"మహోన్నత శక్తి ప్రదేశాలు"

 

"కొన్ని ప్రదేశాలను మనం సందర్శించినప్పుడు మనకు ఉన్నట్లుండి ఎంతో ప్రశాంతంగా మరి శక్తివంతంగా మారిపోయినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉండటానికి కారణం ఏమిటి? అలాంటి అనుభవాలు, అనుభూతులు కొన్ని నిర్ధిష్ట ప్రదేశాలకే ఎందుకు పరిమితమై ఉంటాయి?" అంటూ మనలో అప్పుడప్పుడూ ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, పూర్వజన్మ ప్రతిగమన నిపుణులు మరి వికారాబాద్ లోని "క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ" వ్యవస్థాపకులు "డా|| న్యూటన్ కొండవీటి" గారు ఇలాంటి భూమండలం యొక్క శక్తిక్షేత్రాల ఔన్నత్యాన్నీ .. తిమింగలాలు మరి డాల్ఫిన్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతనూ .. తెలియజేస్తూ .. "వ్యసనాల నుంచి విముక్తులు కావటం ఎలా? ఇతరులకు మనం హీలింగ్ ఎందుకు చేయకూడదు?" అనే ఆసక్తికరమైన సందేహాలకు కూడా అర్థవంతమైన మరి ఆచరణ యోగ్యమైన సమాధానాలు అందించారు. అవి మీ కోసం ..


- ఎడిటర్.

దీప్ శిఖాధన్కర్: "నమస్కారం డా|| న్యూటన్ గారూ! ‘పవర్ స్పాట్స్ - ఉన్నత శక్తి ప్రదేశాలు’ అంటే ఏమిటి? మనం అలాంటి ఓ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ స్థలం మన శక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?"
డా|| న్యూటన్ గారు: ఈ భూగ్రహం మీద జీవిస్తూన్న సకల ప్రాణికోటిలాగే .. మన భూమాత కూడా సజీవమైన శ్వాసించే దివ్యమూర్తియే కనుక మనందరిలానే తన శరీరమైన ఈ భూగోళంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల నుంచి మన భూమాత తన శ్వాస ద్వారా మరింత శక్తి వెదజల్లుతూ ఉంటుంది.

ఏదైనా ఒక ప్రకృతి ప్రదేశంలో పృథ్వి, జల, అగ్ని, వాయు, ఆకాశం మొదలైన పంచభూతాలన్నీ పరిపూర్ణ సామరస్యంలో ఉంటే అక్కడ ఆ యా ప్రత్యేకమైన విన్యాసంతో కూడిన ఉన్నత శక్తిక్షేత్రాలు అంటే .. ‘పవర్ స్పాట్స్’గా ఏర్పడతాయి. ఇవి భూ ఉపరితలం క్రింద శక్తిరేఖలుగా ప్రవహిస్తూ .. ఎక్కడైతే ఎక్కువగా కలుసుకుంటాయో .. అది ఒక మహత్తరమైన స్థానంగా ప్రకాశిస్తుంది.

ప్రతి ఒక్కరూ .. మరి ధ్యానులుగా కానివారు కూడా .. ఆ యా ప్రదేశపు ఉన్నతశక్తి ప్రవాహాలను అనుభూతి చెందగలరు. వీటినే సామాన్య జన పరిభాషలో "పుణ్య తీర్థాలు" .. "దివ్య క్షేత్రాలు" అంటూంటారు. మన ప్రాచీనులు కొన్ని ప్రదేశాల గొప్పతనాన్ని గుర్తించి అక్కడ ‘ఆలయాలు’ మరి ‘ఆరామాలు’ కట్టించటం వల్ల అవి ధార్మిక, మత మందిరాలుగా ప్రసిద్ధి చెందాయి. మరెన్నో ఉన్నత శక్తి క్షేత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతూన్నాయి.

కొందరు ఈ శక్తికేంద్రాలను, ఈ శక్తి వలయాలను, మరి ఈ శక్తివనరులను పూర్తిగా "భ్రమ" అని భావించినా ఆధునిక విజ్ఞానశాస్త్రం మాత్రం ఈ ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞాన రహస్యాలను యదార్థసత్యం అని ఋజువు చేయటం మొదలుపెట్టింది.

