"‘నో’ మరణం .. ‘నో కర్మకాండలు"

 

రాజమండ్రి పిరమిడ్ మాస్టర్ "అక్కల గౌరీశంకర్" గారు 2017 ఏప్రిల్ 11వ తేదీన తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ సందర్భంగా "పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ .. సూత్రాలను" ఆచరణలో పెడుతూ వారి కుటుంబసభ్యులు వ్యర్థమైన కర్మకాండలను నిర్వహించకుండా.. స్వర్గస్థులయిన గౌరీ శంకర్ గారికి సంతోషంగా ధ్యానవీడ్కోలు అందించి నూతన శకానికి ఆత్మజ్ఞానులుగా నిలిచారు!

ఈ క్రమంలోనే జూలై 20వ తేదీన "బ్రహ్మర్షి పత్రీజీ" సమక్షంలో వారి శ్రీమతి "వరలక్ష్మి మేడమ్" తాపేశ్వరం లోని "వేడుక A/c ఫంక్షన్ హాల్"లో "దివ్య ఆత్మజ్ఞాన బోధ" పేరుతో గౌరీశంకర్ గారికి "ధ్యాన ఆత్మీయ సంస్మరణ సభను" ఏర్పాటుచేశారు.

చుట్టుప్రక్కల గ్రామాల నుంచి దాదాపు వెయ్యిమంది పాల్గొన్న ఈ చక్కటి కార్యక్రమంలో వరలక్ష్మి గారు మాట్లాడుతూ "పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల"ను గౌరవిస్తూ నా భర్త గతంలో తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఎటువంటి కర్మకాండలనూ నిర్వహించలేదు. చక్కటి ధ్యాన కార్యక్రమంతో వాళ్ళకు వీడ్కోలు ఇచ్చారు.

"అందుకే ఏప్రిల్ 11వ తేదీన హార్ట్‌ఎటాక్‌తో మరి మా ఆయన అకస్మికంగా తమ భౌతికదేహాన్ని వదిలి వేసినప్పుడు .. వారి అంకిత భావాన్ని గౌరవిస్తూ మేము కూడా ఎలాంటి కర్మకాండలు జరిపించకుండా పిరమిడ్ మాస్టర్లు సామూహిక ధ్యానంతోనే వారికి ఆత్మీయ వీడ్కోలును ఇచ్చాం. మా బంధువులు కొందరు ఇందుకు వ్యతిరేకించినా .. మా అబ్బాయి, అమ్మాయి మా వారి కోరికను తీర్చడానికి నాకు కొండంత అండగా నిలిచారు.

"మా వారు లేని లోటును తలచుకుని నేను బాధపడుతూంటే వాళ్ళు ‘అమ్మా! డాడీ ఈ భూలోకాన్ని వదిలి హాయిగా పైలోకాలకు వెళ్ళారు! నువ్వు బాధపడి ఆయన మార్గానికి అడ్డుపడకు! ఇక్కడ తన పని పూర్తిచేసుకుని మరింత అద్భుతమైన పని చేయడానికి పైలోకాలకు వెళ్ళిన డాడీ ఒక గొప్ప మాస్టర్! అని చెప్పారు. ఇంతటీ గొప్ప ఆత్మజ్ఞానాన్ని మాకు అందించిన పత్రీజీకి మా కృతజ్ఞతలు" అంటూ తమ భావాలను అందరితో పంచుకున్నారు.

పత్రీజీ తమ దివ్యసందేశాన్ని ఇస్తూ .. "మనిషికి ‘మరణం’ అన్నదే లేనప్పుడు కర్మకాండలు చేయడంలో అర్థం లేదు. ‘అసలు చనిపోయింది ఎవరు? శరీరమా .. శరీరంలో ఉంటున్న ఆత్మనా?’ అని మనం తెలుసుకోవాలి! మనకు శరీరంపై రకరకాల వస్త్రాలను ధరించడం, వదలి వేయడం ఉన్నట్లు .. ఆత్మకు కూడా రకరకాల శరీరాలను ధరించడం, వదిలివేయడం ఉంటుంది!

"‘చనిపోవడం’ అన్నది ఆత్మకు మనం బట్టలు మార్చుకున్నంత సర్వ సాధారణం. అయితే ఒక మనిషి శరీరాన్ని వదిలి పెట్టినప్పుడు కొంత దుఃఖం ప్రకృతి సహజంగానే ఉంటుంది .. కానీ ఆ దుఃఖంలోనే పూర్తిగా మునిగిపోవడం ఆధ్యాత్మిక అజ్ఞానం!

" ‘సతీ సావిత్రి’ యమధర్మరాజుకి అడ్డుపడి మరీ చనిపోయిన తన భర్తను బ్రతికించుకుంటుంది! ఇది కేవలం తెర ముందు మనకు తెలిసిన విషయం! అదే సావిత్రి మరణించి పైలోకాలకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆమెతో ‘నువ్వు నీ భర్త ప్రాణాల కోసం పోరాడి పోరాడి మరీ సాధించుకున్నావు కదా! మరి ఆయనతో శాశ్వతంగా కలిసి ఉండకుండా ఇప్పుడు ఆయనను వదిలి నువ్వెందు ఇక్కడికి వచ్చావు?’ అని అడిగాడు!

