పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ - బెంగళూరు

"GFSS అతిథులతో .. ‘ధ్యాన జగత్’"


"ట్రిష్ వాట్స్" - ఆస్ట్రేలియా

 

స్వర్ణలత: "హాయ్ ట్రిష్! .. పిరమిడ్ వ్యాలీ ఎలా ఉంది?"
ట్రిష్: హాయ్! .. ప్రకృతి అందాలతో నిండిన ఈ పిరమిడ్ వ్యాలీ మహాఅద్భుతంగా ఉంది. ఇక్కడి పిరమిడ్ శక్తి తరంగాలు అమోఘం! చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను!

స్వర్ణలత: "మీ గురించి కొంత సమాచారం .."
ట్రిష్: రైతు కుటుంబానికి చెందిన నేను ఆస్ట్రేలియాలోని ఒకానొక వ్యవసాయక్షేత్రంలోనే పుట్టి ప్రకృతి అందాల నడుమ పెరిగాను. రణగొణధ్వనులతో కూడిన పట్టణ వాసాలకు దూరంగా చిన్నప్పటి నుంచీ ఆ ప్రకృతి ఒడిలో నిశ్శబ్ధంగా ఆడుకుంటూ .. "నేను ఇంతకంటే చాలా పెద్దదయిన ఇంకేదో సువిశాల ప్రపంచానికి చెందిన దానిని" అనుకునేదాన్ని.

మా నాన్న గాయకులు. వారు మా "గ్రామ సమూహం"లో కూడా భాగస్థులు కావడంతో .. ప్రజల కోసం పాడడమే కాకుండా చర్చిలో కూడా బృందగానాలు నిర్వహించేవారు. మా అమ్మకు సంగీతం అంటే ప్రాణం. పియానో బాగా వాయించేది. "నా పిల్లల జీవితాలలో సంగీతం తప్పక ఉండాలి" అని ఆమె పట్టుబట్టి మరీ మా అందరికీ సంగీతం నేర్పించింది. అలా సంగీతం పట్ల ఆసక్తితో నేను ఏడేళ్ళ వయస్సులోనే మా నాన్నగారు నిర్వహించే "పిల్లల బృందగానాలు" అంటే Children Choir Group ప్రవేశించాను. 18 ఏళ్ళ వయస్సుకే నేను స్వంతంగా పాటలు వ్రాసి బాణీలు కూడా కట్టేదానిని. నేను వ్రాసే palms అన్నీ కూడా దైవం యొక్క బేషరతు ప్రేమ మరి సృష్టి పట్ల కృతజ్ఞతలతో నిండి ఉంటాయి.

స్వర్ణలత: "మీ కార్యక్రమాలను ఎక్కడెక్కడ నిర్వహించారు?"
ట్రిష్: ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశం అంతా తిరిగి నేను సంగీత కార్యక్రమాలను నిర్వహించాను. యూరోప్, అమెరికా, న్యూజీల్యాండ్, ఇంగ్లాండ్ దేశాలతో పాటు కంబోడియా దేశంలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాను. "అంతర్యుద్ధాలు మరి తీవ్రమైన కరువు కాటకాల నేపథ్యంగా పుట్టి పెరుగుతూన్న కాంబోడియా పిల్లలకు మనం ఎంతగానో సహాయం చెయ్యాలి" అనిపించింది. "వారు తమ స్వరాన్ని గుర్తించుకొవడంలో మనం తోడ్పడితే చాలు .. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రేకేత్తిస్తుంది" అని నిరూపించబడింది.

వారికోసం అలా పనిచేయడం నాలో ఎంతో ఉత్సాహాన్నీ మరి ఆనందాన్నీ ఇచ్చి నాకు నా బాల్యాన్ని జ్ఞాపకం చేసేది. పిల్లలు తమను తాము వ్యక్తపరచుకునేటప్పుడు చూపించే నిజాయితీని నేను చాలా ప్రేమిస్తాను.