ఇలాంటి ప్రకృతి ప్రదేశాలను సందర్శించి, అక్కడ ధ్యానం చేయటం, ధార్మిక వేడుకలను నిర్వహించుకోవటం వలన భూమాతతో మనం గాఢానుబంధాన్ని ఏర్పరచుకోవటమే కాకుండా మన ప్రాణమయకోశంలోని చక్రాలను ఉత్తేజితం చేసుకుని విశ్వమయప్రాణశక్తికి ప్రధాన వాహకంగా మారతాము.

భూమి యొక్క శక్తిక్షేత్రాల ప్రవేశద్వారం దగ్గర ధ్యానం చేసినప్పుడు మనం మన అంతరంగం ద్వారా ఉన్నత తలాలకు చెందిన శక్తి ప్రకంపనలతో అనుసంధానం అవుతాం.

మానవదేహంలో 12 పొరల సూక్ష్మశరీరాలు కొలువై ఉంటాయి. అలాగే భూమికి కూడా 12 పొరలు ఉంటాయి. మనం భూమి యొక్క క్రియాశీలంగా పనిచేస్తూన్న చక్రాలలో దేనికి సమీపంగా ఉంటామో, అదేవిధమైన శక్తిని సంతరించుకుంటూ బహుళ తలాల పరిస్థితులనూ, అనుభవాలనూ పొందుతూ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం.

1. మూలాధార చక్రం - ఉత్తర అమెరికాలోని మౌంట్ శాస్తా: కాలిఫోర్నియా మౌంట్ శాస్తా మూలాధార చక్రపు శక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది ఎంతోమంది దివ్యాత్ములకు నిలయంగా భాసిస్తోంది. వాళ్ళల్లో ఎసెండెడ్ మాస్టర్స్, ఫెయిరీస్‌తో సహా మానవులకు ఉన్నత ఆధ్యాత్మిక పథాన్ని నిర్దేశించే మార్గదర్శకులు ఎందరో ఉన్నారు.

అతి పురాతాన నాగరికత అయిన "లెమూరియన్ సంస్కృతి"లో ఈ ప్రదేశం అంతర్భాగమనీ, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించిన అమరులు ఎందరో అక్కడి నుంచే సాధన కొనసాగిస్తూ ఉన్నారనీ ప్రజలు నేటికీ విశ్వసిస్తున్నారు.

2. స్వాధిష్టాన చక్రం - దక్షిణ అమెరికాలోని "టిటికాకా సరస్సు": దక్షిణ అమెరికాలోని పెరూ నగరంలో ఉన్న "టిటి కాకా సరస్సు" దగ్గర స్వాధిష్టాన చక్రపు శక్తి ప్రవహిస్తూంటుంది. అక్కడ సంతాన సాఫల్యత, లైంగిక, భావోద్వేగ సమస్యలవంటివన్నీ చేకూర్చుకోవచ్చు అనే నమ్మకం ప్రజలలో ఉంది.

3. మణిపూరక చక్రం - ఆస్ట్రేలియాలోని ఉలురు, కటజుట: ఆస్ట్రేలియా నడిబొడ్డున ఉన్న ఉలురు - కటజుట భూగ్రహపు మణిపూరక చక్రంగా భావిస్తాం. ఈ ప్రాంతం భూమి యొక్క మరి దానిపై ఉన్న సకలప్రాణుల యొక్క క్రియాశీలశక్తిని పెంచి పోషించటంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. కనుక ఆస్ట్రేలియన్ ఆదిమజాతులన్నీ ఈ ప్రాంతాన్ని (ఏయర్స్ రాక్) పవిత్ర స్థలంగా ఆరాధిస్తారు. వాళ్ళు ఇక్కడి శిలలను స్పర్శించి తమ పూర్వీకుల ఆత్మలనుంచి దివ్యాశీస్సులు పొందుతారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ శిలారూపాలు నంతరించుకునే వర్ణాలు మరి అవి వెదజల్లే శక్తులు వర్ణనాతీతంగా ఉంటాయి.

