"సంకల్ప ధ్యాన మహత్యం"

 

నా పేరు "B. వెంకటేశ్వర్లు". నేను వింజమూరు ప్రక్కన ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్‌సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాను. 2005 నుంచి అయిదు సంవత్సరాలపాటు ఉపాధ్యాయులకు సంఘం ద్వారా అవిశ్రాంత సేవ చేశాను. తదుపరి సంపాదన కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి స్వల్పకాలంలో లక్షల రూపాయలు సంపాదించాను.

కోట్లు సంపాదించాలి అన్న దురాశతో లాభాల నుంచి వచ్చిన ధనాన్ని మరి అప్పు చేసిన ధనాన్ని కలిపి ఫ్లాట్లు, పొలాలను నెల్లూరు, అమరావతి, వింజమూరు, మనుబోలు లాంటి పట్టణాలలో శక్తికి మించి పదిరెట్లు పెట్టుబడి పెట్టి కొన్నాను. అయితే హఠాత్తుగా అన్ని చోట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. అప్పులన్నీ నాలుగు రెట్లయినాయి. అప్పులవారికి ప్రామిసరీ నోట్లు తిరిగి వ్రాస్తూ .. కొందరికి వడ్డీ మాత్రమే ఇస్తూ .. సమయం దగ్గర పడుతూంటె ఏం సమాధానం చెప్పాలో తెలియక .. దిక్కుతోచక .. ఫోన్ లిఫ్ట్ చేయకుండా .. రాత్రులు నిద్రపోకుండా .. సమాజంలో తిరగకుండా .. టెన్షన్‌తో రహస్యంగా ధ్యానంలో కూర్చుండేవాడిని.

2012 ఫిబ్రవరిలో వింజమూరు‌లో పామూరు "పవన్ మాస్టర్"గారి ఆధ్వర్యంలో "ధ్యాన సప్తాహం" జరిగింది. అప్పుడు ధ్యానం మరి "పత్రి సార్" గురించి పరిచయం ఏర్పడింది. ధ్యానం తెలిసిన మరుసటి రోజు నుంచి మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ధ్యానం చెప్పేవాణ్ణి.

ఉద్యోగం, అప్పులు, ఇంట్లో భార్యకు మానసిక అలజడి, చిన్నపిల్లలు, అప్పులు వంటి సమస్యలు ఇన్ని ఉన్నప్పటికీ వింజమూరులో నేను ఒక్కణ్ణే ఒంటరిగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాణ్ణి!

అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండేది. అయితే ఉన్న స్థలాలను అమ్మేయాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్ని రెట్ల కంటే తక్కువకు కూడా కొనేవారు లేని పరిస్థితి కనిపించే సరికి ఆత్మహత్యే శరణ్యం అని నిర్ణయించుకున్నాను. చివరి ప్రయత్నంగా కడప మాస్టర్ "శ్రీ M.C. ఓబయ్య" గారి సలహా ద్వారా సంకల్ప ధ్యానం చేసి ఫ్లాట్స్ ఒక్కొక్కటిగా అమ్ముతూ అప్పులన్నీ చెల్లించాను. మా మామగారి యొక్క విలువైన ఫ్లాట్‌ను అమ్మి కొంత అప్పు చెల్లించాను. దీనికి బదులుగా నా ప్లాట్ ఆయనకు ఇచ్చాను. దీనికి కూడా కారణం సంకల్ప ధ్యానమే. సహకరించిన మామగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

పలురకాల ఇబ్బందులు, ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ధ్యానం, ధ్యాన ప్రచారంను మరింత ఉధృతం చేశాను. అప్పులవారు ఫోన్ చేస్తూంటే సైలెంట్‌లో ఉంచి ధ్యాన ప్రచారంలో ఉండేవాణ్ణి. వింజమూరు ప్రక్కన "సాతానువారిపాలెం" గ్రామంలో 51 రోజులు, "వింజమూరు" లోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో 180 రోజులు, "కాటేపల్లి" లో సప్తాహం , సాయిబాబా దేవస్థానంలో సప్తాహం, ఇంటింటా ధ్యానం 150 రోజులు, 100 పాఠశాలల్లోని 22వేల మంది విద్యార్థులకు ధ్యానం అలుపెరగకుండా ప్రచారం చేస్తూ, ఉద్యోగ కుటుంబ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించేవాణ్ణి. ప్రాపంచిక విషయాలపై తక్కువ దృష్టి, ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ పెరిగింది.

