"వృత్తికీ .. ప్రవృత్తికీ సంబంధం లేదు"

 

పద్మశ్రీ "D.R. కార్తికేయన్" భారతీయ, ప్రపంచ ప్రముఖ/వ్యక్తులలో ఒకరు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వె‌స్టిగేషన్‌కు పూర్వ ముఖ్యాధికారి. భారతదేశంలోనూ .. ప్రపంచంలోని అనేక దేశాలలోనూ వివిధ ఆధ్యాత్మిక సంస్థలతో సంబంధం కలిగి, సామాజిక కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. మన "PSSM"కు చిరకాల సన్నిహితులు "IFSS" కు ముఖ్య సలహాదారు .. మరి పత్రీజీచే "ఆధ్యాత్మిక రాయబారి"గా పిలువబడే .. శ్రీ కార్తికేయన్ గారి గురించిన విశేషాలు ఆయన మాటలలోనే మనకోసం ..


- స్వర్ణలత

స్వర్ణలత: "సర్! నమస్కారం! భారతదేశంలో ముఖ్య సమావేశాలలో పాల్గొనే వారికి మీ గురించి తెలుసు కానీ మా ధ్యానులందరికోసం మీ గురించిన విశేషాలు వివరిస్తారా!"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: నేను తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఒకానొక గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాను. వ్యవసాయదారులు మౌలికంగా కష్టజీవులు. శారీరక శ్రమచేస్తూ చిత్తశుద్ధితో జీవిస్తారు. మా తల్లిదండ్రులు కూడా అంతే. దానితోపాటు వారు గాఢ మత విశ్వాసం కలిగి ఉండేవారు. కనుక నేను కష్టపడి పనిచేసే, సూటిదనం, దైవభీతి కల నేపథ్యంలో పెరిగాను.

స్వర్ణలత: "పోలీస్ సర్వీస్‌ను ఎందుకు ఎంచుకున్నారు?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: అసలు నేను ‘లా’ చదివాను. కానీ మా నాన్నగారికి నేను ఒక ప్రభుత్వ అధికారి అవ్వాలి అన్న కోరిక బలంగా ఉండేది. ఆయన కోరిక తీర్చడం కోసం నేను "Union Public Service Commission" పరీక్షలు వ్రాశాను. దానిలో ఎంపికైన తరువాత నేను ఒక చైతన్యవంతమైన విభాగంలో, ప్రజలకు ఎప్పుడూ సేవచేస్తూ మంచిని రక్షిస్తూ .. చెడును శిక్షించగల పని చెయ్యాలి అనుకుని పోలీస్ సర్వీస్‍ను ఎంపిక చేసుకున్నాను.

స్వర్ణలత: "విధి నిర్వహణలో మీ ఆశయాన్ని అమల పరిచారా?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: ఖచ్చితంగా ఏ పక్షపాతాలూ లేకుండా, ప్రభావాలకు గురికాకుండా స్వతంత్రతతో, మంచి అయిన దానిని చేశాను. రాజకీయ నాయకులనుంచి నేను ఏమీ .. "ఈ ప్రాంతంలో చేస్తాను .. ఈ ప్రత్యేక సౌకర్యం కావాలి వంటివి" .. కోరేవాడిని కాదు కనుక వాళ్ళు కూడా నన్ను గౌరవించి తమకు అనుకూలంగా వ్యవహరించే పనులు చెయ్యమని ఒత్తిడి పెట్టేవారు కాదు.
ఎక్కడైనా క్లిష్టమైన బాధ్యత నిర్వర్తించవలసి ఉంటే ప్రభుత్వం నన్ను అక్కడ నియమించేది. చాలాకాలంపాటు నేను రెండు పూర్తి సమయాల ఉద్యోగాలు నిర్వహించేవాడిని.

స్వర్ణలత: "భారతదేశంలో మాత్రమేనా?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: కాదు, విదేశాలలో కూడా, మాస్కో (రష్యా), ఆస్ట్రేలియా దేశాలలో విధులు నిర్వహించాను.

స్వర్ణలత: "మీకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రాజీవ్‌గాంధీ గారి హత్యకేసు వివరాలు చెబుతారా!"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: నేను CRP (Central Reseve Police) యొక్క IG (Inspector General)గా హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు రాజీవ్‌గాంధీగారి SIT (Special Investigation Team)కు ముఖ్య అధికారి బాధ్యత స్వీకరించవలసిందిగా కోరింది. నేను "సరే" అన్నాను.

ఆ తరువాత నాకు తెలిసింది .. ఢిల్లీలోని CBI (Central Bureau of Investigation) అధికారులు, ఇతర విభాగాలలోని అధికారులు అందరూ ఆ కేసు విచారణలో పనిచేయడానికి తిరస్కరించారనీ .. ఆ హత్యకు కారణమైనవారు తమకూ, తమ కుటుంబాలకూ హాని చేస్తారేమోనని భయపడటమే దానికి కారణమనీ!

