"ధ్యానం ద్వారానే జీసస్ బోధనల అర్థం తెలుసుకున్నాను"

 

మహబూబ్‌నగర్ జిల్లా .. "కొత్తకోట"కు చెందిన .. S.R.ప్రేమయ్య గారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో నిబద్ధత, అంకితభావం కలిగి ఉన్న పిరమిడ్ మాస్టర్లలో ఒకరు.

ప్రతి ఒక్కరితో స్నేహభావంతో కూడి మెలిగే ప్రేమయ్య గారు గతంలో మహబూబ్‌నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, క్రియాశీలక రాజకీయల్లో చురుకైన పాత్రను పోషించి .. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులుగా, కడ్తాల్, కైలాసపురి "మహేశ్వర్ మహాపిరమిడ్ ట్రస్టీ ఇన్-చార్జ్" గా తమ సేవలను అందిస్తున్నారు.

పత్రీజీ ఆదేశాన్ని శిరోధార్యంగా ఎంచి తమకు అప్పగించిన పనిని అతి సమర్ధవంతంగా నిర్వహించి S.R. ప్రేమయ్య గారు .. ఇన్నర్ వ్యూ ద్వారా తమ ధ్యానానుభూతులను పంచుకుంటున్నారు.


- ఎడిటర్.

వాణి: "ప్రేమయ్య గారూ! మీ గురించి .. మీ ధ్యాన ప్రవేశం గురించీ తెలియజెయ్యండి!"
ప్రేమయ్య గారు: ప్రపంచవ్యాప్త పిరమిడ్ మాస్టర్లందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన "ధ్యానజగత్" పత్రికాముఖంగా నేను .. సమస్త పిరమిడ్ కుటుంబానికి ధ్యానవందనాలు తెలియజేసుకుంటున్నాను!

2000 సంవత్సరంలో ఒక మిత్రుడి ద్వారా నాకు ధ్యానపరిచయం జరిగింది. అప్పటి నుంచి 2002 వరకు క్రమం తప్పకుండా ధ్యాన శిక్షణా తరగతులకు వెళ్తూ, C.D. లలో పత్రీజీ ప్రసంగాలను శ్రద్ధగా వింటూ, నవీన ఆధ్యాత్మికతను సంబంధించిన పిరమిడ్ సొసైటీ ప్రచురణలను చదువుతూ .. రెండేళ్ళపాటు ఒక యజ్ఞంలా ధ్యాన-జ్ఞాన సాధనలతో నన్ను నేను పరిశీలించుకున్నాను.

అప్పుడు కానీ .. అంతవరకూ ఈ సమాజంలో ఒక ముఖ్య రాజకీయ నాయకుడిగా .. స్కూల్ కరెస్పాండెంట్‌గా .. భార్య నలుగురు పిల్లలతో కూడిన కుటుంబానికి పెద్దగా మరి .. అన్నింటినీ మించి షుగర్, బి.పి, వంటి జబ్బులతో బాధపడుతూన్న ఒక రోగిగా ఉన్న నేను .. "నా గురించి నాకు అస్సలు ఏమీ తెలియదు" అన్న సత్యం తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో "అశోకుడు బాటసారుల కోసం నీడనిచ్చే చెట్లను నాటించెను .. వారి ఆకలిదప్పులను తీర్చడానికి అన్నసత్రాలను కట్టించెను" అని చదివి నాకు కూడా "అలా చెయ్యాలి" అనిపించేది.

దాంతో అప్పట్లోనే నేను మా స్నేహితులతో కలిసి మా ఇంటి చుట్టుప్రక్కల మొక్కలు నాటి .. వాటి చుట్టూ కంచెలు, మట్టితో అరుగులు కట్టించి వాటిని సంరక్షిస్తూండేవాళ్ళం.

"పది మంది యొక్క మంచి కోసం ఏదో ఒకటి చెయ్యాలి" అనే కోరిక నాతో పాటే పెరిగి పెద్దవ్వడం మూలాన .. నా భార్య "శ్రీమతి భాగ్యమ్మ" సహకారంతో నేను కొత్తకోటలో St. Anns హైస్కూల్ పేరుతో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలును స్థాపించి .. అతి తక్కువ రుసుముతో పిల్లలకు విలువలతో కూడిన విద్యాబోధన చేసేవాళ్ళం.

