"ధ్యానం ద్వారా 10/10 గ్రేడ్‌ను సాధించాను"

 

నా పేరు "వెన్నెల శ్రీజ" నేను 2015వ సంవత్సరంలో మా నాన్నగారు "వెంకటేశ్వర్లు"గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. నా జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి "ధ్యానం లోకి రాకముందు" మరి "ధ్యానంలోకి వచ్చిన తరువాత".

ధ్యానానికి రాకముందు నాకు తెలిసిన ఏ విషయాన్నీ కూడా ఎవరితోనూ పంచుకునేదానిని కాదు. "ఒకవేళ చెప్తే వాళ్ళకేమైనా మంచి మార్కులు వచ్చేస్తాయేమో" అనే స్వార్థంతో చెప్పేదానిని కాదు.

ఎప్పుడూ నన్ను నేను ప్రక్కవారితో పోల్చుకుంటూ ఉండేదానిని. గంటలు గంటలు ‘T.V' కూడా చూడకుండా .. చదివేదానిని. అర్థం చేసుకోకుండా బట్టీపట్టే దానిని. ఆదివారాలు కూడా చదువుతూనే ఉండేదానిని. అంతసేపు చదివినా ఎగ్జామ్స్‌లో ఏమీ గుర్తుకు రాకపోవటంతో ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా బాధపడేదానిని.

తరువాత 2015వ సంవత్సరంలో 41 రోజులు "వింజమూరు"లో జరిగే ఇంటింటా ధ్యానంలో మా నాన్నగారి ప్రోత్సాహంతో పాల్గొనటం జరిగింది. ధ్యానం నాకు ఎంతో ఆనందాన్నీ మరి ప్రశాంతతనూ అందించింది. ధ్యానం చేసే క్రొత్తల్లోనే ఎన్నో జరగబోయే విషయాలు ముందే తెలవటం .. ఎన్నో question papers కనిపించటం మరి ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ దర్శనం కలగటం జరిగేది. వారి సందేశాలతో నా యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవటం, ‘అంతర్వాణి’ని వినగలగటం, నాకు వచ్చిన అనేక రోగాలను ధ్యానశక్తితోనే తగ్గించుకోవటం .. ఇవన్నీ నాకు ఎంతో ఆనందాన్ని, ధ్యానం పట్ల ఉత్సాహాన్నీ కలిగించాయి.

సాధరణంగా చదివే నేను ధ్యానాభ్యాసం ద్వారా ఏకాగ్రతనూ, జ్ఞాపకశక్తినీ, అవగాహానా శక్తినీ పెంపొందించుకుని ..అర్థం చేసుకుని చదవటం అలవరచుకున్నాను. ఈ నాలుగూ నాకు 10/10 గ్రేడ్‌ను సాధించటానికి ఎంతగానో సహాయపడ్డాయి.

ధ్యానం ద్వారా మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ గైడెన్స్ ద్వారా నేను maths ని ప్రేమిస్తూ, maths మీద ఉండే భయాన్ని సాంతం పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన ఏ విషయమైనా .. అది ఆధ్యాత్మికంగానైనా లేదా భౌతికంగానైనా .. నాతోటి స్నేహితులతోటి ఖచ్చితంగా పంచుకుంటున్నాను. ప్రతిరోజూ ఒక గంటసేపు తప్పకుండా ధ్యానం చేస్తున్నాను.

ఇలా ఉండగా, నా 10th class పబ్లిక్ పరీక్షల ముందు జాండిస్, టైఫాయిడ్, నీరసం వచ్చాయి. దాదాపు రెండు నెలలు నేను స్కూల్‌కి వెళ్ళలేదు. సిలబస్ అంతా పూర్తి అయిపోయి mains preparation సమయంలో స్కూల్‌కి వెళ్ళకపోవటంతో మా బంధువులూ, ఉపాధ్యాయులూ మరి చుట్టుప్రక్కల అందరూ. "నువ్వు పదవ తరగతిలో పది పాయింట్స్ సాధిస్తావని మాకెన్నో ఆశలు ఉన్నాయమ్మా! కానీ నీకు ఈ టైమ్‌లో ఇలా జరగటం దురదృష్టం" అన్నారు .. మరికొందరైతే "ఇప్పుడు నువ్వుండే పరిస్థితికి నీకు 10 పాయింట్స్ కాదు కదా! నువ్వు పదవ తరగతిలో పాస్ అయినా విచిత్రమే" అని చెప్పారు.

ఆ వికల్పాలన్నింటినీ నేను నా మనస్సులోకి రానివ్వకుండా .. వాళ్ళు ఏమి అన్నా "అవి నాకు సంబంధించినవి కావు" అన్నట్లు వ్యవహరిస్తూ .. "నేను 10 పాయింట్స్ ఖచ్చితంగా సాధిస్తాను" అనే దృఢసంకల్పంతో, చదువుతూ ఉండిపోయాను. అలా మాస్టర్స్ అందరూ నాకు అద్భుతంగా సహకరిస్తారనే బలమైన విశ్వాసంతో ఉండటం వలన నేను అనుకున్నట్లుగానే నాకు 10/10 పాయింట్స్ లభించాయి!

ఆదివారం మా స్కూల్లో జరిగే క్లాసులకు వెళ్ళకుండా నేను ధ్యానం క్లాసులకు వెళ్ళేదానిని. Morning Studiesకు వెళ్ళకుండా ఇంట్లోనే ధ్యానం చేసేదానిని. ఖాళీ సమయాలలో పత్రీజీ సార్ సందేశాలను వింటూండే దానిని. సెలవుల్లో విద్యార్థులచేత ధ్యానం చేయిస్తూ ఉండేదానిని.

APRJC అనే కాంపిటీటివ్ పరీక్షలలో కూడా రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, మండలస్థాయిలో మొదటి ర్యాంక్ కూడా నాకు ధ్యానం ద్వారానే లభించింది. ఇలా చదువులో మరి భౌతిక జీవితంలో ఎన్నో విజయాలు నాకు కేవలం ధ్యానం, శాకాహారం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారానే లభించాయి.

ఈ ధ్యానాన్ని నాకు అందించిన మా నాన్నగారికీ, ధ్యానాన్ని విశ్వం మొత్తం అందిస్తూన్న మన అందరి బెస్ట్ ఫ్రెండ్ "బ్రహ్మర్షి పత్రీజీ"కూ .. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ .. నా యొక్క హృదయపూర్వక శత సహస్రకోటి ధన్యవాదాలు.

B. వెన్నెల శ్రీజ
వింజమూరు - నెల్లూరు జిల్లా

- 944 16 25157.

Go to top