4. అనాహత చక్రం - ఇంగ్లాండ్‍లోని "గ్లాస్టన్‌బరీ మరి షాప్ట్స్బరీ" ప్రాంతం: మధ్యయుగకాలంనుంచీ అనాహతశక్తిని వెదజల్లుతూ ఉన్న ఈ నగరాలు ప్రతి ఒక్కప్రాణి, .. మరొక ప్రాణిపట్ల అవ్యాజ్యమైన ప్రేమ కరుణలను కురిపించి తద్వారా భూమియొక్క పౌనఃపున్యాన్ని ఉన్నతంగా మార్చటంలో సహాయపడుతున్నాయి. ఈ ప్రాంతం ఇంగ్లాండ్‌కు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికే హృదయం అని చెప్పవచ్చు.

5. విశుద్ధి చక్రం - ఈజిప్ట్‌లోని గ్రేట్ గీజా పిరమిడ్స్: మధ్య ప్రాచ్యంలోని సుప్రసిద్ధమైన భారీ పిరమిడ్ నిర్మాణాలను భూమియొక్క విశుద్ధచక్రంగా పోల్చవచ్చు. భౌగోళికంగా చూస్తే కేవలం ఇది ఒక్కటే కానీ సరిగ్గా భూమికి మధ్య భాగంలో ఉంటుంది. ప్రాచీన అట్లాంటియన్ నాగరికత యొక్క నిర్మాణాలు ప్రాచీన మరి ఆధునిక ఆధ్యాత్మికతలకు "కేంద్ర బిందువు"అని చెప్పవచ్చు.

ఇక్కడ చేసే ధ్యానంవల్ల మనం మన ఆత్మతో నేరుగా అనుసంధానమై .. మన జీవిత లక్ష్యాన్ని గ్రహించటమే కాక భూమి యొక్క పరిణామప్రక్రియలో సకలసృష్టితో సహా మన వంతు పాత్రను గుర్తించుకుని అందుకు తగిన అతీంద్రియ జ్ఞానాన్ని పొందుతాం.

6. ఆజ్ఞాచక్రం - స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌లోని "స్టోన్ హెంజ్": ఆరవదైన ఆజ్ఞాచక్రం ద్వారా ఇతర ఉన్నత తలాల నుంచి దివ్యనేత్రపుశక్తి ఈ భూమిని చేర్చే ద్వారాలుగా ఈ ప్రదేశం వ్యవహరిస్తోంది.

స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌లోని స్టోన్ హెంజ్ అనే పవిత్ర స్థలాలు దివ్యనేత్రపుశక్తిని ద్విగుణీకృతం చేసేవిగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్‌లో ఉంది.

7. సహస్రారం - హిమాలయాలలోని "మౌంట్ కైలాస్": టిబెట్‌లోని హిమాలయ పర్వతశ్రేణులలో నెలకొని ఉన్న "కైలాసగిరి" సకల భూమండలానికే తలమానికమైన సహస్రారంగా భాసిల్లుతోంది. యుగయుగాలుగా సమస్త దేవతలకూ, సద్గురువులకూ, యోగిపుంగవులకూ పుట్టినిల్లుగా విరాజిల్లుతూన్న ఈ శిఖరాలు నిజంగా మహిమాలయాలే అనటంలో అతిశయోక్తి లేదు.

దీప్ శిఖాధన్‌కర్: "ఈ శక్తిక్షేత్రాలయొక్క ఉన్నతశక్తి ప్రకంపనలను స్వీకరించే ఉత్తమ మార్గం ఏదంటారు?"
డా|| న్యూటన్ గారు: అటువంటి దివ్యస్థలాలను మనం సందర్శించినప్పుడు .. కనీసం 3,4 రోజులయినా పగలూ-రాత్రి అక్కడే ఉంటూ, ఆ యా పర్వతాలు, నదీనదాల సమీపంలోనే నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. అందువల్ల మనం ఆ స్థలంలో అనుసంధానాన్ని ఏర్పరచుకుని ఆ శక్తిని స్వప్నాల ద్వారా అనుభవపూర్వకంగా గ్రహిస్తాం.

