"చిన్నతనంలోనే ధ్యానం నేర్చుకోవాలి"

 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని "శ్రీ వాసవీ సిల్క్స్" యజమాని "మాజేటి శేషగిరిరావు" గారు .. స్థానికంగా జరిగే పిరమిడ్ ధ్యాన ప్రచార కార్యక్రమాలకు తమవంతు విశేష సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ధ్యానంలోని గొప్పదనాన్ని స్వయంగా అనుభవంలోకి తెచ్చుకుని తమ పిరమిడ్ ధ్యాన - శాకాహార కుటుంబంతో కలిసి వీరు చేస్తూన్న విశేష కార్యక్రమాలను గురించి వారి ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం! ఇంటర్వ్యూలో సహకరించిన "ధ్యానజగత్" పబ్లిషర్ D.కేశవరాజు గారికి కృతజ్ఞతలు.

 

- ఎడిటర్

కేశవరాజు గారు: "నమస్కారం సార్! ధ్యానజగత్ మాసపత్రికకు స్వాగతం! మీ గురించిన విశేషాలు.."
శేషగిరిరావు గారు: నా పేరు శేషగిరిరావు. ఏలూరు పట్టణంలో "శ్రీ వాసవీ సిల్క్స్" పేరు మీద వస్త్ర వ్యాపారరంగంలో స్థిరపడిన నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. మాకు ఒక అబ్బాయి "సురేష్" .. మరి అమ్మాయి "సునీత". ఇద్దరూ వివాహాలు చేసుకుని తమ తమ జీవితాలలో స్థిరపడ్డారు.

చిన్నప్పటినుంచీ "సోమవారం గుడి", "మంగళవారం గుడి" అంటూ "ఆదివారం గుడి" వరకూ వారంలో ఏడురోజుల పాటు "ఏదో ఒక దేవుని ఆలయానికి వెళ్ళి రావడం" అన్న సంప్రదాయాన్ని నేను మా పెద్దవాళ్ళ దగ్గరినుంచీ పొందాను. ఇలా క్రమం తప్పని భక్తి మార్గంలో ఉంటూ, రకరకాల పూజలు చేస్తూ ఏలూరు పట్టణంలో మూడు పెద్ద పెద్ద బట్టలు షాపులకు యజమానిని అయ్యాను. ఇలా వస్త్ర వ్యాపారరంగం ద్వారా ఏలూరు పట్టణంలోనే మంచి పేరు తెచ్చుకుని స్థిరపడిన సమయంలో .. 2009 సంవత్సరంలో భీమవరం పిరమిడ్ మాస్టర్ "తటవర్తి వీర రాఘవరావు"గారి మూడురోజుల "ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం" ఏలూరు పట్టణంలో నిర్వహించబడుతోందని చిన్న కరపత్రం ద్వారా తెలిసింది.

అప్పటివరకు నేను ‘ధ్యానం’ గురించి విని ఉండక పోవడంతో .. "సరే, అదేంటో చూద్దాం" అనుకుని అక్కడికి వెళ్ళాను. మొట్టమొదటి క్లాస్‌లోనే ధ్యానంలోని గొప్పదనంతో పాటు మనస్సుకు హత్తుకుపోయే ఎన్నో విషయాలను నేను అక్కడ తెలుసుకున్నాను. "అసలు ఇన్నాళ్ళూ ఇంతమంచి కార్యక్రమాలకు నేను ఎందుకు దూరంగా ఉన్నాను?" అని మొట్టమొదటిసారిగా బాధపడ్డాను.

అంతవరకూ వ్యాపారం, ఖరీదులూ, అమ్మకాలూ మరి పూజలతో మాత్రమే సమయాన్నంతా గడిపేసిన నేను "చిన్నతనంలోనే ధ్యానం నేర్చుకోకపోవడంవల్ల జీవితంలో ఎంతో నష్టపోయాను" అనుకున్నాను.

"సరే .. సరియైన సమయంలో .. సరియైనవి మనకు అందుతాయి" అన్నసృష్టి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ .. "కనీసం ఇప్పటికయినా అందినందుకు" సంతోషిస్తూ .. ధ్యానాన్ని నా జీవిత విధానంగా మార్చుకున్నాను. పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుని వెంటనే మా ఇంటిపై మరి మా షాప్‌పై అంతస్థులో పిరమిడ్‌లు కట్టేశాను!

