"ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడమే సదానంద యోగం"

 

పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ "బైజుబాబు" గారు - "కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం" దగ్గరలోనే 1977లో జన్మించారు. అప్పటికే అక్కడ ఉన్నారు. 1990 ప్రాంతంలో పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నప్పటి నుండే "బ్రహ్మర్షి పత్రీజీ" గురించి "ధ్యానం" గురించి ఎరుక ఉన్నవారు. పిరమిడ్ నిర్మాణాన్ని దూరం నుండే గమనిస్తూ 1992లో పత్రీజీ సాంగత్యం కలిగిన తర్వాత పత్రీజీ ఆదేశంపైన నందవరం వెళ్ళి "సదానంద యోగీశ్వరుల మహా సమాధి" ని దర్శనం చేసుకుని .. సద్గురు సదానందుల వారి భక్తుడైపోయాడు! బ్రహ్మర్షి పత్రీజీ యొక్క గురువర్యులు "సదానంద సద్గురువులు" పిరమిడ్ ప్రపంచానికే పరమ గురువులు.

నందవరంలోనూ .. సదానంద సద్గురువులతోనూ .. ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఉన్న "బైజు" మాస్టర్ ఇన్నర్‌వ్యూ "ధ్యానజగత్" పాఠకులకు ప్రత్యేకం - ఎడిటర్

 

మారం: "బైజుగారూ! ఆత్మ ప్రణామాలు. మీ గురించీ మీ కుటుంబం గురించీ చెప్పండి! మీ తల్లిదండ్రుల నేపథ్యం?"
బైజు: మారం సార్! మీకు నా ఆత్మ ప్రణామాలు. నా పూర్తిపేరు "అన్నా నాయర్ బైజు బాబు". వయస్సు 40 సంవత్సరాలు. చదువు ఇంటర్‌మీడియట్. తండ్రి " కీ||శే|| అన్నా నాయర్ నారాయణ పిళ్ళై " మరి తల్లి " మరియకుట్టి ". చెల్లెలు " బీనాకుమారి ". నా భార్య " గీతా వాణి ". కూతురు " మోక్షితానంద ".

మా నాన్నగారు అయిన నారాయణ పిళ్ళై కేరళలోని త్రివేండ్రం, తల్లి ఎర్నాకులం వాస్తవ్యులు. స్వాతంత్ర్య సమర యోద్ధులు. నేను పుట్టక మునుపే కర్నూలు వచ్చి ఇప్పటి "బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం" ప్రక్కనే " రాఘవేంద్ర నగర్ " లో ఉన్నారు. ఇప్పటి వరకూ అక్కడే నివసిస్తున్నారు. మా నాన్నగారు ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత బిర్లా కంపెనీలో పనిచేశారు.

మారం: "మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వచ్చారు? ధ్యానం పట్ల ఎలా మక్కువ కలిగింది?"
బైజు: మా నాన్నగారు "ధ్యానయోగి". పెళ్ళి కాకముందే ఒక సాధువు. మా అమ్మ పెళ్ళయిన తర్వాత "రాజయోగిని". రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బర్మా అడవుల్లోకి వెళ్ళిన మా నాన్నగారు అక్కడి ఒక కీకారణ్యంలో ఒక మహా యోగీశ్వరుని చూశారు. మా నాన్నగారు ఆయన దర్శనం చేసుకున్నారు.

ఆ యోగి తనది అవసానదశ అని ఎరిగి అటుగా దారి ఎలా వెళ్ళాలో తెలియక తికమక పడుతూన్న మా నాన్నగారిని చూసి పేరుతో దగ్గరికి రమ్మని పిలిచి - "నువ్వు సాధువుగా ఉంటావు. పెళ్ళైన తర్వాత "రాజయోగి" గానూ ఉంటావు. నీకు త్వరలో ఒక అమ్మాయి తటస్థపడుతుంది. ఆ అమ్మాయితో నీకు వివాహం జరుగుతుంది. మీకు ఇద్దరు పిల్లలు పుడతారు. నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో దండం మరి నా కమండలం ఇంకా ఇతర వస్తువులు .. నన్ను నువ్వు ఇక్కడే సమాధి చెయ్యి. ఆ తర్వాత ఈ వస్తువులు నువ్వు తీసుకువెళ్ళు. వీటిని వంశపారంపర్యంగా కాపాడండి. మీ కుటుంబం హాయిగా నడుస్తుంది" అని ఆశీర్వదించి తన శక్తినంతటినీ మా నాన్నగారికి ధారపోసారు.