అయితే ఎంతో ప్రయాసకు ఓర్చి తీవ్రంగా శ్రమపడి నేను దానిని ఛేదించాను. దాదాపు ఒక సంవత్సరం పాటు రోజుకు 20 గంటలు పనిచేసి నేరస్తులను నేర ప్రణాళిక రచించిన వారిని కనుగొన్నాం. మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ నా కృషిని ప్రశంసించాయి.

ప్రపంచంలో అంతకు ముందు ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుని హత్యకేసూ ఈ విధంగా కనుగొనబడలేదు. అందువల్ల Interpol దీనిని Model Investigation గా పరిగణించింది.

అంతేకాదు డాక్టర్ అబ్ధుల్ కలామ్ గారు రాష్ట్రపతి పదవి స్వీకరించిన తరువాత నన్ను ఆహ్వానించి నా జీవితం అపాయంలో పడే ప్రమాదం ఉన్నప్పటికీ .. దేశం కోసం నేను చేసిన సేవలను ప్రశంసించి .. "మిమ్మల్ని రాష్ట్ర గవర్నర్‌గా కానీ, విదేశాలలో రాయబారిగా గానీ నియమించటం మీకు సమ్మతమేనా?" .. అని అడిగారు.

నేను ఆ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి .. "నేను దేశంపట్ల నా విధిని నిర్వర్తించాను అంతే త్పప ఏ ప్రతిఫలం కోసమో కాదు. నేను చేసిన దానికి ఏ పురస్కారమూ అవసరం లేదు" అని చెప్పాను.

స్వర్ణలత: "CBI ముఖ్య అధికారి తరువాత ఏం చేశారు?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్‌కు డైరక్టర్‌ జనరల్‌గా ఆహ్వానించబడి రెండు సంవత్సరాలు దానిలో కొనసాగాను.

స్వర్ణలత: "ఇప్పుడు ఏ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారు?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: ప్రస్తుతం నేను Farmers Associationకు నాయకునిగా ఉంటూ కష్టాలలో ఉన్న రైతులకోసం వ్యవసాయంలో తోడ్పడుతున్నాను. అనేక సాంఘిక సేవా సంస్థలు, మానవ హక్కులు, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, నీటి సమస్య, మతసామరస్యం .. మొదలైన వాటిలో ఉంటూ ఆ యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. అంతేకాదు .. వ్యక్తిగత, సామాజిక శాంతి ఐక్యతల కోసం కృషి చేసే అనేక ఆధ్యాత్మిక సంస్థలు "PSSM", "ఆర్ట్ ఆఫ్ లివింగ్" .. "ఈశా యోగ" .. వంటి సంస్థలలో అనుసంధానమై ఉన్నాను. ఆ యా దేశాల ఆహ్వానం మేరకు 150 దేశాలలో పర్యటించాను.

స్వర్ణలత: "చట్టం నేరం, న్యాయాల చుట్టూ తిరిగే వృత్తిలో కీలకస్థానంలో ఉన్నమీకు ఆధ్యాత్మిక ఆసక్తి ఎలా ఏర్పడింది?
పద్మశ్రీ కార్తికేయన్ గారు: వ్యక్తి వృత్తికీ ప్రవృత్తికీ సంబంధం లేదు. నా కుటుంబ నేపధ్యం నాకు ధార్మికత అలవాటు చేసింది. అనేక సందర్భాలలో వ్యక్తులను పరిశీలించినప్పుడు "మన భౌతికతను దాటి జీవితాన్ని నడిపించేది ఏదో ఉంది" అని అర్థమై దానిని తెలుసుకోవటంలో ‘ఆధ్యాత్మికత’కు చేరువ అయ్యాను.

అందరిలోని, అన్నింటిలోని మంచి విషయాలను గ్రహిస్తూ అత్యున్నత చైతన్యాలమైన మనం ఎదుటివారిపట్ల ఏవిధంగా ఉండాలి అన్నది .. అంతకుముందు సామాజిక స్పృహ లేదా చైతన్యంలో వ్యవహరించిన దాని వెనుక ఉన్న .. ఆత్మచైతన్యం అవగాహనలోకి వచ్చింది.

స్వర్ణలత: "దేశంలోనే ఉన్నత పురస్కారం ‘పద్మశ్రీ’ పొందినప్పుడు మీ అనుభూతి .."
పద్మశ్రీ కార్తికేయన్ గారు: రాష్ట్రపతి నుంచి "పద్మశ్రీ" పురస్కారాన్ని స్వీకరించిన క్షణంలో నా మనస్సులో ఏ భావమూ లేదు. చిత్తశుద్ధితో శ్రమిస్తే దాని ఫలితం ఉంటుంది అంతే!
స్వర్ణలత: "మీ సందేశం?"
పద్మశ్రీ కార్తికేయన్ గారు: విషయాలపట్ల స్పష్టతతో, స్వతంత్రతో, సమత్వంతో జీవించండి. తోటివారికి సాయం చేయండి. అది మనిషిగా మన ధర్మం.

 

పద్మశ్రీ D.R. కార్తీకేయన్

 న్యూఢిల్లీ

Go to top