"ఒకే కంఠం .. ఒకే గమ్యం"

 

నా పేరు "హిమబిందు". నేను 2001వ సంవత్సరంలో ధ్యానంలో ప్రవేశించాను. అదే సమయంలో "రాధిక" కూడా ప్రవేశించింది. "జక్కా రాఘవరావు"గారి ధ్యాన కేంద్రంలో పరిచయం అయ్యాం. ఇద్దరం పాటలు పాడటం వలన మా మధ్య బాగా స్నేహం ఏర్పడింది.

రాఘవరావుగారు మరి పద్మా మేడమ్ దంపతులు మమ్మల్ని ప్రోత్సహించి, మాచే పాటలు పాడించి, మమ్మల్ని పోటీలకు కూడా పంపించేవారు. పత్రీజీగారు నాలుగైదు సందర్భాలలో మా పాటలు విని, 2003వ సంవత్సరంలో తుంబుర తీర్థం ట్రెక్కింగ్‌లో మాకు సంగీత పరీక్ష పెట్టి పాస్ అయ్యాం అనీ .. "ఇక నుంచి వీరిద్దరినీ ‘విజయవాడ సిస్టర్స్’గా పిలుద్దాం" అనీ అందరికీ చెప్పారు.

అప్పటినుంచీ మేము అదే పేరుతో చాలా చోట్ల పాటలు పాడుతూ ధ్యానం చేయించేవాళ్ళం. "ఒకే కంఠం - ఒకే గమ్యం" లా ధ్యాన ప్రచారం కలిసి చేశాం. "గానంతో ధ్యానం" అన్న అంశం మాతోనే ప్రారంభం అయ్యింది. అన్నమయ్య ప్రాజెక్ట్ చేపట్టి ‘పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ’ లోనే కాకుండా, అన్ని ఆధ్యాత్మిక సంస్థలలో .. కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా విజయవాడ సిస్టర్స్‌గా పాడి సన్మానాలు, ప్రశంసలు పొందాం. ప్రతిష్ఠాత్మక కళావేదిక "రవీంద్ర భారతి"లో మొట్టమొదటి ప్రోగ్రామ్ చేసి ఇప్పటికి సుమారు 200 పైచిలుకు ప్రోగ్రామ్స్ చేశాం.

పిరమిడ్ సొసైటీలో మా అసలు పేర్లు కంటే "విజయవాడ సిస్టర్స్"గా ఎక్కువమందికి పరిచయం.


2002వ సంవత్సరంలో విజయవాడ ధ్యానయజ్ఞం మొదలుకుని 2012 ధ్యానమహాచక్రం వరకు ప్రతి సంవత్సరం వేదికపై మాకు కచేరీ చేసే అవకాశం ఇచ్చి పత్రీజీ మాకు ఒక గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించారు.

2009వ సంవత్సరంలో నా స్నేహితురాలు "రాధిక"కు గుండె ఆపరేషన్ జరిగింది. ధ్యానశక్తితో అరోగ్యంగానే ఉండేది. 2014 బుద్ధపౌర్ణమి సంబరాలకు బెంగళూరులో చివరగా State programme ఇచ్చాం. ఆ తరువాత "రాధిక" ఆరోగ్యరీత్యా ఎక్కువ పాడలేదు. 2018, జనవరి 16వ తేదీన రాధిక నన్ను ఒంటిరదాన్ని చేసి తిరిగిరాని లోకాలకు ప్రయాణించింది.

"కళ్ళు మూసుకుంటే ధ్యానం - నోరు తెరిస్తే గానం" అనేవిధంగా కలసి 18 సంవత్సరాలు ప్రయాణించాము. స్నేహబంధం అయినా విజయవాడ సిస్టర్స్‌గా పిలిపించుకున్నాము. మాకు ఒక గుర్తింపును ఇచ్చి గానంతో, ధ్యానంతో ఊపిరిపోసుకుంటూ .. ఎన్ని విపరీత పరిస్థితులు ఎదురైనా, ఆనందంతో గానం చేస్తూ కలిసి ప్రయాణం చేయటానికి అవకాశం ఇచ్చిన పత్రీజీకి పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు చెల్లించుకుంటున్నాము. నా మిత్రురాలు నా ఆత్మలో ఉన్నది.

ప్రియమైన నేస్తమా! "గానాంజలి" సమర్పించుకుంటున్నాను.

"ఏటిలోని కెరటాలు - ఏరు విడిచిపోవూ
ఎదలోపలి మమకారం - ఎక్కడికీ పోదూ
కనుల నీరు చిందితే - మనసు తేలికవునులే
తనకూ, తన వారికీ - ఎడబాటే లేదులే ..
ఎడబాటే లేదులే"

రాధిక, హిమబిందు - విజయవాడ సిస్టర్స్

- 99088 57807.

Go to top