అప్పటికే ఎంతో ఆకలితో ఉన్న మా నాన్నగారు "నాకు ఆకలవుతోంది" అన్నారట. ఆ వెంటనే ఆ యోగి ఒక ఆకును కోసి ఇది తినమని మా నాన్నగారికి ఇచ్చారు. అంతే దానితో మా నాన్నగారికి నాలుగైదు రోజుల వరకూ ఆకలి కాలేదు. అలా మా నాన్నగారు ఆ "యోగి" అడిగినట్లుగానే అక్కడే సమాధి చేశారు.

ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత గురువాక్యం ఫలించి పెళ్ళి చేసుకుని కర్నూలు వచ్చి "బిర్లా కంపెనీ" లో ఉద్యోగం చేరారు. ఆయన సాధు జీవనం గడిపేవారు. నేనూ, మా చెల్లలు సంతానం.

ఎట్టు మిట్టు పిళ్ళై మారు - త్రివేండ్రం " అనంత పద్మనాభ స్వామి " పూజారుల వంశం మా నాన్నగారిది. పుట్టుకతో శాకాహారి. మా నాన్న ఒక యోగి కనుక నాకు చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి.

మారం: "మీకు ‘పత్రీజీ’ పరిచయం ఎప్పుడు, ఎలా, ఎక్కడ కలిగింది?"
బైజు: కర్నూలులోని " బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం " నిర్మించక ముందు అక్కడ అంతా పొదలుండేవి. పెద్ద పుట్ట ఉండేది. తాచుపాములు కూడా తిరిగేవి. 1990, 91 ప్రాంతంలో పిరమిడ్ నిర్మాణం కూడా రోజులాగానే చూసేవాడిని. 1992 సంవత్సరంలో పిరమిడ్ కట్టిన తర్వాత అక్కడ ఒక బ్యానర్ చూశాను. " Meditation work shop " అనే బ్యానర్ ప్రక్కన పత్రిసార్ నిలబడి ఉన్నారు. అప్పుడు వారికి గెడ్డం లేదు. అప్పుడే నేను వెళ్ళి వారిని కలువలేదు.

మారం: "మరి ఎప్పుడు కలుసుకున్నారు పత్రీజీని? ఎలా జరిగింది వారి పరిచయ భాగ్యం?"
బైజు: నా జీవితంలో పెద్ద మలుపు పత్రీజీ పరిచయ భాగ్యం. నాకు టీనేజ్‌లోనే అత్యంత చిత్రంగా రౌడీలు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్ట్స్ పరిచయం కావడం, ఆ పైన వారితో స్నేహాలుగా మారడం జరిగింది. అలా వారి సహవాసం వల్ల చిన్న వయస్సులోనే ఘర్షణాయుతమైన జీవితం నడిచింది ఒక నాలుగైదేళ్ళపాటు.

జీవితంపై విరక్తి పుట్టింది. క్రమంగా "దేవుడెక్కడున్నాడు?" .. "మనుష్యులు ఎందుకు పుట్టాలి?" .. "ఎందుకు మరణించాలి?" అనే మీమాంసతో, సంఘర్షణతో సతమతమవుతూ 1992 లో ఎదురుగానే ఉన్న "బుద్ధా పిరమిడ్ ధ్యాన మందిరం" లో బ్రహ్మర్షి పత్రీజీ దర్శనం చేసుకున్నాను. వారు నన్ను సాదరంగా స్వీకరించి ధ్యానంలో కూర్చోబెట్టారు. ఆ పైన పత్రిసార్ రెగ్యులర్‌గా కలిసేవాడిని.