స్వర్ణలత: "మరి పెద్దవాళ్ళ మాటేమిటి?"
ట్రిష్: నేను పెద్దలతో కూడా పనిచేస్తాను. నిజానికి ప్రతి ఒక్కరిలో కూడా పాడగల శక్తి నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని ఉపయోగించినప్పుడు మనం మరింత సజీవంగా ఉండగలం. కనుక నేను ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని విడుదల చేయడంలో తోడ్పడతాను. అనేకానేక అనుభవాలతో కూడిన మన జీవిత రంగులరాట్నం మనల్ని భయంతో బాధతో మన సహజస్వరాలు మూగబోయేటట్లు చేస్తుంది. సంగీతం మన శరీరంలోని ఒత్తిడిని అధిగమించడానికి తోడ్పడుతుంది. కనుక మనం ప్రతి క్షణం పాడుతూ .. మనల్ని మనం ఆనందంగా వ్యక్తీకరించుకుందాం!

 

"సోన్యా సోఫియా - USA"

 

స్వర్ణలత: "హాయ్ సోన్యా! .. మీ జీవితంలో అనేక అనుభవాలు మిమ్మల్ని ‘స్వస్థకురాలుగా చేశాయి అన్నారు కదా .. ఏమిటవి?"
సోన్యా: నేను పసిపిల్లగా ఉన్నప్పుడే నా తల్లితండ్రులు విడిపోయారు. మా అమ్మ మళ్ళీ పెళ్ళీ చేసుకోవడంతో నేను నా సవితి తండ్రి పెంపకంలో పెరగాల్సి వచ్చింది. ఆయన నన్ను బాగా కొట్టేవాడు. కాస్త పెద్దగా పెరిగాక సవితి తండ్రి బాధలను తప్పించుకుని నా కన్నతండ్రిని చేరితే .. ఆయన నన్ను ఆకలి చూపులు చూసేవాడు. దాంతో ఇక నాకు మగవాళ్ళంటనే భయం ఏర్పడింది.

కాలక్రమంలో నేను ఒక స్నేహితుడికి సన్నిహితం అయ్యాను కానీ అతడు నేను తల్లిని కాగానే నన్ను వదిలివెళ్ళిపోయాడు. తీవ్ర నైరాశ్యానికి లోనైన నేను "చావే శరణ్యం" అనుకున్నాను. కానీ నా బిడ్డ బాధ్యత నన్ను చావనివ్వలేదు. లేవడం .. బిడ్డ పనులు చూసుకోవడం .. మళ్ళీ పడుకోవడం .. ఇదే నా జీవన విధానం అయిపోయింది.

స్వర్ణలత: "మరి ఎలా కోలుకున్నారు?"
సోన్యా: ధ్యానం వలన! నాకు పదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు మా అమ్మ నాకు ధ్యానం నేర్పించింది. అది జ్ఞాపకం వచ్చి నేను మెల్లిమెల్లిగా ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. అయిదు సంవత్సరాలపాటు నేను చేసిన ధ్యాన సాధనవల్ల నా శరీరంలో ఎన్నెన్నో క్రియలు జరిగి కుండలిని చైతన్యం అయ్యింది. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేటప్పుడు కొన్ని శక్తులు నాలో జాగృతం అయ్యేవి. కొన్ని ఆలోచనలు నా కుండలీని సచేతనం చేస్తూండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది! అందుకే నేను కుండలినీ శక్తినే నా గురువుగా యెంచుకున్నాను.

స్వర్ణలత: "స్వస్థకురాలిగా ఎలా మారారు?"
సోన్యా: ఈ క్రమంలో దైవం నాతో సంభాషించడం మొదలయ్యింది. "నీ శరీరాన్ని నేను వాడుకుంటాను"అని దైవం అనగానే నేను నా శరీరాన్ని దైవానికి అధీనం చెయ్యడం సాధన చేశాను. అది ఎలాగంటే .. "ఒక అరగంటసేపు నా చెయ్యిని వాడుకో" .. "కాస్సేపు నా కాలును వాడుకో" .. "నీ ఇష్టం వచ్చినంత సేపు నా మెదడును వాడుకో" .. "నా హృదయాన్ని వాడుకో" అంటూ మెల్లిమెల్లిగా నా శరీరాన్నంతా కూడా దైవానికి సమర్పణ చేసే ధైర్యాన్ని పెంచుకున్నాను. అలా నన్ను నేను దైవానికి సమర్పించుకోవడం మొదలుపెట్టాక మెల్లిమెల్లిగా నా శరీరంలోని బాధ, భయం తగ్గుతూ వచ్చాయి. దైవం కూడా భయం వల్ల .. బాధవల్ల నేను పెట్టే పరిమితులను చాలా సహనంతో భరిస్తూ అనేకసార్లు నా శరీరాన్ని స్వస్థత పరచింది.

