"బుద్ధుని జన్మస్థలం లుంబినీవనం .. మా పాప జన్మస్థలం జేతవనం"

 

నా పేరు "మనోజ్ కుమార్". గత 10సం||ల నుంచి నేను ధ్యానం చేస్తూ ఎన్నెన్నో ధ్యాన కార్యక్రమాలలో పాల్గొని నా వంతు ధ్యానసేవ చేస్తున్నాను. నా వివాహానికి పూర్వం నేను, నా కాబోయే భార్య "జయశ్రీ" ఇద్దరం పత్రీజీతో కలిసి ఇండోనేషియా "బాలి" ధ్యానయాత్రకు వెళ్ళాం. అక్కడ అందరితో కలసి మేము ఫోటోలు దిగుతూండగా అది చూసి పత్రీజీ "చాలు .. చాలు! వచ్చే సంవత్సరం మీరు మీ పాపతో కలిసి ఫోటోలు తీయించుకుందురుగాని" అన్నారు.

"త్వరలోనే పెళ్ళి చేసుకుని .. ఆ తరువాత మూడేళ్ళు ఆగి .. పిల్లలను కందాం" అని అప్పటికే నిర్ణయించుకున్న మేము ఆశ్చర్యపోయి పత్రీజీని వివరం అడుగగా "చాలా ఆత్మలు దివ్యలోకాల నుంచి భూలోకానికి రావడానికి ఉత్తమమైన గర్భాలకోసం ఎదురుచూస్తున్నాయి. వాళ్ళకు మీ సహాయం కావాలి; వెంటనే పెళ్ళి చేసుకోండి" అన్నారు. ఆ తరువాత 2016 "కడ్తాల్ ధ్యానమహాచక్రం - VII"లో డిసెంబర్ 24వ తేదీన మా వివాహం పత్రీజీ చేతుల మీదుగా జరిగింది!

వెంటనే "జయశ్రీ" గర్భం దాల్చడంతో మాకు పుట్టబోయే బిడ్డ ఒకానొక ప్రహ్లాదుడి లాగా మరి లవకుశుల లాగా ఆశ్రమ వాతావరణంలో ధ్యానుల యొక్క అధ్యాత్మిక తరంగాల మధ్య పెరగాలని తలచి అందుకు అనువైన ప్రదేశం చిత్తూరుజిల్లా, కొటాలలోని "జేతవనం"గా నిర్ణయించుకున్నాం!

వెంటనే పత్రీజీ అనుమతితో "జేతవనం"చేరి ఆ సుందరమైన ఆశ్రమంలో ఉంటూ వచ్చాం. చుట్టూ పచ్చదనం, కొండలు, మైమరిపించే పొదరిళ్ళలాంటి వసతి గృహాలతో ఎటుచూసినా ప్రకృతి అందాలతో కూడిన "జేతవనం"లో గడపడం మా అత్యంత అదృష్టంగా భావిస్తున్నాం!!

ప్రతిరోజూ వచ్చేపోయే పిరమిడ్ మాస్టర్ల సత్సంగాల నడుమ, పౌర్ణమి, సామూహిక ధ్యానశక్తులతో నా బిడ్డ ఏ స్కానింగ్‌లూ, ఏ మందులూ లేకుండానే గర్భంలో ఆరోగ్యంగా పెరుగుతూ వచ్చింది. "పత్రీజీ" మరి "స్వర్ణమాలా పత్రి" దంపతుల ఆశీర్వచనాల మధ్య మరి "జేతవనం" వ్యవస్థాపకులు "శ్రీ సుధాకర్", "శ్రీ ప్రభాకర్" సోదరుల ప్రేమానురాగాల మధ్య మరి ఇతర పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో నా భార్య "జయశ్రీ" సీమంతం అయిదవ నెలలో కన్నుల పండుగగా జరిగింది!

ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు తమ తమ ధ్యానానుభవాలను చెబుతూంటే "జయశ్రీ" గర్భంలో ఉన్న పాప తాను కూడా వాటిని వింటూన్నట్లు చక్కగా స్పందించేది. మేము ఇద్దరం కూడా పాపతో నిరంతరం సంభాషణలు చేస్తూ ఉండేవాళ్ళం. కొందరు పిరమిడ్ మాస్టర్లయితే "ఇక్కడికి వెళ్ళమని బాబాజీ నుంచి మాకు మెస్సేజ్ వచ్చింది" అంటూ కొటాల జేతవనానికి వచ్చి మాతోనే ఉండి ప్రతిరోజూ ధ్యానం చేసేవారు.

నెలలు నిండిన "జయశ్రీ"ని డెలివరీ కోసం ఆగస్ట్ 16వతేదీన ప్రక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా .. డాక్టర్ రాకముందే కేవలం పదినిమిషాలలోనే సుఖ ప్రసవం జరిగి పండంటి బిడ్డ జన్మించింది! వెంటనే మేము బిడ్డతో సహా "కొటాల" కు తిరిగి వచ్చేశాం. పత్రీజీకి ఈ విషయం తెలియజేయగానే వారు "ఈ వార్త కోసమే నేను ఎదురు చూస్తున్నాను" అన్నారు.

ప్రస్తుతం మా పాప "కొటాల జేతవనం" లోని అందమైన ప్రకృతి ఒడిలో .. పక్షుల కిలకిలరావాల నడుమ ఆనందంగా ఆడుకుంటోంది. మాకు ఎటువంటి లోటు కలుగకుండా ఆదరించిన "జేతవనం ఆధ్యాత్మిక ఆశ్రమం" వ్యవస్థాపకులు శ్రీ సుధాకర్, శ్రీ ప్రభాకర్ అపూర్వ సోదరుల కుటుంబ సభ్యులకు మా హృదయ పూర్వక శతకోటి కృతజ్ఞతలు!

 

మనోజ్ కుమార్ - చెన్నై
8148646568, 7981808444.

 

Go to top