పత్రిసార్ కూడా నన్నెంతో ఆప్యాయంగా చూసేవారు. వారి కాపురం కూడా కర్నూలులోనే ఉండేది. ఇల్లు కూడా ప్రక్కనే అయినందువల్ల నాకు "పత్రిమేడమ్" తో కూడా పరిచయమైంది. పత్రి మేడమ్ నాకు భోజనం పెట్టి కొడుకులాగా చూసుకుంది ! అలా దొరికింది నాకు ‘పత్రీజీ’ సాంగత్యం, పత్రి మేడమ్ ఆదరణ!

మారం: "మరి మీరు చాలా సంవత్సరాలు ‘నందవరం సదానందయోగి’ సాన్నిధ్యంలో ఎంతో సేవ చేశారు కదా! ఆ స్వామి వారి పట్ల మీకు అనన్యభక్తి ఎలా కలిగింది? ఆ వైనమంతా వివరించండి?"

బైజు: 1994 లో మొట్టమొదటిసారిగా పత్రిసార్ నన్ను నందవరం వెళ్ళి "సద్గురు సదానంద స్వామి" వారి మహా సమాధిని దర్శనం చేసుకుని, ధ్యానం చేసుకుని రమ్మన్నారు. అటు తర్వాత నేను మరొక సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ "యోగానంద" కలిసి నందవరం వెళ్ళి స్వామివారి మహాసమాధి వద్ద ఆ ఊరి పెద్దలు, పిల్లల చేత ధ్యానం చేయించాం. మన కర్నూలు పిరమిడ్ ఇన్‌ఛార్జ్ "నందవరం ప్రసాద్" కూడా ఆ పిల్లలతో కలిసి వచ్చి మొట్టమొదటిసారిగా ధ్యానం చేయించాం. మన ట్రస్ట్ వైస్ ఛైర్మన్ " P.R. వెంకటేశ్వర రెడ్డి" గారి తండ్రి మరి నందవరం "శ్రీ గండ్ల వెంకట సుబ్బయ్య" గారు ధ్యానం చేసిన వారందరికీ అన్నం పెట్టేవారు.

మారం: "మరి మీ స్నేహ బృందమంతా ఏమైంది? వారితో పరిచయాలు ఎలా పరిణమించాయి?"
బైజు: నా లైఫ్‌లో మొదటి ట్విస్ట్ బ్రహ్మర్షి పత్రీజీ పరిచయమైతే .. మరో ట్విస్ట్ మా స్నేహబృందం ధ్యానులుగా మారటం! ఎందుకంటే ఎవరెవరీ సహవాసం వల్ల నేను డిస్టర్బ్ అయ్యానో ఆ క్రిమినల్స్, రౌడీషీటర్లు, నక్సలైట్లుతో ధ్యానం చేయించి ధ్యానులుగా మార్పు తీసుకువచ్చాను. అందులో నందికొట్కూరు రాంబాబు, శ్రీనివాస్ రెడ్డిలతో ఏకంగా అయిదుసార్లు నందవరం "సదానంద స్వామి" మహాసమాధి వద్ద గురుపౌర్ణమి నాకు అన్నదానం చేయించి వాళ్ళలో మార్పు తీసుకువచ్చాను. వాళ్ళను మార్చడం " Cosmic Plan " అని నాకు తర్వాత అర్థమైంది.

మారం: "మీరు మీ ధ్యాన స్నేహబృందంతో పూనుకుని సదానందస్వామి మహాసమాధి మందిరం ప్రాంగణం లోని భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారని నాకు తెలుసు. మరి ఆ అద్భుత అనుభవాన్ని వివరించండి!"
బైజు: ఒకరోజు నేను మా ఇంట్లో ధ్యానం చేస్తూండగా, కాకతాళీయంగా అదే సమయంలో ధ్యానంలో ఒక స్వరం వినపడింది. సదానంద స్వామి యొక్క వాక్కు: "నువ్వు నీ ధ్యాన మిత్రులతో కలిసి నా సమాధి మందిరం ప్రాంగణం చుట్టూ ప్రహరీగోడ కట్టు; ఈ ప్రాంగణం ఒక అద్భుతక్షేత్రం అవుతుంది" అని చెప్పారు.