అటువంటి స్వప్నాలు మనకు దివ్యసంకేతాలనూ మరి గొప్ప సందేశాలనూ అందించే ఆధ్యాత్మిక ప్రబోధాలని తెలుసుకోవాలి. వాస్తవానికి ఈ పవిత్రస్థలాలలో ప్రత్యేకించి ధ్యానం చేయవలసిన అవశ్యకత కూడా ఉండదు. అక్కడ ఊరికే ఉన్నా చాలు మన మనస్సును నిశ్చలం చేసినప్పుడు, తార్కిక మనస్సు లేకుండా పోయినప్పుడు మనల్ని మార్గనిర్దేశం చేయటానికి మనలో నుంచి సహజావబోధ పెల్లుబుకుతుంది.

దీప్ శిఖాధన్‌కర్: "ఇలాంటిచోట్ల మీకు ఏమైనా మరచిపోలేని అనుభవాలు ఎదురయ్యాయా?"
డా|| న్యూటన్ గారు: "బర్ముడా ట్రయాంగిల్" కి అతి సమీపంలో ఉండె "కెనరీ ద్వీపం" లోని "టెనెరిఫ్" అనే శక్తిక్షేత్రంలో నాకు గాఢమైన అనుభూతులు ఉన్నాయి.

సాధారణంగా ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలోని డాల్ఫిన్స్ మరి తిమింగలాలను సదర్శించటానికి జనం తండోపతండాలుగా వస్తూంటారు. మా పడవ సముద్రంలోకి వెళ్తూన్నప్పుడు ఒకానొక చోటుకి చేరుకోగానే గొప్ప ప్రశాంతతనూ, ఆ తర్వాత కొందరు దివ్యాత్మల ఉనికినీ అనుభూతి చెంది నేను నిశ్చలంగా మారిపోయాను. మెల్లిమెల్లిగా నేను ధ్యానమగ్నుడిని అయ్యాను.

దాదాపు ఐదు నిమిషాలలోనే, ఆకాశంలో ఉన్నట్టుండి మార్పులు సంభవిస్తూ, మేఘాల వివిధరకాల దివ్యాత్ములు మరి దేవదూతల రూపాలను సంతరించుకోసాగాయి. సూర్యస్తమయ సమయానికి మా చుట్టూ వందలాది తిమింగలాలు వచ్చి చేరాయి. అవి మా ఎదుట నిలిచి, ఆహ్లాదకరమైన రీతిలో శ్వాస తీసుకోసాగాయి. "సాధారణంగా అవి తమకన్నా ఉన్నతమైన దివ్యశక్తికి తమను తాము హృదయపూర్వకంగా అర్పించుకునే విధానం అది" అని తెలుసుకుని నేనెంతో మధురానుభూతికి లోనయ్యాను!

దీప్ శిఖాధన్‌కర్: "మనం తరచూ వింటూన్నట్లుగా, డాల్ఫిన్, తిమింగలాలు అనేవి మానవులకు స్వస్థత చేకూర్చగలవంటారా?"
డా|| న్యూటన్ గారు: డాల్ఫిన్స్ మరి తిమింగలాలు యొక్క ఆత్మవికాసం ఉన్నతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే బహూశా "మానవులకన్నా అధికంగా ఉంటుంది" అని చెప్పవచ్చు.

మేము కెనడా వెళ్ళినప్పుడు మా బృందంతో ఒకానొక అపరిచిత మహిళ కూడా రావటం జరిగింది. ఒక తిమింగలం వచ్చి ఆమెను తాకింది. అంతే! ఆవిడ తనకు ఏదో జరిగిపోయినట్లు వణికిపోయారు. అయితే తాను పరమానందస్థితిని పొందానని ఆమె చెప్పారు. ఆ తర్వాత తాను క్యాన్సర్ పేషంట్‌ననీ, ఆ తిమింగలం వచ్చి తాకినప్పుడు తన శరీరంలో బలమైన శక్తి ప్రకంపనలను అనుభుతి చెందాననీ చెప్పారు.