వాణి: "మీ రాజకీయరంగ కార్యక్రమాలను గురించి వివరించండి!"
ప్రేమయ్య గారు: నా సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా ప్రజలకు అందించాలన్న తలంపుతో నేను 2000లో "తెలుగుదేశం పార్టీ" ద్వారా ఒక మామూలు కార్యకర్తగా మహబూబ్‌నగర్‌జిల్లా క్రియాశీలక రాజకీయాలలోకి ప్రవేశించాను. 2002 కల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎదిగాను.

ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి గౌరవ సభ్యులుగా ఉన్న డా|| మందా జగన్నాధం గారు నాకు ఎంతో సన్నిహితులు. సికిందరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో E.N.T. సర్జన్‍గా పనిచేస్తూన్న వారు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఇద్దరం కలిసి జిల్లా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో నేనుగా సంబంధాలు కలిగి వుండేవాళ్ళం.

జిల్లాలో నా చురుకైన పాత్రకు గుర్తింపుగా నేను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2004 లో రవీంద్రభారతి లో "శ్రమ శక్తి" అవార్డునూ మరొక సందర్భంలో "జిల్లా ఉత్తమ కార్యకర్త అవార్డు"తో పాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతినీ అందుకున్నాను.

వాణి: "మీరు చేసిన ధ్యానప్రచార విశేషాలు?"
ప్రేమయ్య గారు: నేను ధ్యానంలోకి రావడానికి ముందే .. మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పటికే బాగా విస్తరించి వున్న పిరమిడ్ ధ్యానం గురించీ మరి పత్రీజీ గురించీ తెలుసుకుని పిరమిడ్ మాస్టర్‌లను పిలిపించి మా కాన్వెంట్‌లోని పిల్లలకు ధ్యానం క్లాసులు చెప్పించేవాడిని. అలా "విద్యార్థులకు ప్రత్యేకంగా ధ్యానాన్ని నేర్పించి వారి మానసిక అభివృద్ధికి తోడ్పడుతోన్న పాఠశాల .. కొత్తకోట మండలంలో మాది ఒక్కటే" అని పేరెంట్స్ నుంచి చక్కటి గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత 2002లో నేను ధ్యానంలోకి వచ్చిన తరువాత .. నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులం అంతా కలిసి ధ్యానం చేసేవాళ్ళం. మధ్యాహ్నం పూట పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకుని స్కూలుకు వచ్చే పేరెంట్స్‌కు కూడా మా శ్రీమతి భాగ్యమ్మ ప్రత్యేక ప్రత్యేక ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహించేవారు. శాకాహార ప్రాముఖ్యత గురించి విద్యార్ధులకూ మరి వారి తల్లితండ్రులకూ విశేషంగా తెలియజేసేవాళ్ళం.

వాణి: "ధ్యానంలో మీరు పొందిన అనుభవాలను తెలపండి?"
ప్రేమయ్య గారు: పత్రీజీ బోధనలతొ కూడిన పుస్తకాలూ, "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగ్‌జైన్‌లూ చదువుతూ, ధ్యానం చేసుకుంటూ నేను దివ్యజ్ఞానప్రకాశస్థితిని పొందేవాడిని.
ఈ నేపధ్యంలోనే గత కొన్నొ సంవత్సరాలుగా నాకు ఉన్న డయాబెటీస్, రక్తపోటు మరి ఆస్తమా జబ్బుల నుంచి నేను పూర్తిగా విముక్తుడను అయ్యాను. ఇలా చక్కటి మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం మరి బుద్ధికుశలతలను కూడా పెంచుతూన్న ధ్యానాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందజెయ్యాలని అనుకున్నాను.

