"భగవంతుడు ధ్యానం రూపంలో నాకు దొరికాడు"

 

నా పేరు "రమాదేవి". నాకు 2015 ఏప్రిల్ నుంచి మెదడుకు సంబంధించిన సమస్యవల్ల నరాల బలహీనత వచ్చి భయంకరమైన ఫిట్స్ రావడం మొదలయ్యింది. ఎన్నో హాస్పిటల్స్‌కు వెళ్ళి ఎందరెందరో డాక్టర్లను కలిశాం. రకరకాల పరీక్షలు చేసి వాళ్ళు ఇచ్చిన మందులకు వేలకు వేలు ఖర్చు అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉండేది. ఏదైనా పనిమీద బయటికి వెళ్ళాల్సివస్తే ఇంతే సంగతులు!

ఒకసారి మా పాపను చూడటానికి ట్రైన్‌లో బెంగళూరు వెళ్తూండగా ఫిట్స్ వచ్చాయి. బెర్త్‌పై పడుకున్న నేను క్రిందపడిపోయి లోయర్ బెర్త్ క్రిందకు వెళ్ళి కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాను. అప్పటి వరకూ ప్రక్కసీట్లో ఉన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే ఉన్న నాకు అలా కావడంతో పాపం వాళ్ళంతా బిక్కచచ్చిపోయారు.

ఈ గోలకు ప్రక్క కంపార్ట్‌మెంట్‌లో ఉన్న అయ్యప్పస్వాములు వచ్చి నన్ను బెర్త్ క్రిందినుంచి బయటికి లాగి .. నా అరికాళ్ళనూ, అరిచేతులనూ బలంగా రుద్దారు. చాలాసేపటికి తేరుకున్న నాతో నీళ్ళు త్రాగించి నన్ను కూర్చోబెట్టి వెళ్ళారు.

అలాగే ఇంకోసారి వైజాగ్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్ళిన నాకు ఫిట్స్ వచ్చి నా మెడలో ఉన్న బంగారు గొలుసును ముక్కలు ముక్కలుగా తెంపేశాను. నల్లపూసల దండను తెంపి విసిరేశాను. భరించలేనంత తలనొప్పితో నరాలు చిట్లిపోయినట్లు నరకం అనుభవించాను.

ఇలాంటి క్రమంలో ఒకసారి మేము ఉంటున్న "వర్షిణి అపార్ట్‌మెంట్స్"లోని పిరమిడ్ మాస్టర్ పార్వతి గారు "మీరు చాలా నీరసంగా ఉన్నారు; మీ ఆరోగ్యం బాగాలేకపోతే రోజూ ధ్యానం చేసుకోండి; మీకు బాగుంటుంది" అని చెప్పి వైజాగ్ పిరమిడ్ మాస్టర్ రామాచారిగారి ఫోన్ నెంబరు ఇచ్చారు. అసలు జీవితం మీదే విరక్తి చెంది ఉన్న నేను "సరే చెప్పారు కదా .. వెళ్ళి చూద్దాం ఒకసారి" అని వెళ్ళాను.

అక్కడ "శ్రీ రామాచారి" గారు చెప్పినట్లు ధ్యానం చేయడం మొదలుపెట్టిన పదిరోజులకే నాలో ఎదో తెలియని మార్పు వచ్చింది ఆ పదిరోజులలో ఒక్కసారి కూడా ఫిట్స్ రాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. "సరే ఆరోగ్యం మెరుగుపడుతోంది కదా" అనుకుని ధ్యానాన్ని మరింత శ్రద్ధగా కొనసాగిస్తూ వచ్చాను. ఇంతలో అక్కడి పిరమిడ్ మాస్టర్స్ అందరూ మాడుగుల గ్రామంలో నిర్మించబడిన "విశ్వకాంతి పిరమిడ్ శక్తిక్షేత్రాని"కి వెళ్తూంటే వారితోపాటు నేను కూడా వెళ్ళాను.

ఆ శక్తిక్షేత్రంలో నేను చేసిన ధ్యానం .. నా శరీరాన్నంతటినీ అత్యంత శక్తివంతం చేసింది. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా, రకరకాల టెస్టులూ, స్కానింగ్‌లు చేసినా తగ్గని నా అనారోగ్యం .. కేవలం అక్కడ నేను చేసిన ధ్యానంతో మాత్రమే తగ్గి నేను పూర్తి స్వస్థత పొందాను. నేను ఇన్నేళ్ళుగా పూజిస్తూన్న భగవంతుడు ధ్యానం రూపంలో నాకు దొరికాడు!

ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడికైనా ఒక్కదానినే హాయిగా, ఆనందంగా వెళ్ళి వస్తున్నాను. మా బంధువులూ మరి స్నేహితులూ నా ఆరోగ్యంలో వచ్చిన అద్భుతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ధ్యానాన్ని నేర్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది!

 

P.రమాదేవి

 విశాఖపట్టణం
-95538 01801.

 

Go to top