ఇదంతా కూడా ఆరోగ్యాన్ని శుద్ధిచేసే ప్రక్రియలో భాగమేనని వివరించారు. ఇది జరిగిన నాలుగు నెలలకు ఆమె తన క్యాన్సర్‌ను పూర్తిగా స్వస్థపరచుకున్నానని మాకు నివేదిక పంపారు. నేను కూడా ఈ అద్భుతమైన జీవుల ద్వారా స్వస్థత పొందాను. నాలో ఏ మూలనో, మా అమ్మగారితో ఉండే అనుబంధంలో భావాతీతమైన లోటు ఉండేది. ఆవిడంటే నాకు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ, నేను ఏనాడూ వెళ్ళి ఆమెను మనసారా అక్కున చేర్చుకోలేకపోయేవాడిని.

మా పర్యటనలో భాగంగా ఓసారీ తల్లీ, బిడ్డలైన తిమింగలాలను సందర్శించాం. ఆ తల్లి తిమింగలం నా ఎదుట నిలువెత్తున నిలిచి నేరుగా నా కళ్ళల్లోకి తన అవ్యాజ్యమైన ప్రేమను ప్రసరింపజేసింది. వెంటనే నాలో దుఃఖం పెల్లుబికి, నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఆ క్షణం మా అమ్మ గురించి తపించాను. తిరిగి మేము ఇండియా రాగానే అమ్మకీ, నాకూ మధ్య ఉన్న చిన్న అడ్డుతెర పూర్తిగా తొలగిపోయింది.

నేను సరాసరి మా అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె పాదాలపై పడి తనివితీరా ఏడ్చాను. అంతేకాదు నా జీవితంలో మొట్టమొదటిసారి అమ్మను ఎంతో అప్యాయంగా కౌగలించుకున్నాను కూడా. చిన్నప్పుడు నన్ను తనకు దూరంగా, బామ్మ దగ్గర వదిలిపెట్టిందనే ఉక్రోషం కన్నీరై కరిగిపోయింది. అలా ఆ తల్లి తిమింగలం యొక్క ప్రేమ నన్ను సంపూర్ణంగా స్వస్థత పరచింది.

దీప్ శిఖాధన్‌కర్: "ధ్యానం చేస్తున్నప్పుడు మనలో వచ్చే ఆలోచనలు ‘ఏవి యదార్థమైనవి’ మరి ‘ఏవి ఊహాజనితమైనవి‘ అని విభజించి ఎలా తెలుసుకోగలం?"
డా|| న్యూటన్ గారు: మొదట "శ్వాస మీద ధ్యాస" ధ్యానం ద్వారా మనం మనయొక్క తార్కికమైన ఆలోచనలను అదుపు చేస్తే .. ఆ తర్వాత ఆలోచనారహిత స్థితిలో వచ్చేవి "మన అనుభవాలు" అని గ్రహిస్తాం. అవి సాధారణమైన ఆలోచనలు కావు. ఇవి మన గత అనుభవాల పరంపరపై ఆధారపడినవి కానీ లేదా భవిష్యత్ ఆకాంక్షలకు అనుగుణమైనవి కానే కావు. వాటన్నింటికీ అతీతమైన అంతర్దృష్టి అనుభవాలే అవి.

దీప్ శిఖాధన్‌కర్: "వ్యసనాలు, దురలవాట్లను ఎలా మానుకోవచ్చు?"
డా|| న్యూటన్ గారు: ఎప్పుడైనా సరే, వ్యసనాల వంటి వాటిని సమూలంగా స్వస్థత పరచుకోవాలి. వ్యసనపరుల తమ అంతరాంతరాలలో మోస్తున్న బాధలను తరచి చూసుకోవాలి. ఉదాహరణకు, మద్యానికి బానిస అయిన ఒక మహిళ చివరకు మమ్మల్ని సంప్రదించారు.

