"గిరిజన తండాలన్నీ ధ్యాన - శాకాహారమయం చేస్తాను"

 

నా పేరు "మెగావత్ రాజమల్లు" నేను గిరిజనుడిని. సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన నాకు భార్య, ఇద్దరు అబ్బాయిలు, మరి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందరి పెండ్లిళ్ళు అయిపోయాయి.

నేను 2017 శివరాత్రి రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోకి రాకముందు నేను మద్యం త్రాగుతూ చుట్ట, బీడీలను కాల్చేవాడిని. అన్నిరకాల మాంసాలను విపరీతంగా తినేవాడిని. నా భార్య "మెగావత్ బోడి" కీళ్ళ నొప్పులతో బాధపడుతూ నడువలేని పరిస్థితికి వచ్చింది. ఎందరో దేవుళ్ళకు మ్రొక్కాం. అమ్మవారికి జంతు బలులు కూడా ఇచ్చాం. కానీ ఏ దేవతా కనికరించలేదు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాలు తిరుగుతూ ఎంతోమంది డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకున్నాం. బంధుమిత్రులందరి దగ్గరా అప్పుచేసి మరీ ఆమె వైద్యానికి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. అయినా ఆమె జబ్బు తగ్గలేదు.

ఈ పరిస్థితుల్లో నాకు దేవుళ్ళలా "హాలియా పిరమిడ్" మాస్టర్ "సైదయ్య"గారు మరి నాగార్జున పిరమిడ్ మాస్టర్ "అనిల్‌కుమార్" గార్లు 2017 మహాశివరాత్రి రోజున "శ్రీ తిరుమలనాధ స్వామి గట్టు" మీద జరిగిన ధ్యాన కార్యక్రమంలో నాకు కలిశారు. ధ్యానం యొక్క గొప్పతనాన్ని వారు నాకు వివరించి చెప్పి నాతో ధ్యానం చేయించారు.

నాకు ఎంతో బాగుందనిపించింది ఇంటికి వెళ్ళగానే మా కుటుంబ సభ్యులతో ధ్యానం చేయించాను. నా భార్య ఇంటి దగ్గర ఉన్న పొలం పనులకు వెళ్ళినా సరే క్రమం తప్పకుండా 41 రోజులపాటు నిష్ఠగా ధ్యానం చేసింది. మాంసం తినడం మానేసి కుటుంబం అంతా శాకాహారులం అయ్యాం. మండల ధ్యానం ముగిసే సరికి నా భార్యకు కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అంతకు మునుపు లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని ఆమె జబ్బు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ధ్యానంతో తగ్గిపోయింది!

ఈ ఆనందాన్ని పదిమందికీ పంచాలన్న సంకల్పంతో .. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఆశతో నేను పిరమిడ్ నిర్మాణం కొరకు "తిరుమలనాథ గట్టు" దగ్గర ఉన్న నా ఒకటిన్నర ఎకరాల పొలం నుంచి ఒక ఎకరాన్ని నల్గొండ పిరమిడ్ సొసైటీకి అమ్మి, అర ఎకరం పొలాన్ని ఉచితంగా ఇచ్చాను. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యింది.

2017 డిసెంబర్ 3 వ తేదీన "స్వర్ణమాల పత్రి మేడమ్" గారు వచ్చి భూమిపూజ చేశారు. 2018, ఫిబ్రవరి 21 వ తేదీ పత్రీజీ పిరమిడ్ క్షేత్ర పరిశీలనకు వచ్చి నాచే మరి నా భార్యచే మా అనుభవాలను చెప్పించారు.

నేను నా కుటుంబ సభ్యులం అందరం ధ్యానం చేస్తూ మా చుట్టుప్రక్కల ఉన్న గిరిజన తండాలలో ధ్యానప్రచారం చేస్తున్నాము. మా భాషలో మా వాళ్ళకు ఇంత గొప్పదైన ధ్యానాన్ని పరిచయం చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమాయక గిరిజనులమైన మేం ఏ జబ్బు వచ్చినా భయపడి పట్టణాలలోని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టుకుంటున్నాము.

త్రాగుడు, గుట్కా వంటి వ్యసనాలకు బానిసలమై రోగాలు కొని తెచ్చుకుంటున్నాము. అటువంటి మాకు ధ్యానం నేర్పించి మా కష్టాలు తీరుస్తున్న "పత్రీజీ మహారాజ్"కు వేల వేల దండాలు! మా గిరిజన తండాలన్నీ ధ్యానులుగా శాకాహారులుగా మారే వరకు నేను కృషి చేస్తాను!

 

మెగావత్ రాజమల్లు


 గాత్ తండా - రంగుండ్ల గ్రామం - నల్గొండ జిల్లా

9640100901, 9573077096.

Go to top