"యూరోప్‌లో డివైన్ క్రిస్టల్‌తో సహా పిరమిడ్ ధ్యాన ప్రచారం"

 


హాయ్ .. ! నేను "నవనీత్ కౌర్"! భారతదేశపు "సిక్కు" కుటుంబానికి చెందిన నేను మా తండ్రిగారి వ్యాపారరీత్యా .. సింగపూర్ దేశంలోనే పుట్టి అక్కడే పెరిగిపెద్దయ్యాను. "సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ" నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాను.

చిన్నప్పటి నుంచి మా తల్లితండ్రులు మమ్మల్ని "సిక్కు" సాంప్రదాయపు విలువలతో పెంచడం వల్ల నేను సిక్కుగురువుల గురించి విశేషంగా తెలుసుకుని .. అవకాశం దొరికినప్పుడల్లా మా కుటుంబంతో కలిసి గురుద్వారాలు దర్శించడం. మరి అక్కడ "సేవ" చేయడం చేసేదాన్ని.

ఈ క్రమంలో నాకు వివాహం జరగడం మరి అనుకోని కారణాల వల్ల ఆ బంధం రెండు సంవత్సరాలకే విచ్ఛిన్నం కావడం జరిగి ముఫ్ఫై సంవత్సరాల వయస్సుకే .. నా జీవితం అనేకానేక చేదు అనుభవాలతో నిండిపోయింది. ఆ ప్రభావం నా శరీరంపై కూడా చూసి నేను "రుమటాయిడ్ ఆర్థరైటిస్" అనే ప్రాణాంతకమైన వ్యాధికి గురి అయ్యాను.

శరీరంలోని ప్రతి ఒక్కకీలు వాచి .. నొప్పితో విలవిలలాడేదాన్ని! అల్లోపతి మందులు సైడ్ ఎఫెక్టులతో సమస్య మరింత జటిలం కావడం వల్ల .. "హోమియో", "ఆయుర్వేదం" మందులు కూడా వాడడం మొదలుపెట్టాను. మానసిక ఉపశమనం కోసం గంటల తరబడి గురుద్వారాలలో కూర్చుని ఆలోచించేదాన్ని. మెల్లిమెల్లిగా నాకు నా మానసిక - శారీరక తలాలకు మధ్య ఉన్న బంధం అర్థంకావడం మొదలై .. "అసలు నేను ఎవరు?" .. "నా జీవిత పరమార్థం ఏమిటి?" .. "నా లక్ష్యం ఏది?" అన్నప్రశ్నలు నాలో ఉదయించడం మొదలైంది!

నాఫ్రెండ్ "Tapsy" ద్వారా నేర్చుకున్న పరమహంస నిత్యానంద, ఓషో, తీటా ధ్యానపద్ధతులలో ధ్యానం చేస్తూ "ఎఖార్ట్ టోలె" వంటి గొప్పవారు అందించిన స్వాధ్యాయ గ్రంధాలను అధ్యయనం చేస్తూ జీవితం పట్ల కొంత సానుకూల దృక్పథాన్ని పొందుతూ వచ్చాను. 2008 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు నా అన్వేషణ ఇలా సాగింది.

"పిరమిడ్ ధ్యానం"

2011 సంవత్సరంలో మరో స్నేహితురాలి ద్వారా "పిరమిడ్ మెడిటేషన్" గురించి తెలుసుకుని ఆనాపానసతి ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. 60 నిమిషాలు సాగిన మొదటి సిట్టింగ్‌లోనే ఏదో తెలియని శక్తి ప్రకంపనలతో నా శరీరం పునరుజ్జీవాన్ని పొందాను. గత కొంతకాలంగా మానసిక వేదనతో నిద్రకు దూరమైన నేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను!

ఉదయం లేవగానే ఇంత అద్భుతమైన ఆనాపానసతి పిరమిడ్ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తోన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ గురించీ .. మరి బ్రహ్మర్షి పత్రీజీ గురించీ .. ఇంటర్నెట్ ద్వార క్షుణ్ణంగా తెలుసుకున్నాను. సింగపూర్ లో ఉన్న "పిరమిడ్ కేర్ సెంటర్"లను వెతుక్కుంటూ వెళ్ళి సింగపూర్ పిరమిడ్ మాస్టర్ "శశిధర్ రెడ్డి"గారిని కలిసి మరింత సమాచారం తెలుసుకున్నాను.

వారి సూచన మేరకు ఒక క్రొత్త పిరమిడ్ కేర్ సెంటర్‌ని మా ప్రాంతంలో ఏర్పాటుచేసి .. 40 రోజుల ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించడం మొదలుపెట్టాను.

"నా గదిలో బెడ్‌పై ఒక పిరమిడ్‌ను అమర్చుకుని క్రమం తప్పకుండా ఇంట్లో ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాను; శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుని శుద్ధశాకాహారిగా మారిపోయాను.

