"ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది"

 

నా పేరు "రాంరెడ్డి". నల్గొండజిల్లా "చిల్వకుంట్ల" అనే మారుమూల గ్రామంలోని ఒక వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటినుంచీ కారణమే తెలియని భయాలతో కూడి ఉండేవాడిని. కోపం కూడా నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఎవరు ఏమన్నా ఏడ్చేసేవాడిని. అయితే ఇతరులకు సహాయం చెయ్యాలి అంటే మాత్రం అందరికన్నా ముందు ఉండేవాడిని.

Gland Institute of Pharmaceutical Sciences, నర్సాపూర్, మెదక్‌జిల్లాలో B.Pharmacy 2వ సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడు నాకు మా సీనియర్ "V. నరేష్" ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. మొదటి సిట్టింగ్‌లోనే గంటసేపు ధ్యానం .. మాంసం తినడం వదిలివేశాను!

ఆ తరువాత 41రోజులపాటు క్రమం తప్పకుండా ధ్యానం చేశాను. ధ్యానం చేస్తూన్నప్పుడు శరీరంలో విపరీతమైన నొప్పులు వచ్చి ధ్యానం అయిపోయిన తరువాత మాయం అయిపోయేవి. "ఇలా ఎందుకు జరుగుతోంది?" అని నా స్నేహితుడిని అడుగగా "నీ శరీరంలో ఎక్కడెక్కడ ‘బ్లాక్స్’ ఉన్నాయో అవన్నీ విశ్వశక్తితో చక్కగా ‘క్లీన్’ అవుతున్నాయి. అది నాడీమండలశుద్ధి! నువ్వు ఇంకా ఎక్కువసేపు ధ్యానం చెయ్యి" అని చెప్పాడు.

కాలేజీకి వెళ్ళిరావడం, చదువుకోవడం, మధ్య మధ్యలో ధ్యానం చేసుకోవడం. ఇలా 41 రోజుల తరువాత నన్ను నేను పరిశీలించుకుంటే ఎన్ని మార్పులో:

* నాలో భయాలు తొలగిపోయాయి.
* ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది.
* ఎక్కువ కష్టపడకుండా చదివినవన్నీ అర్థమయ్యేవి. నాలో సంకల్పశక్తి చక్కగా పెరిగింది.
* చిన్నప్పటినుంచి ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోయాయి.
* నాలో ఏ మూలనో ఉన్న బద్ధకం తొలగిపోయి క్రొత్త ఉత్సాహం నిండిపోయింది.
* క్రొత్తవాళ్ళతో కూడా సంకోచం లేకుండా మాట్లాడగలుగుతున్నాను

నేను పొందిన లాభాలన్నీ ఇతర విద్యార్థులు కూడా పొందాలన్న సంకల్పంతో మా ఇతర సీనియర్ స్నేహితులతో కలిసి క్యాంపస్‌లో ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించడం మొదలుపెట్టాం. నర్సాపూర్ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న స్కూల్స్‌లో దాదాపు అరవైవేల ధ్యాన-శాకాహార కరపత్రాలను విద్యార్థులకు పంచిపెట్టాము.

ఈ క్రమంలో నేను B. Pharmacy పూర్తిచేసుకుని కాలేజీలో రెండవ ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో M. Pharmacy లో చేరాను. అక్కడ మా సీనియర్ "ప్రదీప్"తో కలిసి ధ్యాన ప్రచారంలో పాల్గొన్నాను. అంతేకాకుండా మా బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నెం. 47 ని పిరమిడ్ మెడిటేషన్ రూమ్‌గా రూపొందించుకున్నాం. ప్రతి సంవత్సరం మా యూనివర్సిటీ విద్యార్థులం అందరం కలిసి డిసెంబర్ నెలలో కడ్తాల్ కైలాసపురిలో జరిగే "ధ్యానమహాచక్రం" కార్యక్రమాలలో వాలంటరీ సేవలను అందిస్తున్నాం. అన్నదాన మంటపంలో ఇప్పటివరకు లక్షలాది మందికి నా చేతుల మీదుగా భోజనం వడ్డించాను.

ప్రస్తుతం "ఉస్మానియా యూనివర్సిటీ ధ్యానవిద్యార్థి సంఘం" చే ప్రతినెలా రెండవ ఆదివారం "స్వచ్ఛ ఉస్మానియా" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సూర్యాపేట పిరమిడ్ మాస్టర్స్ "శ్రీ బండ రాంరెడ్డి" గారు, "రోజా మేడమ్", "శ్రీనివాస్ సార్" మరి "కవిత మేడమ్" గార్లతో కలిసి సూర్యాపేట మండలంలోని గ్రామాలలో అనేక శాకాహార ర్యాలీలను నిర్వహించాను.

ఒకసారి మే నెలలో మా గ్రామం "చిల్వకుంట్ల"లో శాకాహార ర్యాలీని నిర్వహించి .. సాయిబాబా గుడిలో ధ్యానశిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. అందులో సూర్యాపేటనుంచి 50 మంది స్కూల్ టీచర్లు వచ్చి పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక చిన్న కోడిపిల్ల నా దగ్గరికి వచ్చి ఏడ్వగా నేను దానిని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఓదార్చాను. అది ఆ శాకాహార ర్యాలీ సందర్భంగా నేను పొందిన గొప్ప అనుభవం.


ఆ రోజు రోజా మేడమ్ ద్వారా అనేక ధ్యానజ్ఞాన సత్యాలను తెలుసుకున్న గ్రామస్థులంతా చాలా సంతోషపడి "ఏ తల్లి కన్నబిడ్డవో .. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశావు" అని నన్ను దీవించారు. అది చూసి మా అమ్మ ఎంతో ఆనందపడి .. తాను కూడా ధ్యానం చెయ్యడం ప్రారంభించింది. ఇరవై అయిదు సంవత్సరాలుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ కొన్ని వేలు ఖర్చుపెట్టి వైద్యం చేయించినా తగ్గని తలనొప్పిని అమ్మ మా ఊరిలో నిర్వహించిన 41 రోజుల మండల ధ్యానంలో పోగొట్టుకుంది!

అలాగే 2017 డిసెంబర్‌లో జరిగిన ధ్యానమహాచక్రం లో 5 రోజులపాటు ప్రాతఃకాల ధ్యానంలో పాల్గొన్న మా బంధువుల అమ్మాయి సైనస్ సమస్యను తగ్గించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా సైనస్‌తో బాధపడుతూన్న ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుచేసి లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ కూడా చేయించారు. అయినా సమస్య తగ్గకపోగా శ్వాస ఆడడం కూడా ఇబ్బందిగా మారడంతో నేను ఆమెను కైలాసపురి "మహేశ్వర పిరమిడ్"లో కూర్చోబెట్టి ధ్యానం చేయించాను. ఇప్పుడు ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటూ ఇంజనీరింగ్ చదువుకుంటోంది.

ప్రస్తుతం నేను M.Pharmacy పూర్తిచేసి TSPSC గ్రూప్ -II పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాను. "అందరూ బాగుంటేనే మనం బాగుంటాం" అన్న విశ్వసిద్ధాంతాన్ని బోధించి, ఇంత గొప్పగా జీవించే ధ్యానాన్ని నాకు అందించిన పత్రీజీకి నా ధన్యవాదాలు. నా చిట్టచివరి శ్వాస వరకు నేను ధ్యానప్రచారం చేస్తూనే ఉంటాను! థ్యాంక్యూ!!

 

M.రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ - హైదరాబాద్
- 99121 82239.

Go to top