కేశవరాజుగారు: "ఇంత బిజీ షెడ్యూల్‌లో ధ్యానం ఎప్పుడు చేస్తారు?"
శేషగిరిరావు గారు: ప్రతిరోజూ ఉదయం 4.00 గం||ల నుంచి 6.00 గం||ల వరకు మరి రాత్రి 10.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు రెండు విడతలుగా ధ్యానం చేస్తాను. కేవలం రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయినా .. అది ఎంతో నాణ్యతతో కూడి ఉండడంవల్ల నాకు ఎప్పుడూ విసుగు, అలసట అన్నవి ఉండవు. హాయిగా .. రిలాక్స్‌డ్‌గా పనిచేసుకోవడం నాకూ నా కుటుంబ సభ్యులకూ ధ్యానం నేర్పిన వ్యాపార రహస్యం!

ప్రస్తుతం నా వయస్సు 65సంవత్సరాలు. అయినా నా ఉత్సాహాన్నీ మరి వ్యాపార నైపుణ్యాన్నీ చూసి అందరూ ఆశ్చర్యపోతూంటారు! ధ్యానం ద్వారా నేను పొందుతూన్న లాభాలన్నీ మా షాపులో పనిచేసే సిబ్బంది కూడా పొందాలన్న సత్సంకల్పంతో మా షాపులో పైన ఏర్పాటుచేసిన పిరమిడ్‌లో ప్రతి మంగళవారం వారితో సామూహిక ధ్యానం చేయిస్తాను.

తమ అనారోగ్యాలు దూరం అయ్యాయనీ, సమస్యల నుంచి బయట పడ్డామనీ వాళ్ళు చెబుతూంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. జీతంతోపాటు చక్కటి ధ్యాన సాంప్రదాయాన్ని కూడా వాళ్ళకు అందిస్తూన్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంటోంది.

అంతేకాకుండా వేలాదిగా ధ్యాన-శాకాహార కరపత్రాలను ముద్రించి షాపులకు వచ్చే కస్టమర్లకు పంచిపెడుతూంటాము. చక్కటి ఆత్మజ్ఞాన శీర్షికలతో కూడిన "ధ్యాన జగత్" మాసపత్రికలను ప్రతినెలా పెద్దమొత్తంలో తెప్పించుకుని .. కస్టమర్లకు ఉచితంగా అందిస్తూంటాం.

రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఎక్కడ "పిరమిడ్‌లను కట్టుకుంటున్నాం" అన్నా సరే వారికి మా వంతు ఆర్థిక సహాయాన్ని ఎంతో కొంత అందిస్తున్నాం! ఈ రోజు సమాజంలో అందరిదగ్గరా డబ్బు బాగానే ఉంది! కానీ ఆరోగ్యం, ఆనందం మరి మానసిక ప్రశాంతతలు మాత్రం కరువైపోతున్నాయి. అలాంటి వాళ్ళందరికీ ధ్యాన-శాకాహార మార్గాన్ని చూపిస్తూ వారి జన్మలను ధన్యం చేస్తూన్న పత్రీజీకి వేల వేల కృతజ్ఞతలు!

కేశవరాజు గారు: "ఇతర ప్రదేశాలలో జరిగే ధ్యాన కార్యక్రమాలలో మీరు పాల్గొంటూంటారా?"
శేషగిరిరావు గారు: పాల్గొనడమే కాదు .. నేను కూడా స్వంతంగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలను ఏలూరు పట్టణంలో మరి చుట్టుప్రక్కల ప్రాంతాలలో నిర్వహిస్తూంటాను. మాది గొప్ప ధ్యాన కుటుంబం కావడంతో నేను చేసే ప్రతి పనికీ మా కుటుంబ సభ్యులు తమ సహకారం అందిస్తూంటారు.
-92905 73947.

"పత్రీజీ .. సామాన్యులు కారు"


- శ్రీమతి శ్యామల

కేశవరాజు గారు: "మేడమ్!.. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు?"
శ్యామల గారు: నేను కూడా మా వారితో కలిసి 2009వ సంవత్సరంలోనే ఈ ధ్యానమార్గంలోకి వచ్చాను. అప్పటికే మోకాళ్ళ నొప్పులతో విపరీతంగా బాధపడుతూన్న నేను ఎందరెందరో డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఎన్నెన్నో మందులు వాడేదానిని. కాస్సేపు ఉపశమనంగా ఉండేది కానీ .. ఆ తరువాత మళ్ళీ నొప్పులు మామూలే మరి వాటికి తోడు మందులు వాడిన సైడ్ ఎఫెక్ట్స్ నన్ను బాధించేవి.

