"ఆధ్యాత్మిక సస్యశ్యామలత"


తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, కు చెందిన ఆధ్యాత్మిక గురువు శ్రీ వెంకటరమణ గారు "కోఠీ" ప్రాంతంలో స్థిరపడ్డారు. పిన్నవయస్సు నుంచే వివిధ ఆధ్యాత్మిక సాధనలు చేసి .. "చైతన్యానంద స్వామి"గా ప్రసిద్ధి చెందిన వారు తమ అనుభవ జ్ఞాన సంపదను కొంత మనకు పంచుతున్నారు.


- M. స్వర్ణలత.

స్వర్ణలత: "నమస్కారం స్వామీజీ! మీ గురించి విస్తారంగా తెలుసుకోగోరుతున్నాం .."
స్వామీజీ: " స్వామి చిన్మయానంద’ గారి శిష్యురాలైన మా మేనత్త ‘విమలమ్మ’ గారి ద్వారా నేను నా చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం జరిగింది. "మా పెద్దలు అందరూ కూడా ‘స్వామీ దయానంద సరస్వతి’ గారి యొక్క ‘ఆర్యసమాజ మార్గం’ లో ఉంటూ భగవంతుడిని సగుణ నిరాకారునిగా భావిస్తూ .. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు మా ఇంట్లో యజ్ఞం చేసేవారు.

"నాకు ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ‘స్వామీ చిన్మయానంద తపోవన్ మహారాజ్ శిష్యులు’ నాకు ‘గాయత్రీ దీక్ష’ను ఇచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు దానిని ఇంట్లోనే సాధన చేసుకుని నేను పదహారేళ్ళ వయస్సులో హిమాలయాలకు వెళ్ళాను.

"గంగానది ఒడ్డున ఉన్న స్వామి శివానంద ఆశ్రమానికి చెందిన స్వామి కృష్ణానంద మరి స్వామి ప్రేమానంద లు నన్ను తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి .. నాకు గాయత్రి మంత్రదీక్షను ఇచ్చారు.

"అక్కడ మూడు సంవత్సరాలు ఉండి విద్యారణ్య స్వామీజీ రచించిన విశ్వప్రసిద్ధమైన ‘వేదాంత పంచశతి’ గ్రంధాన్ని అధ్యయనం చేశాను. ఆశ్రమం చుట్టుప్రక్కల కొండలలో, గుహలలో మరి అరణ్యాలలో వారి ఆశీర్వాదాలు తీసుకునేవాడిని.

స్వర్ణలత: "జనజీవన స్రవంతిలోకి ఎలా ప్రవేశించారు?"
స్వామీజీ: "వెల్లూరులో చిలుకమర్తి సుబ్బారావు గారు ‘దివ్యయోగ సమాజం’ స్థాపించి అప్పట్లో ధ్యానాన్ని ఎంతగానో ప్రచారం చేసేవారు. వేలకొద్దీ ప్రజలు దివ్యయోగ సమాజంలో చేరి శ్వాసానుసంధానం ద్వారా చక్కటి సమాధి స్థితిని పొందుతూ ఉండేవాళ్ళు.

"నేను కూడా వారి దగ్గర చేరి .. తీవ్ర ‘ఓంకార ధ్యానం’ చేసి `Talks with Ramana Maharshi' గ్రంథాన్ని అధ్యయనం చేశాను. ‘ఆధ్యాత్మిక మార్గసాధనలో అనుష్టానం చాలా ముఖ్యం’ అని తెలుసుకున్నాను.

"అక్కడి నుంచి పుట్టపర్తి సత్యసాయిబాబా ను కలుసుకుని .. వారి నుంచి ‘మనస్సును చంచలంగా ఉంచవద్దు; అరికట్టు; శ్వాసక్రమాన్నే ఇరవై నాలుగు గంటలూ గమనిస్తూ సత్యసాయి తత్వాన్నే లోకమంతా ప్రచారం చెయ్యి’ అన్న ఆదేశాన్ని పొందాను.

అలా శ్వాసక్రమం ద్వారా నిర్గుణధ్యానం చేసినప్పుడు నాకు హృదయంలో జ్యోతి కనపడేది. ఆ జ్యోతి నాకు ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధించేది.