అలా దైవాన్ని నాలో నిలిపి ఉంచడానికి అనుమతించి .. ఆ ప్రేమకు అర్హురాలిని అయ్యేంతవరకు నాకూ తీవ్రమైన వెన్నునొప్పి మరి మెడనొప్పి ఉండేది.

స్వర్ణలత: " ఆ తరువాత ..?"
సోన్యా: అలా నేను సంపూర్ణంగా స్వస్థురాలిని అయ్యాక ఆ దైవం .. నేను ఎవరినో .. నేను చెయ్యవలసిన పని ఏమిటో చెప్పింది. "బాల్యంలో తిరస్కారానికి గురి అవ్వడం వల్ల ఏర్పడిన ఇబ్బందులను అంతం చేసి .. స్త్రీ పురుషులను నీ కళ్ళతో స్వస్థత పరచడానికే నువ్వు జన్మ తీసుకున్నావు. కానీ వారికి స్వీయ స్వస్థతను బోధించడమే నీ కర్తవ్యం" అని నాకు మార్గనిర్దేశం చేసింది.

స్వర్ణలత: "ప్రస్తుతం మీరు బోధిస్తూన్న EFT (Emotional Freedom Technique) ఎప్పుడు నేర్చుకున్నారు?"
సోన్యా: నేను తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడు నాకు స్వస్థత చేకూర్చడానికి వచ్చిన నా స్నేహితురాలి ద్వారా నేను ‘EFT' నేర్చుకున్నాను. నిజానికి నాలో ఉన్న భయాలు ఈ జన్మకు మాత్రమే చెందినవి కావు. గత అనేకానేక జన్మలలో ఏర్పడి .. క్రమక్రమంగా మోయబడుతూ వచ్చి గూడు కట్టుకున్నవి. నాకే కాదు చాలా మందికి అంతే ఉంటాయి.

ధ్యానంతోపాటు ‘EFT' సాధన నాలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చి నా నుంచి బాధ, భయాలు సంపూర్ణంగా తొలగిపోవడానికి సహాయం చేసింది. నిజానికి బాధలన్నీ కూడా మనం చేసే కర్మల వల్లనే సంభవిస్తాయి. ఇప్పుడు 35 యేళ్ళ వయస్సులో నేను మళ్ళీ నూతన ఆలోచనలతో యవ్వనంలోకి అడుగుపెట్టాను. నా ఆలోచనా ధోరణి సకారాత్మకంగా మారిపోయి నేను "పరిపూర్ణ స్త్రీ"గా మారాను. ఇలా కర్మలు అంటే క్రమబద్ధీకరించబడని ఉద్వేగ గాయాలే కనుక వాటిని క్షమ కరుణల ద్వారా ఎవరికి వారుగా స్వీయ స్వస్థతను పొందడమే ‘EFT' లో ఉన్న మౌలిక సాంకేతికత.

 

"టానియా T. కామడాన్ - మలేసియా"

 

స్వర్ణలత: "హాయ్ టానియా! .. గ్రహాంతర వాసులతో అనుసంధానం కలిగిన మీ నుంచి కొన్ని విశేషాలు తెలుసుకోగోరుతున్నాం .."
టానియా: నేను ఆహార సాంకేతిక విజ్ఞానం (food technology)లో ముఖ్య కన్సల్టెంట్‌గా ఉండేదానిని. 1997లో hipocitis (తుంటి వద్ద నీరు వాపు రావటం)తో కదలలేక చాలా బాధపడ్డాను. 2000 సంవత్సరంలో "రైకీ" నేర్చుకున్నాను. కేవలం అయిదు రోజులలోనే నాకు నేను స్వస్థత చేకూర్చుకున్నాను. అలా శక్తిపట్ల నాకు అవగాహన కలగడంతో USA కి వెళ్ళి దానిలో ప్రావీణ్యత పొంది స్వస్థతా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను.