ఎన్నివిధాల ప్రయత్నించినా ఆ దురలవాటును మానుకోలేకపోతోంది. అప్పుడు నేను ఆమెను తన జీవనశైలి గురించి వివరించమని కోరాను. వాళ్ళ కుటుంబంలో ఆమె ఒక్కతే సంపాదించే వ్యక్తి. ఆమె సంపాదనంతా ఖర్చు పెడుతూ భర్త మితిమీరి ప్రవర్తిస్తూండేవాడు. ఆమె ఎంతో బాధను అనుభవిస్తూ చివరకు మద్యానికి బానిస అయ్యింది. తనయొక్క భావోద్వేగాల భారానికీ మరి మద్యానికి అలవాటు పడటానికి మధ్య సంబంధం ఉందని చెప్పాను.

మొదట బాధను పోగొట్టుకుంటేనే వ్యసనం నుంచి బయట బయట పడవచ్చు. మనలో చాలామంది అనవసరమైన సిగ్గు, పశ్చాత్తాపం మొదలైన ప్రతికూల భావాలను మోస్తూ ఉంటారు. వాస్తవానికి ఏవిధమైన వ్యసనాలకైనా అలవాటు పడే మౌలిక కారణాలు ఇవే అవుతాయి.

దీప్ శిఖాధన్‌కర్: "మన సుప్తచేతనాస్థాయిలో ఏర్పడిన దురలవాట్లను సమూలంగా తొలగించుకోవటం సాధ్యమేనంటారా?"
డా|| న్యూటన్ గారు: సంకల్పశక్తితో దేన్నైనా సాధించగలం. ఉదాహరణకు ఒకరు పదేపదే తమను మోసగించే భాగస్వామిని సంబంధ బాంధవ్యాలలో ఆకర్షిస్తున్నారు అనుకుందాం. దానినుంచి బయటపడటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రతిగమనం, రెండవది ఓదార్పు.

ఈ జీవితంలో గతంలో .. లేదా పూర్వజన్మలలో .. ఈ విధమైన నమూనా ఎక్కడ, ఎప్పుడు ఆరంభం అయ్యిందో ఆ మూలకారణానికి తీసుకువెళ్ళాలి. సాధారణంగా ఇవి కర్మ బంధాలవల్ల ఏర్పడి ఒకేవిధమైన అనుభవం పదేపదే పునరావృతం అయ్యేలా చేస్తాయి.

అయితే వీటి వెనుక ఉన్న కర్మపాఠాన్ని నేర్చుకోనప్పుడు నమూనాలను మళ్ళీ మళ్ళీ ఆకర్షిస్తూ జీవితాంతం ఒకేవిధమైన అనుభవాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

ఒకానొక ఆత్మ తన జీవితపాఠాలను నేర్చుకున్న తర్వాతి జన్మలలో నూతన జీవన బాంధవ్యాలకు సంసిద్ధం అవుతుంది. కానీ ముందు,వాళ్ళు స్వయంగా గత బంధాలనుంచి విడుదల కావాలి. ఆ యా శక్తి తంతువులనూ వ్యక్తులనుంచి మళ్ళించాలి. ఈ ప్రక్రియలో "కన్సోలేషన్" ఎంతగానో తోడ్పడుతుంది.

"ఇంతకాలం మనం కలిసి పంచుకున్న అద్భుతమైన క్షణాలను కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు ఇక్కడినుంచి నేను బయటకు వెళ్తున్నాను. మీ బంధం నుంచి నేను విడుదల అయ్యాను. నా బంధం నుంచి మిమ్మల్ని విడుదల చేశాను."అని భాగస్వామికి చెప్పినప్పుడు కర్మబంధం నుంచి విముక్తులు అవుతారు. అప్పుడు మరోవ్యక్తిని తమ జీవితంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించటానికి వీలు అవుతుంది.

దీప్ శిఖాధన్‌కర్: "మనం ఇతరులకు హీలింగ్ అంటే స్వస్థత చేయవచ్చా?"
డా|| న్యూటన్ గారు: "మనం ఎవ్వరూ కూడా ఇతరులకు హీలింగ్ చేయకూడదు" అని నేను స్పష్టంగా చెప్తున్నాను. పూర్వజన్మ ప్రతిగమన విధానంలో నేను ఎవ్వరినీ హీల్ చేయను. కేవలం తమ స్వీయ స్వస్థతా ప్రక్రియను వాళ్ళే చూసుకునేలా వారికి సహకరిస్తాను. అంతే.