ఆ మెస్సేజ్‌ను పత్రీసార్‌కు చెప్పి మేమంతా వారి అనుమతి తీసుకుని తొమ్మిది మంది ధ్యాన మిత్రులు "రమణ", "భాస్కర్", "మధుసూదన్ రావు", "చిన్నబాబు", "సుధాకర్", "రామాంజనేయులు", "వెంకటేశ్వర రెడ్డి", "రెహమతుల్లా" మరి "శివశంకర్ రెడ్డి" అంతా కలిసి ఆ పొలం యజమాని నందవరం వాస్తవ్యులు పత్రీజీ స్నేహితులు అయిన సదానంద స్వామి వారి శిష్యుడైన "చెన్నారెడ్డి" గారి అనుమతి తీసుకున్నాం.

ఆ పైన మేము తొమ్మింది మంది నందవరంలో రెండు నెలలు ఉండి స్వామి "సద్గురు సదానంద యోగి" వారి ప్రాంగణంలో వంట చేసుకుని తింటూ అక్కడే నిద్రిస్తూ మేము కూడా మేస్త్రీలతో కలిసి శ్రమదానం చేస్తూ ఆ ప్రహరీగోడను ఆరు అడుగుల ఎత్తు పటిష్ఠంగా నిర్మింపజేశాం!

ప్రహరీ లోపల చెట్లు వేశాం. ఇప్పుడు అవన్నీ పెరిగి నీడనిస్తున్నాయి. ఆ పైన గురుపౌర్ణమి ఉత్సవం బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో నందవరం "సద్గురు సదానంద యోగి" సాన్నిధ్యంలో వైభవంగా జరిగింది. అదే రోజు "ధ్యానయుగం" అనే పత్రిక పత్రీసార్ చేతుల మీదుగా 1999వ సంవత్సరంలో విడుదల చేశాం. అందరికీ ఉచితంగా పంచాం. ఆ సందర్భంగా పత్రీజీ నన్ను మెచ్చుకుని నాకు "గురుశక్తి" అనే అవార్డును ఇచ్చారు.

మారం: "నేను 2017లో నందవరం స్వామి సమాధి వెనుక భూమి కొనే ముందు సదానంద స్వామీజీ అనుమతిని కోరుతూ నేను, తాడిపత్రి పిర్తమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, నందవరం పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర రెడ్డి, కర్నూలు పిరమిడ్ మాస్టర్ రామ సుబ్బయ్య గారు మరి పొలం యజమానులు కూర్చుని ధ్యానం చేస్తున్నాం.

ధ్యానంలో నాకు సదానంద స్వామిజీ తమ సమాధిలోంచి బయటకు వచ్చి సమాధిపైన కూర్చుని కనిపించారు. మహదానందంతో నేను వారికి ప్రణమిల్లగా వారు ‘సుభాష్‌తో చర్చించి అన్నీ చెయ్యండి. నా ప్రియశిష్యడు బైజుబాబు ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామిని చెయ్యండి, అభీష్ఠసిద్ధిరస్తు’ అంటూ అదృశ్యమైపోయారు.

నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అసలు ఆ అభివృద్ది కార్యక్రమాలలో మీ యొక్క భాగస్వామ్యం గురించి మేము ఎన్నడూ చర్చించలేదు. నా ఈ అనుభవాన్ని పత్రీజీతో చెప్పగా వారు ‘అది సత్యం’ అని చెప్పారు. ఇలా మీ వల్ల నాకు ఎన్నో సంవత్సరాలుగా కలలుగన్న సదానంద సద్గురు దర్శన భాగ్యం లభించడం నా అదృష్టం! మాకు కూడా సదానంద స్వామీజీ గురించి ఏవైనా ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయా?"

బైజు: మీరు అన్నట్లు నాకు "శ్రీ సద్గురు సదానంద యోగి మహరాజ్" తో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అయిదు లేదా ఆరు అనుభవాలను నేను మీకు వివరిస్తాను. స్వామి వారి సమాధి ప్రాంగణంలో ప్రహరీగోడను నిర్మిస్తున్నప్పుడు వచ్చిన లైవ్ ఎక్స్పీరియన్స్, అంతకు ముందు ధ్యానంలో జీసస్, బుద్ధుడు, షిరిడీ సాయిబాబా .. ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు కనిపించారు.