స్వర్ణలత: "గ్రహాంతర వాసులతో అనుసంధానం ఎలా ఏర్పడింది?"
టానియా: 2001లో నేను ఒక కార్యక్రమం చేస్తూండగా నా చైతన్యంలోకి అత్యున్నత చైతన్యాలు (దివ్యజ్ఞాన సంపన్నులు) ప్రవేశించారు. వారు ఆర్కిట్యూరియన్లు, అప్పట్లో నేను ఏ మాత్రం తీరికలేకుండా ఉండి వారి పట్ల శ్రద్ధ చూపలేదు. అయితే వారు మా ఇంటికి వచ్చి తాము వచ్చిన సంకేతాలు చూపేవారు. నేను వారి ఫోటోలు కూడా తీసుకున్నాను.

వారు నన్ను గ్రహాంతర వాసులకు (Extra Terrestrial Vehicles) పరిచయం చేశారు. నేను వారిని (ETVలను) ఒక సమూహంగా ఆహ్వానించడానికి USA కి వెళ్ళాను. వారు భారీ పరిమాణంలో ఉన్నా, వారి హృదయాలు మృదవైనవి. వారు నన్ను "Benevolent Contacts" అనే పుస్తకం వ్రాయమని చెప్పారు .. వ్రాశాను.

స్వర్ణలత: "మీ ప్రస్తుత కార్యక్రమాలు?"
టానియా: నేను (ETV లతో) పొందిన అనుభవాలు ప్రజలకు తెలియచెయ్యటమే నా ప్రస్తుత ప్రణాళిక. ETV లతో అనుసంధానం పొందే ట్రైనింగ్ వర్క్‌షాప్‍ను నిర్వహిస్తున్నాను. ఆ వర్క్‌షాప్ ఈ సంవత్సరం మలేసియాలో నవంబర్ 4-6 తేదీలలో జరుగుతుంది.

స్వర్ణలత: "ETV ల పట్ల అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు?"
టానియా: ETV లు తమ సాంకేతికతను మనకు అందించాలని భావిస్తున్నారు. మానవులకు సరిగ్గా ఆహారం తీసుకునే విధానం, వ్యాధుల బారిన పడకుండా ఉండడం తెలియచేస్తున్నారు. మన అణ్వాయుధాలు విశ్వానికి నష్టం కల్గిస్తున్నాయి కనుక వారికి అణ్వాయుధాలు నచ్చవు. "కాంతి జీవులుగా అపరిమితంగా ఉండండి. కాంతి జీవులను మీ స్నేహితులుగా భావించండి" అని వారు మనకు తెలియజేస్తున్నారు.

 

"సిసిలీ థామస్ - బెంగళూరు"

 

స్వర్ణలత: "హలో సిసిలీ! .. ‘తాయ్ చీ’ వైద్య విధానంపై మీకు ఆసక్తి ఎలా కలిగింది?"
సిసిలీ థామస్: స్థిరంగా కూర్చుని ధ్యానం చెయ్యడం నాకు మొదట్లో కష్టంగా ఉండేది. దాంతో నేను కదులుతూనే ధ్యానం చేసేదానిని. అలా చేస్తూ కూడా శక్తివంతంగా అవుతున్నానని గ్రహించాను .. కానీ అది కేవలం బాహ్యమైంది మాత్రమే! దాంతో నాకు అంతర మరి బాహ్యశక్తుల మధ్య సమన్వయం కనుక్కోవలసిన అవసరం ఏర్పడింది.