ఉద్యోగం, పిరమిడ్‌కేర్ సెంటర్ నిర్వహణ, స్వాధ్యాయం నా జీవిత ముఖ్య కార్యక్రమాలుగా మారి నన్ను చాలా తక్కువ కాలంలోనే శారీరక - మానసిక స్వస్థురాలిగా మార్చివేశాయి!

"డివైన్ క్వార్ట్‌ క్రిస్టల్"

ఈ క్రమంలోనే నేను 2014 లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చి అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా పిరమిడ్ మాస్టర్ "ప్రదీప్ విజయ్"గారిని కలిసి వారి దగ్గర ఉన్న 144 ముఖాల "డివైన్ క్వార్ట్ క్రిస్టల్"తో అనుసంధానం కావడం జరిగింది.

అద్భుతమైన ఆ క్రిస్టల్ "మైత్రేయబుద్ధ మెగా పిరమిడ్ ఛాంబర్"లో 2500 మంది ధ్యానుల సమక్షంలో జరిగిన ఒకానొక ఉత్సవంలో ఆధ్యాత్మికవేత్త "నీనా బ్రౌన్"గారి ద్వారా ప్రదీప్‌కు అందించబడింది. అప్పటి నుంచి ప్రదీప్ సంరక్షణలో ఆ శక్తివంతమైన క్రిస్టల్ .. ఎన్నెన్నో దేశాలు తిరుగుతూ ఎందరెందరో మాస్టర్స్‌ని కలుస్తుంది.

ఈ క్రమంలో నేను కూడా ప్రదీప్ వెంట పర్యటిస్తూ ఆనాపానసతి ధ్యానప్రచారం చేస్తూన్నాను. 144 ముఖాల ఆ డివైన్ క్వార్ట్ క్రిస్టల్‌ సమక్షంలో చేసిన ధ్యానం మరింత శక్తివంతంగా ఉన్నట్లు వాళ్ళంతా చెప్పడం గొప్ప విషయం.

నేను కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఆ క్రిస్టల్ సమక్షంలో అద్భుతమైన శక్తితరంగాలనూ మరి మనోశూన్యతనూ పొందుతున్నాను.

ఆ క్రిస్టల్ నాతో ఆత్మీయంగా మాట్లాడడం నేను అనుభూతి పొందుతున్నాను. అది నా సత్యపూర్వకమైన వ్యక్తిత్వంగా నేను తెలుసుకున్నాను. నాలో నుంచి వచ్చే అనేకానేక సందేశాలకు క్రిస్టల్ నుంచే నేను సమాధానాలు పొందుతున్నాను.

"ఫిలిప్పైన్స్ - అలెక్స్ ఆర్బిటో"

ఈ క్రమంలో నేను ప్రదీప్‌తో కలిసి 2016లో ఫిలిప్పైన్స్ దేశానికి వెళ్ళి అక్కడ "సైకిక్ హీలర్" అయిన "అలెక్స్ ఆర్బిటో" గారిని కలుసుకున్నాను. వారు కూడా క్రిస్టల్ సమక్షంలో ధ్యానం చేసి దాని స్వస్థతా శక్తి పట్ల ఎంతో ఆసక్తిని కనబర్చారు. ఫిలిప్పైన్స్ మాస్టర్ "మారికా" గారు తమకు స్వప్నం ద్వారా అందిన సందేశాన్ని అనుసరించి నిర్మించిన 21'x21' మీటర్ల "పిరమిడ్ ఫర్ లైట్" పిరమిడ్‌ను ఆర్బిటో గారితో కలిసి మేమంతా సందర్శించడం జరిగింది.

మారికా గారిచే ఏర్పాటుచేయబడిన ధ్యానకార్యక్రమంలో పాల్గొని అక్కడ హాజరయిన 60 మందిచే 144 ముఖాల క్వార్ట్ క్రిస్టల్ సమక్షంలో ఆనాపానసతి ధ్యానం చేయించాం. ఆనాటి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ధ్యానానుభవాల మహాద్భుతాలు!

ఫలితంగా మాకు ఫ్రాన్స్, స్విట్జర్‌ల్యాండ్, జర్మనీ, బల్గేరియా మరి నేపాల్ దేశాల నుంచి క్రిస్టల్ ధ్యానకార్యక్రమాలను నిర్వహించమని రావడం మొదలయ్యింది.

"యూరప్‌లో ధ్యాన పర్యటన"

ఈ క్రమంలోనే 2017 సెప్టెంబర్‌లో మేము మూడు వారాలపాటు యూరోప్‌లో పర్యటిస్తూ "బల్గేరియా దేశం"లోని "సోఫియా" అనే పట్టణంలో వారం రోజులపాటు అద్భుతమైన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించాం.

