"ధ్యాన మాతృత్వం"

 

హాయ్..! నేను "దేవి". మాది "ఈతకోట" గ్రామం; తూర్పుగోదావరి జిల్లా నాకు పదిహేనళ్ళ వయస్సులో .. అంటే నేను ‘టీనేజ్’లో ఉన్నప్పుడే ధ్యానం గురించి తెలిసింది. అప్పటినుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేసుకుంటూనే చదువుతోపాటు నవీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలుసుకున్నాను. సత్యానికి అతి చేరువుగా ఉండే పత్రీజీ సందేశాలంటే నాకు ప్రాణం! వారు చెప్పే ప్రతి ఒక్క సందేశం నన్ను ఎంతగానో ఆలోచింపజేసేది!

2002 సం||లో మొట్టమొదటిసారి నేను పత్రీజీని పిరమిడ్‌వ్యాలీ, బెంగళూరులో కలిసి అదేరోజు శాకాహారిగా మారిపోయాను. అప్పటినుంచీ నా ఆలోచనలలో వచ్చిన గొప్ప మార్పులనూ మరి నాలో సంకల్పశక్తి పెరగడాన్నీ నేను స్పష్టంగా చూసుకున్నాను.

ఒక విద్యార్థిగా నేను చిన్నప్పటి నుంచీ ఎవ్వరేం చెప్పినా నమ్మేయకుండా అందులో శాస్త్రీయతను పరిశీలించేదానిని. అలాగే ధ్యానం గురించి కూడా స్వయంగా తెలుసుకుని ధ్యానం ద్వారా నేను పొందుతోన్న ఫలితాలు అత్యంత శాస్త్రీయంగా ఉండడంతో .. అవి అన్నీ నాలాంటి విద్యార్థులందరికీ అందాలని తహతహలాడే దానిని. ధ్యానంలో నేను పొందుతూన్న అంతరంగ ప్రశాంతతను అందరూ పొందాలన్న కోరికతో ‘విద్యార్థిని’గా ఉన్నప్పుడే తూర్పుగోదావరి జిల్లాలోని దాదాపు 40 గ్రామాలలో ధ్యాన ప్రచారం చేశాను. వివాహం తరువాత మా వారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాను.

అక్కడ నాకు "పూర్వజన్మ ప్రతిగమన శాస్త్రవేత్త" మరి "క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ" వ్యవస్థాపకులు "డా|| న్యూటన్ కొండవీటి"గారిని కలిసే అవకాశం దొరికింది. క్రమం తప్పకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న "లైఫ్ రీసెర్చ్ అకాడెమీ"కి వెళ్ళి అనేక వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. అక్కడ వారు బోధించే "ధ్యాన మాతృత్వం" అన్న అంశం పట్ల నేను విపరీతంగా ఆకర్షితురాలినయ్యాను.

ఈ క్రమంలో ఒకసారి నేను కడ్తాల్, కైలాసపురి "మహేశ్వర మహాపిరమిడ్" లో ధ్యానం చేసుకుంటూ ఉండగా "ధ్యాన మాతృత్వం"పై ఒక పుస్తకం వ్రాయమని నా అంతరంగం నుంచి ఒక సందేశం వచ్చింది! వెంటనే నేను కార్యరంగంలోకి దూకి "ధ్యాన మాతృత్వం"పుస్తకాన్ని రూపొందించాను.

ఎంతోమంది తల్లులు, కాబోయే తల్లులు, మాస్టర్స్ ఆ పుస్తకం చదివి స్ఫూర్తి చెందామని చెప్పారు. చాలా తక్కువ సమయంలోనే అది నాలుగు ముద్రణలు పూర్తిచేసుకుంది!

ప్రస్తుతం నేను .. మా వారు "సూర్య"గారి ఉద్యోగ రీత్యా .. అమెరికా దేశంలోని న్యూజెర్సీ నగరంలో స్థిరపడ్డాను. మాకు ఇద్దరు పిల్లలు. 9సం||ల పాప "ప్రజ్ఞ" మరి 22 నెలల పాప "నిర్వాణ".

ప్రతిరోజూ మేము చేస్తోన్న ధ్యాన ప్రచారం మాకు అందరితో చక్కటి స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి సహాయం చేస్తోంది. ఇలా మా జన్మ లక్ష్యంగా దిశగా ప్రయాణిస్తూ .. మా జీవితాలను ధన్యం చేసుకుంటున్నందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇంత చక్కగా మార్గదర్శనం చేసే గొప్ప గురువు నాకు ఉన్నందుకు నేను సృష్టికి సదా కృతజ్ఞురాలిగా ఉంటాను.

 

దేవి సూర్య చక్కా

 న్యూజెర్సీ - USA

e-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top