అయితే ఒకరోజు సదానంద స్వామి వారి దర్శనం ధ్యానంలో కలిగింది. ఒకరోజు అది ఎలాంటి అనుభవమంటే "నేను ధ్యానానికి ముందు నాకు నేను’ ఈ సదానందస్వామికి నాకు సంబంధమేమిటి? ఎప్పటిది? నేను ఈ ప్రహరీగోడ కోసం కర్నూలు వదిలిపెట్టి నా స్నేహితులతో కలిసి రెండు నెలలుగా ఇక్కడే ఉండి నిద్రించి ప్రహరిగోడ నిర్మింప జేయడమేంటి?! అని దీనికి కారణం నాకు తెలియాలి’ అని భీష్మించుకుని ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు తీవ్రమైన గాఢ ధ్యానస్థితిలో నాకు నా గత జన్మ అతి ముఖ్యమైన జన్మ సదానందస్వామికి పత్రీజీకి సంబంధించిన జన్మ నాకు కనపడింది.

"అది ఒక భీకరమైన అరణ్యం. అక్కడ స్వామి సదానంద సద్గురువులు ‘బాడీ వెకేట్’ చేసి ఉన్నారు. బ్రహ్మర్షి పత్రీజీ మరి కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. ‘సదానంద స్వామి పార్థివదేహాన్ని’ ఒక తెల్ల బట్టతో కట్టాను. స్వామి వారి దేహం చాలా సన్నగా ఉంది. ఆ కారడవిలో ఫలానా చోట సమాధి చేయమని, దేహం చాలించేముందు సదానందస్వామి వారి ఆజ్ఞ. వారి ఆదేశం ప్రకారం నేను వారి దేహాన్ని నా భుజంపై మోసుకుని వెళుతున్నాను. మరి పత్రీజీ మిగిలిన శిష్యులు వెంట నడుస్తున్నారు.

"నిర్ణీత ప్రదేశానికి చేరుకోగానే ఆ పార్థివ దేహాన్ని క్రింద ఉంచాము. ఆ వెంటనే ఏ మాత్రమూ భరించలేనంత దుర్వాసన ఆ ప్రదేశమంతా చుట్టుముట్టింది. ఎంత ప్రయత్నించినా భరించలేనిదిగా ఉంది. ఆ దుర్వాసనకు మిగిలిన శిష్యులంతా పరుగెత్తి పారిపోయారు. నేను పత్రిసార్ మాత్రం ఉన్నాం. కాస్సేపు అయిన తరువాత పత్రీ సార్ ‘నేనిప్పుడే వస్తాను; స్వామి దేహం జాగ్రత్త’ అని ప్రక్కకు వెళ్ళారు.

"కాస్సేపటికి సదానందయోగి పార్థివ దేహంలో కదలిక కనబడింది నాకు. ‘పత్రిసార్! సదానందస్వామి బ్రతికే ఉన్నారు’ అని గట్టిగా అరిచాను. పత్రిసార్ బదులు పిలుపు లేదు. వెంటనే నేను ‘సార్! సార్! అని అరుచుకుంటూ పత్రిసార్ వెళ్ళినవైపు వెళుతున్నాను. అంతలో దాదాపు ఇరవై వేటకుక్కలు స్వామి శరీరం వైపు వెళుతున్నాయి.

"అది గమనించిన నేను ఆగిపోయి ‘ సదానంద స్వామి’ అని గట్టిగా అరిచాను! అరిచిన వెంటనే ఆ కుక్కలు పారిపోయాయి. కాస్సేపట్లో పత్రీసార్ తిరిగి వచ్చారు. మళ్ళీ చూస్తే ఆ దుర్వాసన లేదు. సదానంద స్వామి పార్థివదేహంలో చలనం లేదు. ఆ దుర్వాసన రావడం మిగిలిన శిష్యులు పారిపోవడం, పత్రీజీ కాసేపు ప్రక్కకు వెళ్ళడం ‘సదానందస్వామి’ ఇదంతా తన మహిమ చూపడం కోసమేనని నాకు పత్రీసార్‌కు తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నేను, పత్రీసార్ స్వామి వారి పార్థివ దేహాన్ని సమాధి చేశాం."

