"41 రోజుల శాకాహార - మహాకరుణ యాత్ర"
(అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 11 వ తేదీ వరకు)

 

నా పేరు "ఆనందప్రసాద్". నేను 2006, డిసెంబర్ నెలలో నా మిత్రుడు "గాలిబ్" ద్వారా పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచీ నెను అనేక ధార్మిక సంస్థలకు వెళ్ళి ఎందరో గురువులను కలిశాను. అనేక పూజాలూ, భజనలూ, స్తోత్రాలూ, యజ్ఞాలూ చేశాను. కానీ నన్ను వేధించే మూడు కోరికలు మాత్రం తీర్చుకోలేకపోయాను.

"భగవంతుడిని ప్రత్యక్షంగా చూడడం"
"సరియైన గురువును కలవడం"
"విశ్వకల్యాణం కోసం పాటుపడడం"

హిందూమతంలో అయితే లాభం లేదనుకుని ముస్లిం మతంలో చేరి రోజుకు అయిదుసార్లు "నమాజు" చేస్తూ ఖురాన్ మొత్తాన్ని తెలుగులో చదివాను. అయినా నా కోరికలు తీరలేదు; భగవద్గీత, బైబిల్ చదివినా ఏమీ అర్థం కాలేదు!

నా స్నేహితుడు "గాలిబ్" ద్వారా ధ్యానం నేర్చుకుని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ వచ్చాను. ఒక నెలరోజుల పాటు కొత్తగూడెంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరంగారావు గారి పిరమిడ్‌లో ధ్యానం చేశాను. కానీ నాకు అంతగా తృప్తి అనిపించలేదు! ఎంత ప్రయత్నించినా మనస్సు శూన్యం కాలేకపోయింది. దాంతో ఇది సరియైన ధ్యానం కాదేమో అనుకున్నాను.

తరువాత తెలిసింది .. అసలు నేనే సరిగ్గా లేనని! ఎందుకంటే నేను అప్పటికి ఇంకా మాంసాహారినే! ఇక వెంటనే శాకాహారిగా మారి పత్రీజీకి శరణాగతి అయ్యాను! ఇక అప్పటినుంచి నన్ను చిన్నప్పటినుంచీ వేధిస్తూ వచ్చిన మూడు కోరికలు అచిరకాలంలోనే తీరిపోయాయి! అవే ..

"నన్ను నేను చూసుకోవడం"
"పత్రీజీని కలుసుకోవడం"
"ధ్యాన ప్రచారం చెయ్యడం"

2007 సంవత్సరం నేను కొత్తగూడెంలో "బ్రహ్మర్షి పిరమిడ్ కేర్ సెంటర్"ను స్థాపించి అక్కడ స్కూళ్ళల్లో మరి కాలేజీలలో పిల్లలకు ధ్యానం నేర్పించాను. 2010లో విజయవాడ పట్టణంలో "పిరమిడ్ కిడ్స్ స్కూల్"ను స్థాపించి .. చిన్నారులకూ మరి వాళ్ళ తల్లిదండ్రులకూ ధ్యానం నేర్పిస్తూ వచ్చాను. 2013లో ఖమ్మం జిల్లా "పిండిప్రోలు" గ్రామం దగ్గర "కాస్మిక్ వ్యాలీ" స్థల సేకరణలో భాగం పంచుకుని .. రెండు సంవత్సరాలపాటు అక్కడ పౌర్ణమి ధ్యాన కార్యక్రమాలను నిర్వహించాం!

ఆ తరువాత 2011లో 41 రోజుల ధ్యాన తెలంగాణ యాత్రను నిర్వహించి .. 2012లో "తెలంగాణ ధ్యాన మహాచక్రం"లో నా సేవనలు అందించాను. ప్రస్తుతం .. అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో 41 రోజులపాటు "శాకాహార మహాకరుణ" ర్యాలీలను నిర్వహించమని పత్రీజీ సూచించారు.

ఆయా ప్రదేశాలలోని పిరమిడ్ మాస్టర్లను ఈ ర్యాలీతో జత కలిపి ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుందాం!

 

కాశిన ఆనందప్రసాద్

 ఖమ్మం
-78239 60092

Go to top