"దివ్య పురుషులు విచ్చేసిన మహా యోగ్ - ధ్యాన కుంభ్"

 

నా పేరు కస్తూరి. నేను నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఋషీకేశ్‌లో జరిగిన "మహా యోగ్ - ధ్యాన కుంభ్" మహోత్సవం"లో పాల్గొన్నాను. అందుకుగాను ఋషీకేశ్, హరిద్వార్‌లలో అడుగడుగునా అనేకానేక ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ఆశ్రమాలకూ, క్షేత్రాలకూ ఆహ్వానపత్రికలు ఇవ్వడానికి నిర్వాహకుల వెంట నేను కూడా వెళ్ళాను. ఒక్కరోజులో 50 ఆధ్యాత్మిక సంస్థలకు ఆహ్వాన పత్రికలు అందజేసాం.

28వ తేదీ అక్టోబర్ 2017 న ఈ ఆహ్వాన పత్రికలు అందిస్తూ "శ్వాస మీద ధ్యాస" ఉంచి నా శ్వాసలు ఆ ప్రదేశాలలో విడుదల చేశాను. ధ్యానమహాచక్రాలు జరిగే ప్రదేశాలకు ముందుగా చేరి ఇలా శ్వాసలు వెదజల్లాలని ఖజురహో వెళ్ళినప్పుడు పత్రీజీ చెప్పి మా చేత ఆచరింప చేసారు. అదే సంకల్పం నేను ఋషీకేశ్‌లో నిర్వర్తించాను. కొన్ని ఆశ్రమాలలో ఆ సంస్థలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు "అంతదూరం నుంచి వచ్చి పిలుస్తున్నారు .. తప్పకుండా ‘మహా యోగ్ ధ్యాన్ కుంభ్’కు వస్తాము" అని చెప్పారు. ఆహ్వాన పత్రం ఇవ్వడానికి ఒక అశ్రమంలోనికి ఆటో డ్రైవర్ ప్రత్యేకంగా నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ అచ్చంగా రమణ మహర్షి కనిపించారు! వారికి ఆహ్వాన పత్రిక వచ్చి ఆహ్వానించినప్పుడు వారు పాంఫ్లెట్‌ను చేతులతో తడిమి "బ్రహ్మర్షి పత్రీజీ" అని నోటితో ఉచ్చరించి "నేను వస్తాను ‘మహా యోగ్ ధ్యాన్ కుంభ్’ కు" అని పది నిమిషాలు నాతో మాట్లాడారు! అలా దివ్యపురుషులు అందరూ ఋషీకేశ్ మహా కుంభ్‌కు విచ్చేసారు!

50 సంస్థలకూ, ఆశ్రమాలకూ ఆహ్వానాలు ఇచ్చేసరికి సాయంత్రం 4.00 గంటలు సమయం అయ్యింది. అప్పటి వరకు ఆటోడ్రైవర్ కూడా ఏ ఆహారం తీసుకోలేదు.

4వ తేదీ నవంబర్ 2017 కార్తీకపౌర్ణమి. ప్రాతః కాల ధ్యానంలో "గంగానది" నాతో మాట్లాడి "నువ్వు నా అంశానివి .. ఈ గంగా ప్రవాహం యొక్క మూలం చూపిస్తాను నాతో రా" అని తన ప్రవాహంతో నన్ను తీసుకుపోయింది. ఆ ప్రవాహం వస్తూన్న కొండలపైన ఉన్న జలపాతాల ఉధృతి మరి మనోహరమైన దృశ్యం ఇప్పుడు కూడా వర్తమాన క్షణంలో నాకు కనిపిస్తోంది!

ఎంత తెల్లదనం అంటే .. పాల నురుగు కన్నా తెల్లగా అత్యంత వేగంగా అది భూమిపైకి దూకడం నేను చూసాను. చూస్తూండగానే ఆ తెల్లని నురుగుల జలపాతం బ్రహ్మర్షి పత్రీజీ అయిపోయారు. నేను ఆశ్చర్యపోయి "బాబాజీ! ఆ జలపాతం, ఈ గంగ కూడా మీరేనా?!"అన్నాను. అప్పుడు సంధ్యాసమయ కాంతిలో సింధూర రంగులో "గంగామాత" కనబడి పత్రీజీని తన ఒడిలో అక్కున చేర్చుకుని "నా బిడ్డను, నా మానసపుత్రుడు ఇతడే" అని అత్యంత స్పష్టంగా వీనుల విందుగా అంది!

ఇలా ఈ అనుభవం పొందడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అనుభవాన్ని స్వయంగా పత్రీజీకి చెప్పాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి ఆ గంగానది ప్రవాహం .. పరవళ్ళు త్రొక్కుతూన్న గల గల చప్పుడుతో కనిపించేది. అక్కడే ఆ ప్రదేశంలోనే ‘మహా యోగ్ ధ్యాన్ కుంభ్’ జరిగింది. అక్కడే గంగామాతకు బ్రహ్మర్షి పత్రీజీ హారతిని సమర్పించారు.

దాదాపు 60 సంవత్సరాల నుంచి ఊహలలో ఆ అనుభవం పొందుతూ ఉన్న నేను ఆ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా దర్శించి గంగాస్నానం చేసి హారతిని సమర్పించుకోవడం పత్రీజీ అనుగ్రహ భాగ్యమే! వారికి శతకోటి కృతజ్ఞతలు!

 

D. కస్తూరి

 తణుకు - పశ్చిమగోదావరి జిల్లా

Go to top