వాణి: "మీరు ఢిల్లీ "ఆంధ్రప్రదేశ్ భవన్"లో అద్భుతమైన ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారని అందరూ చెప్పుకుంటారు .. దాని వివరాలు .."
ప్రేమయ్య గారు: 2004లో పత్రీజీ అనుమతి తీసుకుని .. ఒక రాజకీయ నాయకుడిగా నాకు ఉన్న పరిచయాలతో ఢిల్లీలోని "ఆంధ్రప్రదేశ్ భవన్"లో పార్లమెంట్ సభ్యుల కోసం ధ్యాన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పార్లమెంటు సభ్యులు, MLA లు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల వారు కూడా ఈ శిబిరంలో పాల్గొని ప్రశాంతంగా ధ్యానం చేసి పత్రీజీ సందేశాన్ని అందుకుని చక్కటి అనుభూతులను మూటకట్టుకున్నారు.

A.P. గౌరవ పార్లమెంట్ సభ్యులు కీ.శే. ఎర్రన్నాయుడు, డా||మందా జగన్నాధం, రావుల చంద్రశేఖర్ రెడ్డి గార్ల సహకారంతో జరిగిన ఆ ధ్యాన శిక్షణాకార్యక్రమం అందరి ప్రశంసలనూ అందుకుంది. ఎంతో మంది ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే కర్నూల్ పిరమిడ్ మాస్టర్ డా||పరమేశ్వర్ రెడ్డి, డోన్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి, బేతంచర్ల పిరమిడ్ మాస్టర్ మహానందయ్యగార్ల కుటుంబ సభ్యులతో అందరం కలిసి పదిరోజులపాటు ఢిల్లీలోని వివిధ కాలనీల్లో నివాసం ఉండే తెలుగువాళ్ళను కలిసి వాళ్ళకు ధ్యాన ప్రచారం నిర్వహించాం. ధ్యాన సమాచారంతో కూడిన బ్రోచర్లనూ, పుస్తకాలనూ వారికి విరివిగా పంచాం.

వాణి: "మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మువ్‌మెంట్ కోసం మరి పిరమిడ్ పార్టీ కోసం ఎప్పటి నుంచి పనిచేశారు?"
ప్రేమయ్య గారు: ఢిల్లీలో మేము చేసిన కార్యక్రమాల సందర్భంగా, పత్రీజీ నన్ను అభినందిస్తూ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‍మెంట్ యొక్క రాజకీయ విభాగం అయిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సారధ్య పగ్గాలను చేపట్టమని సూచించారు. "యధా ప్రజా తధా రాజా" అంటూ పాలకులను ఎన్నుకునేలా ప్రజలను జాగృత పరుస్తోన్న "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మ్యానిఫెస్టో" నాకు చాలా నచ్చి .. పత్రీజీ సూచనను నా ఆత్మపిలుపుగా తలచాను.

వెంటనే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకీ, అందులోని నా గౌరవ హోదాలకూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి .. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి అడుగుపెట్టాను.

వాణి: "మరి మీరు పిరమిడ్ పార్టీ తరపున ఎన్నికలలో పాల్గొనడం జరిగిందా?"
ప్రేమయ్య గారు: 2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో MP స్థానానికి నా సన్నిహితులైన మందా జగన్నాధం గారికే ప్రత్యర్థిగా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మా అబ్బాయి ఫెర్రీరాయ్ .. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేశాడు. ఈ సందర్భంగా వేలాది ధ్యానప్రచార కరపత్రాలను నా నియోజకవర్గ ప్రజలకు పంచడం జరిగింది.
మొత్తానికి ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గపు అభ్యర్థిగా ఇంటింటికీ ధ్యాన-శాకాహార ప్రచారం చేసే భాగ్యం నాకు దక్కింది. ఈ ఎన్నికలలో మా అబ్బాయికి పన్నెండువేల ఓట్లు పోల్ అయ్యాయి! ఆ తరువాత మహబూబ్‌నగర్ M.L.A. స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో నేను పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలలో పోటీచేసిన అన్ని పార్టీల వారికీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మ్యానిఫెస్టోను, ధ్యాన కరపత్రాలను, ధ్యాన పుస్తకాలను పంచడం జరిగింది.

