"మనస్సు ఉంటే మార్గం ఉంది"

 

కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట వాస్తవ్యులు "వెంకట భైరవశర్మ", వీరి శ్రీమతి "రాణి నాగలక్ష్మి" గారికి 2007 నుంచి "ఆనాపానసతి" ధ్యాన పరిచయం. వీరి ఇద్దరు పిల్లలు .. హైస్కూలు విద్యనభ్యసిస్తున్నారు.

పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేయటం ద్వారా మరింత శక్తి తీసుకోవచ్చునని ఋజువు కావటం వలన "ఆ పిరమిడ్‌లు మనమే చేయాలి" అనే ఆసక్తితో వారు 2008వ సంవత్సరం నుంచి మెల్లిమెల్లిగా పిరమిడ్‌లు తయారు చేయటం మొదలుపెట్టారు.

రకరకాల సైజులలో, రకరకాల మోడల్స్ గల పిరమిడ్‌లు తయారుచేయటం, వాటి ఫినిషింగ్ చీపురు పుల్లులతో పూర్తిచేయటం మరింత ఆకర్షిణీయంగా తయారవ్వటం, క్రమక్రమంగా అది ఒక చిన్న సైజు వ్యాపారానికి దారి తీసింది. అయితే వ్యాపార అభివృద్ధికి కావలసిన పెట్టుబడి కోసం చేసే ప్రయత్నాలలో వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలపై దృష్టిపడింది!

ఆ ప్రయత్నాలలో వారికి తెలిసిన "ఈమని సూర్య నారాయణ"గారిని కలిసి ఆరా తీయగా .. ప్రస్తుత తెలుగుదేశాం ప్రభుత్వంలో "బ్రాహ్మణ కార్పొరేషన్" ఒకటి వుందనీ, దీనిలో "చాణక్య పథకం" అనే దాని ద్వారా వ్యాపార అభివృద్ధి నిమిత్తం పెట్టుబడి దొరుకుతుందనీ తెలిసి వెంటనే అప్లయి చేయటం జరిగింది.

అంతే! బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ "వేమూరి ఆనంద్ సూర్య"గారు వీరి అప్లికేషన్ పరిశీలించి ఇన్‌స్పెక్షన్ చేయించి "వీరి అప్లికేషన్ యదార్థమైనదే" అని నిర్ధారించారు. వీరు రకరకాల పిరమిడ్‌లు తయారుచేయటం పరిశీలించి "ఇవి ధ్యానానికి చక్కగా ఉపయోగపడతాయి" అని గ్రహించి అప్లికేషన్ ద్వారా వీరికి "లోన్" మంజూరు చేయించటం జరిగింది.

తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయటం మరి సుమారు మూడు నెలలు కాలంలోనే అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత వాస్తవంగా మూడు లక్షల రూపాయలు "లోన్" మంజూరు అయ్యి చేతికి అందింది! అయితే అందులో 1,80,000/- .. అక్షరాల ఒక లక్షా ఎనభై వేల రూపాయలు సబ్సిడీలో .. కట్టవలసిన పైకం బాకీ మొత్తం 1,20,000/- ఒక లక్షా ఇరవై వేల రూపాయలు మాత్రమే! అదీ అయిదు సంవత్సరాల సమయం. అంటే నెలకు రెండు వేల రూపాయలు అన్నమాట!

ఇప్పుడు వారి వ్యాపారం "మూడు పువ్వులు, ఆరు కాయలు" అన్నమాట. అందుకే దేనికైనా చొరవ కావాలి. "ప్రయత్నలోపం లేకుండా మన పని మనం చేస్తూంటే జరుగవలసినవి జరిగే తీరతాయి" అనటానికి ఇదొక మచ్చు తునక! మొత్తం మీద "పిరమిడ్ జగత్"లో భాగంగా "లఘు పరిశ్రమల డిపార్ట్‌మెంట్" నుంచి పిరమిడ్‌లు తయారు చేయటానికి ఈ విధంగా ప్రభుత్వం వారి నుంచి కూడా ప్రోత్సాహకాలు రావటం ఎంతో సంతోషించదగిన విషయం! అంతే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది కనుక మంచి మనస్సుతో మరింత వ్యాపార అభివృద్ధితో వారు ముందుకు సాగాలని కోరుతూ ..


జక్కా రాఘవరావు 

విజయవాడ
- 92940 05008, 94908 78041.

Go to top