91వారాల నుంచి ప్రతి ఆదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్‌చే ధ్యానం క్లాసు, మధ్యాహ్నం భోజనం, శాకాహార ర్యాలీలు ఆపకుండా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా నా శక్తి అనూహ్యంగా వందలరెట్లు పెరిగి ప్రస్తుతం సంకల్పాలన్నీ వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు వింజమూరు, పరిసర గ్రామాల మిత్రులు, మాస్టర్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకారం అందిస్తున్నారు.

గతంలో మా కుటుంబములో నేను ఒక్కణ్ణే ధ్యానం చేస్తూండగా ప్రస్తుతం మా ఇంటిలో అందరూ ధ్యానం, శాకాహారం పాటిస్తున్నారు. మా అమ్మాయే నాకు మాస్టరయ్యింది. (జనవరి 2018లో "ధ్యాన జగత్" మాస పత్రికలో వెన్నెల "శ్రీజ" అనుభవం మీరు చదివే ఉంటారు. "ధ్యానం ద్వారా 10/10 గ్రేడ్ సాధించాను") ఈ కార్యక్రమాల ద్వారా నా ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వచ్చింది; స్థితప్రజ్ఞత పెరిగింది.

మా మామగారికి గుండె బైపాస్ సర్జరీ చేసిన సందర్భంలోనూ మరి మా అబ్బాయికి రెండు కాళ్ళూ యాక్సిడెంట్ అయిన సందర్భంలోనూ చలించకుండా ధ్యానం క్లాసులకు వెళ్ళి ప్రచారం చేశాను. ప్రస్తుతం ధ్యానులే బంధువులు, మిత్రులుగా వేలాదిమంది ఉండటం నా యొక్క పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను.

కేవలం రెండు సంవత్సరాల ధ్యాన ప్రచారం మూలంగా వింజమూరు ప్రక్కన "సాతానువారిపాలెం" గ్రామంలో ప్రసాద్ మిత్రులు 27'x27' పిరమిడ్, రవిచంద్ర, గోపాల్ మిత్రులు 12'x12' రూఫ్‌టాప్ పిరమిడ్‌లు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం వింజమూరు - "యర్రబల్లిపాలెం"లో 62.5 అంకణాల (500 గజాలు) స్థలం విస్తీర్ణంలో కోటి రూపాయల వ్యయంతో 40'x40' పిరమిడ్ ధ్యానమందిరం, 40'x40' హాల్, గ్రంథాలయం, మాస్టర్ విశ్రాంతి గది, భోజనశాల, వంటగది, టాయ్‌లెట్స్, ఆహ్లాదకరమైన ఉద్యానవనం నిర్మిస్తూ, "ధ్యానం చేస్తే - భోజనం ఉచితం" అనే నినాదంతో "శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ శక్తిక్షేత్రం" ను నిర్మిస్తున్నాం.

ఉద్యోగం ద్వారా వచ్చే జీతం బ్యాంకులో ఉన్న అప్పులకే సరిపొతున్నది. కేవలం ఇంటి ఖర్చుల వరకే జీతం సర్ధుబాటు అయినది. అయినప్పటికీ వజ్ర సంకల్పంతో ఎన్నో ఒడుదుడుకులు, అవమానాలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు వచ్చినప్పటికీ, స్వంత ఇల్లు లేనప్పటికీ పట్టించుకోకుండా పిరమిడ్ నిర్మాణం, ధ్యాన ప్రచారమే లక్ష్యాలుగా ముందుకు వెళుతున్నాను. భూమి మీదకు వచ్చిన అసలు పనిమీద దృష్టిని కేంద్రీకరించాను.

ఈ సంకల్పబలం, ఆలోచనా శక్తి మూలంగా వింజమూరులోని ప్రధాన రహదారిలో శాశ్వత కేర్ సెంటర్ భవనాన్ని ఉచితంగా "పసుపులేటి రాజమ్మ ధ్యాన కేంద్రం" పేరుతో వారి కుమారులు "రమణయ్య మాస్టర్" ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పిరమిడ్ నిర్మాణానికి పలువురు మాస్టర్లు స్వచ్ఛందంగా ఫోన్లు చేసి ధన వస్తు సేవ రూపంలో సహకరిస్తున్న వారికందరికీ శత సహస్రకోటి వందనాలు. ఇంకనూ సహకరించే వారికి కూడా ధన్యవాదాలు.

ఇంత అద్భుతమైన ధ్యానాన్నీ, పిరమిడ్ నిర్మాణ అవకాశాన్నీ, ప్రచార అవకాశాలన్నీకల్పించిన మాస్టర్లందరికీ .. మరి జగద్గురు పత్రీజీ గారికి .. శత సహస్ర కోటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

B. వెంకటేశ్వర్లు

వింజమూరు - నెల్లూరు జిల్లా

- 91103 18485.

Go to top