వాణి: "మీరు చేసిన సాంఘిక సేవా కార్యక్రమాలు మరి మీరు పొందిన అవార్డులు వివరించండి!"
ప్రేమయ్య గారు: రాజకీయాలలోకి రాకముందే నేను "SHED (Society for Healthcare, Education & Development)" సంస్థలో పనిచేస్తూ హైదరాబాద్‍లోని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళచే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ యా శిబిరాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాలలో విశేష ప్రచారం చేసేవాళ్ళం. ముఖ్యంగా దళితులకోసం ఈ కార్యక్రమాలు జరిపిస్తూండేవాళ్ళం!

నేను చేసిన ఈ సేవా కార్యక్రమాలకు గాను 2012లో డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ వారిచే నేను "దళిత రత్న" అవార్డును పొందడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలోని ప్రజలను జాగృతపరుస్తూ మేము విరివిగా చెట్లను నాటించే వాళ్ళం. జీవకోటి సంరక్షణ కోసం కృషి చేస్తూన్న "అంతర్జాతీయ జీవ వైవిధ్య రక్షణ సంస్థ" యొక్క శాఖను కొత్తకోట మండలంతో స్థాపించి జంతుజాల పరిరక్షణకు కృషి చేస్తూన్నందుకు నేను అటవీశాఖ వారిచే "జీవవైవిధ్య రక్షక్" అవార్డును అందుకున్నాను. ఈ అవార్డు భారతదేశంలో మొట్టమొదటిసారి నాకే ఇవ్వబడింది!!

వాణి: "క్రైస్తవ మతానికి చెందిన మీరు ధ్యానంలో ఇమిడిపోవడం, ఒకానొక యోగీశ్వరుడిగా రూపుదిద్దుకోవడం అద్భుతం. మరి ఒక క్రిస్టియన్‌గా మీకు కలిగిన ధ్యాన అనుభూతి!"
ప్రేమయ్యగారు: 1980 దశకంలో నేను "ఇవాంజెలిస్ట్" .. అంటే "దేవుని సువార్తకునిగా" పనిచేస్తూ .. అందుకుగాను అమెరికన్ క్రిస్టియన్ అసోసియేషన్ నుంచి నెలకు 25 అమెరికన్ డాలర్లు వేతనం కూడా అందుకునేవాడిని.

"హృదయశుద్ధి కలవారు మాత్రమే దేవుని దర్శించెదరు" .. "నీ వలెనే నీ పొరుగువాడిని ప్రేమించు" .. "దేవుని రాజ్యం నీయందే యున్నది" వంటి ఏసుక్రీస్తు వాక్యాలు నన్ను ఎంతగానో ఆలోచింపజేసేవి.

అయితే ధ్యానంలోకి వచ్చిన తరువాత మాత్రమే నాకు హృదయశుద్ధి ఎలా చేసుకోవాలో, దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో, పొరుగు వారిని ఎలా ప్రేమించాలో అర్ధం అయ్యింది. బైబిల్‌లో నేను చదివిన సువార్తలలో, భగవద్గీత సందేశాలలో, మరి బుద్ధుని బోధనలలో చెప్పబడింది అంతా ఒకే సత్యం గురించి అని నేను తెలుసుకున్నాను.

అందుకే పత్రీజీ మనల్ని నిరంతర ధ్యాన సాధనతో పాటు సజ్జనసాంగత్యం కోసం అందరి దగ్గరకూ వెళ్ళమంటారు. స్వాధ్యాయం కోసం అన్ని సంస్థలకూ, మతాలకూ, చెందిన పుస్తకాలను చదవమంటారు. దాదాపు పన్నెండు సంవత్సరాలుగా నేను పత్రీజీతో కలిసి పనిచేస్తూ .. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎంతో మంది క్రిస్టియన్స్‌కూ, మా బంధువులకూ నేను, మా కుటుంబ సభ్యులం కలిసి ధ్యానం నేర్పించాం.