"మాటా, పలుకు లేని సావిత్రితో .. ‘సృష్టి సిద్ధాంతానికి విరుద్ధంగా నువ్వు అప్పుడు చేసిన పనికి ఫలితంగా మళ్ళీ స్త్రీగా నువ్వు ఇంకో మూడు జన్మలు ఎత్తి .. ప్రతి జన్మలో కూడా వెంట వెంటనే భర్తను కోల్ఫోతావు’ అన్నాడు! ఇది తెర వెనుక జరిగిన భాగోతం! మనం తెలుసుకోవలసిన సత్యం!

‘మరణం’ అన్నది ప్రతి భౌతిక జీవికీ అత్యంత సహజం కనుక చనిపోయిన వాళ్ళను చూసి ఏడవకుండా వాళ్ళకు ఆనందంగా వీడ్కోలు ఇవ్వడం నేర్చుకోవాలి. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి పనులను తలచుకుని వాళ్ళను అభినందించాలి. ‘మరణం .. అది భౌతిక దేహానికే కానీ ఆత్మకు కాదు’ అన్న సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు.

"పూర్వం ఒకానొక గ్రామంలో ఒకానొక తల్లి .. చనిపోయిన తన బిడ్డను బ్రతికించమని వలవలా ఏడుస్తూ బుద్ధుడిని అడిగింది! "బ్రతికిస్తాను తప్పకుండా! అయితే అసలు మరణమే సంభవించని ఏదేని ఒక ఇంటినుంచి గుప్పెడు ఆవాలను తీసుకుని రా’ అని అడిగాడు బుద్ధుడు! ఎక్కిన గడపా దిగిన గడపే కానీ .. చావు లేని ఇల్లు ఆ తల్లికి కనబడలేదు! చివరికి ‘మరణం అత్యంత సహజం’ అన్న సత్యాన్ని గ్రహించిన ఆమె బుద్దునికి శరణాగతి అయ్యింది!

ఈ భూలోకంలో ఉన్నంతసేపే మనకు పరస్పర బంధాలూ మరి బంధుత్వాలు! చనిపోయి పై లోకాలకు వెళ్ళాక అక్కడ ‘పెళ్ళాం’ ఉండదు; ‘మొగుడు’ ఉండడు; ‘తల్లి’ ఉండదు; ‘తండ్రి’ ఉండడు.

"మహాభారతయుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడని వలవలా ఏడుస్తున్నాడు అర్జునుడు! అంతవరకూ సాక్షాత్తూ భగవంతుని ద్వారానే భగవద్గీతను విన్నా కూడా అతడు పుత్రప్రేమతో దుఃఖసాగరంలో మునిగిపోయి అస్త్రసన్యాసం చేస్తానంటూ కూలబడి వున్నాడు! అది చూసి కృష్ణుడు అతడిని నేరుగా పై లోకాలకు తీసుకుని వెళ్ళి అక్కడ హాయిగా ఆడుకుంటూన్న అభిమన్యుడిని చూపించాడు.

" ‘కుమారా .. అభిమన్యూ!’ అంటూ పరుగు పరుగున వచ్చి .. Ex -కుమారుడిని హత్తుకోవడానికి ప్రయత్నిస్తూన్న అర్జునుడిని చూసి ‘మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు?! ఎవరు మీకు కుమారుడు?!’ అని ఆశ్చర్యంగా అడిగాడు Ex- అభిమన్యుడు!

"అంతే! సత్యం తేటతెల్లం కావడంతో చప్పున కళ్ళు తెరుచుకున్న అర్జునుడు మారుమాట్లాడకుండా కృష్ణుడి వెంట భూలోకానికి తిరిగి వచ్చేసి .. మళ్ళీ గాండీవాన్ని చేతపట్టి కర్తవ్యపాలకుడు అయ్యాడు" అంటూ అందరిచే " ‘నో’ మరణం " .. " ‘నో’ కర్మకాండలు" అని పత్రీజీ చెప్పించారు! అనంతరం "నానాటి బ్రతుకు నాటకము" అన్న అన్నమాచార్య కీర్తన పాడుతూ అందరిచే ధ్యానం చేయించారు!

అనంతరం "నానాటి బ్రతుకు నాటకము" అన్న అన్నమాచార్య కీర్తన పాడుతూ అందరిచే ధ్యానం చేయించారు!
ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులు "నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి" గారు ఆత్రేయపురం మండలం "పేరవరం" గ్రామంలో గోదావరి నదీమ తల్లి ఒడ్డున అవుతూన్న "వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం" యొక్క అభివృద్ధి విశేషాలను తెలియజేశారు.

భీమవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ "తటవర్తి వీర రాఘవరావు", "తటవర్తి రాజ్యలక్ష్మి"గార్లు; రాజమండ్రి చిట్టూరి కల్పనా, మూర్తిగార్లు; విజయవాడ జక్కా రాఘవరావుగారు; అమలాపురం ఇళ్ళ శ్రీరామమూర్తి గార్లు తమ తమ సందేశాలను ఇచ్చారు. చక్కటి రుచికరమైన భోజన కార్యక్రమంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది!

నల్లమల్లి అన్నపూర్ణ

 మండపేట - తూర్పుగోదావరి జిల్లా

- 92466 59985.

 

Go to top