"ధ్యాన ఉస్మానియా దశాబ్ది మహోత్సవం"


అనుభవాలు

యూనివర్సిటీ Ph.D విద్యార్థి "పరుశురామ్" మాట్లాడుతూ: "నేను 2002లో మహబూబ్‌నగర్‌లో 40 ఆదివారాలు .. 40 మాస్టర్స్ ధ్యాన కార్యక్రమం జరుగుతూన్నప్పుడు నా మిత్రులు ‘M. రాములు’ ద్వారా ధ్యానంలోకి ప్రవేశించాను. 2007-08 ఉస్మానియా యూనివర్సిటీలో M.Sc. చదువుతూన్నప్పుడు ధ్యానం ద్వారా నేను పొందుతూన్న ఆనందాన్ని అందరికీ పంచడానికి ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యానప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. తక్షణమే నా మిత్రులు ‘బుచ్చయ్య’, ‘శివశంకర్’, ‘రవి’, ‘బాలకృష్ణారెడ్డి’, ‘సురేష్’ గార్ల సహాయంతో బాయ్స్ హాస్టల్ పైన ధ్యానతరగతులు మొదలుపెట్టాం.

"నా మిత్రులు ధ్యానంలోకి వచ్చాక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యారు. మొదట 80 మందితో 41 రోజుల ధ్యాన తరగతుల కార్యక్రమం ‘ల్యాండ్ స్కేప్ గార్డెన్’ లో మొదలుపెట్టాం. మాకు తోడుగా ‘హుడా లక్ష్మి మేడమ్’ కూడా వచ్చేవారు. ఇలా పది సంవత్సరాలుగా ధ్యాన మహాయజ్ఞంకు ముందు మరి బుద్ధపౌర్ణమికి ముందు ప్రతి సంవత్సరం రెండుసార్లు 41 రోజుల ధ్యాన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి వ్యక్తికీ ధ్యానాన్ని పంచుతూ, ప్రతి విద్యార్థినీ ‘ధ్యానవిద్యార్థి’గా మార్చాలనే సంకల్ప ధ్యానంతో పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని తెలియజేశారు.

"T. వాణి": "ఒకప్పుడు రకరకాల భయాలతో మరి ఆత్మన్యూనతా భావాలతో బాధపడి .. ధ్యానం నేర్చుకున్న తరువాత మెల్లిమెల్లిగా నన్ను నేను సరిచేసుకుంటూ వచ్చాను. నా ఆలోచనా విధానంలోని లోపాలను గమనించుకున్నాను. వెంటనే రకరకాల కుటుంబ నేపథ్యాల నుంచీ మరి రకరకాల ప్రాంతాలనుంచీ సిటీకి వచ్చి యూనివర్సిటీలో చేరి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోలేక నాలాగే బాధపడుతోన్న నా తోటి విద్యార్థినులకోసం మా లేడీస్ హాస్టల్ టెర్రేస్ పైన ధ్యాన తరగతులను మొదలుపెట్టాను.

"ఎంతోమంది విద్యార్థినులు ఈ తరగతులలో పాల్గొని సంకల్పశక్తి గురించీ, మనోనిశ్చలత గురించీ, మనోస్థైర్యం గురించీ తెలుసుకున్నారు. చక్కటి ఆత్మవిజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందరం కలిసి చదివేవాళ్ళం. మా వ్యక్తిత్వాలలో నడవడికలలో వస్తోన్న మార్పులను గమనించిన మా ప్రొఫెసర్లు మరి మా కుటుంబ సభ్యులు కూడా ఈ ధ్యానమార్గంలోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అని తెలియజేశారు.

ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోనే PG విద్యను అభ్యసించి ప్రస్తుతం గ్రూప్ -2 ఆఫీసర్‌గా పనిచేస్తోన్న సూర్యాపేట ధ్యాన యువకుడు "రంజిత్" మాట్లాడుతూ:

"మొదటిసారి గ్రూప్ -2 పరీక్షకు హాజరయి ఫెయిల్ అయ్యి డిప్రెషన్‌కు గురి అయిన నేను జీవితం అంతా నిస్సారంగా తోచడంతో ఇక ‘ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాను. ఆత్మహత్యా ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యాక యోగా, ప్రాణిక్ హీలింగ్, విపశ్యన ధ్యానం వంటివి ఎన్నో చేశాను. కాస్త ఉపశమనం లభించిందే కానీ డిప్రెషన్‌లోంచి మాత్రం బయటపడలేక పోయాను.

"అలాంటి సమయంలోనే అదృష్టవశాత్తూ 2008లో ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ‘ఆనాపానసతి’ ధ్యానం గురించి తెలిసింది. నిరంతర ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాదుల ద్వారా జీవితం యొక్క విలువను తెలుసుకున్నాను. చక్కటి ప్రణాళికకు నా ధ్యానశక్తిని జోడించి రెండవసారి గ్రూప్-2 పరీక్షలకు హాజరయి విజయం సాధించాను. ఈ క్రమంలోనే గత కొన్నేళ్ళుగా నేను బాధపడుతూన్న తలనొప్పి నుంచీ మరి దృష్టిలోపం నుంచీ కూడా విముక్తి చెందాను.

"ఇలా పరీక్షలలో నా ‘ఫెయిల్యూరే’ ఒక గురువుగా నాకు ఈ ధ్యాన మార్గాన్ని చూపించింది! నాతోపాటు క్యాంపస్‌లో PSSM యువత ఆధ్వర్యంలో జరుగుతూన్న ధ్యాన కార్యక్రమాలలో పాల్గొని తమ జీవితాలను తీర్చిదిద్దుకున్న వాళ్ళు ఎందరో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ సంస్థలలో చేరి ఉన్నత స్థానాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ధ్యానం మరి ఆత్మవిజ్ఞానం అంటే అదేదో కేవలం పెద్దవాళ్ళకో లేక వయస్సు ఉడిగిన వాళ్ళకో కాకుండా మాలాంటి యువతకే అవసరం అని చాటి చెబుతూ మమ్మల్ని ధ్యానయోగులుగా తీర్చిదిద్దుతోన్న పత్రీజీకి కృతజ్ఞతలు" అని తెలియజేశారు.

ఆనాటి కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ "ఓషనోగ్రోఫీ" డిపార్ట్‌మెంట్ "ప్రొఫెసర్ బాల్‌కిషన్" గారు "అన్ని శాస్త్రాలలాగే అధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా విద్యార్థులకు బోధించబడటానికి కృషి చేస్తాను" అని తెలియజేశారు.

 

Go to top