వాణి: "పత్రీజీతో మీ సాన్నిహిత్యం"
ప్రేమయ్య గారు: పత్రీజీ గొప్ప స్నేహశీలురు! ప్రతి ఒక్కరినీ వారు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ వారి వారి కార్యదక్షతలను తగిన పనులను వారికి అప్పగిస్తూ ప్రతి క్షణం వారి వెన్నంటే ఉండి వారికి కావలసిన సహాయ సహకారాలను అందిస్తూంటారు!

హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తూన్న ప్రతిసారీ మార్గమధ్యలో కొత్తకోటలో ఆగి నాతో మాట్లాడి ఒక్కోసారి నన్ను కూడా తమ వెంట తీసుకుని వెళ్ళేవారు. నన్ను తమ సరసన కూర్చోబెట్టుకుని అప్యాయంగా భోజనం వడ్డించేవారు.

వారు కొత్తకోటకు వచ్చినప్పుడల్లా "అంత గొప్ప గురువుగారు మా ఇంటికి ఏం వస్తారులే?! అతి సామాన్యమైన మా చిన్న ఇల్లు వారికి వసతిగా ఉండదు" అనుకుని నాకు తెలిసిన బ్రాహ్మణ, వైశ్య స్నేహితుల ఇళ్ళల్లోనే వారికి భోజనం, వసతి ఏర్పాటు చేసేవాడిని. "మీ ఇంటికి వెళ్దాం" అని వారు అన్నా కూడా "వద్దు లెండి సార్! మాది మామూలు ఇల్లు .. మీకు వసతిగా ఉండదు" అని తప్పించుకునేవాడిని.

అయితే ఒకసారి సార్ ముందస్తుగా నాకు చెప్పాపెట్టకుండా శ్రీమతి స్వర్ణమాలాపత్రి మేడమ్ తో కలిసి కర్నూల్ వెళ్తూ కొత్తకోటలో ఆగి సాక్షాత్తు శివపార్వతులలా సరాసరి మా ఇంటికి వచ్చేశారు! అతి మామూలుగా వున్న మా ఇల్లే తమ స్వంత ఇల్లు అయినంత ఆత్మీయంగా వాళ్ళిద్దరూ కొంతసేపు మా ఇంట్లో గడిపి, మాతో ధ్యానం చేయించి మా ఆతిధ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోయారు! ఇక మా ఇంట్లో వారి ఆనందాశ్చర్యాలకు అంతేలేదు, అది మా జీవితంలో మరచిపోలేని రోజు!

వాణి: " మీరు ఆ తరువాత క్రొత్త ఇల్లు కట్టుకున్నారు అసలు డబ్బేలేదు అనుకున్న మీరు ఆ ఇల్లు ఎలా కట్టుకోగలిగారు?"
ప్రేమయ్య గారు: ఆ తరువాత కొద్ది కాలానికే కొత్తకోటలో .. ఊరు బయట మాకు వున్న స్థలంలో అనుకోకుండా ఆధునిక హంగులతో కూడిన మంచి పిరమిడ్ గృహం కట్టుకోవడం జరిగింది. నిర్మాణం పనికి అవసరం ఉన్నప్పుడల్లా ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బు సర్ధుబాటు అయ్యేది. "అసలు ఇంత పెద్ద ఇంటిని మేమే కట్టామా!? అనిపిస్తూ వుంటుంది.
సద్గురువుల సంకల్పశక్తి .. కుచేలుడి వంటి వాడిని కూడా కుబేరునిలా చేయగలదు! ఆ విధంగా నేను ఆనతికాలంలో ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంటికి పత్రీజీతోనే ప్రారంభోత్సవం చేయించుకుని గృహప్రవేశం చేశాను.
వాణి: "పత్రీజీతో పాటు మీరు ఎప్పుడైనా ధ్యాన పర్యటనలలో పాల్గొన్నారా?"
ప్రేమయ్యగారు: పత్రీజీతో కలిసి నేను అనేక ధ్యాన ప్రచార పర్యటనలలో పాల్గొని వారి బోధనలను ప్రత్యక్షంగా వినేవాడిని. వారిలోని చురుకుదనం, కార్యదక్షత, ప్రతిఒక్కరితో స్నేహంగా మెలిగే తీరు, ప్రతి ఒక్క క్షణాన్నీ సద్వినియోగం చేసుకునే వారి వ్యవహారశైలి నాకు ఎంతో ఇష్టం!