ఈ అనుభవం పూర్తయిన తరువాత నేను ధ్యానంలోంచి బయటకు వచ్చాను. ధ్యానం నుంచి లేచిన తర్వాత నాకు కలిగిన నా గతజన్మ అనుభవాన్ని ‘రివ్యూ’ చేసుకుంటే నాకు అర్థమైనదేమిటంటే నాకు సదానంద సద్గురువులకు, బ్రహ్మర్షి పత్రీజీకి జన్మజన్మల అనుబంధం ఉందని అందుకే ఇప్పుడు ఈ జన్మలో అదే మహనీయుని యొక్క మహాసమాధి ప్రాంగణంలో ప్రహరీగోడ నిర్మాణం చేయించడం, నా పైన అపార కరుణతో సదానంద సద్గురువులు మరి బ్రహ్మర్షి పత్రీజీ కలిసి ప్రసాదించిన అద్భుత వరం ఇది!

ఇంకా ఆలోచిస్తే నాకు తట్టింది - ఆ జన్మలో సదానంద స్వామి వారి పార్థివ దేహాన్ని భూమిలో మహాసమాధి చేశాం కానీ "పైన ఒక మందిరం కానీ, ప్రాంగణం కానీ నిర్మించలేకపోయాను" అనే వెలితి ఉండేది. అందుకే ఈ జన్మలో అదే అవకాశం నాకు ప్రసాదింప బడిందని నాకు అర్థమైంది. " ఆహా! దొరకునా ఇటువంటి సేవ!"

కర్నూలుకు వచ్చి పత్రిసార్‍కు ఈ అనుభవం చెప్పినప్పుడు సార్ ఎంతో సంతోషించి ఇలా అన్నారు "ఇందుకే నిన్ను అక్కడికి పంపాను. నీ భౌతిక కాయం ఉన్నంత వరకు మన గురువులు ‘సదానంద సద్గురువులు’ యొక్క సమాధి మందిర పరిరక్షణ నీ బాధ్యత" అన్నారు నాతో! అందుకే ఎవరైనా ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు చేయడానికి వస్తే నేను అంగీకరించలేదు. ఇప్పుడు సరియైన సమయానికి, సరియైన టీమ్‌తో పత్రిమేడమ్ ఛైర్మన్‌గా ట్రస్ట్ ఏర్పడింది. కనుక నాకు ఎంతో తృప్తి కలిగింది.

అనుభవం : 2

మా అమ్మగారు పక్షవాతం కారణంగా 2012లో ICU లో ఉన్నప్పుడు నేను స్వామి సమాధి వద్దకు వచ్చి, ఊదిబత్తులు అంటించి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానం నుంచి లేచి ఆ బత్తీలు కాలగా వచ్చిన విభూది పొట్లం కట్టుకుని కర్నూలు హాస్పిటల్‌లో ఉన్న అమ్మ నోట్లో వేసి, స్వామి వారిని ఒకసారి తలచుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్‌లో అమ్మ ప్రక్కన ఉన్న నా చెల్లలు, ఫోన్ చేసి "అన్నయ్యా! అమ్మ స్పృహలోకి వచ్చింది. కాలు, చేయి కదిలిస్తోంది" అని. ఆ తర్వాత ఒక సంవత్సరానికి ప్రశాంతంగా కన్నుమూసింది.

అనుభవం : 3

స్వామి సమాధి మందిరం వద్ద ప్రహరీగోడ నిర్మాణం పూర్తయిన తర్వాత ముందు అనుకున్న ప్రకారం మేస్త్రీలకు అందరికీ బట్టలు పెట్టాలని .. ఏర్పాట్లు చేస్తాం రమ్మని మైసూర్ నుంచి S.K. రాజన్ సార్; గిరిజా రాజన్ మేడమ్, కీ||శే|| చంద్రశేఖర్ మాస్టర్ ఫోన్ చేశారు. మరునాడు ఉదయం నేను ప్రయాణం చేయాలి.