అప్పటికే మా అన్న "తాయ్ చీ" సాధన చేసేవాడు. టావోయిస్టిక్ పద్ధతిలో కదలికన్నీ నిదానంగా మృదువుగా ఉంటాయి. నేను కూడా అది నేర్చుకున్నాను. "తాయ్ చీ" అంటే వలయాకారంలో ఉండే ఒకానొక ప్రాణశక్తి. "చొవాన్" అంటే శక్తివంతమైన అంతిమ పిడికిలి. "తాయ్ చీ చొవాన్" అంటే తావో తాత్త్వికతపై ఆధారపడిన మార్షల్ ఆర్ట్!

తాయ్ చీ కదలికలు నా శరీరంలో సున్నితమైన స్పందనలను కలిగించడమే కాకుండా నాతో ఎంతో ఎరుకను కలిగించాయి. మనస్సును ఉపయోగిస్తూ శ్వాసను "చి (chi)" వైపు మళ్ళించడం ఒకానొక గొప్ప వ్యూహం! ఈ శ్వాస వ్యూహంలో మన సహానుభూత మరి పారాసహానుభూత (sympathetic and para sympathetic) నాడీ వ్యవస్థలు రెండూ సమతూకంలో ఉండడాన్ని "తాయ్ చీ" సాధ్యం చేస్తుంది.

స్వర్ణలత: "తావో" అంటే ఏమిటో వివరించండి?"
సిసిలీ థామస్: శూన్యం నుంచి ఉద్భవించిన రెండు పరస్పర వ్యతిరేక శక్తులయిన "యిన్" మరి "యాంగ్"లను చలనంలోకి తెచ్చే చైతన్యాన్ని "తావో (డవ్)" అంటాం.

క్రీ.పూ. 540 సంవత్సరంలో అప్పటి చైనారాజు .. ఒకానొక బౌద్ధ గురువు అయిన బోధిధర్ముడిని తన రాజ్యానికి ఆహ్వానించి .. తమ ప్రజలకు దివ్యజ్ఞానం మరి దీర్ఘజీవనం కలిగించే ప్రక్రియలను బోధించమన్నాడు. అందులో భాగంగానే బోధిధర్ముడు వారికి తావో మెళకువలను నేర్పించాడు. కాలక్రమంలో తావో విద్య ఆగ్నేయ ఆసియా దేశాలయిన తైవాన్, హాంగ్‌కాంగ్, మకావు దేశాలలో కూడా విస్తరించింది.

ఈ సృష్టిలో పరస్పర వ్యతిరేక శక్తులయిన ఘనము - శూన్యము; స్త్రీ-పురుష; చీకటి - వెలుతురు వంటి శక్తులను చలనంలోకి తేగలిగిన ఈ తావో ఆర్ట్‌ను ఎవ్వరయినా సాధన చేయవచ్చు.

దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అతి సున్నితమైన వరుస కదలికల ద్వారా వివిధ శరీర అంగాలలో తావో చైతన్యశక్తిని ప్రేరేపించడం చేస్తే తీవ్రమైన వెన్నునొప్పి, రుమటాయిడ్, ఆర్థరైటీస్, మోకాళ్ళనొప్పులు వంటివి కూడా తగ్గిపోతాయి. నేను ఈ "తావో (డవ్)" విద్యను చైనాలోని షాంఘై నగరంలో ఫ్రాన్స్‌లో, ఉత్తర కాలిఫోర్నియాలలో గ్రాండ్ మాస్టర్స్ "పుషెంగ్ యువాన్" .. "ఫుక్వింగ్ క్వాన్" .. "డాక్టర్ యాంగ్" .. "జ్వింగ్ మింగ్"ల వద్ద నేర్చుకున్నాను.

స్వర్ణలత: "GFSS కార్యక్రమాలకు ఎలా వచ్చారు?"
సిసిలీ థామస్: నేను ఇంతకు మునుపు కూడా ఇంటర్నెట్ ద్వారా "పిరమిడ్ వ్యాలీ" గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఈ అద్భుతమైన శక్తి ప్రదేశం నాకు ఎంతో నచ్చింది. అందుకే GFSS నిర్వాహకులు ఆహ్వానించగానే ఆనందంగా అంగీకరించాను. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే నవీనయుగ ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మనం సంసిద్ధతతో ఉంటే చాలు ..
వారి నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకోవచ్చు.

Go to top