ఉదాహరణకు ఒకవేళ ఎవరి క్యాన్సర్‌నైనా నేను హీల్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను వారి కర్మలో జోక్యం చేసుకున్నట్లు అవుతుంది. దానికి బదులు మొదట "క్యాన్సర్ జబ్బు బారిన వాళ్ళు ఎందుకు పడ్డారు?" .. "దాని మూలకారణం ఏమిటి?" .. "బాధితులు నేర్చుకోవలసిన కర్మపాఠాలు ఏమిటి?" అని వాళ్ళే స్వయంగా గ్రహించేలా చేయటం వరకే నా పాత్ర. లేదంటే నేను మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

కొన్నిసార్లు ఈ ప్రక్రియలో నా ప్రమేయం ఉండటంవల్ల అనర్ధాలు కూడా జరిగాయి. కరుణతో నేను వారి కర్మలో కొంతభాగాన్ని తీసుకోవటం జరిగింది. దాంతో ఆ వ్యక్తి యొక్క కర్మపాఠం విభజింపబడి .. క్షుణ్ణంగా నేర్చుకునే అవకాశాన్నికోల్పోవటం వల్ల .. నా జోక్యం వారికి ఏమాత్రం తోడ్పడలేకపోయింది.

అంతేగాక, నేనూ ఎంతో బాధను అనుభవించవలసి వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరి ‘హోమ్వర్క్’ వాళ్ళే చేయవలసి ఉంటుంది కదా! సరిగ్గా అలాగే అన్నమాట. మనం కేవలం స్ఫూర్తిపరంగా కొంత సహాయపడవచ్చు. అంతే! మరోప్రక్క మనం ఇతరులకు హీలింగ్ చేస్తున్నాం అంటే "వాళ్ళ సహజమైన స్వాభావికమైన స్వస్థతాశక్తి సామర్ధ్యాలను చులకన చేస్తున్నాం" అని గుర్తించాలి. మొక్కలకూ, జంతువులకూ మరి పది సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లలకు మాత్రమే మనం హీలింగ్ చేయవచ్చు.

దీప్ శిఖాధన్‌కర్: "మన చుట్టూ ఉన్నవారు మనలానే ఆధ్యాత్మికంగా లేనప్పుడు ఆ బంధంలో మనం ఎలా ఎదగగలం?"
డా|| న్యూటన్ గారు: అసలు ఈ సృష్టిలో దివ్యత్వాన్ని కలిగి లేనిదంటూ ఏదీలేదు. ప్రతి ఒక్కటీ దివ్యాత్మ స్వరూపమే .. ప్రతి ఒక్కరూ దివ్యాత్మస్వరూపులే. అయితే ఒక్కొక్కరూ తమ తమ స్థాయిలకు తగినట్లుగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు.

కనుక మనం మన చుట్టూ ఉన్నవారికన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో ఉంటే మరింత కరుణ, అవధుల్లేని ప్రేమతో వ్యవహరించినట్లైతే వారు కూడా మన స్థాయికి సుళువుగా ఎదుగుతారు.

మననుంచి వెలువడేశక్తి కూడా ఇతరులను ప్రభావితం చేస్తుంది కనుక ఆధ్యాత్మికం, భౌతికం అంటూ పేర్లు పెట్టి తీర్పులు చెప్పకూడదు. మనమంతా కూడా ఒకరికొకరు మానవత్వంతో అనుసంధానమై ఉంటాము.

ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్ళు కూడా తమ ఆత్మసత్యాన్ని తెలుసుకుంటారని ఆశించాలి. అప్పటిదాకా వాళ్ళు తమ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించటానికి స్ఫూర్తినిస్తే చాలు!

 

డా|| న్యూటన్ కొండవీటి

హైదరాబాద్

Go to top