హఠాత్తుగా నాకు కడుపులో తట్టుకోలేనంత బాధ మొదలైంది. "డా|| పరమేశ్వర రెడ్డి" గారు స్కానింగ్ చేయించి, అపెండిసైటిస్ అనీ .. కడుపులో గడ్డ ఉందనీ, చీము పట్టిందనీ, "వెంటనే ఆపరేషన్ చేయాలి ఎమర్జెన్సీ" అని అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా చక్కగా నందవరం వెళ్ళి స్వామి సమాధి ముందు పడుకుని, "స్వామీ! నేను రేపు ఉదయం బయలుదేరి మైసూరు వెళ్ళాలి, ఏం చేస్తావో నీ ఇష్టం" అని సంకల్పించి ధ్యానం చేసి అలాగే పడుకున్నాను. తెల్లారి లేచేసరికి ఏ నొప్పి లేదు, నేను మైసూరు వెళ్ళి వచ్చాను. ఇప్పటివరకూ ఆ నొప్పి మళ్ళీ రాలేదు!

అనుభవం : 4

తర్వాతి కాలంలో పిరమిడ్ నుంచి బయటకు వస్తూ ఉంటే బయట పొదలలో ఒక కట్లపాము నా కాలుని కరిచింది. విషం ఎక్కింది. "కట్లపాము కరిస్తే బ్రతకటం కష్టం" అన్నారు. అయినా నేను సదానందయోగిని తలచుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాను. స్ట్రెక్చర్ పైన నన్ను లోపలికి తీసుకెళ్ళేప్పుడు "సదానందయోగి" నా భ్రూమధ్యంలో కనబడి "నేను చూసుకుంటాను, నీకేమీ కాదు" అన్నారు. స్వామి అభయమిచ్చి కాపాడడం వల్ల నేను క్షేమంగా ఇంటికి తిరిగివచ్చాను.

అనుభవం : 5

కర్నూలులో బైక్‌పై వెళుతున్నాను. లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. పది అడుగులు ఎగిరి క్రింద పడ్డాను. నా లోపల నుంచి స్వామి స్వరం "నీకేమి కాదు" అని వినబడింది. చుక్క రక్తం కారకుండా బ్రతికి బయటపడ్డాను.

అనుభవం : 6

కర్నూలు - నంద్యాల మధ్య ఫ్రెండ్స్‌తో కారులో వెళుతున్నాను. ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తూన్న బస్సును తప్పించుకోవడం కోసం, నా ఫ్రెండ్ కారును ప్రక్కకు త్రిప్పడం కోసం సడన్ బ్రేక్ వేశాడు. అంతే కారు ఎన్నో పల్టీలు కొట్టి ప్రక్కనున్న పొలంలోకి దూసుకుపోయింది. పల్టీ పల్టీకి సదానంద సద్గురువులను తలచుకున్నాను. "ఓం శ్రీ సదానంద యోగీశ్వరా రక్ష! రక్ష!" అని. అందరం సురక్షితంగా బ్రతికి బయటపడ్డాం.

అనుభవం : 7

2008 గురుపౌర్ణమి కంటే ముందు బంధువులను కలుసుకోవాలని ‘కేరళ’ వెళ్ళాను. అక్కడ నెలరోజులు గడిపాను.

ఏదో మాయ మరచి గురుపౌర్ణమి గురించి మరిచిపోయాను. నేను మా బంధువుల పొలానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ధ్యానం చేశాను. ధ్యానం నుంచి లేచి కళ్ళు తెరచి నా ప్రక్కకు చూస్తే ఒక వృద్ధ రూపంలో నాకు కనులకు కనబడింది. అప్పుడు ఆ వృద్ధ రూపంలో ఉన్న వృద్ధుడు "నువ్విక్కడ ఒళ్ళు మరచి కేరళలో కూర్చుంటే అక్కడ ’గురుపౌర్ణమి’ ఉత్సవం నందవరంలోని సదానంద స్వామి సన్నిధిలో ఎవరు చేస్తారు?" అని గట్టిగా తిట్టారు.