"ఆ తరువాత శ్రీశైలం దగ్గర ఉన్న హఠకేశ్వరం చేరుకుని అక్కడ నలభై సంవత్సరాల నుంచి మౌనంలో ఉన్న ఒకానొక స్వామీజీని దర్శించుకుని .. వారి సమక్షంలో ఊర్థ్వముఖ ధ్యానం చేస్తూ పది సంవత్సరాలు గడిపాను.

"పుట్టపర్తి హాలు ప్రక్కన పెద్ద వృక్షానికి ‘ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస’ అన్న బోర్డును 34 ఏళ్ళ క్రితమే నేను వ్రేలాడదీశాను! "ఆ సమయంలో చుట్టూ ఉన్న అడవిలోనుంచి చిరుతలు, ఎలుగుబంట్లు కూడా వచ్చి మాతో సహవాసం చేసేవి! అక్కడ ఆశ్రమ విద్యార్థులకు నేను ధ్యానం, యోగం నేర్పించేవాడిని, అక్కడి నుంచి నేను మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి .. అక్కడ కొంతకాలం గడిపి .. మళ్ళీ అక్కడి నుంచి హంపీ, విజయనగరం వెళ్ళాను.

"కంచికి వెళ్ళి అక్కడ కంచి పీఠాధిపతులు ‘చంద్రశేఖరేంద్ర స్వామి’ గారిని దర్శించాను. "అక్కడి నుంచి ప్రకాశం జిల్లా ‘భైరవకోన’లోని కీకారణ్యాలలో సంచరిస్తూ .. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ నాలుగేళ్ళు గడిపాను. ఆ తరువాత సిద్ధలూరులో భక్తులు నా కోసం నిర్మించిన ఆశ్రమంలో 20 సంవత్సరాలపాటు ఉండిపోయాను. ఆ ఆశ్రమాన్నే ఆ తరువాత ‘సాయిబాబా’ గుడిగా మార్చి .. అక్కడ విరివిగా సత్సంగాలు, వేదాంత గోష్ఠులు నిర్వహించాను.

"ఆ ఆధ్యాత్మిక తరంగాల ఫలితంగా గత యాభై సంవత్సరాలుగా కరువుకాటకాలతో బాధపడుతూన్న చుట్టుప్రక్కల పల్లెలన్నీ సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామల పంటసీమలుగా మారిపోయాయి! అదే సమయంలో నేను పుట్టపర్తి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను కూడా చాలాసార్లు దర్శించాను.


స్వర్ణలత: "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌తో పరిచయం ఎలా ఏర్పడింది?"
స్వామిజీ: "నేను మహానందిలో ఉన్నప్పుడు పత్రీజీ తమ స్నేహితులు విఠల్ రావు గారితో కలిసి మా దగ్గరికి వచ్చి కర్నూలులోని పిరమిడ్ నిర్మాణం గురించి చెప్పారు! నేను వెంటనే కర్నూలు వెళ్ళి అక్కడి పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేసుకున్నాను. ధ్యానయోగమే అన్నింటికంటే మించిన గొప్ప ఆధ్యాత్మిక సాధన అనీ ధ్యానంలో శ్వాసను గమనించడం ద్వారానే మనం సుళువుగా సమాధి స్థితిని పొందగలుగుతాం అనీ నేను ఆచరణపూర్వకంగా తెలుసుకున్నాను. లోకమంతా ధ్యానం నేర్పించాలనే తపన పత్రీజీలో నాకు కనబడింది!

"సర్వశ్రేష్ఠమైన ధ్యానం చేయడం వలన మనం విగ్రహారాధనలనూ, యజ్ఞయాగాదులనూ మరి సకల దేవతలకు అభిషేకాలనూ చేసిన గొప్ప ఫలితాన్ని ఏకకాలంలో పొందగలం’ అని తెలుసుకున్న క్షణం నుంచీ నేను పర్యటిస్తూన్న ప్రతి ఒక్క చోట కూడా ధ్యానప్రచారం చేస్తూ నా జన్మను తరింపజేసుకుంటున్నాను!"


చైతన్యానంద స్వామీజీ

హైదరాబాద్

 

 

Go to top