స్థానిక మాస్టర్ "Maggie" ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూరోపియన్స్ అందరూ శక్తి అనుభూతి చెందడమే కాకుండా, పిరమిడ్ క్యాప్స్‌నూ మరి పిరమిడ్ పుస్తకాలనూ క్రిస్టల్ ఆసక్తిగా తీసుకున్నారు. చాలా మంది దివ్యచక్షువు అనుభవాలను పొందగా కొందరు పట్టరాని సంతోషంతో ఏడ్చేసారు!

కార్యక్రమానికి హాజరయిన "ఇటలీ దేశం" .. "దామన్‌హుర్ స్పిరిచ్యువల్ కమ్యూనిటీ" కి చెందిన మాస్టర్స్ మమ్మల్ని ఇటలీలో కార్యక్రమాలను నిర్వహించడానికి ఆహ్వానించారు!

బల్గేరియా దేశంలో మేము నిర్వహించిన కార్యక్రమాల అనుభూతులను మూటగట్టుకుని ప్రకృతి అందాలతో నిండిన Rila Mountains మరి Balkin Mountains Rangeలలో కూడా క్రిస్టల్ ధ్యానం చేసుకుంటూ స్విట్జర్‌ల్యాండ్ చేరుకున్నాం.

అక్కడ స్థానిక మాస్టర్ "మార్టిన్" గారు ఏర్పాటుచేసిన ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది యూరోపియన్లు శ్వాస గమనంలో ఉన్న శాస్త్రీయతను గుర్తించారు. మరిన్ని కార్యక్రమాలను స్విట్జర్‌ల్యాండ్ వ్యాప్తంగా నిర్వహించాల్సిందిగా వారు మమ్మల్ని కోరడం జరిగింది.

ఇదే విషయాన్ని మేము అదే సమయంలో "జర్మనీ" లో ఉన్న పత్రీజీతో పంచుకోగా వారు "భవిష్యత్తులో స్విట్జర్‌ల్యాండ్ PSSM కి ఒక ముఖ్యప్రదేశంగా మారనుంది కాబట్టి మీరు స్విట్జర్‌ల్యాండ్‌కు తరలి వెళ్ళాలి. అని సూచించారు. వారి మాటలను నేను మరి ప్రదీప్ విశ్లేషించుకుంటూ ఉండగానే ప్రకృతి అందాలతో కూడిన ఆ చల్లని ప్రదేశంలో 2018 మార్చి నెలలో మళ్ళీ "PSSM ధ్యానకార్యక్రమాలను" నిర్వహించాల్సిందిగా ప్లాన్ నిశ్చయం అయిపోయింది!

స్విట్జర్‌ల్యాండ్ నుంచి కారులో బయలుదేరి .. మంచుతో నింపబడిన అక్కడి అందాలను వీక్షిస్తూ లండన్ చేరుకున్నాం. "లండన్ పిరమిడ్ మాస్టర్స్" రవికిరణ్, ప్రాణహిత, శ్రీలక్ష్మి గార్లు ఏర్పాటుచేసిన ధ్యాన కార్యక్రమాలలో క్రిస్టల్ మెడిటేషన్ ద్వారా చాలా మంది తమ అనాహత చక్రం ఉత్తేజితం చెందినట్లు తెలియజేశారు. మా యూరప్ పర్యటనలో చివరి మజిలీగా మేము "ప్యారిస్" మహానగరం దగ్గరలో ఉన్న Fontainebleau అనే ప్రదేశానికి చేరుకున్నాం.

అక్కడ మాకు ఆతిధ్యం ఇచ్చిన "విన్సెంట్" మరి వారి కుటుంబం మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించి రుచికరమైన శాకాహార భోజనాన్ని అందించారు.

మూడు రోజులపాటు వారిచే ఏర్పాటు చేయబడిన సామూహిక ధ్యాన కార్యక్రమాలలో మరి గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొన్న మేము వారందరి ధ్యానానుభవాలను విని ఆశ్చర్యపోయాం. వారంతా శాకాహారులుగా మారి పిరమిడ్ శక్తిని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు.

వచ్చే సంవత్సరం బెంగళూరు "పిరమిడ్ వ్యాలీ"ని మరి కడ్తాల్ "కైలాసపురి"ని సందర్శించడానికి వాళ్ళంతా తమ ఉత్సాహాన్ని తెలియజేశారు. 2018 మార్చి నెలలో మా సరికొత్త స్విట్జర్‌ల్యాండ్ PSSM మిషన్‌లో భాగంగా మళ్ళీ అక్కడ మా ధ్యాన కార్యక్రమ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుని .. తిరుగు ప్రయాణం అయ్యాం!

 

నవనీత్ కౌర్ 

సింగపూర్ దేశం

Go to top