2004లో నేను పత్రీజీతో కలిసి కేరళరాష్ట్రంలోని తిరువనంతపురం శ్రీ S.K. రాజన్ గారు ఏర్పాటు చేసిన "ట్రెక్కింగ్" కార్యక్రమంలో పాల్గొన్నాను. దారిలో చుట్టూ కొండలతో వున్న నదీతీర ప్రదేశానికి చేరుకున్నాం. "ఇక్కడ మొసళ్ళు వున్నాయి .. నీళ్ళలో దిగవద్దు" అన్న హెచ్చరిక బోర్డులు చూసి భయపడుతూన్న నన్ను చూసిన పత్రీజీ నా చేయి పట్టుకుని మరీ నది నీళ్ళలోకి తీసుకుని వెళ్ళారు! అక్కడ మెడవరకు నీటిలో కూర్చోబెట్టి నాతో 40 నిమిషాలపాటు ధ్యానం చేయించారు!

బయటికి వచ్చేసరికి నాలో నీళ్ళు అంటే మొసళ్ళు అంటే వున్న భయం పోయి .. నీటితో మరి మొసళ్ళతో కూడా ఎలా స్నేహం చెయ్యాలో తెలిసింది. అలా భయపడే వాటితో స్నేహం చేసి పరిస్థితులను మనకు అనుగుణంగా మలచుకుంటూ ఎలా చక్కదిద్దుకోవాలో నాకు అప్పుడు తెలిసింది.

వాణి: "ఇంకా మీ ధ్యానానుభవాలు?!"
ప్రేమయ్యగారు: 2006లో ఒకసారి నా కంట్లో శుక్లాలు వచ్చి కంటికి తీవ్రంగా ఇన్‌ఫెక్షన్ సోకింది. దాంతో నా కళ్ళు వాచిపోయి మంటతో నీళ్ళు కారుతూ చాలా కాలం బాధపడ్డాను. నిపుణులైన కంటి డాక్టర్లను ఎందరినో కలిశాను కానీ .. వాళ్ళు మాత్రం "కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయితే చేస్తాం గానీ .. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల కంటి చూపుకు మాత్రం గ్యారెంటీ ఇవ్వలేం" అని తేల్చిచెప్పారు.

చివరికి నా స్నేహితుడు మరి అప్పట్లో హైదరాబాద్ "సరోజినీ దేవి కంటి ఆసుపత్రి"లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న "డా|| సాయిబాబా గౌడ్" గారు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించి .. కాటరాక్ట్ ఆపరేషన్ తేదీని నిర్ణయించారు. ఆపరేషన్ కోసం కారులో మా పెద్దబ్బాయి నన్ను హైదరాబాద్ తీసుకెళ్తూంటే .. పత్రీజీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. "ఎక్కుడున్నావయ్యా?" అని అడిగారు .. విషయం చెప్పాను. హాస్పిటల్‍కి వెళ్ళబోయే ముందు మెహదీపట్నంలోని "స్పిరిచ్యువల్ ఇండియా" ఆఫీసుకు వచ్చి తమను కలుసుకుని వెళ్ళమని పత్రీజీ ఆదేశించారు. వారు చెప్పిన విధంగానే "స్పిరిచ్యువల్ ఇండియా" ఆఫీసుకు వెళ్ళాను.

ఆపరేషన్ కోసం వెళ్తున్న నా చేయి పట్టుకుని .. పత్రీజీ తదేకంగా అయిదు నిమిషాలపాటు నా కళ్ళలోకే చూస్తూండి పోయారు. కాస్సేపు వారి సమక్షంలో ధ్యానం చేయించి "సరే, వెళ్ళిరా" అన్నారు.