అలాంటి సమయంలోనే ధ్యానం గురించి తెలుసుకుని ఏలూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు "రాధా మేడమ్"గారి ఇంట్లో పత్రీజీ గారి ధ్యానం క్లాస్ ఉందంటే వెళ్ళాను. విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో అక్కడ క్రింద కూర్చుని ధ్యానం చేసుకుంటూన్న నన్ను పత్రీజీ లేపి .. "కుర్చీలో కూర్చోండి" అన్నారు.

అంతమందిలో కూడా నన్నూ, నా బాధనూ గుర్తించిన ఆ గురువుగారు "సామాన్యులు మాత్రం కారు" అని నాకు అనిపించింది. ఆ తరువాత ధ్యానం పై చక్కటి పట్టు కుదిరి క్రమంగా కాళ్ళ నొప్పులతోపాటు ఎన్నో సంవత్సరాలుగా నన్ను బాధిస్తూ వచ్చిన "మైగ్రేన్ తలనొప్పి" కూడా తగ్గిపోయింది.

కేశవరాజు గారు: "ధ్యానంలో ఇంకా మీ అనుభవాలు.."
శ్యామల గారు: పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పత్రీజీ ఒకసారి మా ఇంటికి వచ్చారు. వారికి "టీ" కాస్తూ ఉండగా పొరపాటున అది ఒలికి నా చేతి మీద పడి బొబ్బలు వచ్చేశాయి. అయితే చిత్రంగా మంట కానీ, నొప్పికానీ లేవు.

అదేరోజు రాత్రి మా అమ్మాయి గృహప్రవేశ వేడుకకు కూడా వెళ్ళి తనకు అన్ని పనులలోనూ సహాయం చేశాను. "ఇలా ఒక సద్గురువు సమక్షంలో ఉన్నప్పుడు కర్మసిద్ధాంతం ప్రకారం మనకు జరగవల్సినవి జరిగినా .. అందులో నొప్పి, కష్టం అన్నవి మనల్ని ఎక్కువుగా బాధించవు" అని నాకు అర్థం అయ్యింది!

కేశవరాజు గారు: "మీ దినచర్య ఎలా ఉంటుంది?"
శ్యామల గారు: ఇంట్లో క్రింద ధ్యానకేంద్రం ఇంటిపైన పిరమిడ్! వచ్చిపోయే ధ్యానులతో పిరమిడ్ మాస్టర్ల సత్సంగాలతో మా ఇల్లు ఒక శక్తిక్షేత్రంలా మారిపోయింది. ఇక వేరే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. మొదట్లో నేను చాలా సున్నిత మనస్కురాలిగా ఉంటూ ఎవరేమన్నా విపరీతంగా బాధపడిపోయే దానిని. వారిపై ద్వేషాన్నీ మరి కోపాన్నీ మనస్సులోనే దిగమ్రింగుకుంటూ నన్ను నేనే బాధపెట్టుకునేదాన్ని.

ధ్యానంలోకి వచ్చాక "వాళ్ళ అజ్ఞానంవల్లే వాళ్ళు అలా ప్రవర్తించారు" అని తెలుసుకుని వాళ్ళపై కరుణతో ఉంటున్నాను. వాళ్ళకు ధ్యానం గురించి చెప్పి .. వాళ్ళతో స్నేహపూర్వకంగా ప్రవర్తించగలుగుతున్నాను. ఇలా నన్ను నేను స్వస్థత పరచుకోవడం ధ్యానం నాకు ఇచ్చిన బహుమతి. ప్రతిఒక్కరూ ధ్యానం తప్పకుండా చెయ్యాలి! "సజ్జన సాంగత్యం", "పుస్తక పఠనం" మరి అవకాశం ఉన్నప్పుడల్లా "ఆచార సాంగత్యం" చెయ్యాలి .. అప్పుడే జీవితాన్ని ఒక చక్కటి ఆటలా హాయిగా ఆడుకోగలుగుతాము!

ఒకసారి నేను ధ్యానంలో ఉండగా "మహావతార్ బాబాజీ" ఆంజనేయస్వామి లా మారి విశ్వం అంతా తిరుగుతూన్నట్లుగా అనుభవం వచ్చింది. పిరమిడ్ మాస్టర్లంతా కూడా ఒకే కుటుంబ సభ్యుల్లా పరస్పరం ఆప్యాయంగా ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది పత్రీజీ మనకు అందించిన "గొప్ప వసుధైక కుటుంబ" సాంప్రదాయం!

 

మాజేటి శేషగిరిరావు

-9290573948

- 92905 73948.

 

Go to top