ఇక ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేరళ నుంచి బయలుదేరి వచ్చి మూడు రోజుల ముందునుంచే నందవరంలో ఉండి సదానందయోగి వారి సన్నిధిలో గురుపౌర్ణమి ఉత్సవం చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది నాకు "అలా వృద్ధుని రూపంలో వచ్చి నన్ను హెచ్చరించింది సదానందస్వామియే" అని.

ఆ సంవత్సరం గురుపౌర్ణమి సమయంలో కుంభవర్షం వచ్చింది. అయినా ఉత్సవం వైభవంగా జరిగింది. బోజనాలు పెడుతున్నంత సేపు మాత్రం వర్షం రాలేదు. స్వామి నన్ను పిలిచి మరీ సేవ చేయించుకున్నారు. ఆ తర్వాత పత్రిసార్ పత్రి మేడమ్ రాలేకపోయినప్పుడు కూడా గురుపౌర్ణమి ఉత్సవం, అన్నదానసేవ చక్కగా చేశాం. ఎప్పటికీ చేస్తాం.

2017 లో గురుపౌర్ణమి ఉత్సవం "సదానంద సద్గురు నిత్యాన్నదాన సేవాట్రస్ట్" ఆధ్వర్యంలో .. బ్రహ్మర్షి పత్రీజీ నేతృత్వంలో మహావైభవంగా జరిగింది! ఈ సందర్భంగా నా స్వంత ధనంతో ఎనిమిదివేల మందికి అన్నదాన సేవ చేయడం జరిగింది!

నేను "నందవరం సదానంద స్వామి ఆశ్రమ ఇన్‌ఛార్జ్" గా స్వామి వారి ఆదేశంతో, అనుగ్రహంతో మరి వారి అనుమతితో గతం 20 సంవత్సరాలు గురుపౌర్ణమి ఉత్సవాలు వైభవంగా, విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇకపై "గురుపౌర్ణమి" ఉత్సవాలు స్వామి వారి ఆదేశంతో నా జీవిత కాలపర్యంతం ఒక మహా తపస్సుగా త్రికరణశుద్ధిగా అన్నదాన సేవ నా స్వంత ద్రవ్యంతో చేయడానికి పూనుకున్నాను.


మారం: మీరు మీ అపూర్వ అనుభవాలు ఎన్నో సదానందయోగితో ఉన్నాయి కదా! ఒక పుస్తకం ఏమైనా వ్రాస్తారా?"

బైజు: ఔను సార్! "సద్గురు మహరాజ్ సదానంద" అన్న పేరుతో ఒక పుస్తకం వ్రాస్తున్నాను. కనుక పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా సరే సదానంద యోగి వారితో అనుభవాలు, అనుభూతులు ఉన్నవారు దయచేసి ఈ నెంబర్‌కు ఫోన్ చేయగలరు. సెల్: 9966307545, 8688031120 నోట్: అయితే మీ అనుభవాలను, అనుభూతులను ఏప్రిల్ 30వ తేదీ లోపుగా పంపాలి. అవి ఖచ్చితంగా సదానంద యోగికి సంబంధించినవై ఉండాలి.

మారం: " ’ధ్యానజగత్’ పాఠకులకు మీ సందేశం"
బైజు: అందరం ధ్యానం చేస్తూ .. ధ్యానం చేయిస్తూ .. స్వాధ్యాయం చేస్తూ .. అహింసా మార్గంలో నడుస్తూ జీవించాలి. ప్రతి ఒక్కరూ గురుపౌర్ణమికి "సదానంద మహా సమాధి" వద్ద ధ్యానం చేయాలి. వారి ఆశీర్వాదం పొందాలి. నేను నా జీవితంలో ఎందరో మహా యోగులను కలిసాను. నా సందేశం ఏమిటంటే ధ్యాన అనుభవాలు వచ్చినా, రాకపోయినా నిరంతర ధ్యాన సాధన మాత్రం వదిలిపెట్టవద్దు. "శ్వాస మీద ధ్యాస" ద్వారా మాత్రమే ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది.

"సదానంద స్వామి" అంటే "సదా ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడమే సదానంద యోగం"

Go to top