"ధ్యానంతో మాతృత్వభాగ్యం"

 

నా పేరు "మాధవి". నా చిన్నప్పుడే అంటే 1998లోనే నేను మా తల్లితండ్రుల ద్వారా "అతీషా పిరమిడ్ ధ్యానకేంద్రం"లో ధ్యానం నేర్చుకుని చదువుతోబాటు వుయ్యూరు మరి కృష్ణాజిల్లాలో జరిగే ధ్యాన కార్యక్రమాలలో పాల్గొనేదానిని.

ఏడు సంవత్సరాల క్రితం నా వివాహం జరిగి మా వారు ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉండడంతో నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రెండుసార్లు గర్భం దాల్చాను కానీ దురదృష్టవశాత్తూ "మిస్ క్యారేజ్" అయ్యి ఆరోగ్యపరంగా మరి మానసికపరంగా చాలా బాధపడ్డాను.

ఆ సందర్భంలో వుయ్యూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ "స్వర్ణలత మేడమ్" .. బళ్ళారి పిరమిడ్ మాస్టర్ "పుష్ప" గారి ఫోన్ నెంబర్ ఇచ్చి నన్ను వారితో మాట్లాడమని చెప్పారు.

"పుష్పా మేడమ్" నాకు ఎంతో ధైర్యం చెప్పి .. చక్కటి ఆత్మజ్ఞాన విషయాలను నాకు బోధిస్తూ .. కర్మ సిద్ధాంతం గురించి నాకు అవగాహనను కలుగజేసారు. ఇలా నన్ను నేను ఆత్మపరంగా స్వస్థత పరచుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఉండగా 2016వ సంవత్సరంలో మళ్ళీ గర్భం దాల్చాను.

ఎప్పటికప్పుడు "పుష్పామేడమ్"తో మాట్లాడుతూ .. వారి సలహాలనూ, చిట్కాలనూ పాటిస్తూ ప్రశాంతంగా గర్భంలో ఉన్న బేబీతో కనెక్ట్ అయ్యేదానిని.

4వ నెలలో దుబాయ్‍లోని డాక్టర్లు నాకు బెడ్ రెస్ట్ సూచించడంతో నేను వుయ్యూరులో ఉన్న మా అమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఆ క్రమంలో నా కోరిక మేరకు ఉయ్యూరు విచ్చేసిన పుష్పా మేడమ్‌తో కలిసి అందరం సామూహిక ధ్యానం చేశాం. అప్పుడు "పుష్పా మేడమ్" గారికి నా గర్భంలో ఒక "సన్నటి పొర" బిడ్డ చుట్టూ ఉన్నట్లుగా .. మరి అదే బిడ్డను పదిలంగా కాపాడుతూన్నట్లుగా కనిపించింది.

ఆ తరువాత "పుష్పా మేడమ్" తాము వ్రాసిన "యోగులతో నా ఆత్మకథ" పుస్తకాన్ని నాకు ఇచ్చి వెళ్ళారు. ఆ పుస్తకంలో ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు నిరూపణలతో సహా వ్రాసారు. బెడ్‌రెస్ట్‌లో కూడా నేను క్రమం తప్పకుండా ధ్యానంచేస్తూ 7 వ నెలలో డాక్టర్ సూచన ప్రకారం స్కానింగ్ చేయించాము.

గర్భంలో బిడ్డ చక్కగా ఎదుగుతున్నట్లూ .. బిడ్డ చుట్టూ ఏదో సన్నటి పొర ఉన్నట్లూ రిపోర్ట్ వచ్చింది. దాని గురించి డాక్టర్లు చర్చించుకుంటూనే ఉండగా ఏడవ నెల నిండుతూనే ప్రసవం జరిగి పండంటి బాబు పుట్టాడు!

ఇలా ఎప్పటికప్పుడు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ, నన్ను వర్తమానంలో జీవింపజేసి, ఒక గొప్ప మాస్టర్‌కు జన్మ ఇచ్చిన తల్లిగా నన్ను మలచిన "పుష్పామేడమ్"కు "ధ్యానజగత్" ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాతృత్వం నాకు నా ధ్యానం యొక్క ప్రతిఫలం! "ధ్యానశక్తితో ఏదైనా సాధించవచ్చు" అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.

PSSM ద్వారా ఇంతలా ధ్యానాన్ని విస్తరింపజేస్తూన్న పత్రీజీకి .. మరి అనుక్షణం వారిని అనుసరిస్తూ ధ్యానాన్ని మరింత విశ్వవ్యాప్తం చేస్తూన్న పిరమిడ్ మాస్టర్లకూ .. నా శతకోటి ఆత్మప్రణామాలు!!

 

M. మాధవి

వుయ్యూరు - కృష్ణాజిల్లా
-7659042188, 9866389918.

Go to top