ చరిత్రలతో నిండిపోయి ఉన్న తాడిపత్రి రాజకీయాలకు మొట్టమొదటిసారిగా ధ్యానం - అహింసా శాకాహార ప్రచార రంగును అద్ది .. ప్రజలలో క్రొత్త ఆలోచనలను రేకెత్తించాం!

ఆనంద్ కుమార్: " ‘ధ్యానం’ మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?"
రంగనాధ రెడ్డీ గారు: ధ్యానానికి ముందు నేను ఏదైనా ఒక వ్యక్తి వల్ల కానీ .. ఒక సంఘటనవల్ల కానీ .. నాకు ఏదైనా మంచి జరిగితేనే సంతోషంగా ఉండేవాడిని; లేకపోతే వాళ్ళను, తిట్టేసి డిప్రెషన్‌లో పడిపోయి నా జీవితాన్ని నరకం చేసుకునేవాడిని.

అదే ధ్యానంలోకి వచ్చాక మాత్రం నాలో నేను స్పష్టంగా చూసుకున్న తేడా ఏమిటంటే .. నాకు వ్యతిరేకంగా ఉన్న సంఘటన కానీయండి లేక వ్యక్తులు కానీయండి "వాళ్ళ వల్లే నాకు కష్టాలు వచ్చి నేను ఇంత దృఢంగా మారిపోయాను; అంటే వాళ్ళవల్ల నాకే మంచి జరిగింది" అని వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం అలవాటు అయ్యింది.

" ఆ కష్టకాలం నాకు స్నేహితులు మరి ఆత్మ విశ్వాసం రూపంలో ఎన్నో బహుమతులను అందించింది" అని అర్థం అయ్యింది. "మాట మీద ధ్యాస మరి "మానసిక స్థిరత్వం కేవలం ధ్యానసాధన వల్లనే సాధ్యం" అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. ఇందుకు ఉదాహరణగా:

ఈ ఎలెక్షన్‌లూ మరి ధ్యాన ప్రచారాలతో నా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమై "జీరో" కు పడిపోయింది. అయిన వాళ్ళంతా ముఖం చాటేశారు. అయినా నేను ధ్యానం నాకు అందించిన మొక్కవోని ధైర్యంతో మరి కృష్ణమోహన్ ఇచ్చిన కొండంత సహకారంతో క్రొత్తగా "నాపరాయి" మరి "రియల్ ఏస్టేట్" వ్యాపారాలను ఆరంభించాను. కేవలం నా ధ్యానశక్తి మరి సంకల్పశక్తులతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో నిలద్రొక్కుకుని .. చక్కటి లాభాలను పొందుతూ జీవితంలో బ్రహ్మాండంగా స్థిరపడ్డాను!

"ఇలా ధ్యానానికి మనం ఎంత ఇస్తే .. అంతకు అంత అది పదింతలై మళ్ళీ మన దగ్గరికే తిరిగి వస్తుంది" అనడానికి నా జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ!

ఒకనాడు "దొంగ నాయాలు" అని తిట్టుకున్న వారికి ధ్యానంలోనే క్షమాపణలు చెప్పి .. వాళ్ళను నా ఎదుగుదలకు సహాయపడిన గురువులుగా తలిచాను. నా జీవితంలోని క్లిష్టసమయాలలో "నో జడ్జిమెంట్స్ .. నో కంప్లయింట్స్" అన్న విశ్వ సూత్రానికి నిలువెత్తు రూపం అయిన పత్రీజీ చూపించే గొప్ప లక్షణాలు నాకు ఎంతగానో మార్గదర్శక సూత్రాలయ్యాయి.

మిరపకాయకు కారం రుచి .. చింతకాయకు పుల్లని రుచి .. ఉప్పుకు ఉప్పు రుచి, తీపికి తియ్యదనం రుచి ఉన్నట్లే .. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వారి వారి ఆత్మ సంస్కారాలను అనుసరించి రకరకాల లక్షణాలతో జన్మలు తీసుకుంటారు.

ఒక కూరను పసందుగా వండాలంటే మరి అన్ని రుచులూ ఉన్న సరంజామాను వేసి వండినట్లే .. మన జీవితం కూడా పసందుగా ఉండాలంటే అన్నిరకాల వ్యక్తులూ మనకు కావాలి. అందుకే ఎవ్వరినీ జడ్జి చేయరాదు. వాళ్ళ వాళ్ళ లక్షణాలను మనకు అనుకూలంగా మలచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి.

ఆనంద్ కుమార్: "మీకు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగిందని విన్నాం .."
రంగనాధ రెడ్డిగారు: అవును! ఒకసారి నాకు రోడ్డు ప్రమాదంలో కంటికి బలమైన గాయం తగిలింది. " కన్ను ఏకంగా తీసి వేయాల్సి వస్తుంది" అని డాక్టర్లు తేల్చేశారు కూడా! అయినా నేను ధైర్యంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి .. ఇంటికి కూడా రాకుండా నేరుగా ధ్యాన కేంద్రానికి వెళ్ళిపోయాను.

అక్కడ పిరమిడ్ క్రిందనే కూర్చుని .. "ధ్యానం వల్ల అన్ని జబ్బులూ నయం అయినప్పుడు నాకెందుకు తగ్గదు?" అని ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాను. బంధువులూ మరి స్నేహితులూ " ఇక కన్ను పూర్తిగా పోయినట్లే" అనుకుంటూన్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నా కన్ను బాగు కావడం జరిగింది! ఒక చిన్న మందు గోలీ కూడా మ్రింగకుండా ఆ సందర్భంలో నన్ను నేను స్వస్థత పరచుకున్నాను.