ఆపరేషన్ చేసేముందు హాస్పిటల్ సిబ్బంది "చూపుకు మాత్రం గ్యార్ంటీ ఇవ్వలేం" అని పత్రాలు వ్రాయించుకున్నారు. డా||సాయిబాబా గౌడ్ కూడా "ప్రేమయ్యా! నీ చూపుకు గ్యారెంటీ ఇవ్వలేను" అంటే "నాకు చూపు తప్పకుండా వస్తుంది! ఎందుకంటే నేను పత్రీజీ ఇచ్చిన ఎనర్జీతో ఇక్కడికి వచ్చాను. ఇంకా ఈ భూమిపైన నేను చెయ్యాల్సిన పని చాలా వుంది" అంటూ ఆత్మవిశ్వాసంతో డాక్టర్‍కి చెప్పాను.

ఆపరేషన్ అయ్యాక నేను కోలికోవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయి "నీకు చూపు తప్పకుండా వస్తుంది .. కంగ్రాట్స్" అని చెప్పారు. "నాకు తెలుసు" అన్నాను నేను!

అన్నట్లే నాకు గతంలో కన్నా కూడా స్పష్టంగా చూపు వచ్చింది. ఇలా ధ్యానం వల్ల నేను పొందిన శారీరక స్వస్థతలన్నీ ఒక ఎత్తయితే .. నన్ను నేను తెలుసుకోవడం, సూక్ష్మశరీరయానాలు చేయడం, ఉన్నతలోకాల మాస్టర్లనుంచి దివ్యసందేశాలను అందుకోవడం వంటి ఎన్నెన్నో ఆత్మపరమైన లాభాలను పొందడం మరొక ఎత్తు!

వాణి: "ప్రస్తుతం మీరు నిర్వహిస్తూన్న బాధ్యతల గురించి చెప్పండి!"
ప్రేమయ్య గారు: పత్రీజీ ఆదేశంతో కడ్తాల్ "మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్"లో "మెంబర్"గా నేను నా బాధ్యతలను నిర్వహిస్తున్నాను. డిసెంబర్ 18 నుంచి 31 వరకు 14 రోజులపాటు అక్కడ జరగబోయే ధ్యానమహాచక్రం - VIII కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వేలాది మంది ధ్యానులకు కావలసిన వసతి, పారిశుద్ధ్య ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాను.

వాణి: "పత్రీజీ యొక్క సాంగత్యం మీకు ఎలా అనిపిస్తోంది?"
ప్రేమయ్య గారు: ఏసుక్రీస్తు వెంట సెయింట్ పాల్ గా .. శ్రీ రాముడి వెంట ఆంజనేయుడిగా .. పత్రీజీ వెంట వుండి పనిచేస్తూ .. నా జన్మ ధన్యం చేసుకుంటూ .. ఈ జన్మ నా అనేక జన్మల పుణ్యఫలితంగా భావిస్తున్నాను. ఒక పిరమిడ్ మాస్టర్ అయినందుకు కలిగిన భాగ్యం ఇది.

వాణి: " ‘ధ్యాన జగత్’ మాసపత్రిక గురించి మీ అనుభూతి మరి పాఠకులకు మీ సందేశం?"
ప్రేమయ్య గారు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుంచి గవర్నమెంట్ ఆఫీసులకూ, ఆఫీసర్లకూ ప్రతినెలా "ధ్యాన జగత్" మాసపత్రికను, "స్పిరిచ్యువల్ ఇండియా" మరి "స్పిరిచ్యువల్ సైన్స్" మ్యాగజైన్‌లను పంచుతున్నాం.

"ధ్యాన జగత్" మాసపత్రిక ప్రజలకు అందిస్తోన్న పరమాద్భుత జ్ఞానం ఇంతింత అని చెప్పడానికి వీలులేదు! తమ ఆధ్యాత్మిక ప్రేరణలనూ, జ్ఞానాన్ని రంగరించి మరీ ప్రతినెలా మనకు అందజేస్తోన్న గురువుగారైన పత్రీజీకి ఎన్నికృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే!

 

"దళితరత్న" .. "ధ్యాన రత్న" .. S.R. ప్రేమయ్య

 కొత్తకోట - మహబూబ్‌నగర్ జిల్లా

 

Go to top