ఆ తరువాత కొన్నాళ్ళకు వ్యాపార లావాదేవీలలో పడిపోయి నేను కొంతకాలంపాటు ధ్యానానికి దూరంగా ఉండిపోయాను. క్రమంగా నాలో స్వార్థం పెరిగిపోయి హృదయ దౌర్భల్యంతో " అందరికంటే నాకే ఎక్కువ లాభాలు రావాలి" అన్న పోటీ తత్త్వంతో పనిచేస్తూ "హార్ట్ ఎటాక్" తెచ్చుకున్నాను.

హాస్పిటల్‌లో ICU లో చేరిన నన్ను నా అంతరాత్మ హెచ్చరించింది! ఆ హెచ్చరికతో నేను .. "ఒక ధ్యానికూడా ఎరుకలేని స్థితిలో ఏ రకమైన వికారాలకు లోనయితే రకరకాల జబ్బులకు గురి అవుతాడు" అని అర్థం చేసుకుని వెంటనే డాక్టర్స్ ఒప్పుకోకపోయినా సరే నా స్వంత భరోసాతో డిశ్చార్జ్ అయ్యి .. ఇంటికి వచ్చేశాను.

మందులూ, మాకులూ ఏవీ లేకుండా .. కేవలం ధ్యానం చేసుకుంటూ .. ప్రేమతత్త్వంతో నా హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే పూర్తి స్వస్థతను పొంది సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అయ్యాను! మళ్ళీ వైద్యపరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్స్ అన్నీ "నార్మల్" అని వచ్చాయి!!

అప్పటినుంచీ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ PSSM నూ మరి పత్రీజీని వదలకుండా పూర్తి ఎరుకస్థితిలో జీవిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఉంటున్నాను.

ఆనంద్ కుమార్ : "నందవరంలో మీరు తలపెట్టిన ప్రాజెక్ట్ గురించి .."
రంగనాధ రెడ్డీ గారు: "సదానంద సద్గురు నిత్యాన్నదాన సేవా ట్రస్ట్" ఆధ్వర్యంలో "సద్గురు సదానంద తపోవనం " గా పిరమిడ్ ఆశ్రమాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. దీనిని పత్రీజీ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ గా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

"మనం ఏ విధమైన భావంతో ఇతరులకు ఆహారం అందిస్తే .. వారిలో అవే భావాలను నెలకొల్పిన వాళ్ళం అవుతాం! " అన్న విశ్వ న్యాయ సూత్రాన్ని అనుసరించి పత్రీజీ తమ గురువుగారైన శ్రీ సదానంద సద్గురు సమాధి ప్రాంగణంలో ప్రతిరోజూ పదివేలమందికి తగ్గకుండా నిత్యాన్నదానం జరగాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది!

మేడమ్ స్వర్ణమాల పత్రి గారు ఛైర్మన్‌గా .. మారం శివప్రసాద్ గారు వైస్ ఛైర్మన్‌గా .. నేను మేనేజింగ్ డైరెక్టర్‌గా .. జైజుబాబు జాయింట్ సెక్రెటరీగా మరి కర్నూలు, తాడిపత్రి, నంద్యాల, బేతంచర్ల లకు చెందిన పలువురు పిరమిడ్ మాస్టర్లు ట్రస్టీలుగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు ఆరు ఎకరాల స్థలం ఇటీవలే సేకరించడం జరిగింది! ఇప్పటివరకు ప్రాంగణమంతా చదునుచేసి ౩౦ అడుగుల మెటల్ రోడ్లు మరి బోరు వేయడం జరిగింది. అక్కడ 60’ x 60’ పిరమిడ్ మరి వచ్చిపోయే ధ్యాన సాధకులకు వసతికోసం ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

ఇందులో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా భాగస్వాములే! అయితే వారు అందించే ఆర్థిక విరాళాలు మాత్రం ఖచ్చితంగా ‘బ్యాంక్’ లోనే డిపాజిట్ చేయాలి.

మన ప్రధానమంత్రి మాన్యశ్రీ "నరేంద్ర మోడీజీ" గారు దేశంలో అవినీతిని రూపుమాపే ఉద్యమం లో భాగంగా "ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలనే చేపట్టాలి" అని పిలుపు ఇచ్చారు. అందుకే ఈ ఆశ్రమ నిర్మాణానికి వచ్చే విరాళాల యొక్క వివరాలను పారదర్శకంగా ఉంచడానికి బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే స్వీకరించడానికి ట్రస్ట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

ఎవరయినా వస్తు రూపంలో తమ వితరణ ఇస్తే స్వీకరించబడుతుంది కానీ నగదు రూపంలో ఒక్కరూపాయి కూడా స్వీకరించబడదు. అందుకే ట్రస్ట్ పేరున రసీదు బుక్కులను కూడా ప్రచురించలేదు!

అతి త్వరలోనే మనం అందరం కలిసి "పత్రీజీ కలల ప్రాజెక్ట్" అయిన "సద్గురు సదానంద తపోవనాన్ని" అద్భుతంగా పూర్తి చేసుకుందాం! PSSM కు మూల పురుషుడయిన ఆ మహా గురువు యొక్క శక్తి ప్రకంపనలను అనుభూతి చెందుతాం!

వందల సంవత్సరాల పాటు ఈ భూమి మీద నివసించిన "శ్రీ సదానంద స్వామీజీ" యొక్క సమాధి ప్రాంగణం అయిన ఆ స్థలం ఎంతో గొప్ప శక్తి ప్రదేశం .. కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ఈ శక్తి ప్రాంగణంలో ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాం.


మారంరెడ్డి రంగనాథ రెడ్డి 

తాడిపత్రి - అనంతపురం జిల్లా
-9490065939

Go to top